ఓడి గెలిచిన అసాంజే | Andrea Witchek Article On Wikileaks Founder Julian Assange | Sakshi
Sakshi News home page

ఓడి గెలిచిన అసాంజే

Published Thu, Apr 18 2019 3:46 AM | Last Updated on Thu, Apr 18 2019 3:46 AM

Andrea Witchek Article On Wikileaks Founder Julian Assange - Sakshi

అసాంజే 

చరిత్ర పొడవునా, ప్రతీఘాతుక శక్తులు ప్రపంచంపై అజమాయిషీ చేయాలని ఎల్లçప్పుడూ ప్రయత్నిస్తూ వచ్చాయి. హింస ద్వారా, అపహరణ ద్వారా, ప్రధాన స్రవంతి వార్తా కథనాలను వక్రీకరించడం ద్వారా లేక ప్రజారాశుల్లో భయాందోళనలను రేకెత్తించడం ద్వారా వారు ప్రపంచాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తుంటారు. మరోవైపున  సాహస ప్రవృత్తి, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఇలాంటి చీకటి శక్తులపై తిరగబడుతూ వచ్చారు. అబద్ధాలను ఎండగట్టుతూ, పాశవికత్వం, దుర్మార్గంపై గర్జిస్తూ్త వీరు పోరాడుతున్నారు. పాలకులకు వ్యతిరేకంగా కొందరు కత్తులు, తుపాకులు ఉపయోగించి పోరాడారు. కొంతమంది మాటల్నే ఆయుధాలుగా చేసుకున్నారు. చాలామంది ఈ పోరాటాలను విస్తరించారు. అంధకార శక్తులపై పోరాటానికి నూతన యోధులు పుట్టుకొస్తున్నారు. ప్రతిఘటించ డం అంటే ఉత్తమమైన ప్రపంచం కోసం స్వప్నించడమే. జీవించడానికి కలగనడం అన్నమాట. 

చరిత్రలో అత్యంత సాహసవంతులు తమ దేశాలు, సంస్కృతుల కోసం మాత్రమే ఎన్నడూ పోరాడలేదు. సమస్త మానవజాతికోసం పోరాడారు. వీరినే ‘సహజ మేధావులు’గా నిర్వచించవచ్చు. ఆస్ట్రేలియా కంప్యూటర్‌ నిపుణుడు, చింతనాపరుడు, మానవతావాది జులియన్‌ అసాంజే ఒక కొత్తదైన పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. అక్షరాలు, పదాలతో కూడిన ఒక మొత్తం బెటాలియన్‌ని ఆయన ప్రారంభించారు. అంకితభావం కలిగిన కొద్దిమంది నిపుణులు, కార్యకర్తలతో కూడిన చిన్న బృందానికి జులియన్‌ అసాంజే ‘కమాండర్‌’. పాశ్చాత్య సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వేలాది డాక్యుమెంట్లను బహిర్గతం చేసిన యుద్ధం అది. దశాబ్దాలుగా పాశ్చాత్య ప్రపంచం సాగిస్తూ వచ్చిన అత్యంత ఘోరమైన నేరాలకు గట్టి సాక్ష్యాధారంగా ఉంటున్న అపారమైన డేటాబేస్‌లోకి ఆయన చొచ్చుకెళ్లారు. అత్యంత విషపూరితమైన రహస్యాలను బహిర్గతం చేశారు. 

వికీలీక్స్‌ తర్వాత, న్యూయార్క్, బెర్లిన్, లండన్‌ లేక పారిస్‌ నగరాల్లో నివసిస్తున్న ఏ ఒక్కరికీ ‘మాకు ఏమీ తెలియదు’ అని చెప్పే హక్కు లేకుండా పోయింది. ఇప్పటికీ వారికి జరిగిందేమీ తెలియదు అనుకుంటే, తెలుసుకోకూడదని వారు నిర్ణయించుకున్నారన్నమాటే. దీనికి మించిన అవకాశవాదం ఉండదు. ఆఫ్గాన్‌ ప్రజలకు పాశ్చాత్య ప్రపంచం ఏం ఒరగబెట్టిందో అసాంజే, అతడి సహచరులు బట్టబయలు చేశారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రజలను నయా వలసవాదం, సామ్రాజ్యవాదం ఎన్ని బాధలకు గురి చేశాయో కూడా వీరు తేల్చి చెప్పారు.  

అమెరికా, పాశ్చాత్య ప్రపంచం సాగించిన ఘాతుకాలకు చెందిన రహస్య ఫైళ్లను లక్షలాదిగా విడుదల చేసి యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చిన అసాంజేకు కొన్ని రోజుల క్రితం ఒక దేశం (ఈక్వెడార్‌)  ద్రోహం చేసింది. అసాంజేకు ఇన్నేళ్లుగా రాజ కీయ ఆశ్రయమిచ్చి, పౌరసత్వం కల్పించిన ఆ దేశ పాలకుడు లెనిన్‌ మోరినోను చరిత్ర చాలా చెడుగా అంచనా వేయవచ్చు. మెట్రోపాలిటన్‌ పోలీసులు జులియన్‌ అసాంజేని లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం నుంచి లాగి వ్యాన్‌ ఎక్కిస్తున్నప్పుడు పాశ్చాత్య పాలన అసలు రూపాన్ని యావత్‌ ప్రపంచం చూడగలిగింది.

పాశ్చాత్య బీభత్సాన్ని ఎదుర్కోవడానికి దేశదేశాల్లో లక్షలాదిమంది ప్రజలు ఇప్పుడు లేచి నిలబడుతున్నారు. వీరిని పాశ్చాత్య ప్రభావం నుంచి విముక్తి చేస్తున్న కొత్త మీడియాకు, అసాంజే, ఆయన సహోద్యోగులు వంటి ధీరోదాత్తులకు అభివందనలు. అసాంజే ఓడిపోలేదు. వెన్నుపోటుకు, విద్రోహానికి గురయ్యాడు. కానీ అతడు తనకు మద్దతిస్తున్న లక్షలాదిమంది ప్రజల ఆలోచనల్లో నిలిచి ఉన్నారు. అతని నిజాయితీకి, ధైర్యసాహసాలకు, సత్యనిష్ఠకు ప్రపంచ ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతోంది. భూమ్మీద అత్యంత శక్తిమంతమైన, దుష్ట, విధ్వంసక, పాశవిక స్వభావం కలిగిన మొత్తం పాశ్చాత్య సామ్రాజ్యంతో అసాంజే ఘర్షిస్తున్నారు. దాని రహస్య సంస్థలను దెబ్బతీయడంలో, వాటి కుట్రలను అడ్డుకోవడంలో ఆయన విజయం సాధిం చారు. అలా ఎంతోమంది జీవితాలను కాపాడారు. 

ఇదంతా జులియన్‌ అసాంజే సాధించిన విజయంగానే చెప్పవచ్చు. అంతిమ విజయం కాదు కానీ ఇది విజయం కంటే తక్కువేమీ కాదు. అసాంజేని అరెస్టు చేయడం ద్వారా పాశ్చాత్య సామ్రాజ్యం తన బలహీనతను చాటుకుంది. రాయబార కార్యాలయం నుంచి పోలీసు వ్యాన్‌ లోకి అసాంజేని లాగడం ద్వారా పాశ్చాత్య సామ్రాజ్యం తన అంత్యక్రియలను తానే సిద్ధం చేసుకుంటోంది.
(’న్యూ ఈస్టర్న్‌ అవుట్‌లుక్‌’ సౌజన్యంతో)

వ్యాసకర్త : ఆంద్రె విచెక్‌ , ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు, చిత్ర నిర్మాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement