విడుదల చేసిన అమెరికా కోర్టు
ఆస్ట్రేలియా చేరుకున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు
స్వాగతించిన ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్
సైపన్/కాన్‌బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్‌లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా.
అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మీడియా ఎదురుచూపులు
విచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్‌లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు.
అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్‌పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు.
శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి
విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు.
భార్యను, తండ్రిని హత్తుకుని..
ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్‌బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్‌లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment