
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కెనడా, చైనా, మెక్సికోలపై భారీ సుంకాలను విధించారు. ఈ ప్రకటన ''యుద్ధ చర్య'' అని బిలియనీర్, ప్రముఖ పెట్టుబడిదారు 'వారెన్ బఫెట్' (Warren Buffett) అని అన్నారు. సుంకాలు ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.
సుంకాలు.. వస్తువులపై పన్నుగా పనిచేస్తాయని. ఇది ప్రజలు లేదా వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బఫెట్ అన్నారు. ఇప్పటి వరకు మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో 101 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ.. ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని స్పష్టం చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన బఫెట్.. సుంకాల ఆర్థిక భారం వినియోగదారులపై పడుతుందని చెప్పారు. ఈ రోజు (మంగళవారం) నుంచి అమలులోకి వచ్చే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలను విధించడంలో ట్రంప్ ముందుకు సాగుతున్నందున.. బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా దిగుమతులపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్య బీజింగ్‌తో ఉద్రిక్తతలను పెంచానుందని నిపుణులు చెబుతున్నారు. చైనా కూడా సుంకాలతోనే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇవన్నీ గమనిస్తుంటే.. వాణిజ్య యుద్ధం జరుగుతుందా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!
సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని.. వ్యాపారాలు, వినియోగదారులపై ఖర్చుల భారం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సుంకాలతో విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి కారణం.. దేశీయ తయారీని పెంచడమే అని ట్రంప్ సమర్ధించుకుంటున్నారు. అయితే విమర్శకులు ఇటువంటి విధానాల వల్ల ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.