
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.
చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.
చైనాపై ట్రంప్ సుంకాలు
చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment