
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు.
చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.
Latest UY | World
Xi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?
Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025
జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్
అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.