
అమెరికాతో చర్చలపై చైనా
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్‌కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు.
అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు.
జిన్‌పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్‌పింగ్‌కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్‌ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్‌పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్‌కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు.
చైనాపై 145 శాతం బాదుడు
చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.
ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు
ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది.