టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 23) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ కొట్టిన సిక్సర్లలో ఓ భారీ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో సౌరభ్ నేత్రావల్కర్ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్.. 104 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌ను బద్దలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు కొడుతుంది. బట్లర్ ఉతుకుడును చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
The Solar Panel damaging 104M six of Jos Buttler. 🌟pic.twitter.com/us41FZnZCF
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024
ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇవాళ మరో సెమీస్ బెర్త్ ఖరారైంది. విండీస్‌ను ఓడించి సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది. ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా గ్రూప్-2లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ రెండో ప్లేస్‌కు పరిమితం కాగా.. విండీస్, యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇంగ్లండ్-యూఎస్‌ఏ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment