న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు.
బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్‌లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్‌లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్‌టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్‌సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్‌సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్‌సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి.
Comments
Please login to add a commentAdd a comment