న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు.
కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా ప్రకటించారు.
అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్‌లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి.
సాధారణ అమ్మకాలే..
ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment