Insurance policies
-
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్‌డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు. -
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
బీమా.. నడిపినోళ్లకు నడిపినంత!
గుప్తా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఢిల్లీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటాడు. మూడు రోజులు ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో నివాసం ఉంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే అతడు కారును ఉపయోగిస్తుంటాడు. తన నివాసం నుంచి ఆఫీస్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 ఏళ్ల మణి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లి రావడం అతడు ఉద్యోగంలో భాగం. అంతేకాదు, వారాంతంలో దూర ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్) చేయడం అతడికి హాబీ. దీంతో ఏటా 30,000 కిలోమీటర్ల మేర అతడు ప్రయాణం చేస్తుంటాడు. కానీ, గుప్తా ఏడాది మొత్తం తిరిగేది 4,000 కిలోమీటర్లు మించదు. వీరిలో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఇద్దరూ తమ కారు కోసం ఏటా చెల్లిస్తున్నది ఒకే రకమైన ప్రీమియం. నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, పరిమిత వేగంతో, తక్కువ దూరం ప్రయాణించే వారిని.. ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని ఒకే గాటన కట్టడం సహేతుకంగా అనిపించదు. అందుకే నడిపినంత దూరానికే, నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని బీమా సంస్థలు తీసుకొచ్చాయి. ‘‘రోజూ ఎక్కువ దూరం పాటు ప్రయాణించే వారు, దూర ప్రయాణాలకు తరచుగా వెళ్లే వారితో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లించడానికే నా ప్రాధాన్యం. ఎందుకంటే నేను కారులో తిరిగేది చాలా తక్కువ దూరం. పైగా నేను ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే నేను చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉండాలని కోరుకున్నాను’’అని గుప్తా తెలిపారు. అందుకే ఆయన ‘పే యాజ్ యూ డ్రైవ్’ (పీఏవైడీ), ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) యాడాన్స్ను ఎంపిక చేసుకుని, గతంతో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు. గుప్తా వంటి వారికి ఇప్పుడు పీఏవైడీ పాలసీలు ఒక మంచి ఎంపికగా, ఆకర్షణీయంగా మారాయనడంలో సందేహం లేదు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందన్న దాని ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం వసూలు చేయడం ఈ పాలసీల్లో ఉన్న వెసులుబాటు. అందుకే తక్కువ నడిపే వారికి, జాగ్రత్తగా నడిపే వారికి ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ పీఏవైడీ, పీహెచ్యూఐ పాలసీలు ఎలా పనిచేస్తాయి? వీటిని తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు? ఈ వివరాలను అందించే కథనమే ఇది. నేపథ్యం.. మోటార్ బీమా పాలసీలకు సంబంధించి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) 2022 జూలైలో అనుమతించింది. వినియోగ ఆధారిత వాహన బీమా ప్లాన్లు, రైడర్లు ఆ తర్వాత నుంచి మార్కెట్ ప్రవేశం చేశాయి. టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు/గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వాహన వినియోగాన్ని అంచనా వేసి, ఆ మేరకు ప్రీమియాన్ని సాధారణ బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. కారు నడిపే తీరును కూడా అవి ఈ పరికరాల ద్వారా పరిశీలిస్తాయి. దీంతో సంబంధిత వాహనదారుడి డ్రైవింగ్ తీరు, దూరంపై బీమా కంపెనీలకు కచి్చతమైన సమాచారం లభిస్తుంది. వీటిని విశ్లేషించిన అనంతరం, రిస్క్ ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. పీఏవైడీ ప్లాన్ల/రైడర్లలో వాహనం తక్కువ నడిపే వారికి ప్రీమియం భారం ఎలా అయితే తగ్గుతుందో.. వాహనం ఎక్కువగా వినియోగించే వారికి ప్రీమియం భారం పెరుగుతుంది. పీఏవైడీ, పీహెచ్ఐయూ యాడాన్లుగా లభిస్తాయి. ప్రస్తుత ప్లాన్‌కు అనుసంధానంగా తీసుకోవచ్చు. రెన్యువల్ సమయంలో బీమా కంపెనీకి ఈ విషయాన్ని చెబితే చాలు. బీమా ఏజెంట్ లేదంటే నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే వీటిని తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రాన్ని నింపి, అప్పటికే కలిగి ఉన్న బీమా ప్లాన్ వివరాలను సమరి్పస్తే చాలు. దూరం ఆధారంగా.. పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్ల ఆధారంగా పీఏవైడీ పాలసీల ప్రీమియం ఆధారపడి ఉంటుంది. పలు రకాల ప్రీమియం శ్లాబులు ఉంటాయి. వీటి నుంచి పాలసీదారుడు ఎంపిక చేసుకోవచ్చు. ‘‘మన దేశంలో టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు కేవలం కొన్ని రకాల కార్ల మోడళ్లకే అందుబాటులో ఉన్నాయి. అందుకని మేము తీసుకొచి్చన పాలసీలో, ఓడోమీటర్ సాయంతో దూరాన్ని లెక్కిస్తున్నాం. ఓడోమీటర్ రీడింగ్‌ను టెలీమ్యాటిక్స్ డివైజ్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. సాధారణ ప్రీమియంతో పోలిస్తే బీమా సంస్థలు పీఏవైడీ ప్లాన్ కింద.. 2,500 కిలోమీటర్ల వరకు తిరిగే కార్లకు ప్రీమియంలో 25 శాతం తగ్గింపునిస్తున్నాయి. ఏడాదికి 2,501 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరానికి 17.50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇక 5,001–7,000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే వాహనాలకు ప్రీమియంలో 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. 7,501–10,000 కిలోమీటర్ల దూరం నడిచే కార్లకు ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు నడిచే కార్లకు ప్రీమియంలో ఎలాంటి రాయితీ ఉండదు. పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఉన్న ఓడోమీటర్ రీడింగ్‌ను బీమా సంస్థలు నమోదు చేస్తాయి. తిరిగి రెన్యువల్ సమయానికి తిరిగిన దూరం ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. ‘‘ఇలా ఏడాదిలో తిరిగిన దూరం ఆధారంగా మరుసటి ఏడాది ప్రీమియంలో బీమా కంపెనీలు తగ్గింపును ఇస్తాయి. ఒకవేళ పాలసీదారుడు అదే కంపెనీ వద్ద రెన్యువల్ చేసుకోకుండా, మరొక కంపెనీ వద్ద పాలసీ తీసుకున్నా సరే, గడిచిన ఏడాదికి సంబంధించిన డిస్కౌంట్‌ను నెఫ్ట్ ద్వారా పాలసీదారు ఖాతాకు బదిలీ చేస్తాయి. అదే కంపెనీతో కొనసాగితే రెన్యువల్ ప్రీమియంలో తగ్గించి, మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది’’అని పార్థానిల్ ఘోష్ వివరించారు. పాలసీ తీసుకునే సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్లను ఏడాది కాక ముందే అధిగమించేశారనుకుంటే, అప్పుడు టాపప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 6,000 కిలోమీటర్ల కోసం పాలసీ తీసుకుని, రెన్యువల్ గడువుకు ముందే ఈ దూరం దాటేస్తే, అప్పుడు దీన్ని పెంచుకోవచ్చు. ‘‘ఒకటికి మించిన కార్లు ఉన్నవారు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి పీఏవైడీ ప్లాన్లు మంచి ప్రయోజనాన్నిస్తాయి. ప్రీమియంలో తగ్గింపు అనేది కారు మోడల్, దాని వయసు, రిజి్రస్టేషన్ అయిన ప్రాంతం ఆధారంగా నిర్ణయం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు రెన్యువల్ సమయంలో అదనపు రివార్డులను కూడా ఇస్తున్నాయి. పాలసీ సంవత్సరంలో కారు తక్కువ వినియోగిస్తాననే స్పష్టత యజమానికి ఉంటే, వాస్తంగా వినియోగించుకున్న మేరకే ప్రీమియం చెల్లించడం సహేతుకంగా ఉంటుంది’’అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల హెడ్ ఆకర్‡్ష శర్మ సూచించారు. నడిపే తీరు కూడా ముఖ్యమే గుప్తా మాదిరే తాము కూడా డ్రైవింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని అనుకునే వారు ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో వాహనం నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చార్జ్ చేస్తారు. పీఏవైడీ మాదిరే, పీహెచ్వైయూ (పే హౌ యు యూజ్) కూడా యాడాన్‌గా వస్తోంది. ‘‘నడిపే తీరు ఆధారితంగా ఆల్గోరిథమ్ ఇంటర్నల్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా అండర్‌రైటర్స్ (బీమా అధికారులు) ప్రీమియంను కచి్చతంగా లెక్కిస్తారు. దేశంలో కనెక్టెడ్ కార్లను ప్రారంభించడం పీఏవైడీ ఆఫర్ చేయడానికి అనుకూలం. అవి డ్రైవింగ్ తీరుపై బీమా సంస్థలకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సుభాశిష్ మజుందార్ తెలిపారు. కనెక్టెడ్ కార్స్ అంటే ఇంటర్నెట్తో అనుసంధానమైనవి. వీటిల్లో కమ్యూనికేషన్ డివైజ్‌లు, సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్లను తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. పాలసీని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. జునో జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న ‘స్విచ్’ అనేది ఆన్ డిమాండ్ పాలసీ. పట్టణానికి వెలుపల ఉండి, కారును నడపని సమయంలో పాలసీని ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల బీమా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇలా ఆఫ్ చేసుకున్న సమయంలో కారుకు ఏదైనా నష్టం ఏర్పడితే అందుకు బీమా కంపెనీ నుంచి పరిహారం రాదని (కొన్ని మినహాయింపులు) గుర్తుంచుకోవాలి. కస్టమర్ కారు నడుపుతున్న తీరు ఆధారంగా డ్రైవింగ్ స్కోర్‌ను బీమా సంస్థలు కేటాయిస్తాయి. అధిక వేగం, పరధాన్యంతో డ్రైవింగ్, ఉన్నట్టుండి బ్రేక్‌లు కొట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్ కేటాయిస్తాయి. ఒకవేళ పాలసీని స్విచాఫ్ చేసుకున్న తర్వాత, కారును వినియోగించినట్టయితే ఆ సమయంలో స్విచాన్ చేయడం మర్చిపోయినా.. వారి తరఫున యాప్ ఆ పనిచేస్తుంది. అన్నింటిపై కాదు.. నడిపినంత దూరం, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంపై వచ్చే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓన్ డ్యామేజ్ అంటే వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం వాటిల్లినా లేదా చోరీకి గురైనా పరిహారం ఇచ్చేదని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే తమ వాహనం వల్ల ఎదుటి వాహనానికి, వ్యక్తులకు జరిగే నష్టానికి రక్షణనిచ్చే కవరేజీ. కొన్ని బీమా కంపెనీలు కేవలం ఓన్ డ్యామేజ్ వరకే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు థర్డ్ పార్టీ కవరేజీపైనా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కనుక మొత్తంమీద డిస్కౌంట్ ఎంత వస్తుందన్నది ముందే విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు కారు ప్రీమియం రూ.5,000 చెల్లిస్తున్నారనుకుంటే.. అందులో రూ.3,000 ఓన్ డ్యామేజ్ కోసం, రూ.2,000 థర్డ్ పార్టీ కోసం అయితే, ఓన్ డ్యామేజ్ రూ.3,000పై 5–25 శాతం వరకు డిస్కౌంట్ అంటే రూ.150–750 వరకు తగ్గుతుందని అర్థం. ఇక్కడ వాహనదారుడి ప్రయాణ సమాచారం ఎప్పటికప్పుడు బీమా కంపెనీలకు తెలుస్తుందని గుర్తు పెట్టుకోవాలి. గోప్యత కోరుకునే వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ డేటా ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంపై నిర్ణయానికి వస్తాయి. డిస్కౌంట్ పొందే వారి డ్రైవింగ్ తీరు సైతం బీమా కంపెనీలకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో ప్రమాదాల క్లెయిమ్‌లు వచి్చన సమయంలో ఈ డేటా వాటికి ఉపకరించొచ్చు. రద్దీ సమయాల్లో డ్రైవింగ్, ప్రమాదాలకు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు సంబంధించి బీమా కంపెనీలు కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. బీమా కంపెనీ కోరినట్టు టెలీమ్యాటిక్స్, ఇతర పరికరాలు అమర్చుకోవాలంటే, అందుకు కొంత అదనపు వ్యయం అవుతుంది. ఈ పరికరాలకు మెయింటెనెన్స్, మరమ్మతుల ఖర్చు కూడా వాహనదారుడిపైనే పడుతుంది. వాహనంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించి పాలసీ నియమ, నిబంధనలు ఏంటో ముందే తెలుసుకోవాలి. వీటికి కవరేజీ.. ► సంప్రదాయ బీమాలో మాదిరే అన్ని రకాల రిస్క్‌లను పీఏవైడీ కవర్ చేస్తుంది. అయితే ప్రీమియం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉంటుంది. ► ప్రమాదం జరిగితే కారు రీపేర్ లేదంటే రీప్లేస్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ► చోరీకి గురైతే లేదా చోరీ కారణంగా కారు డ్యామేజ్ అయినా పరిహారం లభిస్తుంది. ► వరదలు, భూకంపాలు తదితర విపత్తుల వల్ల కారుకు నష్టం ఏర్పడినా పరిహారం వస్తుంది. ► థర్డ్ పార్టీ కవరేజీ కూడా పీఏవైడీలతో వస్తుంది. ► కొన్ని పీఏవైడీ పాలసీలు గాయాల రక్షణ కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. మినహాయింపులు.. ► ఉద్దేశపూర్వకంగా చేసుకునే నష్టానికి పరిహారం రాదు. ► మద్యం, డ్రగ్స్ ప్రభావంతో కారు నడుపుతూ ప్రమాదం, నష్టం వాటిల్లితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ► డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎదురయ్యే నష్టానికి పరిహారం రాదు. ► రోజువారీ వినియోగం వల్ల వాహనంలో విడిభాగాలను మార్చాల్సి వస్తే వాటికి పరిహారం రాదు. ► ఎలక్ట్రికల్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించవు. ప్రీమియం తగ్గించుకునే టిప్స్.. ► తక్కువ దూరం నడిపే వారికి పీఏవైడీతో ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. దగ్గరి దూరానికి కారును ఉపయోగించుకోకుండా ఉండాలి. కార్యాలయానికి వెళ్లేవారు సహచర ఉద్యోగితో కలసి చెరొక రోజు కారును వినియోగించుకోవడం వల్ల ఆదా చేసుకోవచ్చు. ► చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ సందర్భంలోనూ ట్రాఫిక్ నియామాలు ఉల్లంఘించకూడదు. పరిమిత వేగాన్ని మించకుండా ఉండాలి. సడెన్ బ్రేక్‌లు వేయడం, రిస్క్ తీసుకుని క్రాస్ చేయడం ఇలా ప్రమాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలి. ► ఎయిర్ బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఎక్కువగా ఉన్న కారును ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. ► మద్యపానం సేవించే వారు ఆ సమయంలో క్యాబ్ సేవలు వినియోగించుకుని, వ్యక్తిగత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. -
బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!
సాక్షి, ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డు వినియోగింకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందనీ, జీవిత బీమా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. (కర్మను నమ్ముతారా? లేదా?ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర) ఇన్సూరెన్స్ పాలసీలను తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించే సౌకర్యాన్ని నిలిపేయాలని ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. పాలసీ లోన్ అంటే జీవిత బీమా సంస్థలు పాలసీదారుని పాలసీ సరెండర్ విలువ ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ ఇవ్వడం. పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను తనఖాపెట్టి రుణాలు తీసుకోవడం. ఎండోమెంట్, మనీ-బ్యాక్ లేదా ఫుల్-లైఫ్ పాలసీ లాంటి జీవిత బీమా పాలసీల ద్వారా లోన్ ఫెసిలిటీ అందిస్తోంది. అయితే, టర్మ్,యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్స్) ఈ సదుపాయం లేదు. కోటక్ లైఫ్ ప్రకారం ప్రతీ జీవిత బీమా పాలసీపై రుణాన్ని పొందలేరు. ఈనేపథ్యంలో ప్లాన్‌ను కొనుగోలుకు ముందే బీమా కంపెనీని సంప్రదించాలి. అలాగే యూలిప్లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఇది ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సాధారణంగా బీమా పాలసీ సరెండర్ విలువలో 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తక్కువ. కస్టమర్లు పాలసీ లోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లించ వచ్చు. అయితే వడ్డీ, లోన్ కలిపి పాలసీ సరెండ్ వ్యాల్యూని మించితే పాలసీ రద్దవుతుంది. కాగా గత ఏడాది ఆగస్టులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ) కూడా దాదాపు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-2 అకౌంట్ సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు, నగదు జమ చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
బీమా ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కారు కలిగి ఉండాలని అనుకుంటారు. కార్లను కొంత మంది నిత్యావసరాల కోసం వినియోగిస్తే, మరి కొందరు లగ్జరీ కోసం ఉపయోగించుకుంటారు. ఎవరు ఎలా ఉపయోగించుకున్నా.. ఆ కారుకి బీమా (ఇన్సూరెన్స్) చేయించుకోవడం తప్పనిసరి. అయితే కొంతమంది కారుకి బీమా చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని అని మిన్నకుండిపోతారు. కానీ ఖరీదైన బీమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం. మీ పాత కార్ల కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎంచుకోండి: మీరు పాత కారు కోసం థర్డ్ పార్టీ లేదా సమగ్ర బీమా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారుకు ఎలాంటి కవరేజీ అందించినప్పటికీ.. సమగ్ర బీమాలో కంపెనీ థర్డ్ పార్టీతో పాటు సొంత డ్యామేజ్ కవరేజీని అందిస్తుంది. ఈ కారణంగా, థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కంటే సమగ్ర బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీరు సమగ్ర బీమాకు బదులుగా థర్డ్ పార్టీ బీమాను ఎంచుకుంటే ఎక్కువ డబ్బుని ఆదా చేసుకోవచ్చు. కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్స్టాల్ చేయండి: కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం ప్రస్తుత కాలంలో చాలా అవసరమని. ఎందుకంటే దానిపై కూడా కారు బీమా ఆధారపడి ఉంటుంది. అప్డేటెడ్ యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. కావున కారు సేఫ్టీ ఫీచర్స్ పరిగణనలోకి తీసుకుంటే, బీమా కంపెనీ మీ నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది. అనవసరమైన కార్ మోడిఫికేషన్స్ నివారించండి: ఆధునిక కాలంలో వాహన ప్రేమికులు తమ వాహనాలను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవాలనుకుంటారు. అయితే మోడిఫైడ్ కార్ల విలువ సాధారణ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కావున కారు విలువ పెరిగే కొద్దీ భీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుడు అవసరమైతే తప్పా కారు మోడిఫికేషన్ చేయకూడదు. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంపార్ చేసుకోండి: ఒక కారుకి బీమా పాలసీ తీసుకునే ముందు మార్కెట్లో ఉన్న భీమా పాలసీలు ఏవి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఒకసారి కంపార్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో భీమా పాలసీలను విక్రయిస్తున్న కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ భీమా పాలసీలను ఎంచుకోవచ్చు. మీరు భీమాలను సరిపోల్చుకుంటే తక్కువ ప్రీమియంతో మెరుగైన భీమా పొందే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద మినహాయింపు చెల్లించండి (Voluntary Deductibles): కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లిస్తే తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కంపెనీ మీకు అందించే అవకాశం ఉంటుంది. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లించవచ్చు. అవసరం లేని యాడ్-ఆన్‌లను అవైడ్ చేయండి: మీ కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాలసీకి యాడ్ ఆన్ కవర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంచుకునే యాడ్ ఆన్ కవర్లను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్, గ్యారేజ్ క్యాష్ వంటివి ఉన్నాయి. నిజానికి మీరు ఎన్ని యాడ్-ఆన్ కవర్లను జోడిస్తే, మీ ప్రీమియం అంత ఖరీదైనదిగా మారుతుంది, కావున మీకు తప్పనిసరి అనుకున్నవి కాకుండా మిగిలినవి తొలగించుకోవచ్చు. మైనర్ క్లెయిమ్స్ అవైడ్ చేయండి: కారుకోసం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చిన్న నష్టాల కోసం క్లెయిమ్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న రిపేరీలకు ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. కావున ఆలాంటి వాటిని మీరే పరిష్కరించుకోవచ్చు. మీరు చిన్న చిన్న నష్టాలకు క్లెయిమ్ చేస్తే మీ నో క్లెయిమ్ బోనస్ కోల్పోవచ్చు, అది మాత్రమే కాకుండా తర్వాత ప్రీమియంపై తగ్గింపును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్) మీరు డ్రైవ్ చేసినంత ప్రీమియం చెల్లించండి (Pay As You Drive Car Insurance): సాధారణంగా కార్లు ఉపయోగించే అందరూ ప్రతి రోజూ ఉపయోగించే అవకాశం ఉండదు. కాబట్టి మీరు కారుని ఎక్కువగా ఉపయోగించని సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించడం మంచిది కాదు. ఎక్కువ ప్రీమియం పొందాలంటే ఎక్కువ ఉపయోగించాలి. ఈ పాలసీ ప్రకారం మీరు మీ కారుని ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారో దానికి తగిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) పాలసీ ల్యాప్స్ అవైడ్ చేయండి: కారు వినియోగదారుడు ఏదైనా ఒక వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, దానిని చెల్లించడానికి ఒక నిర్దిష్ట గడువు ఉంటుంది. కావున ఆ గడువు లోపల మీరు తప్పకుండా పాలసీ చెల్లించాల్సి ఉంటుంది. మీ గడువు ముగిసేవరకు వేచి ఉండటం మంచిది కాదు, ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
కేంద్రం పన్నుపోటు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా ప్రకటించారు. అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి. సాధారణ అమ్మకాలే.. ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. (క్లిక్ చేయండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!) -
ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి 14 పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్ 14 పాలసీలను ఆవిష్కరించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని అప్‌గ్రేడ్ చేసినవి ఉన్నాయి. అయిదు హెల్త్ పాలసీలు, 4 వాహన బీమా, మిగతావి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పాలసీలు ఉన్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో కస్టమర్ల ఆలోచనా ధోరణులు, అవసరాలు మారాయని తదనుగుణంగా తాజా పాలసీలను రూపొందించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించి హెల్త్ బూస్టర్, బీఫిట్, సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ షీల్డ్ తదితర పాలసీలు ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్లు అమిత్ ఆనంద్, సుబ్రతో బెనర్జీ, సుధీర్ నాయుడు వివరించారు. డ్రోన్లకు, సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించేలా రిటైల్ సైబర్ లయబిలిటీ పాలసీలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!
ఎల్ఐసీ తన పాలసీదారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలను పునరుద్ధరించడానికి రెండు నెలల సమయాన్ని ఇచ్చింది. ఎల్ఐసీ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి చేరువ కావడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీల ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎల్ఐసీ పాలసీ తీసుకోని ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించకపోతే వారి ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయితే కనుక భీమా, ఇతర ప్రయోజనాలు లభించవు. అందుకే ఎప్పటికప్పుడు ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించాలని పేర్కొంటుంది. ఒకసారి పాలసీ ల్యాప్స్ అయితే పునరుద్ధరించడం కొంచెం కష్టం అవుతుంది. ఎల్ఐసీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కింద మాత్రమే రుసుము చెల్లించి పాలసీను పునరుద్ధరించుకోవచ్చు. తాజాగా అలాంటి 'స్పెషల్ రివైవల్ క్యాంపైన్' అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 22 వరకు నిర్వహిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా, పాలసీదారులు తమ బీమా పాలసీలను పునరుద్ధరించడానికి ప్రోత్సాహకంగా ఎల్ఐసీ ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ కూడా అందిస్తుంది.(చదవండి: వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!) pic.twitter.com/U5tTme79hY — LIC India Forever (@LICIndiaForever) August 23, 2021 ఎవరు అర్హులు నిర్దిష్ట అర్హత కలిగిన, కొన్ని నియమనిబంధనలకు లోబడి మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలు గడువు పూర్తి కానీ పాలసీదారుల మాత్రమే అర్హులు అని తెలిపింది. అయితే, టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లను దీని నుంచి మినహాయించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర పాలసీల ఆలస్య రుసుము ఫీజులపై రాయితీలు ఇవ్వబడుతున్నాయి" అని ఎల్ఐసీ ఆఫర్ కూడా ఇచ్చింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా రివైవ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ ఎంత ఎల్ఐసీ రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, రూ.1-3 లక్షల మధ్య గల ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రీమియం రూ.3 లక్షలకు మించి ఉన్నట్లయితే ఆలస్య రుసుములో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. "అనివార్య పరిస్థితుల కారణంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. భీమా కవరేజీ పునరుద్ధరించడం కోసం పాత పాలసీని పునరుద్ధరించడం మంచి నిర్ణయం" అని ఎల్ఐసీ తెలిపింది. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్‌కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
ఆధార్ అనుసంధానం: వీటికి కూడా మాండేటరీ
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ నంబర్‌తో అనుసంధానంపై మరో షాకింగ్ న్యూస్‌ను బీమా రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. బీమా పాలసీలతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్ అనుసంధానం చేయడం తప్పని సరి అని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్మనీ లాండరింగ్ చట్టం 2017సవరించిన నిబంధనల ప్రకారం ఇది మాండేటరీ అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని బీమా సంస్థలకు సమాచారాన్ని అందించింది. అలాగే బీమాపాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పాలసీదారులను కోరింది. అన్ని బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లతో అనుసంధానం తప్పనిసరి అని ఐఆర్డీఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న, కొత్త బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై స్పందించిన ఐసీఐసీఐ లాంబార్డ్ సీఎండీ భార్గవ్ దాస్‌గుప్తా ఆర్థిక సేవల కోసం ఏకీకృత వేదికను సృష్టించేందుకు, అదే సమయంలో ప్రభుత్వాల డిజిటైజేషన్ ఎజెండాను ప్రోత్సహించేందుకు ఇదొక ప్రగతిశీల ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఆరంభంలో స్వల్పకాలిక సవాళ్లను అధిగమించాల్సి ఉన్నప్పటికీ మోసాలను , అక్రమాలను నిరోధించే క్రమంలో ఇది గణనీయమైన దీర్ఘకాల ప్రయోజనాలను ఉంటాయని ఆయన చెప్పారు. కాగా దేశంలో మొత్తం 24 జీవిత బీమా సంస్థలు, 33 జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఇక మీదట ఈ కంపెనీల పాలసీలన్నీ ఇక ఆధార్ తో అనుసంధానించుకోవాలి. ఇప్పటికే జీవిత బీమా సంస్థలు బీమా క్లెయిములను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. రూ.50వేలకు మించిన బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్‌కార్డు నంబరు ఇవ్వాలని బీమా సంస్థలు కోరుతున్న సంగతి తెలిసిందే. -
అవి భారతీయులు ఇష్టపడటం లేదు!
ఇన్సూరెన్స్ లు చేయించుకోవడం పట్ల ఎక్కువ మంది భారతీయులు అనాసక్తిని కలిగి ఉంటున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్న వారిలో 14శాతంతో దక్షిణాఫ్రికా ప్రజలు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణ కొరియా, జపాన్, యూనైటెడ్ కింగ్ డమ్ లు ఉన్నాయి. అత్యల్పంగా ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్నవారిలో 0.8శాతంలో పాకిస్తాన్ చివరిస్థానంలో నిలవగా, 3.3 శాతంతో భారత్ చివర నుంచి ఐదో స్థానంలో ఉంది. గత పదిహేనేళ్లలో భారత్ లో ఇన్సూరెన్స్ చేయించుకుంటున్న వారి సంఖ్యలో కూడా ఎటువంటి గణనీయమైన మార్పులు కనిపించడం లేదు. 2001లో 2.71 శాతం మంది భారతీయులు ఇన్సూరెన్స్ లు తీసుకున్నారు. వీరిలో లైఫ్ ఇన్సూరెన్స్ లు చేయించుకున్నవారు 2.15కాగా, కేవలం 0.56 శాతం మంది ఇతర ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నారు. 2014లో ఇన్సూరెన్స్ లు తీసుకున్న వారి శాతం 3.3కు పెరగగా.. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లు తీసుకునే వారి శాతం 0.7కు పడిపోయింది. -
ఫ్లోటర్ హెల్త్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్.. సాధారణంగా మనపై ఆధారపడ్డ వారి బాగోగులు చూసుకోవడానికి బీమా పాలసీలు తీసుకుంటాం. వీటిల్లో హెల్త్ పాలసీలు కూడా ఉంటాయి. మన కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం వచ్చినపుడు, దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు, ఇతర ఎమర్జెన్సీ పరిస్థితులలో ఆరోగ్య బీమా పాలసీలు దన్నుగా నిలుస్తాయి. ప్రస్తుతం బీమా కంపెనీలు పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. వాటిల్లో ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి. ఇది సాధారణ ఆరోగ్య బీమా పాలసీ మాదిరే ఉంటుంది. కానీ వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా.. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో కవరేజ్ ఒకరికి మాత్రమే ఉంటుంది. ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మొత్తం కుటుంబ సభ్యులకు కవరేజ్ ఉంటుంది. ఇందులో ప్రీమియం కుటుంబ పెద్ద వయసు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా కుటుంబాన్ని ప్రారంభించిన వారు ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వారి కుటుంబం పెరుగుతూ వస్తుంది కాబట్టి. ఈ పాలసీకి పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. పాలసీ ఎంపికకు ముందు మీ అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోండి. అలాగే బీమా కంపెనీ పనితీరు, క్లెయిమ్ సెటిల్మెంట్, దాని సేవలు, పాలసీ వివరాలు వంటి తదితర అంశాలపై కూడా కన్నేయండి. పాలసీ తీసుకునే ముందు మీ ఆరోగ్యం, అలవాట్ల సమాచారాన్ని కంపెనీ ముందు దాచొద్దు. ఇక కుటుంబంలో ఎవరికైనా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే వారి కోసం విడిగా ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. -
నగలకు బీమా ధగధగ
బంగారంతో మనకున్న అనుబంధం ఇప్పటిది కాదు. బంగారం కోసం యుద్ధాలే జరిగాయి. చరిత్రను చూస్తే... బంగారం మన సంస్కృతిలో ఎలా కలసిపోయిందో స్పష్టంగా అర్థమౌతుంది. ఇప్పటికీ బంగారాన్ని సమాజంలో హోదా కిందే పరిగణిస్తారు. అందుకేనేమో!! హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నా మహిళలు మాత్రం మెడలో గొలుసులు ధరించకుండా బయటకి వెళ్లటానికి అంత ఇష్టపడటంలేదు. కొందరైతే ఇటీవల గొలుసు దొంగల కారణంగా ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు. అయినాసరే!! మహిళలు బయటికెళ్లేటపుడు బంగారాన్ని ధరించకుండా వెళ్లటానికి ఇష్టపడరు. దాన్ని బంగారంపై ఉన్న మోజు అనుకోవచ్చు... లేకుంటే తమ హోదా దెబ్బతింటుందనే భావన కావచ్చు.. కారణం ఏదైనా కావచ్చు. అంతేకాదు... శుభకార్యాల్లో, ప్రత్యేక రోజుల్లో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులకు ప్రేమతో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అలాగే బంగారం చేతిలో ఉంటే ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవచ్చన్నది మరి కొందరి నమ్మకం. మరి మనం ఇంతగా ప్రాధాన్యమిచ్చే బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే..? ఎవరైనా దొంగలిస్తే..? గొలుసు దొంగల్లా లాక్కుపోతే..? అప్పుడేంటి పరిస్థితి? అందుకే బంగారు ఆభరణాలకు, విలువైన ఇతర వస్తువులకు బీమా తీసుకోవాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం బీమాతో ఆభరణాల రక్షణ * ఇల్లు, విలువైన ఇతర వస్తువులతో కలిపి కూడా * పాలసీ తీసుకునే ముందు నిబంధనలు చూడాలి * మీ అవసరాలకు తగ్గట్టు ఉన్నదే ఎంచుకోవటం బెటర్ ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా కంపెనీలు బంగారు ఆభరణాలకు బీమా అందిస్తున్నాయి. ఈ బీమాను రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి... బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తించే పాలసీ. రెండోది... ఇంటి బీమాలో భాగంగా విలువైన వస్తువులతోపాటు బంగారు ఆభరణాలక్కూడా తీసుకునే పాలసీ. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులకు సంబంధించి... పలు రకాల ప్రమాదాలను కవర్ చేసే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. ఆభరణాలకు బీమా అందిస్తున్న కొన్ని సంస్థలు * ఓరియంటల్ ఇన్సూరెన్స్ * యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ * న్యూ ఇండియా అస్యూరెన్స్ * నేషనల్ ఇన్సూరెన్స్ * హెచ్డీఎఫ్సీ ఎర్గో * బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ * ఐసీఐసీఐ లాంబార్డ్ * టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనలు మారుతుంటాయ్.. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకం నిబంధనలు రూపొందించుకుంటుంది. ఉదాహరణకు ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బంగారు ఆభరణాలపై ఎన్ని డైమండ్స్ ఉన్నాయో వాటి సంఖ్యను అడుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క డైమండ్ విలువ రూ.2,500పైగా ఉండాలి. ఫ్యూచర్ జెనరాలి విషయానికొస్తే.. ఈ సంస్థ బంగారు ఆభరణం ఖరీదు రూ.10,000పైన ఉంటే దాని వాల్యుయేషన్ సర్టిఫికేట్‌ను అందించాలని అడుగుతుంది. * బీమా మొత్తాన్ని బట్టి ప్రీమియం కూడా మారుతుంటుంది. టాటా ఏఐఏ హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2,360 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కంటెంట్ కవర్‌ను అందజేస్తోంది. అదే మీరు బీమా కవర్‌ను రూ.6 లక్షలకు తగ్గించుకుంటే గనుక ప్రీమియం కూడా రూ. 1,416కి వస్తుంది. * కొన్ని కంపెనీలు డి స్కౌంట్లను కూడా అందిస్తాయి. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ నాలుగు ఇన్సూరెన్సులు తీసుకుంటే 15 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది. అదే 6 విభాగాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకుంటే 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంటి బీమాలో బంగారు ఆభరణాలు-విలువైన వస్తువుల బీమా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల బీమా, ఫర్నిచర్ బీమా తదితర విభాగాలు ఉంటాయి. * సాధారణంగా బంగారు ఆభరణాల బీమాకు సంబంధించిన వార్షిక ప్రీమియం రూ.2,000-రూ.3,000 మధ్యలో ఉండొచ్చు. ఇక్కడ ప్రీమియం... బీమా మొత్తాన్ని బట్టి మారుతుంటుంది. క్లెయిమ్ పొందటం ఎలా? ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినప్పుడు విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయాలి. క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. నష్టం జరిగిన వస్తువులకు సంబంధించిన వాల్యుయేషన్ సర్టిఫికేట్‌తో సహా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. కంపెనీ ఉద్యోగి వ చ్చి నష్టాన్ని అంచనా వేస్తారు. దొంగతనం జరిగితే పోలిస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీని, అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖనుంచి సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భాల్లో బీమా వర్తించదు.. వరుసగా 30 రోజులకు పైగా ఇంట్లో ఎవరూ నివసించకుండా ఉన్నపుడు... ఆ ఇంట్లో దొంగతనం జరిగినా ఇతర ఏదైనా అసంఘటిత చర్యలు చోటుకున్నా పోయిన విలువైన వస్తువులకు సంస్థలు ఎలాంటి బీమాను చెల్లించవు. * యుద్ధం వంటి కారణాలతో బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే దానికి బీమా కంపెనీ బాధ్యత వహించదు. * కొన్ని సందర్భాల్లో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బంగారు ఆభరణాలకు నష్టం వాటిల్లిందని కంపెనీ భావించినా క్లెయిమ్ దక్కకపోవచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోండి పాలసీ తీసుకునే సమయంలో అన్ని ప్రమాదాలకూ పాలసీ వర్తిస్తుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే క్లెయిమ్ సమయంలో సమస్యలు వస్తాయి. అలాగే మొత్తం వస్తువు ఖరీదుకు బీమా ఉంటుందా? లేక ఫస్ట్ లాస్ లిమిట్ ఆధారంగా బీమా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని సందర్భాలో వస్తువు మొత్తానికి నష్టం వాటిల్లదు కదా. నష్టం వాటిల్లినంత మేరకు మాత్రమే బీమా వర్తిస్తుంది. దీన్నే ఫస్ట్ లాస్ లిమిట్ అంటారు. ఇంటి బీమాతో కలిసి బంగారు ఆభరణాలకు బీమా తీసుకుంటే తక్కువ మొత్తంలో క్లెయిమ్ వస్తుంది. విడిగా విలువైన ఆభరణాలకు మాత్రమే బీమా తీసుకోవడం ఉత్తమం. -
పాప చదువు కోసం.. ఈక్విటీ ఫండ్స్ మెరుగు
నాకు ఇటీవలే ఒక కూతురు పుట్టింది. ఆమె చదువు కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పన్ను ప్రయోజనాలు లభించేలా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వగలరు. - ఆనంద్, విశాఖ పట్టణం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం బీమా పాలసీలు తీసుకుంటారు. దీనివల్ల పన్నులు కలిసి వస్తాయనేది వారి ఆలోచన. కానీ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ తప్పుల్లో ఇదొకటి. మీ పాప విద్యావసరాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యేక ప్లాన్ అవసరం లేదు. పన్ను ఆదా చేసే స్కీమ్‌లతో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. దీర్ఘకాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పరిస్థితులను పట్టించుకోకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం ఏడాదికొకసారైనా సమీక్షించండి. మీ పాప ఉన్నత చదువులు నిమిత్తం మీకు మరో రెండు, మూడేళ్లలో డబ్బులు అవసరమవుతాయనుకున్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విత్‌డ్రా చేసుకుని సురక్షితమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోతే ఆ ప్రభావం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. నా వయస్సు 27 సంవత్సరాలు. నేనొక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆన్లైన్ ద్వారా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలపండి. - ఖాదర్ బీ, కడప స్టాక్ మార్కెట్‌కు కొత్త అయిన ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో, మరికొంత మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒడిదుడుకుల ప్రభావాన్ని కొంత మేర తట్టుకోవచ్చు. ఆన్లైన్లో బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో ఇన్వెస్ట్ ఆన్లైన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే సూచనలను పాటించండి. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి. మిరా అసెట్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్-వీక్లీ డివిడెండ్ స్కీమ్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మిరా ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌కు బదిలీ చేశాను. నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్లో షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్లుగా ఉంది. ఇది ఎలా సాధ్యం. వీక్లీ డివిడెండ్ పేఅవుట్ స్కీమ్‌లో వచ్చే డివిడెండ్‌పై పన్ను విధించిన తర్వాతే రీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు కదా ! ఈ విషయమై తగిన సలహా ఇవ్వగలరు. - మధు, విజయవాడ వాస్తవ లాభాలపైన మాత్రమే డివిడెండ్‌ను ప్రకటించాలని సెబీ నిబంధనలు వెల్లడిస్తున్నాయి. మిరా అసెట్ షార్ట్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్ అమల్లోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయింది. ఈ ఫండ్ మూలధన నిధులు రూ.4 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఇది ఎలాంటి డివిడెండ్లను ప్రకటించలేదు. వాస్తవ లాభాలను ఆర్జించలేకపోయినందువల్ల కావచ్చు. మరోవైపు మిరా అసెట్ షార్ట్‌టెర్మ్ బాండ్ ఫండ్-రెగ్యులర్ ప్లాన్ క్రమం తప్పకుండా డివిడెండ్లను చెల్లిస్తోంది. ఈ కారణం వల్ల మీ లాభాలు క్యాపిటల్ గెయిన్స్‌గా ఆ సంస్థ చూపించి ఉండవచ్చు. డెట్ ఫండ్స్‌పై వచ్చిన షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. నేను ఐసీఐసీఐ ప్రులైఫ్స్టేజ్ పెన్షన్ యాడ్(డైనమిక్ పీ/ఈ ఫండ్)లో 2010నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు సంతృప్తికరంగా లేనందున ఈ స్కీమ్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి ? - రాహుల్, హైదరాబాద్ మీరు తీసుకున్న పాలసీ డిఫర్డ్ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. జీరో ప్రీమియం అలకేషన్ చార్జీలు ఉండడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అయితే నిర్వహణ చార్జీలు ఏడాదికి 13.1 శాతంగా ఉన్నాయి. ఇది కాకుండా 1.35 శాతం(ఏడాదికి) ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు అదనం. వ్యయాలు అధికంగా ఉన్నందున రాబడులు అల్పంగా వస్తాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో వ్యయాలు చెల్లించారు. అయినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే, సరెండర్ వాల్యూగా ఫండ్ విలువ మీకు లభిస్తుంది. ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకూ మీరు చెల్లించిన ప్రీమియమ్‌లపై మీరు పొందిన పన్ను మినహాయింపులను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌లో కొనసాగితే నష్టాలు మరింతగా కొనసాగుతాయి. కాబట్టి దీనిని సరెండర్ చేసి భవిష్యత్తులో తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
క్యాష్ బ్యాక్‌తో భవిత భద్రం
ఆశయాలను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో విధమైనవి ఉంటాయి. అయితే, వారు, వీరు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ కామన్‌గా ఉండే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. కనుక భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు వర్తమాన అవసరాలను కూడా తీర్చుకోగలగడం ముఖ్యం. అటు దీర్ఘకాలికమైన లక్ష్యాలపై ఎంతగా దృష్టి పెడతామో .. ఇటు స్వల్పకాలిక, మధ్యకాలికమైన మైలురాళ్లను సాధించడం కూడా అంతే ముఖ్యం. మొట్టమొదటి కారు కావొచ్చు, సొంత ఇల్లు కావొచ్చు, పిల్లల చదువు లేదా పెళ్లిళ్లు కావొచ్చు.. ఇవన్నీ కూడా ఆ కోవకే చెందుతాయి. కుటుంబానికి సంతోషాన్ని పంచే.. వీటన్నింటినీ సాధించేందుకు తగినన్ని నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికమైన వాటితో పాటు స్వల్పకాలికమైన లక్ష్యాల సాధనకు కూడా తోడ్పడే క్యాష్ బ్యాక్ బీమా పాలసీలను గురించి వివరించేదే ఈ కథనం. క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రయోజనాలు.. ఇది చాలా సింపుల్ జీవిత బీమా పథకం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడకుండా.. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల సాధనకు వివిధ సమయాల్లో నిర్దిష్ట మొత్తం పాలసీదారు చేతికి అందిస్తుంది. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, విహారయాత్రలు లాంటి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యేకతలేమిటంటే ... పరిమిత కాలం పాటు ప్రీమియంలు కడితే చాలు దీర్ఘకాలికమైన పెట్టుబడి ప్రయోజనాలు అందించడం ఈ తరహా ప్లాన్ల ప్రత్యేకత. ఉదాహరణకు ఇండియాఫస్ట్ క్యాష్ బ్యాక్ ప్లాన్ విషయం తీసుకుంటే 5/7/10 సంవత్సరాల పాటు పేమెంటు టర్మ్ ఉంటే .. 9/12/15 సంవత్సరాల పాటు పాలసీ కొనసాగుతుంది. ప్లాన్ కాల వ్యవధి కొనసాగినంత కాలం.. మధ్య మధ్యలో గ్యారంటీగా చెల్లించే మొత్తాలు చేతికి వస్తూ ఉంటాయి. ప్లాన్ మెచ్యూరిటీ వేళ అదనంగా లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఇక, ఈ ప్లాన్‌లో జీవిత బీమా కవరేజీతో పాలసీదారు కుటుంబానికి ఇన్సూరెన్స్పరమైన భద్రత లభిస్తుంది. అలాగే, కట్టిన ప్రీమియంలు, పొందే ప్రయోజనాలపైనా పన్నులపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. పన్ను ప్రయోజనాలు ... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద చాలా మటుకు క్యాష్ బ్యాక్ ప్లాన్లకు సుమారు రూ. 1,50,000 దాకా కట్టే ప్రీమియంలకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తంపైన, విత్‌డ్రాయల్స్ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. డెత్ బెనిఫిట్స్‌పై కూడా పన్నులు ఉండవు. ఎవరికి అనువైనవి ... భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం సంసిద్ధులుగా ఉండాలనుకునే వారెవరికైనా కూడా ఈ పాలసీలు అనువైనవే. ఇది సింపుల్ ఎండోమెంట్ ప్లాన్. ప్లాన్ ఆఖర్లో మెచ్యూరిటీ మొత్తాన్ని (బోనస్ లాంటి వాటితో పాటు) అందుకోవడంతో పాటు ప్లాన్ కొనసాగినంత కాలం మధ్య మధ్యలో కాస్త కాస్త చొప్పున నగదు కూడా చేతికి వస్తుండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనువైనవి. -
ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!!
నాకు 33 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. నెల జీతం రూ.63,000. వార్షికంగా రూ.7,56,000. భార్య, ఐదేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. నాకు, నా భార్యకు కొన్ని బీమా పాలసీలు, కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. బీమా పాలసీలు... - నా పేరిట రూ.లక్ష మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.5,000 - నా పేరిటరూ. లక్ష కవరేజీతో బీమా కిరణ్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.800 - ఆఫీస్ ఇస్తున్న బీమా కవరేజీ రూ.25,00,000 - ఆఫీస్ ఇస్తున్న వైద్య బీమా ఫ్లోటింగ్ పాలసీ. కవరేజీ రూ.3,50,000 - మ్యాక్స్ బుపా కవర్ రూ.3,00,000. - నా భార్య పేరిట రూ.లక్ష కవరేజీతో మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.6,000 ప్రస్తుత నెలవారీ ఖర్చులు... - గృహ అవసరాలకు: రూ.8,000 - కారు లోన్ చెల్లింపులు: రూ.9,000 - ఆర్డీ అలాగే పీపీఎఫ్: రూ. 5,000 - బీమా: రూ.1,000 - స్కూల్ ఫీజు రూ.6,000. - అత్యవసర నిధికి వ్యయం రూ.6,000 - మొత్తం ఖర్చు రూ. 35,000 పొదుపు... ఇతర పెట్టుబడులు - నా భార్య పేరిట నెలకు రూ.2000 చొప్పున బ్యాంక్‌లో ఆర్డీ. - పీపీఎఫ్‌లో నెలకు రూ.3,000 చొప్పున పొదుపు - షేర్లలో రూ.70,000 పెట్టుబడులు అప్పులు.. - నెలకు రూ.9,000 చొప్పున ఇంకా 24 నెలలు కారు రుణం చెల్లింపు ప్రణాళికలు... ప్రస్తుత రూ.70,000కు తోడు ఇకపై ప్రతి ఏటా రూ.50,000 చొప్పున షేర్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే పిల్లల చదువు, వారి పెళ్లిళ్లు, నా రిటైర్మెంట్ ఇవన్నీ మున్ముందు ఉన్నాయి. నేను ఏం చేస్తే బాగుంటుంది? - ప్రసాద్, హైదరాబాద్ పెట్టుబడులు/పోర్ట్‌ఫోలియో సూచనలు... - మీ కుటుంబ ఆర్థిక భద్రతకు తొలుత జీవిత బీమా కావాలి. రూ.50 లక్షల జీవిత బీమా అవసరం ఉంది. - కుటుంబం మొత్తానికి వైద్య అవసరాలకు బీమా చేయించండి - దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అవసరమే. - దురదృష్టకర పరిస్థితులు ఎదురయితే, ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఒక చైల్డ్ పాలసీ కూడా కావాలి. - మీ ప్రస్తుత పాలసీలు సంప్రదాయబద్ధమెనవి. వీటిని నిలిపేస్తే పలు పెనాల్టి రుసుములు చెల్లించాలి. కాబట్టి వీటిని కొనసాగించండి. తద్వారా వచ్చే డబ్బును పిల్లల విద్య, రిటైర్మెంట్ అవసరాలు వంటికి వినియోగించవచ్చు. సాంప్రదాయ పాలసీలు గనుక, వీటిపై 6 నుంచి 7.5 శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. - మీరు బ్యాంక్, రికరింగ్ డిపాజిట్లలో ప్రస్తుతం పెట్టుబడులు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ట్యాక్స్ అనంతరం వీటి ద్వారా మీకు కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చే వీలుంది. క్రమంగా ఈ పొదుపులను ఈక్విటీ, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలోకి మార్చుకోండి. తద్వారా తగిన రిటర్న్స్ పొందే వీలుంటుంది. - ఈక్విటీ, ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు సలహాలను అడిగారు. మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీమ్స్‌లో పెట్టుబడులు బాగుంటాయి. ఇవి అధిక ఇబ్బందుల సర్దుబాటు ధోరణిలో రిటర్న్స్ అందిస్తాయి. - ఆయా మార్గాల ద్వారా మీరు మంచి ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారని భావిస్తున్నాను. మీరు బీమా పాలసీలు, ఆర్డీ, పీపీఎఫ్ వంటివి ఎప్పుడు... ఎంతవరకూ తీసుకున్నారు... తత్సంబంధ అంశాలు తెలపలేదు. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం మీకు అందుబాటులో ఉంటుందనుకున్న డబ్బును పరిగణనలోకి తీసుకుని తాజా సూచన చేస్తున్నా. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉండవచ్చన్నది చూస్తే... - రిటైర్మెంట్కు, విద్యకు, వివాహాల డబ్బు అవసరాలకు 6, 7.5, 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది... - ప్రస్తుతం ఉన్న మీ ఆదాయ, వ్యయాలను, పొదుపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు... -
ఆన్లైన్ బీమా.. ఆరిందాల మేలు..
ఇంటర్నెట్ మాధ్యమంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఆన్లైన్లో విమానం టికెట్లు, పుస్తకాలు షాపింగ్ చేసినంత సులువుగా పాలసీ కొనుగోలు ప్రక్రియ కూడా ఉండే విధంగా బీమా కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఇమిడి ఉన్న ప్రయోజనాల గురించి వివరించేదే ఈ కథనం. సౌకర్యవంతం, పారదర్శకం: ఆన్లైన్ ప్రత్యేకత ఏమిటంటే .. పాలసీని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు దరఖాస్తు నింపి సమర్పించవచ్చు. ఉదాహరణకు సమయాభావం వల్ల కావొచ్చు లేదా ఏదైనా కారణం వల్ల కావొచ్చు మీరు సగంలోనే ఆపేసిన పక్షంలో మళ్లీ తర్వాతెప్పుడైనా మిగతాది నింపి దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం దరఖాస్తు ఎక్కడిదాకా నింపినది.. బీమా కంపెనీ సదరు ఫారం యూఆర్ఎల్ను మీకు అప్పటికప్పుడు ఈమెయిల్ కూడా చేస్తుంది. కంపెనీ సేల్స్ సిబ్బంది మీకు ఫోన్ చేసి మరీ దరఖాస్తు నింపడంలో సహాయం చేస్తారు. లేదా మీరే కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసినా.. సిబ్బంది సహకరిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రతి దశలోనూ మీకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందుతాయి. పాలసీ తీసుకునే ముందు మీకేమైనా సందేహాలుంటే తీర్చేందుకు కంపెనీ వెబ్సైట్లో ప్రత్యేక సెక్షన్ ఒకటి ఉంటుంది. ధుృవీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ అయినా చేయొచ్చు లేదా కొరియర్ చేయొచ్చు. మీరు ఎంచుకున్న లైఫ్ కవరేజీని బట్టి వైద్య పరీక్షల అవసరం గురించి కంపెనీయే మీకు తెలియజేస్తుంది. సురక్షితం: ఆన్లైన్లో పాలసీ తీసుకోవడమనేది ఇతర ఈ-కామర్స్ లావాదేవీల తరహాలోనే చాలా సురక్షితమైనది. మీ క్రెడిట్/డెబిట్ కార్డు లేదా ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రీమియంను చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం పాలసీలకైతే.. కొన్ని సంస్థలు ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. ఇతరత్రా ఉత్తరప్రత్యుత్తరాలన్నీ కూడా కొరియర్లు, పోస్ట్ కన్నా వేగవంతంగా ఈమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ల రూపంలో జరిగిపోతాయి. పాలసీ నిర్వహణ ఈజీ: కస్టమర్ల సందేహాలు అప్పటికప్పుడు తీర్చేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు బీమా కంపెనీల్లో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. సంస్థ వెబ్సైట్లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబరుతో పాటు, సంప్రదించాల్సిన ఈమెయిల్ ఐడీలు కూడా ఉంటాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. కాల్ సెంటర్‌కి కస్టమర్ చేసిన ఫోన్ కాల్ రికార్డును.. పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా బీమా కంపెనీ అట్టే పెట్టి ఉంచాలి. ఇక, ఆన్లైన్లో తీసుకోవడం వల్ల పాలసీ నిర్వహణ సులభతరంగా ఉంటుంది. ప్రీమియం రసీదులు, రిమైండర్లు, పాలసీ స్టేట్మెంట్ మొదలైనవి ఠంచనుగా ఆన్లైన్లోనే వచ్చేస్తాయి. క్లెయిమ్ ప్రక్రియ సులభతరం: డెత్ క్లెయిములు మొదలైన వాటి గురించి పాలసీదారు కుటుంబసభ్యులు కంపెనీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా కంపెనీకి తెలియజేయొచ్చు. క్లెయిముకు ఏమేం పత్రాలు అవసరమవుతాయన్నది వెబ్సైట్లోనే ఉంటాయి. వాటిని సరిగ్గా అందజేస్తే చాలు. అయితే, క్లెయిమ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే.. పాలసీ తీసుకునే సమయంలోనే ఏ విషయాన్నీ దాచిపెట్టకుండా, పూర్తిగా వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలి. అప్పుడే క్లెయిమ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. చౌక: ఇతర మాధ్యమాలతో పోలిస్తే ఆన్లైన్ మాధ్యమంలో పంపిణీ వ్యయాలు, ఇతర ఖర్చుల భారం బీమా సంస్థకి తగ్గడం వల్ల ఆన్లైన్ పాలసీలు కాస్త చౌకగా లభిస్తాయి. ప్రస్తుతం తక్కువ ప్రీమియాలతో ఆకర్షణీయమైన పాలసీలను అందించేందుకు జీవిత బీమా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు పొగాకు వినియోగించని వారికి కంపెనీలు ప్రీమియం మరికాస్త తగ్గిస్తున్నాయి. అవసరానికో పాలసీ: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పాలసీలను బీమా సంస్థలు ఆన్లైన్లో అందిస్తున్నాయి. సాధారణంగా టర్మ్ ప్లాన్లు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. పొదుపు, పెట్టుబడి, వైద్యం, రిటైర్మెంట్ వంటి ఇతరత్రా అవసరాలకు తగిన పాలసీలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇలా ఎంతో కీలకమైన బీమా ప్రయోజనాలను ఆన్లైన్ మాధ్యమం ద్వారా మరింత చేరువగా తెస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. షరా మామూలుగా.. పాలసీని తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. క్లెయిమ్‌లను సెటిల్ చేయడంలోను, సేవలు అందించడంలోనూ సంస్థ రికార్డు, కంపెనీ బ్రాండ్ నేమ్ మొదలైనవి చూసుకోవాలి. -
రియల్ ఖిలాడీ
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ అంటే టక్కున గుర్తొచ్చేది ఖిలాడీ సిరీస్ సినిమాలు. చెఫ్ ఉద్యోగం నుంచి వందల కోట్ల రూపాయల సినిమాలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే స్థాయికి ఎదిగిన అక్షయ్‌కుమార్.. పెట్టుబడుల్లోనూ ఖిలాడీనే అనిపించుకుంటున్నాడు. బాండ్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అక్షయ్ .. ఎక్కువగా రియల్టీ వైపు మొగ్గు చూపుతాడు. ముంబైలో సంపన్నులు నివసించే లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో అపార్ట్మెంట్, జుహూ ప్రాంతంలో బంగళా, అదే ప్రాంతంలో మరో లగ్జరీ ప్రాజెక్టులో ఇంకో అపార్ట్మెంట్ కొన్నాడు. దేశీయంగానే కాదు.. విదేశాల్లో కూడా భారీగానే ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేశాడు అక్షయ్. దుబాయ్‌లో అమితాబ్ బచ్చన్ ఇంటికి పక్కనే మరో విలాసవంతమైన విల్లాను కొనిపెట్టుకున్నాడు. ఇటు మారిషస్‌లోనూ, అటు కెనడాలోనూ కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి అక్షయ్‌కి. ఇదే కాదు.. వ్యాపారపరమైన తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయతనికి. ఏదైనా మంచి ప్రాజెక్టు తగిలిందంటే.. ప్రారంభ దశలోనే రెండు, మూడు ఫ్లాట్లు కొనేస్తాడు. నిర్మాణం పూర్తి కావొచ్చే దశలో మంచి రేటు రాగానే అమ్మేస్తాడు. ఈ విధంగా ఇటు సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు.. అటు రియల్టీ వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు. అక్షయ్ కుమార్ రియల్టీ పెట్టుబడుల విషయంలో కొన్ని సెంటిమెంట్ కోణాలు కూడా ఉన్నాయి. జుహూ బీచ్ బంగళాని అతను కొనడం వెనుక అచ్చం సినిమా తరహా ప్రత్యేక కథ ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో సదరు ఖాళీ బంగళా దగ్గర ఫొటో షూట్ కోసం ప్రయత్నించాడు అక్షయ్. కానీ, న్యూసెన్స్ చేస్తున్నారంటూ.. ఆ బంగళా వాచ్‌మన్.. అక్షయ్‌ని, ఫొటోగ్రాఫర్‌ని అక్కణ్నుంచి తరిమేశాడు. అటుపైన స్టార్డమ్ వచ్చిన తర్వాత.. పట్టుపట్టి అదే బంగళాని కొనుక్కున్నాడు అక్షయ్. అలాగే, కొన్నాళ్ల క్రితం రౌడీ రాథోడ్ సినిమాను చిత్రీకరించిన ములుంద్ ప్రాంతంలో నిర్మాణదశలో ఉన్న ఒక ప్రాజెక్టులో 4 ఫ్లాట్స్ బుక్ చేసుకున్నాడట. ఇవి ఇన్వెస్ట్మెంట్ కోసం కాదని.. ఆ ప్రాంతంతో తన అనుబంధానికి గుర్తుగా సావనీర్లుగా వాటిని కొన్నాడు. -
ఈ మూడూ తప్పనిసరండోయ్..
ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్.. ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి. వైద్య బీమా పాలసీలు.. వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రమాద బీమా.. ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. -
ఈ మూడూ తప్పనిసరండోయ్..
ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్.. ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి. వైద్య బీమా పాలసీలు.. వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రమాద బీమా.. ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు.