పాప చదువు కోసం.. ఈక్విటీ ఫండ్స్ మెరుగు
నాకు ఇటీవలే ఒక కూతురు పుట్టింది. ఆమె చదువు కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పన్ను ప్రయోజనాలు లభించేలా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇవ్వగలరు.
- ఆనంద్, విశాఖ పట్టణం
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం బీమా పాలసీలు తీసుకుంటారు. దీనివల్ల పన్నులు కలిసి వస్తాయనేది వారి ఆలోచన. కానీ అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ తప్పుల్లో ఇదొకటి. మీ పాప విద్యావసరాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యేక ప్లాన్ అవసరం లేదు. పన్ను ఆదా చేసే స్కీమ్‌లతో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. దీర్ఘకాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పరిస్థితులను పట్టించుకోకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం ఏడాదికొకసారైనా సమీక్షించండి. మీ పాప ఉన్నత చదువులు నిమిత్తం మీకు మరో రెండు, మూడేళ్లలో డబ్బులు అవసరమవుతాయనుకున్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విత్‌డ్రా చేసుకుని సురక్షితమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోతే ఆ ప్రభావం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు.
నా వయస్సు 27 సంవత్సరాలు. నేనొక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆన్‌లైన్ ద్వారా ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలపండి.
- ఖాదర్ బీ, కడప
స్టాక్ మార్కెట్‌కు కొత్త అయిన ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో, మరికొంత మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒడిదుడుకుల ప్రభావాన్ని కొంత మేర తట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఇన్వెస్ట్ ఆన్‌లైన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే సూచనలను పాటించండి. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి.
మిరా అసెట్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్-వీక్లీ డివిడెండ్ స్కీమ్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మిరా ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌కు బదిలీ చేశాను. నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్‌లో షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్లుగా ఉంది. ఇది ఎలా సాధ్యం. వీక్లీ డివిడెండ్ పేఅవుట్ స్కీమ్‌లో వచ్చే డివిడెండ్‌పై పన్ను విధించిన తర్వాతే రీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు కదా ! ఈ విషయమై తగిన సలహా ఇవ్వగలరు.
- మధు, విజయవాడ
వాస్తవ లాభాలపైన మాత్రమే డివిడెండ్‌ను ప్రకటించాలని సెబీ నిబంధనలు వెల్లడిస్తున్నాయి. మిరా అసెట్ షార్ట్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్ అమల్లోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయింది. ఈ ఫండ్ మూలధన నిధులు రూ.4 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఇది ఎలాంటి డివిడెండ్‌లను ప్రకటించలేదు. వాస్తవ లాభాలను ఆర్జించలేకపోయినందువల్ల కావచ్చు. మరోవైపు మిరా అసెట్ షార్ట్‌టెర్మ్ బాండ్ ఫండ్-రెగ్యులర్ ప్లాన్ క్రమం తప్పకుండా డివిడెండ్‌లను చెల్లిస్తోంది. ఈ కారణం వల్ల మీ లాభాలు క్యాపిటల్ గెయిన్స్‌గా ఆ సంస్థ చూపించి ఉండవచ్చు. డెట్ ఫండ్స్‌పై వచ్చిన షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
నేను ఐసీఐసీఐ ప్రులైఫ్‌స్టేజ్ పెన్షన్ యాడ్(డైనమిక్ పీ/ఈ ఫండ్)లో 2010నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు సంతృప్తికరంగా లేనందున ఈ స్కీమ్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి ?
- రాహుల్, హైదరాబాద్
మీరు తీసుకున్న పాలసీ డిఫర్డ్ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. జీరో ప్రీమియం అలకేషన్ చార్జీలు ఉండడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అయితే నిర్వహణ చార్జీలు ఏడాదికి 13.1 శాతంగా ఉన్నాయి. ఇది కాకుండా 1.35 శాతం(ఏడాదికి) ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు అదనం. వ్యయాలు అధికంగా ఉన్నందున రాబడులు అల్పంగా వస్తాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో వ్యయాలు చెల్లించారు. అయినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే, సరెండర్ వాల్యూగా ఫండ్ విలువ మీకు లభిస్తుంది. ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకూ మీరు చెల్లించిన ప్రీమియమ్‌లపై మీరు పొందిన పన్ను మినహాయింపులను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌లో కొనసాగితే నష్టాలు మరింతగా కొనసాగుతాయి. కాబట్టి దీనిని సరెండర్ చేసి భవిష్యత్తులో తెలివిగా ఇన్వెస్ట్ చేయండి.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్