పాలసీ సరెండర్‌ చేస్తే.. ఇక ఊరట! | Differences between guaranteed and special surrender values of Special Story | Sakshi
Sakshi News home page

పాలసీ సరెండర్‌ చేస్తే.. ఇక ఊరట!

Published Mon, Jul 8 2024 5:44 AM | Last Updated on Mon, Jul 8 2024 8:10 AM

Differences between guaranteed and special surrender values of Special Story

నిబంధనల్లో తాజాగా మార్పులు..

తొలి నాళ్లలో రద్దు చేసుకుంటే అధిక మొత్తం

సెప్టెంబర్‌ నాటికి అమలు చేయాలన్న ఐఆర్‌డీఏఐ

ప్రీమియం భారమైతే సరెండర్‌ ఒక మార్గం

తప్పుడు పాలసీ అంటగట్టినా వదిలించుకోవచ్చు..

ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్‌/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. 

నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్‌) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్‌ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం.

సరెండర్‌ వేల్యూ? 
జీవిత బీమాలో సరెండర్‌ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్‌ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్‌ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్‌ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి.

 ఇది అసమంజసమని భావించిన ఐఆర్‌డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్‌ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్‌ సరెండర్‌ వ్యాల్యూ (జీఎస్‌వీ), స్పెషల్‌ సరెండర్‌ వ్యాల్యూ (ఎస్‌ఎస్‌వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్‌ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్‌ సరెండర్‌ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్‌ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్‌ సరెండర్‌ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది.

ఎంతొస్తుంది..? 
పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్‌ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూ, స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ, చెల్లింపుల సరెండర్‌ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్‌ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్‌ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 

సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీని సరెండర్‌ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్‌ రూ.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్‌) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్‌ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్‌ అతడికి జమ అయింది. 

గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్‌ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్‌ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్‌ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్‌ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్‌ కుమార్‌ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. 

ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్‌ సరెండర్‌ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్‌ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ పాలసీలు, సింగిల్‌ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది.  

ఎప్పటి నుంచి..? 
స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్‌ పాలసీలకే వర్తిస్తాయని బంధన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్‌ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్‌డీఏఐ తీసుకొచి్చన స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.

ప్రత్యామ్నాయాలు... 
ఎండోమెంట్‌ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్‌ చేయడం ఒక్కటే ఆప్షన్‌ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్‌ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. 

మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్‌ అష్యూర్డ్‌ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్‌ సమ్‌ అష్యూర్డ్‌ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్‌ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్‌ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు.  

ప్రయోజనాలు
నూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్‌ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్‌ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్‌డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్‌ పెట్టడం కూడా సరెండర్‌ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు.  

సంప్రదాయ పాలసీలు / టర్మ్‌ ప్లాన్లు
ఎండోమెంట్‌ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్‌ అష్యూర్డ్‌ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్‌ అష్యూర్డ్‌ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్‌ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. 

అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్‌) పాలసీదారు మరణించినట్టయితే సమ్‌ అష్యూర్డ్‌ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్‌ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్‌ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్‌ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement