నగలకు బీమా ధగధగ
బంగారంతో మనకున్న అనుబంధం ఇప్పటిది కాదు. బంగారం కోసం యుద్ధాలే జరిగాయి. చరిత్రను చూస్తే... బంగారం మన సంస్కృతిలో ఎలా కలసిపోయిందో స్పష్టంగా అర్థమౌతుంది. ఇప్పటికీ బంగారాన్ని సమాజంలో హోదా కిందే పరిగణిస్తారు. అందుకేనేమో!! హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నా మహిళలు మాత్రం మెడలో గొలుసులు ధరించకుండా బయటకి వెళ్లటానికి అంత ఇష్టపడటంలేదు. కొందరైతే ఇటీవల గొలుసు దొంగల కారణంగా ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు.
అయినాసరే!! మహిళలు బయటికెళ్లేటపుడు బంగారాన్ని ధరించకుండా వెళ్లటానికి ఇష్టపడరు. దాన్ని బంగారంపై ఉన్న మోజు అనుకోవచ్చు... లేకుంటే తమ హోదా దెబ్బతింటుందనే భావన కావచ్చు.. కారణం ఏదైనా కావచ్చు. అంతేకాదు... శుభకార్యాల్లో, ప్రత్యేక రోజుల్లో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులకు ప్రేమతో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అలాగే బంగారం చేతిలో ఉంటే ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవచ్చన్నది మరి కొందరి నమ్మకం.
మరి మనం ఇంతగా ప్రాధాన్యమిచ్చే బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే..? ఎవరైనా దొంగలిస్తే..? గొలుసు దొంగల్లా లాక్కుపోతే..? అప్పుడేంటి పరిస్థితి? అందుకే బంగారు ఆభరణాలకు, విలువైన ఇతర వస్తువులకు బీమా తీసుకోవాలి.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
బీమాతో ఆభరణాల రక్షణ
* ఇల్లు, విలువైన ఇతర వస్తువులతో కలిపి కూడా
* పాలసీ తీసుకునే ముందు నిబంధనలు చూడాలి
* మీ అవసరాలకు తగ్గట్టు ఉన్నదే ఎంచుకోవటం బెటర్
ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బీమా కంపెనీలు బంగారు ఆభరణాలకు బీమా అందిస్తున్నాయి. ఈ బీమాను రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి... బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తించే పాలసీ. రెండోది... ఇంటి బీమాలో భాగంగా విలువైన వస్తువులతోపాటు బంగారు ఆభరణాలక్కూడా తీసుకునే పాలసీ. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులకు సంబంధించి... పలు రకాల ప్రమాదాలను కవర్ చేసే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు.
ఆభరణాలకు బీమా అందిస్తున్న కొన్ని సంస్థలు
* ఓరియంటల్ ఇన్సూరెన్స్
* యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్
* న్యూ ఇండియా అస్యూరెన్స్
* నేషనల్ ఇన్సూరెన్స్
* హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో
* బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
* ఐసీఐసీఐ లాంబార్డ్
* టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్
నిబంధనలు మారుతుంటాయ్..
ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకం నిబంధనలు రూపొందించుకుంటుంది. ఉదాహరణకు ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బంగారు ఆభరణాలపై ఎన్ని డైమండ్స్ ఉన్నాయో వాటి సంఖ్యను అడుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క డైమండ్ విలువ రూ.2,500పైగా ఉండాలి. ఫ్యూచర్ జెనరాలి విషయానికొస్తే.. ఈ సంస్థ బంగారు ఆభరణం ఖరీదు రూ.10,000పైన ఉంటే దాని వాల్యుయేషన్ సర్టిఫికేట్‌ను అందించాలని అడుగుతుంది.
* బీమా మొత్తాన్ని బట్టి ప్రీమియం కూడా మారుతుంటుంది. టాటా ఏఐఏ హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2,360 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కంటెంట్ కవర్‌ను అందజేస్తోంది. అదే మీరు బీమా కవర్‌ను రూ.6 లక్షలకు తగ్గించుకుంటే గనుక ప్రీమియం కూడా రూ. 1,416కి వస్తుంది.
* కొన్ని కంపెనీలు డి స్కౌంట్లను కూడా అందిస్తాయి. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ నాలుగు ఇన్సూరెన్సులు తీసుకుంటే 15 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది. అదే 6 విభాగాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకుంటే 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంటి బీమాలో బంగారు ఆభరణాలు-విలువైన వస్తువుల బీమా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల బీమా, ఫర్నిచర్ బీమా తదితర విభాగాలు ఉంటాయి.
* సాధారణంగా బంగారు ఆభరణాల బీమాకు సంబంధించిన వార్షిక ప్రీమియం రూ.2,000-రూ.3,000 మధ్యలో ఉండొచ్చు. ఇక్కడ ప్రీమియం... బీమా మొత్తాన్ని బట్టి మారుతుంటుంది.
క్లెయిమ్ పొందటం ఎలా?
ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినప్పుడు విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయాలి. క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. నష్టం జరిగిన వస్తువులకు సంబంధించిన వాల్యుయేషన్ సర్టిఫికేట్‌తో సహా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. కంపెనీ ఉద్యోగి వ చ్చి నష్టాన్ని అంచనా వేస్తారు. దొంగతనం జరిగితే పోలిస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీని, అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖనుంచి సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సందర్భాల్లో బీమా వర్తించదు..
వరుసగా 30 రోజులకు పైగా ఇంట్లో ఎవరూ నివసించకుండా ఉన్నపుడు... ఆ ఇంట్లో దొంగతనం జరిగినా ఇతర ఏదైనా అసంఘటిత చర్యలు చోటుకున్నా పోయిన విలువైన వస్తువులకు సంస్థలు ఎలాంటి బీమాను చెల్లించవు.
* యుద్ధం వంటి కారణాలతో బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే దానికి బీమా కంపెనీ బాధ్యత వహించదు.
* కొన్ని సందర్భాల్లో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బంగారు ఆభరణాలకు నష్టం వాటిల్లిందని కంపెనీ భావించినా క్లెయిమ్ దక్కకపోవచ్చు.
ఈ విషయాలు గుర్తుంచుకోండి
పాలసీ తీసుకునే సమయంలో అన్ని ప్రమాదాలకూ పాలసీ వర్తిస్తుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే క్లెయిమ్ సమయంలో సమస్యలు వస్తాయి. అలాగే మొత్తం వస్తువు ఖరీదుకు బీమా ఉంటుందా? లేక ఫస్ట్ లాస్ లిమిట్ ఆధారంగా బీమా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని సందర్భాలో వస్తువు మొత్తానికి నష్టం వాటిల్లదు కదా.
నష్టం వాటిల్లినంత మేరకు మాత్రమే బీమా వర్తిస్తుంది. దీన్నే ఫస్ట్ లాస్ లిమిట్ అంటారు. ఇంటి బీమాతో కలిసి బంగారు ఆభరణాలకు బీమా తీసుకుంటే తక్కువ మొత్తంలో క్లెయిమ్ వస్తుంది. విడిగా విలువైన ఆభరణాలకు మాత్రమే బీమా తీసుకోవడం ఉత్తమం.