Oriental Insurance Company
-
మూడు ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు మూలధనం!
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు వాటి ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల మూలధన సమకూర్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు (యూఐఐసీ) ఉన్నాయి. ఆదాయాలపైకాకుండా, లాభార్జనకు వ్యూహాలు రచించాలని గత ఏడాది ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మూడు సంస్థలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఈ మూడు సంస్థలకు ఆర్థికశాఖ రూ.5,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఐసీఎల్కు రూ.3,700 కోట్లు కేటాయించగా, ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.1,200 కోట్లు లభించాయి. ఇక చెన్నై ఆధారిత యూఐఐసీకి కేటాయింపులు రూ.100 కోట్లు. మూడు సంస్థలూ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తగిన సాల్వెన్సీ నిష్పత్తులను కలిగిలేవు. సాల్వెన్సీ రేషియో 150 శాతం ఉండాల్సి ఉండగా, ఎన్ఐసీ విషయంలో 63 శాతం, ఓఐసీ 15 శాతం, యూఐఐసీ 51 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ అయ్యింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. ఇందులో ఒకదానిని ప్రైవేటీకరించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ సవరణకు ఆమోదముద్ర వేసింది. -
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చనుంది. వాటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు ఇది తప్పనిసరి అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.5,000 కోట్ల నిధులను సమకూర్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా, నియంత్రణపరమైన నిధుల అవసరాలను చేరుకునేందుకు వీలుగా వీటికి ఎంత మేర సమకూర్చాలనే దానిపై ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి తెలిపారు. వాటి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా లేదని, సాల్వెన్సీ మార్జిన్ పెంచేందుకు నిధుల సాయం అవసరమని చెప్పారు. కంపెనీలు తమకు వచ్చే క్లెయిమ్‌లకు చెల్లింపులు చేస్తుంటాయని తెలిసిందే. ఈ చెల్లింపులకు మించి నిధులను బీమా సంస్థలు కలిగి ఉండడాన్ని సాల్వెన్సీ మార్జిన్‌గా చెబుతారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ మార్జిన్ అయినా ఉండాలి. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
కోవిడ్-19తో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు
Covid-19: కోవిడ్-19 మహమ్మరి అంటువ్యాధి కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థల సిబ్బంది మరణిస్తే ఆ ఉద్యోగుల నామినీలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో అందించనున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులకు కోవిడ్-19 ఎక్స్ గ్రేషియాను చెల్లించాలని నిర్ణయించినట్లు జనరల్ ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్(జీఐఈఏఐఏ) అధికారి ఒకరు తెలిపారు. ఈ నాలుగు బీమా సంస్థలలో ఒకటైన ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోవిడ్-19తో మరణించిన ఉద్యోగుల నామినీకి రూ.10 లక్షలను ఏకమొత్తంగా ఎక్స్ గ్రేషియాను చెల్లించినట్లు ప్రకటిస్తూ జూలై 22న సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి/జీవిత భాగస్వామి/ఆధారిత పిల్లలు, తల్లిదండ్రుల చికిత్స కోసం స్టాఫ్ గ్రూప్ మెడిక్లెయిం పాలసీ కింద కవర్ కానీ వైద్య ఖర్చులను కూడా 100 శాతం తిరిగి చెల్లిస్తామని బీమా కంపెనీ తెలిపింది. "నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్కు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. మిగిలిన మూడు కంపెనీలు త్వరలో తమ సర్క్యులర్లతో బయటకు రావచ్చు" అని జీఐఏఐఏ ప్రధాన కార్యదర్శి కె. గోవిందన్ తెలిపారు. -
నిబంధనల వ్యథ.. చంద్రన్న బీమా కథ!
⇒ నమోదైన లబ్ధిదారులు 16.57 లక్షలు ⇒ బీమా చెల్లించాల్సింది 3,004 మందికి ⇒ ఇప్పటి వరకు చెల్లించింది 2084 కుటుంబాలకు.. పల్స్ సర్వేలో వివరాలు సక్రమంగా లేకపోవటంతో ఇక్కట్లు బందరు మండలం చిరివెళ్లపాలెంలో ఓ యువకుడు ట్రాక్టర్ ఢీకొని గత ఏడాది నవంబరులో మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా నేటికీ అందలేదు. ఈ ఒక్క సంఘటనే కాదు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ పరిస్థితి లబ్ధిదారులను వేదన పెడుతోంది. చంద్రన్న బీమా పథకంలో నిబంధనల మోత నిరుపేదల మతిపోగొడుతోంది. ఒక్కోసారి ఒక్కో రకం రూల్ అని చెబుతూ బాధితులతో ఆటలాడుకుంటున్నారు. పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం లబ్ధిదారులకు శాపంగా మారింది. మచిలీపట్నం : అసంఘటిత రంగంలో పనిచేసే బాధిత కార్మికులకు చంద్రన్న బీమా సకాలంలో అందక ఆవేదన పెడుతోంది. ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధిస్తుండటంతో బీమా సొమ్ము కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 2016 అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 16.57 లక్షల మంది ఈ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 3,004 మంది వివిధ కారణాలతో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2,084 మందికి బీమా సొమ్మును చెల్లించినట్లు వెలుగు ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో 139 ప్రమాదం కారణంగా మరణించిన కేసులు, సహజ మరణాలు 1943, పాక్షికంగా వికలాంగులైన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సొమ్ము అందించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆధార్‌కార్డు ఆన్లైన్ కాకపోవటం, రేషన్‌కార్డులో తప్పులు దొర్లటం, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం, పల్స్ సర్వే ఇంకా పూర్తికాకపోవటం తదితర కారణాలతో మృతుల కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము సకాలంలో చేతికి అందని పరిస్థితి నెలకొంది. రెండు బీమా కంపెనీల ద్వారా నగదు చెల్లింపులు.. డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పల్స్ సర్వే సమయంలోనూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల నుంచి చంద్రన్న బీమా ప్రీమియంగా రూ.15 వసూలు చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై) ద్వారా సహజ మరణం పొందితే రూ.30 వేలు, ప్రమాదంలో మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3,62,500 ఇవ్వాలి. మృతుని కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే ఇద్దరికి ఏడాదికి రూ.1200 స్కాలర్షిప్ అందించాల్సి ఉంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) ద్వారా 60 నుంచి 70 ఏళ్ల వయసుఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4.25 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు లైఫ్ ఇన్సూరె న్స్ కార్పొరేషన్ ద్వారా రూ.75 వేలు ముందస్తుగా చెల్లించటంలో ఇబ్బంది ఉండటం లేదు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ.4.25 లక్షలు చెల్లించే సమయంలోనే నిబంధనలతో జాప్యం జరుగుతోందని వెలుగు అధికారులు చెబుతున్నారు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు సంబంధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న తరువాతే ఈ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
నగలకు బీమా ధగధగ
బంగారంతో మనకున్న అనుబంధం ఇప్పటిది కాదు. బంగారం కోసం యుద్ధాలే జరిగాయి. చరిత్రను చూస్తే... బంగారం మన సంస్కృతిలో ఎలా కలసిపోయిందో స్పష్టంగా అర్థమౌతుంది. ఇప్పటికీ బంగారాన్ని సమాజంలో హోదా కిందే పరిగణిస్తారు. అందుకేనేమో!! హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నా మహిళలు మాత్రం మెడలో గొలుసులు ధరించకుండా బయటకి వెళ్లటానికి అంత ఇష్టపడటంలేదు. కొందరైతే ఇటీవల గొలుసు దొంగల కారణంగా ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు. అయినాసరే!! మహిళలు బయటికెళ్లేటపుడు బంగారాన్ని ధరించకుండా వెళ్లటానికి ఇష్టపడరు. దాన్ని బంగారంపై ఉన్న మోజు అనుకోవచ్చు... లేకుంటే తమ హోదా దెబ్బతింటుందనే భావన కావచ్చు.. కారణం ఏదైనా కావచ్చు. అంతేకాదు... శుభకార్యాల్లో, ప్రత్యేక రోజుల్లో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులకు ప్రేమతో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అలాగే బంగారం చేతిలో ఉంటే ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవచ్చన్నది మరి కొందరి నమ్మకం. మరి మనం ఇంతగా ప్రాధాన్యమిచ్చే బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే..? ఎవరైనా దొంగలిస్తే..? గొలుసు దొంగల్లా లాక్కుపోతే..? అప్పుడేంటి పరిస్థితి? అందుకే బంగారు ఆభరణాలకు, విలువైన ఇతర వస్తువులకు బీమా తీసుకోవాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం బీమాతో ఆభరణాల రక్షణ * ఇల్లు, విలువైన ఇతర వస్తువులతో కలిపి కూడా * పాలసీ తీసుకునే ముందు నిబంధనలు చూడాలి * మీ అవసరాలకు తగ్గట్టు ఉన్నదే ఎంచుకోవటం బెటర్ ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా కంపెనీలు బంగారు ఆభరణాలకు బీమా అందిస్తున్నాయి. ఈ బీమాను రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి... బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తించే పాలసీ. రెండోది... ఇంటి బీమాలో భాగంగా విలువైన వస్తువులతోపాటు బంగారు ఆభరణాలక్కూడా తీసుకునే పాలసీ. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులకు సంబంధించి... పలు రకాల ప్రమాదాలను కవర్ చేసే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. ఆభరణాలకు బీమా అందిస్తున్న కొన్ని సంస్థలు * ఓరియంటల్ ఇన్సూరెన్స్ * యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ * న్యూ ఇండియా అస్యూరెన్స్ * నేషనల్ ఇన్సూరెన్స్ * హెచ్డీఎఫ్సీ ఎర్గో * బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ * ఐసీఐసీఐ లాంబార్డ్ * టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనలు మారుతుంటాయ్.. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకం నిబంధనలు రూపొందించుకుంటుంది. ఉదాహరణకు ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బంగారు ఆభరణాలపై ఎన్ని డైమండ్స్ ఉన్నాయో వాటి సంఖ్యను అడుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క డైమండ్ విలువ రూ.2,500పైగా ఉండాలి. ఫ్యూచర్ జెనరాలి విషయానికొస్తే.. ఈ సంస్థ బంగారు ఆభరణం ఖరీదు రూ.10,000పైన ఉంటే దాని వాల్యుయేషన్ సర్టిఫికేట్‌ను అందించాలని అడుగుతుంది. * బీమా మొత్తాన్ని బట్టి ప్రీమియం కూడా మారుతుంటుంది. టాటా ఏఐఏ హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2,360 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కంటెంట్ కవర్‌ను అందజేస్తోంది. అదే మీరు బీమా కవర్‌ను రూ.6 లక్షలకు తగ్గించుకుంటే గనుక ప్రీమియం కూడా రూ. 1,416కి వస్తుంది. * కొన్ని కంపెనీలు డి స్కౌంట్లను కూడా అందిస్తాయి. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ నాలుగు ఇన్సూరెన్సులు తీసుకుంటే 15 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది. అదే 6 విభాగాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకుంటే 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంటి బీమాలో బంగారు ఆభరణాలు-విలువైన వస్తువుల బీమా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల బీమా, ఫర్నిచర్ బీమా తదితర విభాగాలు ఉంటాయి. * సాధారణంగా బంగారు ఆభరణాల బీమాకు సంబంధించిన వార్షిక ప్రీమియం రూ.2,000-రూ.3,000 మధ్యలో ఉండొచ్చు. ఇక్కడ ప్రీమియం... బీమా మొత్తాన్ని బట్టి మారుతుంటుంది. క్లెయిమ్ పొందటం ఎలా? ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినప్పుడు విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయాలి. క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. నష్టం జరిగిన వస్తువులకు సంబంధించిన వాల్యుయేషన్ సర్టిఫికేట్‌తో సహా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. కంపెనీ ఉద్యోగి వ చ్చి నష్టాన్ని అంచనా వేస్తారు. దొంగతనం జరిగితే పోలిస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీని, అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖనుంచి సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భాల్లో బీమా వర్తించదు.. వరుసగా 30 రోజులకు పైగా ఇంట్లో ఎవరూ నివసించకుండా ఉన్నపుడు... ఆ ఇంట్లో దొంగతనం జరిగినా ఇతర ఏదైనా అసంఘటిత చర్యలు చోటుకున్నా పోయిన విలువైన వస్తువులకు సంస్థలు ఎలాంటి బీమాను చెల్లించవు. * యుద్ధం వంటి కారణాలతో బంగారు ఆభరణాలకు నష్టం జరిగితే దానికి బీమా కంపెనీ బాధ్యత వహించదు. * కొన్ని సందర్భాల్లో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బంగారు ఆభరణాలకు నష్టం వాటిల్లిందని కంపెనీ భావించినా క్లెయిమ్ దక్కకపోవచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోండి పాలసీ తీసుకునే సమయంలో అన్ని ప్రమాదాలకూ పాలసీ వర్తిస్తుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే క్లెయిమ్ సమయంలో సమస్యలు వస్తాయి. అలాగే మొత్తం వస్తువు ఖరీదుకు బీమా ఉంటుందా? లేక ఫస్ట్ లాస్ లిమిట్ ఆధారంగా బీమా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని సందర్భాలో వస్తువు మొత్తానికి నష్టం వాటిల్లదు కదా. నష్టం వాటిల్లినంత మేరకు మాత్రమే బీమా వర్తిస్తుంది. దీన్నే ఫస్ట్ లాస్ లిమిట్ అంటారు. ఇంటి బీమాతో కలిసి బంగారు ఆభరణాలకు బీమా తీసుకుంటే తక్కువ మొత్తంలో క్లెయిమ్ వస్తుంది. విడిగా విలువైన ఆభరణాలకు మాత్రమే బీమా తీసుకోవడం ఉత్తమం. -
‘గోవాడ’లో గోల్మాల్?
చోడవరం : గోవాడ చక్కెర మిల్లులో తడిసిన పంచదార అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి కాసులు కురిపించినట్టు చెప్పుకుంటున్నారు. సుమారు రూ.8కోట్లు మేర అవినీతి జరిగిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ కర్మాగారం గతేడాది వరకు లాభాల బాటలో పయనించింది. పాలకవర్గం నిర్లక్ష్యంతో గతేడాది ప్రారంభంలో క్వింటా రూ.2900 ధర ఉన్నప్పుడు పంచదార అమ్మకుండా గోడౌన్లలో నిల్వ ఉంచేశారు. సుమారు 5.2లక్షల క్వింటాళ్ల పంచదారను వడ్లపూడి, కశింకోటల్లోని ప్రైవేటు గోడౌన్లతోపాటు ఫ్యాక్టరీ గోడౌన్లలో నిల్వ చేశారు. ఇంతలో హుద్‌హుద్ ధాటికి గోడౌన్ల పైకప్పులు గతేడాది ఎగిరిపోయాయి. సుమారు 2.61లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది.దీనివల్ల రూ.80కోట్లు వరకు నష్టం వచ్చిందని పాలకవర్గం, యాజమాన్యం అప్పట్లో గగ్గోలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తడిసిన పంచదార అమ్మకం,బీమా పరిహారం పొందడంలో కొంత హైడ్రామా సాగినట్టు తెలిసింది. నష్టాల బూచిని చూపి పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కయి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని తెలిసింది. కశింకోట సీడబ్ల్యూసీ గోడౌన్లలోని 1.19లక్షల క్వింటాళ్ల అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. ఈ పంచదారకు యాజమాన్యం ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీకి పూర్తిగా ప్రీమియం చెల్లించకపోవడం, తర్వాత ఏదోలా పూర్తిసరకుకు బీమా వర్తించేలా తంటాలు పడినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదారను పరిశీలించేందుకు బీమా కంపెనీ అధికారులు రావడం, బస్తాలన్నింటినీ టెండరు ద్వారా అమ్మేసి, మిగతాది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు జోడించి నష్టపరిహారం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాక్టరీకి గోనెలు సరఫరా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్‌ప్రైవేటు పేరున ఈ వ్యవహారంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారే బీమా టెండరు వేసి తర్వాత క్వింటా రూ.1070కి కోడ్ చేసి, టెండరును దక్కించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎకాయెకిన యా జమాన్యం, పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు ఏకమై మధ్యంతరంగా తీర్మానించి పంచదారను వివిధ ధరలకు బహిరంగమార్కెట్లో విక్రయించినట్టు తెలిసింది. ఈక్రమంలో సుమారు రూ.8కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని ఇన్సూరెన్సు సంస్ధకు కోర్టు నోటీసులు కూడా పంపినట్టు తెలిసింది. కాగా అక్రమాల విషయం ఎక్కడ బయటపడుతుందోనని బీమా పరిహా రం రూ.4కోట్లు వద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు ఇందులో కీలకపాత్రవహిస్తున్న వారు నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. -
గణేశ్ మండళ్లకూ ఇన్సూరెన్స్
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లకు అతి తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించేందుకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. ఉత్సవాల సమయంలో ఉగ్రవాద సంస్థలు ఏ రూపంలోనైనా దాడులు చేసే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో మండపాలకు, అక్కడ విధులు నిర్వహించే కార్యకర్తలు, దర్శనానికి వచ్చే భక్తులకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఉట్టి ఉత్సవాల సమయంలో ఇదివరకే ఈ ఇన్సూరెన్స్ క ంపెనీ సార్వజనిక గోవిందా బృందాలకు అతి తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో గణేశ్ ఉత్సవాల సమయంలో సార్వజనిక మండళ్లకు బీమా కల్పించాలని బృహత్తర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రూ.50, రూ.100ల ప్రీమియంతో కార్యకర్తలకు రూ.50వేల నుంచి రూ.లక్షా వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీ పరిపాలన విభాగం అధికారి సచిన్ ఖాన్విల్కర్ తెలిపారు చెప్పారు. ‘ఉత్సవాల సమయంలో విద్యుత్ తోరణాలు, ప్లడ్ లైట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. దీంతో విద్యుద్ఘాతం జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ఆస్కారముంటుంది. దీంతో మండళ్లకు బీమా సౌకర్య కల్పించి అండగా నిలవాల’ని నిర్ణయించామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఈ బీమా సౌకర్యం కేవలం రిజిస్ట్రేషన్ మండళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి మొదలుకుని గణేశ్ మండపం పరిధి వరకు, సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఉత్సవాలు ముగిసేవరకు వర్తిస్తుందన్నారు. ఏదైన ప్రమాదం జరిగి బీమా పాలసీ డబ్బులు పొందాలంటే స్థానిక పోలీసు స్టేషన్లో కచ్చితంగా కేసు నమోదై ఉండాలని ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ ఆసావరి దేశాయి చెప్పారు. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల దాడులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనం, దోపిడీలు, తొక్కిసలాటలతో పాటు భూకంపం, ఈదురు గాలులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు, గణేశ్ విగ్రహంపై అలంకరించిన ఖరీదైన నగలు, భక్తులు సమర్పించుకున్న కానుకలు, హుండీలో నగదు, మండపం నుంచి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్లే డబ్బులు తదితర రిస్కు పనులన్నింటికి కూడా ఈ బీమా వర్తిస్తుందన్నారు.