న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు వాటి ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల మూలధన సమకూర్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు (యూఐఐసీ) ఉన్నాయి.
ఆదాయాలపైకాకుండా, లాభార్జనకు వ్యూహాలు రచించాలని గత ఏడాది ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మూడు సంస్థలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఈ మూడు సంస్థలకు ఆర్థికశాఖ రూ.5,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌ఐసీఎల్‌కు రూ.3,700 కోట్లు కేటాయించగా, ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.1,200 కోట్లు లభించాయి.
ఇక చెన్నై ఆధారిత యూఐఐసీకి కేటాయింపులు రూ.100 కోట్లు. మూడు సంస్థలూ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తగిన సాల్వెన్సీ నిష్పత్తులను కలిగిలేవు. సాల్వెన్సీ రేషియో 150 శాతం ఉండాల్సి ఉండగా, ఎన్‌ఐసీ విషయంలో 63 శాతం, ఓఐసీ 15 శాతం, యూఐఐసీ 51 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ అయ్యింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. ఇందులో ఒకదానిని ప్రైవేటీకరించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ సవరణకు ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment