insurance company
-
దేశ ప్రగతిలో తనదైన ముద్రవేస్తూ...
‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్– 2024’ వారి తాజా నివేదిక ప్రకారం భారత జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ– 2023లో 107వ ర్యాంక్ పొంద డమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇప్పటికే క్లెయిమ్‌ల చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచ నంబర్ 1గా ఇది ఉండటం గమనార్హం. 2024 సెప్టెంబర్ 1 నాటికి భారతీయ జీవిత బీమా సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇటువంటి ఫలితాలు ప్రభుత్వ బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి.జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయడం ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 1956 వరకు ఉద్య మాలు నడిచాయి. ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయిదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది. ఇప్పుడు ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు దేశా భివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! ఏదైనా బీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిమ్‌ల పరిష్కార శాతమే కొలబద్ద. ఆ విషయంలో 99 శాతంతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఎల్ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోన స్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. కానీ ఇంతవరకూ ఎల్ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకో లేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్ప లేదంటే మన ఎల్ఐసీ ఎంత పటిష్ఠమైనదో తెలుస్తోంది. గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ దాదాపు 70 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. ఎల్ఐసీ సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు. 2024 మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పైమాటే. ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1960లలో పేద భారత దేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది. గత బడ్జెట్ సెషన్లో అనేకమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ఈ విషయంపై వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు. బీమా ప్రీమియ మ్‌లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్ఐసీని ఆర్థికంగా బలోపేతం చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి, అంతిమంగా దేశానికీ, పాలసీ దారులకూ ఎంతో ప్రయోజనకరం అవుతుంది. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులుమొబైల్: 94417 97900 (నేడు ఎల్ఐసీ ఆవిర్భావ దినోత్సవం) -
Hit And Run Case: రూ. 1.98 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది. -
అతని కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం.. ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్!
ఓ కార్ యాక్సిడెంట్లో మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం చెల్లించాలని కార్ ఓనర్, డ్రైవర్‌తో సహా బీమా కంపెనీని ఆదేశించింది. పది సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో మరణించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఉద్యోగి కుటుంబానికి వడ్డీతో సహా రూ. 2.45 కోట్లు చెల్లించాలని కారు యజమాని, డ్రైవర్, బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల ఆదేశించిన అత్యధిక పరిహారాల్లో ఇది ఒకటి. బార్క్‌లో పనిచేసే ప్రియనాథ్ పాఠక్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం ముంబై అనుశక్తి నగర్ వద్ద బైక్ వెళ్తుండగా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కేసులో కారు యజమాని నోబుల్ జాకబ్ నిందితుడు కాగా 2014 డిసెంబరు 19న జాకబ్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మృతుడు ప్రియనాథ్ పాఠక్ నెల జీతం రూ.1.26 లక్షలు కావడంతో కోర్టు భారీ పరిహారాన్ని నిర్ణయించింది. -
మూడు ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు మూలధనం!
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు వాటి ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల మూలధన సమకూర్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు (యూఐఐసీ) ఉన్నాయి. ఆదాయాలపైకాకుండా, లాభార్జనకు వ్యూహాలు రచించాలని గత ఏడాది ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మూడు సంస్థలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఈ మూడు సంస్థలకు ఆర్థికశాఖ రూ.5,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఐసీఎల్కు రూ.3,700 కోట్లు కేటాయించగా, ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.1,200 కోట్లు లభించాయి. ఇక చెన్నై ఆధారిత యూఐఐసీకి కేటాయింపులు రూ.100 కోట్లు. మూడు సంస్థలూ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తగిన సాల్వెన్సీ నిష్పత్తులను కలిగిలేవు. సాల్వెన్సీ రేషియో 150 శాతం ఉండాల్సి ఉండగా, ఎన్ఐసీ విషయంలో 63 శాతం, ఓఐసీ 15 శాతం, యూఐఐసీ 51 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ అయ్యింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. ఇందులో ఒకదానిని ప్రైవేటీకరించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ సవరణకు ఆమోదముద్ర వేసింది. -
టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..
ముంబై: కారు టైర్ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప, డ్రైవర్ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్ పట్వర్థన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్ 25న పట్వర్ధన్ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు. వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేయడంతో కారు ముందు టైర్ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి.. ఫ్యామిలీకి రూ.3.11కోట్ల పరిహారం..
ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.3.11 కోట్లు చెల్లించాలని ట్యాంక్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్. ఈ మొత్తాన్ని మృతుడి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలకు(మైనర్లు) అందించాలని సూచించింది. అత్యధిక నష్టపరిహానికి సంబంధించిన ఘటనల్లో ఇదీ ఒకటి కావటం గమనార్హం. ఏంటీ కేసు..? మహారాష్ట్ర ముంబైలో 2018 డిసెంబర్ 6న ప్రశాంత్ విశ్వాస్ర(37) స్కూటీని ఓ జంక్షన్ వద్ద ట్యాంకర్ వెనుకనుంచి ఢీకొట్టింది. స్కూటీపైనుంచి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రశాంత్ చనిపోయాడని కుటుంబసభ్యులు క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ ఓనర్ దీనా బీ గవాడే, ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లించాలని కోరారు. అయితే ట్రైబ్యునల్ నోటీసులు పంపినా దీనా హాజరుకాలేదు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఫిర్యాదును వ్యతిరేకించింది. యాక్సిడెంట్ సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యంలో ఉన్నాడని చెప్పింది. డ్రైవర్ మద్యం సేవించాడని డాక్టర్లు నిర్ధరించినప్పటికీ అతను సాధారణ స్థితిలోనే ఉన్నాడని రిపోర్టులో ఉందని ట్రైబ్యునల్ పేర్కొంది. అతను సాధారణ వ్యక్తిలాగే ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడాడని, తూగకుండా సరిగ్గానే నడిచాడని పేర్కొంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఐఆర్ను పరిశీలించి సెక్యూరిటీ సంస్థలో జోనల్ హెడ్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ఏడాదికి రూ.17లక్షల జీతం పొందుతున్నాడని గుర్తించిన ట్రైబ్యునల్.. అన్ని లెక్కలు వేసి అతని కుటుంబానికి రూ.3.11 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ట్యాంకర్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. -
బీమా పరిహారం చెల్లింపుపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, అమరావతి: ప్రమాద బీమా పరిహారం పెంపు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోయినప్పటికీ, ఆ తీర్పుపై బీమా కంపెనీ దాఖలు చేసే అప్పీల్లో సైతం పరిహారం మొత్తాన్ని పెంచుతూ తీర్పు ఇచ్చే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కోరిన మొత్తం కంటే ఎక్కువ పరిహారంగా నిర్ణయించే అధికారం కూడా తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రమాదంలో బాధితుని కుటుంబానికి రూ.1.79 లక్షల పరిహారం చెల్లించాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవరించింది. పరిహారం మొత్తాన్ని రూ.5.89 లక్షలకు పెంచింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన రూ.1.79 లక్షలకు అదనంగా రూ.4.10 లక్షలను బాధిత కుటుంబానికి చెల్లించాలని బీమా కంపెనీతో పాటు, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలివీ గుంటూరు జిల్లా అమరావతికి చెందిన లలూనాయక్ అనే వ్యక్తిని 2005లో ఆటో అతి వేగంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో లలూనాయక్ మరణించగా.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రూ.2 లక్షలను పరిహారంగా ఇప్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ప్రమాద బీమా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ బాధిత కుటుంబానికి రూ.1.79 లక్షలను పరిహారంగా చెల్లించాలని బీమా కంపెనీని, ఆటో డ్రైవర్‌ను ఆదేశిస్తూ 2007లో తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు డివిజనల్ మేనేజర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా.. జస్టిస్ దుప్పల వెంకటరమణ విచారణ జరిపారు. బీమా కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారాన్ని రద్దు చేయాలని కోరారు. వాహనం నడిపే సమయంలో ఆటో డ్రైవర్‌కు సరైన లైసెన్స్ లేదన్నారు. మృతుడి భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారాన్ని పెంచాలని కోరారు. మృతుని ఆదాయాన్ని నెలకు రూ.1,200గా పరిగణిస్తూ ట్రిబ్యునల్ బీమా పరిహారాన్ని నిర్ణయించిందన్నారు. మృతుడి ఆదాయాన్ని నెలకు రూ.4,500గా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ట్రిబ్యునల్ తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోయినా పరిహారం మొత్తాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబానికి జరిగే నష్టాన్ని ట్రిబ్యునల్ సరైన కోణంలో పరిశీలించలేదని ఆక్షేపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ నిర్ణయించిన రూ.1.79 లక్షల పరిహారాన్ని రూ.5.89 లక్షలకు పెంచుతున్నట్టు తీర్పులో పేర్కొన్నారు. -
ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్, 3 లక్షల బీమా
సాక్షి,ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే. ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు. ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కేవలం 3 నిమిషాల్లో దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్‌ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్లకు జీవిత బీమా కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు. -
మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే!
వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సెలక్ట్ చేసుకొని మరి దొంగతనం చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా బ్రాండెడ్ కార్లపై వాళ్ల మనసు పడిందా అంతే సంగతులు. ఇన్సూరెన్స్ కంపెనీ ఎకో (acko) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాలు ఢిల్లీ- ఎన్సీఆర్లలో చోరీకి గురైనట్లు తేలింది. ఈ ప్రాంతం దేశంలో కార్ల యజమానులకు హాని కలిగించే ప్రాంతంగా మారినట్లు నివేదిక పేర్కొంది. ఎకో వెహికల్ థెఫ్ట్ రిపోర్ట్ ప్రకారం, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లు జాబితాలో స్థానం సంపాదించగా.. హీరో స్ల్పెండర్ బైక్‌లను దొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అత్యధికంగా దొంగిలించబడిన టాప్ - 5 కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ / మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ శాంత్రో హోండా సిటీ హ్యుందాయ్ ఐ10 అత్యధికంగా దొంగతనానికి గురైన టాప్ -5 టూ వీలర్లు హీరో స్ప్లెండర్ హోండా యాక్టివా బజాజ్ పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 టీవీఎస్ అపాచీ దేశంలో సురక్షితమైన ప్రాంతాలు భారతదేశంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే నగరాల గురించి ఈ ఎకో నివేదిక హైలెట్ చేసింది. దేశంలో వాహన దొంగతనాల విషయానికి వస్తే, వాహన దొంగతనాల కేసుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత బెంగళూరు 9 శాతం, చెన్నై 5 శాతం ఉన్నాయి. కాగా, దేశంలోనే అతి తక్కువ వాహనాల దొంగతనాలు జరుగుతున్న నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నిలిచాయి. అత్యంత ఇష్టపడే కారు రంగు కారు రంగు విషయానికి వస్తే తెల్లటి కార్లు ఎక్కువగా దొంగతనానికి గురవుతాయి. తెల్ల కార్లను దొంగతనం చేయడానికి కారణం..ట్రాఫిక్‌లో గుర్తించ లేకపోవడం, తెల్లటి కార్ల రంగును మార్చడం చాలా సులభం. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
ఆ కంపెనీలో విరుష్క పెట్టుబడులు.. ఐపీవోకు బ్రేకులు
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ కంపెనీ పెట్టుబడులున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిలిపివేసింది. అయితే ఈ అంశాలపై సెబీ (వెబ్సైట్లో) ప్రస్తుతం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గో డిజిట్ ఇన్సూరెన్స్ ఆగస్ట్ 17న ప్రాథమిక పత్రాలను సెబీకి సమర్పించింది. కంపెనీలో సుప్రసిద్ధ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మకు పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కంపెనీ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
మ్యాక్స్ లైఫ్ వాటాపై యాక్సిస్ కన్ను
న్యూఢిల్లీ: బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోగల వాటాను పెంచుకోనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రానున్న 6–9 నెలల్లో వాటాను 20 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు బ్యాంక్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ సంస్థలు రెండింటితో కలసి మ్యాక్స్ లైఫ్‌లో 12.99 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్ కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో డీల్‌కు అనుమతిని పొందాక మ్యాక్స్ లైఫ్‌లో యాక్సిస్ ఈ వాటాను సొంతం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మ్యాక్స్ లైఫ్‌లో 7 శాతంవరకూ అదనపు వాటా కొనుగోలుకు యాక్సిస్ అనుబంధ సంస్థలకు హక్కు లభించింది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి ఒకేసారి లేదా దఫదఫాలుగా వాటాను దక్కించుకోవచ్చు. గత ఐదేళ్లలో బ్యాంకెస్యూరెన్స్ విభాగం 18–20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. నూతన అమ్మకాలలో 60 శాతం ఈ విభాగం ద్వారానే నమోదవుతున్నట్లు తెలియజేశారు. బ్యాంక్, బీమా కంపెనీల మధ్య ఒప్పందమే బ్యాంకెస్యూరెన్స్. దీంతో బ్యాంక్ కస్టమర్లకు బీమా ప్రొడక్టులను విక్రయించడం, బ్యాంక్ బ్రాంచీలను ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది. -
వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!
German Court Rule Pass It Is Work Place Accident: ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు ఆఫీసులన్ని తమ ఉద్యోగులను వర్క్‌ప్రం హోంకి పరిమితం చేశాయి. అయితే ఈ మధ్య మళ్లీ కొంతకాలంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ బాస్‌లు ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఈ ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు చాలా వరకు విదేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం అంటూ ఇళ్ల నుంచే వర్క్ చేయండి అంటూ సూచించింది. దీంతో ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే వర్క్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ వర్క్ ఫ్రం హొంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు మీకు ఇంటి వద్ద ఏదైన అనుకోని ప్రమాదం జరిగితే భీమా వర్తించదంటున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు (చదవండి: గిరిజన సంప్రదాయ నృత్యంతో అలరించిన ప్రియాంక గాంధీ : వైరల్ వీడియో) అసలు విషయలోకెళ్లితే. ...జర్మనీలోని వ్యక్తి ఒక రోజు ఉదయమే లేచి సరాసరి వర్క్ చేయడానికి అని తన ఇంటిలోని ఆఫీస్ రూంకి వెళ్తుండగా మెట్టమీద నుంచి జారిపడిపోతాడు. దీంతో సదరు వ్యక్తికి వెన్నముకకు తీవ్రంగా గాయమవుతుంది. అయితే సదరు ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన భీమా సంస్థ ఆ వ్యక్తి ఇంటివద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి కంపెనీకి సంబంధించిన బీమా పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదంటూ నిరాకరిస్తుంది. దీంతో అతను న్యాయం కావాలంటూ జర్మనీ ఫెడరల్ కోర్టులో సదరు కంపెనీకి సంబంధించిన భీమా సంస్థ పై పిటిషన్ దాఖలు చేస్తాడు. అయితే కోర్టు అతను ఉదయం ఇంటి కార్యాలయంలో పనిచేయడానికి వెళ్తున్నప్పుడు జరిగింది కాబట్టి పరిహారం పొందేందుకు అర్హుడంటూ కోర్టు తీర్పు ఇస్తుంది. ఈ మేరకు సదరు బీమా సంస్థ ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే మార్గంలో తప్ప ఇంటి వద్ద జరితే ప్రమాదాలకు వర్తించదు అంటూ వాదించడానికి ప్రయత్నిస్తుంది. అయితే కోర్టు ఆ వాదనను తోసిపుచ్చి అతను ఎక్కడ ఉన్న పనిచేయడానికి వెళ్తున్నప్పుడే జరిగింది కాబట్టి సదరు వ్యక్తికి బీమా వర్తిస్తుందంటూ తీర్పు ఇస్తుంది. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ) -
హెల్త్ క్లెయిమ్ ఇలా కూడా కాదంటారు!
బీమా పాలసీ తీసుకునేదే కష్ట కాలంలో ఆదుకుంటుందన్న భరోసాతో. తీరా బీమా క్లెయిమ్ అవసరం ఏర్పడిన సందర్భంలో.. పరిహారానికి అర్హత లేదంటూ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి..? అందుకే బీమా పాలసీ పత్రంలో అడిగిన ప్రతీ సమాచారం పట్ల పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పాలసీ పత్రాలపై సంతకం పెట్టేయడం కాకుండా.. అందులోని షరతులు, మినహాయింపులు, నిబంధనలు, పరిమితుల జాబితాను సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్క చిన్న కారణం కనిపించినా.. బీమా సంస్థలు పరిహారానికి నో చెప్పొచ్చు. అందుకే సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి ఒక పాలసీదారు బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడంతో.. అతని కుటుంబం క్లెయిమ్ కోసం దాఖలు చేసుకుంది. సదరు ప్రైవేటు సాధారణ బీమా సంస్థ పరిహారం చెల్లించేందుకు తిరస్కరించింది. దీనికి చూపించిన కారణం.. 346సీసీ బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడమే. 150సీసీ సామర్థ్యానికి మించి ఇంజన్‌తో కూడిన బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురైతే పరిహారం బాధ్యత తమపై ఉండదన్న షరతును కూడా సదరు కంపెనీ తమ పాలసీ పత్రాల్లో పేర్కొంది. అయినప్పటికీ పాలసీదారు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించి బీమా పరిహారం లభించిందనుకోండి. అందుకే వివిధ బీమా సంస్థలు కొన్ని అరుదైన కారణాలతోనూ పరిహారం చెల్లింపులకు తిరస్కరిస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకునే వారు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు వీటిపై అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్‌ను కలిగిన ఒక పాలసీదారు మామిడి చెట్టెక్కి కాయలు కోస్తూ జారి కిందపడి వైకల్యం పాలయ్యాడు. చాలా ప్రమాదకరమైన విన్యాసంగా దీన్ని పేర్కొంటూ సదరు బీమా కంపెనీ తొలుత క్లెయిమ్‌ను తిరస్కరించింది. ప్రమాదకరమైన చర్య కనుక.. పాలసీదారుకు అందులో నైపుణ్యం ఉందా? లేదా అన్నది పరిగణనలోకి రాదని బీమా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే శాశ్వత మినహాయింపుల జాబితాలో ఇది కూడా ఉన్నట్టు వివరణ ఇచ్చింది. హజార్డస్ స్పోర్ట్/యాక్టివిటీగా దీన్ని చూపించింది. కాకపోతే తదనంతర పరిణామాలతో బీమా కంపెనీ దిగొచ్చి, క్లెయిమ్‌ను చెల్లించింది. కనుక పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రమాదకర విన్యాసాలు, క్రీడల క్లాజ్ గురించి తప్పకుండా పాలసీదారులు ఒకసారి తెలుసుకొని, వాటికి దూరంగా ఉండడం మంచిది. 150సీసీ కంటే అధిక సామర్థ్యంతో కూడిన బైక్‌ను నడపడం ప్రమాదానికి దారితీస్తుందని, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాహనంతో ప్రమాదం ఉండదని చెప్పగలమా? కానీ కొన్ని బీమా కంపెనీలు ఈ వైఖరినే అనుసరిస్తున్నాయి. 150సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనం నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది కనుక పరిహారం చెల్లించబోమంటూ ఒక కేసులో ప్రముఖ సాధారణ బీమా సంస్థ బదులివ్వడం గమనార్హం. ఈ విషయంలో పాలసీదారులు అవగాహన కలిగి ఉండాలి. ‘‘వాస్తవానికి ఏడాది క్రితం వరకు ఎక్కువ ప్లాన్లలో ఈ నిబంధన ఉండేది. కానీ, ఇందులో మార్పు వచ్చింది. అయినప్పటికీ ప్రమాద బీమా ప్లాన్‌ను తీసుకున్న వారు, తీసుకోవాలని అనుకునే వారు పాలసీ డాక్యుమెంట్‌ను ఆసాంతం ఒక్కసారి చదివి ఈ తరహా కొర్రీలేవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. లేదంటే ఆర్థిక సలహాదారు సాయం తీసుకోవాలి’’ అని భేషక్ డాట్ ఓఆర్జీ వ్యవస్థాపకుడు మహావీర్ చోప్రా తెలిపారు. తిరస్కరిస్తే మార్గం ఏంటి? పరిహారం తిరస్కరణకు గురైందని ఆందోళన పడక్కర్లేదు. మీ క్లెయిమ్ నిజాయితీతో కూడినదేనని బీమా కంపెనీని ఒప్పించడం ద్వారా పరిహారం అందుకోవచ్చు. దీనికంటే ముందే బీమా సంస్థ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించిందన్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. కారణాలను విశ్లేషించుకోవాలి. మీరు తీసుకున్న పాలసీకి సంబంధించి నియమ, నిబంధనలను, మినహాయింపుల గురించి మరోసారి సమీక్షించుకోవాలి. ఒక్కోసారి దరఖాస్తు, దానికి అనుబంధంగా అందజేసిన చికిత్సా సమాచారం అసంపూర్ణంగా ఉంటే.. అప్పుడు అదనపు పత్రాలను, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. క్లెయిమ్ తిరస్కరణ ముందే బీమా సంస్థ పూర్తి విచారణ చేస్తుంది. అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది. కానీ, బీమా కంపెనీ పరిహారం చెల్లించకపోవడం వెనుక సహేతుక కారణం లేదని మీరు గుర్తిస్తే బీమా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెనియల్ అప్పీల్లెటర్ ద్వారా తిరిగి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ నిర్ణయం సరైంది కాదంటూ అందుకు మద్దతుగా పత్రాలను సమర్పించాలి. ఒకవేళ టీపీఏ నుంచి తీసుకుంటే వారిని సంప్రదించి, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం లభించకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్ కార్యాలయాన్ని ఆశ్రయించొచ్చు. అక్కడ కూడా న్యాయం లభించకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ సాయం కోరొచ్చు. చికిత్స కోసం కాకుండా.. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ డాక్టర్ సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన అనంతరం.. ఎన్నో రక్తపరీక్షలు, డెంగ్యూ, మలేరియా, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి కూడా జ్వరానికి కారణాన్ని వైద్యుడు గుర్తించలేకపోయాడని అనుకుందాం. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుని పరిహారం కోసం బీమా సంస్థకు క్లెయిమ్ దాఖలు చేసుకుంటే తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ‘యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్’ కొనసాగలేదని బీమా సంస్థ ఎత్తిచూపొచ్చు. ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేకుండా, వైద్య పరీక్షలు, చికిత్స చేస్తే అందుకు పరిహారాన్ని బీమా సంస్థలు చెల్లించకపోవచ్చు. అంతేకాదు సరైన విధంగా చికిత్స చేయకపోయినా (యాక్టివ్లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) పరిహారం ఇవ్వబోవు. ‘‘జ్వరానికి ఔట్ పేషెంట్ కింద చికిత్స చేయవచ్చంటూ కొన్ని క్లెయిమ్‌లను బీమా కంపెనీలు ఆమోదించకపోవచ్చు. ఇది సహేతుకమే. కానీ, ఒక పేషెంట్‌గా వైద్యులు యాక్టివ్లైన్ ట్రీట్మెంట్ను అనుసరిస్తున్నారా? లేదా అన్నది తనకు ఎలా తెలుస్తుంది. ఈ లోపాన్ని పరిహరించాల్సి ఉంది’’ అని ష్యూర్క్లెయిమ్ సీఈవో అనుజ్ జిందాల్ పేర్కొన్నారు. పాక్షిక చెల్లింపులు కరోనా కారణంగా ఎదురైన క్లెయిమ్‌లలో బీమా కంపెనీలు పాక్షిక చెల్లింపులు చేసినవి చాలానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన ధరలకే తాము చెల్లింపులు చేస్తామన్నది బీమా కంపెనీల వాదన. ‘‘ఈ నిబంధన నిజంగా అడ్డంకే. ముఖ్యంగా నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ చేసుకునే వారికి ఇబ్బందికరం. సహేతుక చార్జీల గురించి పాలసీదారునకు ఎలా తెలుస్తుంది? బీమా సంస్థలే చికిత్సల సాధారణ చార్జీల గురించి పారదర్శకంగా వెల్లడించడం మంచిది’’ అన్నది జిందాల్ అభిప్రాయం. ముంబైకి చెందిన కార్యకర్త గౌరంగ్ దమానీ ఇదే విషయమై లోగడ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా.. ఈ నిబంధన ఎత్తివేయాలంటూ ఐఆర్డీఏఐకూ లేఖ రాశారు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు ఎక్కువగా ఫిక్స్డ్ బెనిఫిట్ ప్రయోజనంతో ఉంటాయి. సంబంధిత వ్యాధి నిర్ధారణ అయి నిర్ణీత రోజుల పాటు జీవించి ఉంటే పరిహారం మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. ముఖ్యంగా కేన్సర్ వంటి చికిత్సల్లో బీమా సంస్థలు పాక్షిక చెల్లింపులే చేస్తున్నాయి. కేన్సర్లను ముందస్తు దశలో గుర్తిస్తే.. 25 శాతం బీమానే అందిస్తున్నాయి. కేన్సర్‌కు సంబంధించి ముఖ్యమైన చికిత్సలకు మాత్రం పూర్తి పరిహారం లభిస్తుంది. మినహాయింపులు పాలసీ పత్రంలో మినహాయింపులను స్పష్టంగా పేర్కొంటారు. ఆ జాబితాలోని వాటికి చికిత్స తీసుకుంటే పరిహారం రాదు. ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌లో పరిహారం రాదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను వెల్లడిస్తే.. 3–4 ఏళ్ల వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీ లభిస్తుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి కూడా క్లెయిమ్ కోరలేరు. నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరి క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా, రీయింబర్స్ మెంట్ రూపంలో రావాలని అడగొచ్చు. వాస్తవాలను చెప్పకపోవడం, దాచిపెట్టడం.. బీమా కంపెనీలు పరిహారం చెల్లింపులను తిరస్కరించడానికి చూపించే కారణాల్లో.. పాలసీదారు పూర్తి సమాచారం వెల్లడించకపోవడమే ఎక్కువగా ఉంటోంది. పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఇదే సమస్యకు కారణం అవుతోంది. ముఖ్యంగా తమ వృత్తి లేదా చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పకపోవడం, ఆదాయం, అప్పటికే కలిగి ఉన్న బీమా పాలసీలు, ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తెలియజేయకపోవడం వంటివి భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు దారితీయవచ్చు. ఎందుకంటే పాలసీదారు వెల్లడించే సమాచారం ఆధారంగానే బీమా సంస్థలు రిస్క్‌ను అర్థం చేసుకుంటాయి. ఆ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో క్లెయిమ్‌లు ఏ మేరకు రావచ్చన్నది అంచనా వేస్తాయి. తదనుగుణంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. మరి పాలసీ దరఖాస్తులో చెప్పిన సమాచారానికి, పాలసీదారు వాస్తవ ఆరోగ్య పరిస్థితులకు పొంతన లేకపోతే అప్పుడు బీమా సంస్థ ఆ భారాన్ని మోయడానికి అంగీకరించదు. కనుక తప్పనిసరిగా పూర్తి వాస్తవిక సమాచారాన్ని వెల్లడించాలి. కావాలని కాకుండా, అవగాహన లేక వెల్లడించకపోయినా ఆ బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. గతంలో ఏవైనా పాలసీల కోసం దరఖాస్తు చేసుకుని, బీమా కంపెనీ నుంచి తిరస్కరణకు గురైనా ఆ సమాచారం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సకాలంలో క్లెయిమ్ దరఖాస్తు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన 24 గంటల్లోగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న పాలసీ నిబంధనలు, ఎటువంటి చికిత్స కోసం చేరారన్న అంశాల ఆధారంగా ఈ సమయం పరిమితుల్లో మార్పులు ఉండొచ్చు. కానీ, సాధ్యమైనంతగా 24 గంటల్లోపే క్లెయిమ్ దాఖలు చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆలస్యంగా ఈ పనిచేస్తే క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. దీంతో ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం ఆస్పత్రిలో చేరకముందు, చేరిన తర్వాత చికిత్సకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు, బిల్లులు జాగ్రత్త చేసుకోవాలి. డిశ్చార్జ్సమ్మరీ తీసుకోవాలి. వైద్య పరీక్షల పత్రాలను కూడా జత చేసి క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిందే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలంటూ అన్ని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఇప్పటికే కోరింది. అన్ని దశల్లోనూ పాలసీదారులతో పారద్శకమైన సంప్రదింపులు నిర్వహించాలని ఆదేశించింది. క్యాష్‌లెస్ క్లెయిమ్‌ల పరిష్కారం, పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా కోరింది. ఒకవేళ థర్డ్ పార్టీ ద్వారా ఈ సేవలు అందిస్తున్నా కానీ, అన్ని రకాల సంప్రదింపులు పద్ధతి ప్రకారం ఉండాల్సిందేనని ఆదేశించింది. అంతేకాదు, బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాల్లో కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. -
పాలసీబజార్ ఐపీవో.. సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో రూ. 2,268 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 6,018 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. క్రెడిట్ ప్రొడక్టులను పోల్చి చూపే పోర్టల్ పైసాబజార్‌ను సైతం కంపెనీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీవో చేపట్టేందుకు పాలసీబజార్ ఆగస్ట్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో చేపట్టే ముందు ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. తాజా ఈక్విటీ జారీ నిధులను కంపెనీ బ్రాండ్ల ప్రాచుర్యం, బిజినెస్ విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. చదవండి: ఐపీవో.. ఓయోకి భారీ ఝలక్! -
ధూమపానం.. లంగ్ క్యాన్సర్ లింక్‌కు ఆధారాల్లేవు!
అహ్మదాబాద్: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్ స్మోకింగ్) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది. పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్ వస్తుందని గుర్తు చేసింది. అలోక్ కుమార్ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది. -
ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ
ముంబై: ప్రైవేట్ రంగ బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ఈషీల్డ్ నెక్ట్స్’ ప్లాన్ ఆవిష్కరించింది. జీవితంలో వివిధ దశలకు (వివాహం, ఇంటి కొనుగోలు మొదలైనవి) అనుగుణంగా కవరేజీ పెరిగే సౌలభ్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. లెవెల్ కవర్, పెరిగే కవరేజీ ప్రయోజనం, ఫ్యూచర్ ప్రూఫింగ్ ప్రయోజనంతో లెవెల్ కవర్ అంటూ మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న ఆప్షనే చివరిదాకా కొనసాగుతుంది. మధ్యలో మార్చుకోవడానికి ఉం డదు. రెగ్యులర్‌గా లేదా ఏకమొత్తంగా లేదా పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపారు. -
బీమా కవరేజీలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. ప్రభుత్వమే వారి తరఫున బీమా ప్రీమియం చెల్లించడం.. అలాగే, ఉచిత వైద్యం అందిస్తుండడంతో ఏపీ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించింది. 2020–21కి గానూ దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీమా కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారో గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 74.60 శాతం మంది కవరేజీతో మొదటి స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మందే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేసేలా.. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి అమలుచేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని ఇంత పెద్దఎత్తున ఉచిత ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకువచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేవని నీతిఆయోగ్ స్పష్టంచేసింది. తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలే కాదు.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు సైతం ఇన్సూ్యరెన్స్ కవరేజీలో ఏపీతో పోటీపడలేక పోయాయి. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో సైతం కేవలం 15 శాతం మంది మాత్రమే కవరేజీలో ఉన్నట్లు నీతి ఆయోగ్ తన తాజా గణాంకాల్లో పేర్కొంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పథకంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ఎక్కువమందికి లబ్ధి కలిగేలా చేశారు. దీంతో ఇన్సూ్యరెన్స్ ద్వారా అధికశాతం మందికి ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కలిగింది. -
బీమాకు పెట్టుబడుల ధీమా!
న్యూఢిల్లీ: దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు పార్లమెంటు సోమవారం ఆమోదముద్ర వేసింది. వాయిస్ వోట్ ద్వారా లోక్‌సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ గతవారమే ఆమోదముద్ర వేసింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం .. బీమా కంపెనీలు మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోందని, తమంతట తాము నిధులు సమీకరించుకోవాల్సిన ప్రైవేట్ సంస్థలకు ఎఫ్‌డీఐల పరిమితి పెంపుతో కొంత ఊతం లభించగలదని ఆమె తెలిపారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 49%కి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు తెలిపారు. కంపెనీలకు కోవిడ్ కష్టాలు.. సాల్వెన్సీ మార్జిన్ల నిర్వహణకు (జరపాల్సిన చెల్లింపులతో పోలిస్తే అసెట్స్ నిష్పత్తి) సంబంధించి బీమా కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. ‘బీమా సంస్థలు.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.. నిధుల సమీకరణపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కష్టాలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల వృద్ధికి అవసరమైన పెట్టుబడులు రాకపోతే పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది‘ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఏడు ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో మూడు కంపెనీల్లో సాల్వెన్సీ మార్జిన్లు నిర్దేశించిన స్థాయికన్నా తక్కువ ఉన్నాయని మంత్రి చెప్పారు. అయితే, వాటికి కావాల్సిన అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా అవి ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం తగు సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఏయూఎం.. 76 శాతం అప్.. 2015 నుంచి బీమా రంగంలోకి రూ. 26,000 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని, నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) పరిమాణం గడిచిన అయిదేళ్లలో 76 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 68కి పెరిగిందని, గత అయిదేళ్లలో 6 కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయని వివరించారు. బీమా సంస్థల్లో 74% ఎఫ్డీఐలనేది గరిష్ట పరిమితి మాత్రమేనని, ఆయా కంపెనీలు దీన్ని కచ్చితంగా ఆ స్థాయికి పెంచుకోవాలనేమీ లేదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐని పెంచేలా సీతారామన్ ప్రతిపాదన చేశారు. బిల్లులో ప్రత్యేకాంశాలు.. ► బీమా సంస్థలు.. పాలసీదారుల సొమ్మును భారత్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు తీసుకెళ్లేందుకు కుదరదు. లాభాల్లో కొంత భాగాన్ని భారత్‌లోనే అట్టే ఉంచాలి. ► బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్లో కీలక సభ్యులు స్థానిక భారతీయులే ఉండాలి. డైరెక్టర్లలో కనీసం 50 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. ఇన్ఫ్రా కోసం నాబ్‌ఫిడ్ బిల్లు.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ (డీఎఫ్ఐ) ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు 2021ని సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటయ్యే డీఎఫ్ఐ రాబోయే కొన్నేళ్లలో రూ. 3 లక్షల కోట్ల దాకా నిధులు సమీకరించవచ్చు. తద్వారా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద దాదాపు 7,000 ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, మైనింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ఉద్దేశించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2021ని ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఆమోదించింది. -
వచ్చే ఏడాది పాలసీల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్ డిప్యూటీ సీఈవో రుషభ్ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019–20లో కంపెనీ సుమారు రూ.3,200 కోట్ల వ్యాపారం అంచనా వేస్తోందని తెలిపారు. ఇందులో నూతన వ్యాపారం రూ.1,000 కోట్లు ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సాండ్‌బాక్స్ పేరుతో ఐఆర్డీఏ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నంగా.. కస్టమర్లకు అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించేలా బీమా కంపెనీలను ప్రోత్సహిస్తోంది. సాండ్‌బాక్స్ కింద అనుమతి పొందిన బీమా ప్లాన్‌కు తొలుత నియంత్రణ పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. పరిమిత కాలానికి, పరిమిత సంఖ్యలో పాలసీలను కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఫలితాలనుబట్టి అట్టి ప్లాన్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఐఆర్డీఏ నిర్ణయిస్తుంది. -
గ్రేటర్లో నకిలీ పాలసీల దందా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బీమా సంస్థలు, వాహన యజమానులు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదన పరిహాసానికి తావిస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రహదారి భద్రతా బిల్లులో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించే లక్ష్యంతో వాహన బీమాపై దృష్టి కేంద్రీకరించారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రమాదానికి పాల్పడిన వాహన యజమానులు, బీమా సంస్థలే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలకు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రమాదబీమాపై ఇప్పటికే నీలినీడలు అలుముకొని ఉన్నాయి. గ్రేటర్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న నకిలీబీమా సర్టిఫికెట్ల దందా రహదారి భద్రతకు తూట్లు పొడుస్తోంది. ఆటోలు, కాబ్‌లు, మెటడోర్లు, టాటాఏస్‌లు, మినీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్లు, లారీలు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, తదితర అన్ని ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఫిట్నెస్ పరీక్షల్లో నకిలీ బీమా సర్టిఫికెట్లే రాజ్యమేలుతున్నాయి. వాహనాల ఫిట్నెస్ సమయంలో వాటి యజమానులు, ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు సమర్పించే బీమా సర్టిఫికెట్లు కేవలం నకిలీవని, ఏ ప్రామాణికమైన బీమాసంస్థకు చెందినవి కావని తెలిసి కూడా ఆర్టీఏ అధికారులు యధేచ్చగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇలా నకిలీ బీమా పత్రాల ఆధారంగా ఫిట్‌నెస్‌పై ధృవీకరణ పొందే వాహనాలు ప్రమాదాలకు పాల్పడితే బాధితులకు ఎలాంటి పరిహారం లభించే అవకాశం ఉండదు. సదరు వాహనం ఏ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించకుండానే తిరుగుతున్న దృష్ట్యా ప్రమాద బీమా వర్తించదు. నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో నకిలీ బీమా దందా యధేచ్చగా కొనసాగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాహన యజమానులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఈ అక్రమ దందాకు ఊతమిచ్చేవిధంగా ఈ నిర్లక్ష్యం కొనసాగుతోంది. క్యూఆర్ సృష్టించేస్తారు... వ్యక్తిగత వాహనాల బీమా విషయంలో వాహనదారులు నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం వారికే పరిమితమవుతుంది. అయినప్పటికీ కొత్త వాహనాల కొనుగోలు సమయంలోనే బీమా సంస్థలు కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు వర్తించే విధంగా ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని తీసుకొని బీమా ధృవపత్రాలను అందజేస్తున్నాయి. కానీ రవాణా వాహనాలకు ఇది సాధ్యం కాదు. ఈ వాహనాలు ప్రతి సంవత్సరం ఆర్టీఏ నుంచి సామర్ధ్య ధృవీకరణను పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో బీమా సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ ప్రయాణికుల సీట్ల సామరŠాధ్యన్ని అనుసరించి ఒక్కో వాహనం రూ.5000 నుంచి రూ.15000 వరకు ప్రీమియం చెల్లించి అధీకృత బీమా సంస్థల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ ప్రీమియం మొత్తాన్ని ఎగవేసేందుకే వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్ల సహకారంతో మార్కెట్లో కేవలం రూ.500 నుంచి రూ.1000లకు ఒకటి చొప్పున లభించే నకిలీ బీమా పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ పత్రాలను తయారు చేసే క్రమంలో సదరు వ్యక్తులు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను కూడా కంఫ్యూటర్ ఆధారంగా సృష్టిస్తున్నారు. రకరకాల పేర్లతో రూపొందించే ఈ పత్రాలు పూర్తిగా నకిలీవేనని తెలిసినప్పటికీ ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును గుడ్డిగా ఆమోదిస్తూ రహదారి భద్రతను పాతరేస్తున్నారు. తమకు కనిపించే బీమా పత్రాలు నకిలీవేనని తెలిసినప్పటికీ తప్పుడు క్యూఆర్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకొని వదిలేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో తరచుగా ఇలాంటి నకిలీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు సుమారు 55 లక్షల వరకు ఉన్నాయి. సుమారు 35 లక్షల ద్విచక్ర వాహనాలు,మరో 15 లక్షల కార్లు వ్యక్తిగత కేటగిరీకి చెందినవి కాగా, మరో 5 లక్షల వాహనాలు పూర్తిగా రవాణా కేటగిరీకి చెందినవి. వీటికి ప్రతి సంవత్సరం ఫిట్నెస్ తప్పనిసరి. లక్షా 50 వేల ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు, మరో 2 లక్షల లారీలు, ఇవి కాకుండా ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, తదితర అన్ని కేటగిరీలకు చెందిన ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలలో 60 శాతానికి పైగా నకిలీ బీమా పత్రాల ఆధారంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. -
బీమా చెల్లించకుండా నష్టం కలిగించారు
సాక్షి, హైదరాబాద్: సకాలంలో బీమా చెల్లించకుండా ఓ ఖాతాదారుడికి నష్టం కలిగించడమే కాకుండా, తప్పు తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన కెనరా బ్యాంకు తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వ్యాపారం కోసం ఖాతాదారుడు రుణం తీసుకున్నప్పుడు, రుణ ఒప్పందం ప్రకారం బీమా చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని తేల్చి చెప్పింది. సకాలంలో బీమా మొత్తం చెల్లించకపోవడం వల్ల ఆ ఖాతాదారుడికి కలిగే నష్టాన్ని భరించాల్సింది బ్యాంకేనంది. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన ఆస్తినష్టానికి బాధ్యత వహించాల్సిందేనని కెనరా బ్యాంకును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అతనికి రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని బ్యాంకుకు స్పష్టం చేసింది. ఖర్చుల కింద రూ.10వేలను చెల్లించాలంది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యులు కె.రమేశ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వై.శేఖర్ వైఎన్ ప్రెస్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వ్యాపార టర్నోవర్ బాగుండటంతో ఖమ్మంలోని కెనరా బ్యాంకు శేఖర్ ప్రెస్‌కు 2010లో రూ. 20 లక్షల రుణం ఇచ్చింది. ఒప్పందం మేరకు ప్రెస్ స్టాక్‌కు బ్యాంకే బీమా చెల్లించాలి. దీని ప్రకారం 2013 వరకు బీమా చెల్లించింది. 2014 నుంచి చెల్లించలేదు. పాలసీ రెన్యువల్ చేసుకోవాలని బీమా కంపెనీ నోటీసు పంపినా కెనరా బ్యాంకు పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా 2015లో వైఎన్ ప్రెస్‌లో విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగింది. దీంతో శేఖర్ పరి హారం కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోగా, తమకు బ్యాంకు ప్రీమియం చెల్లించలేదని బీమా కంపెనీ తెలిపింది. దీంతో శేఖర్ కెనరా బ్యాంకుపై రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ జైశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కెనరా బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. బీమా కంపెనీ చూపిన రుజువులూ పరిశీలించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ కెనరా బ్యాంకు వాదనను తప్పుపట్టింది. తన తప్పును బీమా కంపెనీపై నెడుతోందంటూ ఆక్షేపించింది. ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యతారాహిత్యమే కాక, సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని తేల్చింది. దీని వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన నష్టానికి కెనరా బ్యాంకే బాధ్యత వహించాలంది. వైఎన్ ప్రెస్ రూ.43 లక్షల మేర నష్టం వాటిల్లిందని సర్వేయర్ నివేదిక చెబుతోందని, పోలీసులు రూ.6.8 లక్షల మేరే నష్టమని చెబుతున్నారని తెలిపింది. అందువల్ల వైఎన్ ప్రెస్‌కు రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కెనరా బ్యాంకును ఆదేశించింది. అలాగే ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలంది. -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి!
కన్సాస్: అమెరికాలోని కన్సాస్‌లో పట్టణంలో ఓ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. ఓ చిన్నారి(5) కారణంగా ఇక్కడి కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన శిల్పం తీవ్రంగా దెబ్బతినడంతో రూ.89 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అతని కుటుంబానికి నోటీసులు జారీచేసింది. కన్సాస్‌లోని ఓవర్లాండ్ పార్క్‌కు చెందిన సారా గుడ్‌మెన్ కుటుంబం మే 19న స్థానిక కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సారా కుమారుడు అక్కడ ఏర్పాటుచేసిన గాజు శిల్పాన్ని కదిలించేందుకు యత్నించాడు. దీంతో ఆ శిల్పం కిందపడిపగిలిపోయింది. ఈ ఘటనలో సారా కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో బాలుడి విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఆ కుటుంబానికి బీమా కంపెనీ నోటీసులు జారీచేసిందన్నారు. నోటీసులు అందుకున్న సారా స్పందిస్తూ.. నిర్వాహకులు ఆ శిల్పానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. -
క్లెయిమ్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా ఆసుపత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపులో ఆలస్యం చేసే బీమా కంపెనీలపై జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు 15 రోజుల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే, చెల్లించాల్సిన మొత్తంపై సదరు బీమా కంపెనీ వారానికి ఒక శాతం చొప్పున వడ్డీ కట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జరిమానాను బీమా కంపెనీయే నేరుగా ఆసుపత్రికి చెల్లించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ పథకంలో చేరడానికి ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇంకా తమ స్పందన తెలపలేదు. -
మూడు సాధారణ బీమా కంపెనీల విలీనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియలో భాగంగా మూడు సాధారణ బీమా సంస్థలను ఒకే కంపెనీ కింద విలీనం చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విలీనానంతరం ఏర్పడే సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే బీమా కంపెనీగా విలీనం చేస్తామని, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన సంస్థను లిస్టింగ్ చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఎయిరిండియా సహా 24 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియ జరుపుతున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఎల్ఏ పరిధిలోకి కార్పొరేట్ మోసాలు న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్ఏ) మరింత పటిష్టం చేసే దిశగా కార్పొరేట్ మోసాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. మోసపూరితంగా ఆర్జించిన సొమ్మును విదేశాలకు తరలించిన పక్షంలో.. దేశీయంగా సదరు వ్యక్తులకున్న ఆస్తులను జప్తు చేసే విధంగా పీఎంఎల్ఏ చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్ఏ కింద అన్నిరకాల నేరాల్లోనూ ఒకే తరహా బెయిల్ షరతులు ఉండేలా ఫైనాన్స్ బిల్లు 2018లో ప్రతిపాదించినట్లు పేర్కొంది. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థకు రూ.15 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. తద్వారా నకిలీ హ్యాండ్సెట్స్ సంఖ్య దిగివస్తుందని, ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని అంచనా. టెలికం శాఖ (డాట్)లో భాగంగా సెంట్రల్ ఎక్విప్మెంట్స్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వ్యవస్థ బీఎస్ఎన్ఎల్ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. ఇది దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో అన్ని సేవలను నిలిపివేస్తుంది. ఆయా ఫోన్లలో ఏ నెట్వర్క్ ఉన్నా, చివరకు సిమ్ కార్డు తీసేసినా, ఆఖరికి ఐఎంఈఐ నంబర్‌ను మార్చేసినప్పటికీ సర్వీసులను బ్లాక్ చేస్తుంది. -
నవంబర్ తొలివారంలో ‘న్యూఇండియా’ ఐపీఓ
ముంబై: ఇండియాలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు నవంబర్ మొదటి వారంలో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) జారీచేయనుంది. ఇటీవలే మరో సాధారణ బీమా కంపెనీ జీఐసీ రూ. 11,370 కోట్ల ఐపీఓ 1.35 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత ఒకటిన్నర నెలల్లో ఇతర బీమా కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ లైఫ్‌లు కూడా ఐపీఓలు జారీచేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యం లో ప్రభుత్వ రంగ ఎన్ఐఏ భారీ పబ్లిక్ ఇష్యూరానుండటం విశేషం. ఇండియాతో పాటు 28 దేశా ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూ ఇండి యా అష్యూరెన్స్ ఐపీఓ నవంబర్ మొదటివారంలోనే పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఖచ్చితంగా ఎంత మొత్తానికి ఐపీఓ జారీచేయబోయేదీ, ఇష్యూ దర ఎంతనేది ఈ వారం లో ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. వందేళ్లు..: త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్న న్యూఇండియా అష్యూరెన్స్‌కు ప్రస్తుతం సాధారణ బీమా మార్కెట్లో 16 శాతం వాటా వుంది. 31 పోటీ కంపెనీలున్నప్పటికీ, గత ఐదేళ్లుగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 26,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనావేస్తున్న ఈ కంపెనీకి రూ. 69,000 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 2017 జూన్ క్వార్టర్ ముగింపునాటికి ఈ కంపెనీ పెట్టుబడుల మార్కెట్ విలువ రూ. 63,100 కోట్లు వుంది. అత్యధిక టాప్ కార్పొరేట్లు ఈ కంపెనీకి దీర్ఘకాలిక కస్టమర్లుగా ఉన్నాయి. -
జీఐసీ మెగా ఐపీవో వచ్చేస్తోంది
ముంబై: ప్రభుత్వ రంగంలోని రీ ఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఈ నెల 11న ప్రారంభం కానుంది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.855–912గా ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూ 13వ తేదీతో ముగుస్తుంది. రూ.11,370 కోట్ల మేర సమీకరిస్తున్న ఈ ఐపీఓ... దేశంలో రెండో అతి భారీదిగా చెప్పొచ్చు. 2010లో వచ్చిన కోల్ ఇండియా రూ.15,000 కోట్ల ఐపీవో అతిపెద్దది. ఐపీవోలో జీఐసీ 14.22% వాటాను అమ్మకానికి పెడుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 12.26 శాతానికి సమానమైన 10,75,00,000 షేర్లను ఆఫర్ చేయనుండగా, 1.96%కి సమానమైన 1,72,00,000 షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనున్నట్లు జీఐసీ చైర్మన్ అలైస్ జి వైద్యన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఐసీ రూ.390 కోట్ల లాభాల్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.704 కోట్ల లాభంలో సగం మేర తగ్గిపోయింది. ప్రధాని సాగు బీమా పథకం రూపంలో ఎదురయ్యే నష్టాల కోసం చేసిన అధిక కేటాయింపులు, బీమా గణన విధానంలో మార్పులే లాభం తగ్గిపోవడానికి కారణాలని వైద్యన్ స్పష్టతనిచ్చారు. అయితే, సాగు బీమా పాలసీలకు రీఇన్సూరెన్స్ డిమాండ్ పెరగడంతో జూన్ త్రైమాసికంలో ఆదాయం మాత్రం 189 శాతం పెరిగి రూ.17,195 కోట్లకు చేరింది. -
పీఎస్‌యూ బీమా ఐపీవోలతో 15వేల కోట్లు
సర్కారుకు సమకూరనున్న ఆదాయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని రెండు సాధారణ బీమా కంపెనీల ఐపీవోల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.15,000 కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వరంగంలోని ఐదు సాధారణ బీమా కంపెనీల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రానున్న కొన్ని వారాల్లో ఐపీవోకు రానున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ రెండు ఐపీవోల ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రస్తుత మార్కెట్ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఖజానాకు రూ.15,000 కోట్ల వరకు నిధులు సులభంగా సమకూరే అవకాశం ఉందనేది మార్చంట్ బ్యాంకర్ల అభిప్రాయం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.72,500 కోట్లను సమీకరించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యం. -
ఎస్బీఐ లైఫ్ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్
రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ప్రముఖ బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్ తొలి పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) సెబీ నుంచి ఆమోదం లభించింది. ఐపీవోకు సంబంధించి ఎస్బీఐ లైఫ్ ఈ ఏడాది జూలైలో దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్ల వరకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి. ఐపీవోలో భాగంగా 12 కోట్ల షేర్ల (రూ.10 ముఖ విలువ)ను ఎస్బీఐ లైఫ్ ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఇది 12 శాతం ఈక్విటీకి సమానం. ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐకి 70.1 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా ఈ సంస్థ 8 కోట్ల షేర్లను విక్రయించనుంది. 26 శాతం వాటా కలిగిన ఫ్రాన్స్ సంస్థ బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ 4 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఇంకా ఎస్బీఐ లైఫ్‌లో కేకేఆర్ ఆసియా ఫండ్, టెమాసెక్ హల్డింగ్స్కు 1.95 శాతం చొప్పున మైనారిటీ వాటాలున్నాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.7,000 కోట్ల వరకు సమీకరించే యోచనలో ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ‘‘ఈక్విటీ షేర్ల లిస్టింగ్‌తో ఎస్బీఐ లైఫ్ బ్రాండ్ పేరు విస్తృతం అవుతుంది. కంపెనీ ప్రస్తుత వాటాదారులకు నిధుల లభ్యత ఏర్పడుతుంది. ఈక్విటీ షేర్లకు పబ్లిక్ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది’’ అని కంపెనీ తెలిపింది. పరిశీలనలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీవో మరోవైపు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ), న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సైతం సెబీ వద్ద ఐపీవోకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీవో విషయంలో బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) నుంచి కొన్ని వివరణలను సెబీ కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, జీఐసీ ఐపీవోకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్ల నుంచి కూడా వివరణలు రావాల్సి ఉందని వెల్లడించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ దాఖలు చేసిన ఐపీవో పత్రాలు పరిశీలనలో ఉన్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
విడిగానే ఫ్యామిలీ హెల్త్!
♦ వృద్ధాప్య తల్లిదండ్రులను చేరిస్తే అధిక ప్రీమియం ♦ కవరేజీ కూడా పరిమితంగానే ఉంటుంది ♦ విడిగా వారికంటూ పాలసీ తీసుకుంటే అధిక కవరేజీ ♦ ప్రీమియం పెరగకుండా రెండు విధాల ప్రయోజనం ♦ కొన్ని తప్పనిసరి సందర్భాల్లోనే సింగిల్ పాలసీ బీమా కంపెనీలిపుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో దంపతులు, వారి ఇద్దరి పిల్లలతోపాటు వృద్ధులైన తల్లిదండ్రులకూ చోటు కల్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈ తరహా పాలసీలను ఆఫర్ చేయడం పెరిగింది. మరి ఇది లాభమేనా? లేక నష్టపోతామా? ఈ విషయం తేల్చుకోవాలంటే కొన్ని అంశాలను చూడాల్సి ఉంటుంది. వృద్ధులను ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో చేరిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. విడిగా వారికి ఓ పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువ కావొచ్చు. అందుకే పాలసీ తీసుకునే ముందు వీటన్నింటినీ ఓసారి జాగ్రత్తగా పరిశీలించాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తల్లిదండ్రులను చేరిస్తే సమస్యలివీ... తల్లిదండ్రులను సైతం ఒకే పాలసీలో చేర్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఎంచుకుంటే, పెద్ద వయసులో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీమా కంపెనీలు కోరతాయి. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం లేకపోలేదు. లేదా కొన్ని నియంత్రణలనైనా పెడుతుంటాయి. ఏదైనా వ్యాధి అప్పటికే ఉండుంటే కవరేజీ రూపేణా ప్రీమియం పెరిగిపోతుంది. హెల్త్ పాలసీల్లో ఓ ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే తదుపరి ఏడాది ప్రీమియంలో నో క్లెయిమ్ బోనస్ రూపేణా తగ్గింపు పొందొచ్చు. కానీ, వృద్ధులైన తల్లిదండ్రులనూ ఒకే పాలసీలో చేర్చడం వల్ల వారి కోసం చికిత్సల పేరుతో ఏటా క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే వారిని కూడా కలిపి ఒకే పాలసీ తీసుకునేట్టు అయితే నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం కోల్పోవాల్సి ఉంటుంది. రెండు వేర్వేరు పాలసీలను తీసుకుంటే పేరెంట్స్ పాలసీలో తరచూ క్లెయిమ్లున్నప్పటికీ మిగిలిన పాలసీలో అయినా నో క్లెయిమ్ బోనస్ పొందడానికి వీలుంటుంది. ఇక తల్లిదండ్రుల కోసం విడిగా పాలసీ తీసుకుంటే దానికి చెల్లించే ప్రీమియానికీ సెక్షన్ 80డీ కింద అదనపు పన్ను మినహాయింపు పొందొచ్చు. తనకు, తన జీవిత భాగస్వామి, పిల్లలకు తీసుకున్న హెల్త్ ప్లాన్‌పై ఓ ఏడాదిలో రూ.25,000 వరకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు ఈ సెక్షన్ కింద లభిస్తుంది. అలాగే, 60ఏళ్లు దాటిన తల్లిదండ్రులకు తీసుకునే హెల్త్ పాలసీపై ఏడాదికి రూ.30వేల ప్రీమియానికీ పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా రెండు వేర్వేరు పాలసీలు తీసుకున్నప్పటికీ ఆదాయపన్ను రిటర్నుల్లో ఒకే కాలమ్‌లో రెండింటి మొత్తాన్ని కలిపి పేర్కొనాల్సి ఉంటుంది. హెల్త్ చెకప్‌లకు అయ్యే వ్యయాన్నీ కూడా ఇదే కాలమ్‌లో గరిష్ట పన్ను మినహాయింపు పరిధి మేరకు చూపించుకోవచ్చనేది ఆదిత్య బిర్లా హెల్త్ కంపెనీ ప్రతినిధి సూచన. ఒకే పాలసీ ఏ సందర్భంలో...? ముందస్తు వ్యాధుల చరిత్ర ఉంటే వృద్ధులైన తల్లిదండ్రులకు పాలసీ ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించినపుడు వారితో కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం ప్రయోజనకరం. కొన్ని బీమా కంపెనీలు ఇందుకు అవకాశమిస్తున్నాయి. అయితే, వృద్ధాప్యంలో ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన ఆరోగ్య రక్షణ కవరేజీ అందించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి అటువంటి కేసుల్లో తాము సులభంగానే వ్యవహరిస్తున్నట్టు మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ఆశిష్ మెహరోత్రా తెలిపారు. ‘‘తల్లిదండ్రులకు విడిగా పాలసీ లభించని పక్షంలోనే వారిని వారి పిల్లలు తమ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో చేర్చుకోవాలి. సీనియర్లు విడిగా పాలసీ కోసం దరఖాస్తు చేసుకుంటే లభించడం కష్టం. ముందస్తు వ్యాధులతో ఉంటే మరింత కష్టమవుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో అయితే కవరేజీ పొందే అవకాశాలు ఎక్కువ’’అని బీమా బ్రోకరేజీ సంస్థ జేఎల్టీ డిప్యూటీ సీఈవో అరవింద్ లద్దా వివరించారు. మ్యాక్స్ బూపా హార్ట్‌బీట్ ఫ్యామిలీ ఫస్ట్ ప్లాన్‌లో ఓ వ్యక్తి 20 రకాల బంధుత్వాలు ఉన్నవారిని ఒకే పాలసీలో చేర్చుకునే అవకాశం ఉందని, వయసు పరంగా ఎటువంటి గరిష్ట పరిమితులు కూడా లేవని ఆ సంస్థ ఎండీ ఆశిష్ మెహరోత్రా తెలిపారు. వయసు ఆధారంగా... ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియం ఆ కుటుంబ సభ్యుల్లో గరిష్ఠ వయసున్న వ్యక్తి ఆధారంగా ఖరారు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు లేదా అత్త, మామలను అందులో చేరిస్తే సాధారణంగా వారు పెద్ద వయసులో ఉంటారు గనుక తక్కువ బీమాకే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ‘‘దీనికి బదులు రెండు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను తీసుకోవడం లాభకరం. ఒకటి తల్లిదండ్రులకు, మరొకటి వారి కుమారుడు లేదా కుమార్తె కుటుంబానికి’’ అనేది మార్కెట్ నిపుణుడు రాహుల్ మెహతా సూచన. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఆర్జనపరుడైన వ్యక్తి పాలసీ తీసుకోవాలని అనుకున్న సందర్భంలో ఏం జరుగుతుందో ఉదాహరణతో చూద్దాం. చరణ్ వయసు 30, జీవిత భాగస్వామి వయసు 28, తండ్రి వయసు 55, తల్లి వయసు 50గా భావిస్తే రూ.5 లక్షల కవరేజీకి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకోవాలని భావించారు. దీనికి మ్యాక్స్ బూపా ఫ్యామిలీ ఫస్ట్ పాలసీలో ప్రీమియం రూ.59,113. అదే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్హాన్స్లో ప్రీమియం రూ.62,289.ఇలా కాకుండా తల్లిదండ్రులకు, మిగిలిన కుటుంబ సభ్యులకు వేర్వేరు పాలసీలు తీసుకుంటే ఇంతే ప్రీమియానికి రెట్టింపు కవరేజీ అందుకోవచ్చు. ఇక్కడ చెప్పుకున్నట్టు చరణ్ తల్లిదండ్రులకు రూ.10లక్షల హెల్త్ ప్లాన్, అతడు, అతడి జీవిత భాగస్వామి కోసం రూ.10 లక్షల కవరేజీతో మరో ప్లాన్‌కు కలిపి చెల్లించాల్సిన ప్రీమియం రూ.50,321. ప్రీమియం రూ.9వేలు తగ్గడంతోపాటు కవరేజీ రెట్టింపైంది. అదే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌లో యాక్టివ్ హెల్త్ ఎన్హాన్స్లో రెండు వేర్వేరు పాలసీలకు కలిపి ప్రీమియం రూ.59,201. ఒకే పాలసీ, విడిగా పాలసీల్లో ప్రయోజనాల విషయంలో కొన్ని తేడాలు ఉండొచ్చు. రీస్టోరేషన్ ప్రయోజనాలు అదనం ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీల్లో చాలా కంపెనీలు రీస్టోరేషన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే రూ.5 లక్షల పాలసీలో ఓ ఏడాదిలో మొత్తం కవరేజీ వినియోగించుకుంటే, తిరిగి మళ్లీ రూ.5 లక్షల కవరేజీ ఆ ఏడాదికి పునరుద్ధరించబడుతుంది. ఉదాహరణకు ఓ కుటుంబ సభ్యుడు అనారోగ్యం పాలై ఆస్పత్రి ఖర్చులు రూ.5 లక్షలు దాటిపోతే కవరేజీ మొత్తం ఖర్చయిపోతుంది. అప్పుడు ఇక ఆ ఏడాదికి వైద్య పరంగా రక్షణ లేకుండా పోతుంది. కానీ, రీస్టోరేషన్‌లో కవరేజీ అయిపోయిన వెంటనే మరొక్కసారి అంతే మొత్తాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. దీనికి అదనంగా చార్జీ వసూలు చేయడం ఉండదు. ఈ బెనిఫిట్‌ను పైన చెప్పుకున్న ఉదాహరణలకు అన్వయించి చూద్దాం. తల్లిదండ్రులను కూడా ఒకే పాలసీ కింద కలిపి తీసుకుంటే రూ.5 లక్షల పాలసీకి రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా కలుపుకుంటే దురదృష్టకరమైన పరిస్థితుల్లో రూ.10 లక్షల వరకూ రక్షణ పొందొచ్చు. కానీ, ఇంతే ప్రీమియానికి రెట్టింపు కవరేజీతో వస్తుందని వేర్వేరు పాలసీలు తీసుకుంటే అప్పుడు ఒక్కో పాలసీలో బేసిక్ కవరేజీ రూ.10లక్షలు, రీస్టోరేషన్ కింద అదనంగా రూ.10 లక్షలు. కలిపితే రెండు పాలసీలపై నలుగురు సభ్యులు రూ.40 లక్షల వరకు రక్షణ పొందొచ్చు. ఎంతటి ఉపద్రవం వచ్చి పడినా నిశ్చింతగా ఉంచే కవరేజీ ఇది. పైగా ద్రవ్యోల్బణం ప్రభావంతో నేడు ఓ వ్యాధికి అయ్యే చికిత్సా వ్యయం ఐదేళ్ల తర్వాత ఎంత లేదనుకున్నా కనీసం 50 శాతం అధికమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే తల్లిదండ్రులకు విడిగా పాలసీ తీసుకోవడం ప్రయోజనకరమే. -
హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!
• స్థిరమైన ఆదాయాన్నిచ్చేందుకు రకరకాల ప్లాన్లు • కాస్త ముందు నుంచే పెట్టుబడి పెడితే ఉత్తమం • రిటైరయ్యేదాకా విత్‌డ్రా చేయకపోతే కావలసినంత నిధి అత్యధిక శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల్లోనో... స్వయం ఉపాధి మీదో బతుకుతున్న మన దేశంలో రిటైర్మెంట్కు ఉండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి పింఛను వచ్చే అవకాశం ఉన్నా... అది ఏ మూలకూ సరిపోదు. ఇక కంపెనీలైతే పెన్షన్ ఇవ్వవు. మరేంటి దారి? చాలా మందికి ఇదే సమస్య. ఉద్యోగం చేసినన్నాళ్లూ హాయిగా గడిపేసిన తాము... రిటైర్మెంట్ తరవాత పిల్లలపై ఆధారపడాలంటే వారికి సుతరామూ ఇష్టం ఉండదు. కొందరికి పిల్లలపై ఆధారపడే అవకాశమూ ఉండదు. ఇలాంటి వారు చేయాల్సింది ఒక్కటే!!. ముందుచూపుతో పెట్టుబడులు పెట్టాలి. వయసు పెరిగిన తరవాత వైద్య ఖర్చుల వంటివి కూడా జత అవుతాయి కనక... వీటికి తగ్గట్టు రిటైరీలకు తగిన ఆదాయాన్నిచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? అవిచ్చే రాబడులేంటి? వాటిపై పన్నులెంత ఉంటాయి? ఈ వివరాలన్నీ తెలియజేసేదే ‘సాక్షి ప్రాఫిట్’ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రిటైర్మెంట్ పథకాలు ప్రధానంగా రెండు రకాలు. ఈపీఎఫ్, పీపీఎఫ్. పన్ను ఆదా బాండ్ల వంటి గ్యారంటీగా రాబడులనిచ్చేవి ఒక రకం. నేషనల్ పెన్షన్ సిస్టమ్, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు వంటి మార్కెట్ ఆధారిత పాలసీలు రెండో రకం. మన ఆదాయం, మనం భరించగలిగే రిస్క్, ఆర్థిక అవసరాలు, మనం పనిచేసే ఉద్యోగం/స్వయం ఉపాధి వంటి అంశాల ఆధారంగా ఏ ఏ ప్లాన్లలో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. అయితే మార్కెట్ ఆధారిత ప్లాన్లు, గ్యారంటీడ్ ప్లాన్లలో సమతూకంతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని ప్రయోజనాలు పొందవచ్చన్నది నిపుణుల సలహా. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)... వేతన జీవులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఫండ్ సాధనం ఇది. ఉద్యోగి ప్రతినెలా మూలవేతనం, డీఏ కలిపితే వచ్చే మొత్తంలో 12 శాతాన్ని ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. నెలకు రూ.15,000 వరకూ వేతనం పొందే ఉద్యోగులకు ఇది తప్పనిసరి. అంతకు మించిన వేతనం ఉండే ఉద్యోగుల విషయంలో ఇది ఆప్షనల్. ఈ నిధిని ఈపీఎఫ్ఓ గానీ, కంపెనీకి చెందిన ట్రస్ట్ కానీ నిర్వహిస్తుంది. రాబడులు: 8 శాతం రేంజ్లో ఉంటాయి. పన్ను అంశాలు: పన్ను ప్రయోజనాల విషయంలో దీనిది అగ్రస్థానమే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీపై గానీ, విత్డ్రాయల్స్పై గానీ ఎలాంటి పన్ను పోటు ఉండదు. విత్‌డ్రాయల్స్: 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ వీటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం కొంత మొత్తంలో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకొని ఖర్చు చేసే అలవాటున్నవారికి 58 సంవత్సరాల వరకూ ఉన్న లాకిన్ పీరియడ్ కళ్లెం వేస్తుంది. మైనస్ పాయింట్లు: ప్రభుత్వం తరచూ నిబంధనలు మారుస్తుండటం. పన్ను రహిత బాండ్లు... రిటైర్మెంట్ అవసరాల కోసం డిజైన్ చేయకపోయినా, 10/15/20 ఏళ్ల పాటు స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పన్ను రహిత బాండ్ల గురించి ఏటా అప్పటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడిస్తారు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఎన్టీపీసీ, హడ్కో వంటి ప్రభుత్వ రంగ ఇన్ఫ్రా కంపెనీలు ఈ బాండ్లను జారీ చేస్తాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇష్యూని బట్టి క్రెడిట్ రిస్క్‌ను మీరే మదింపు చేసుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు పన్ను రహిత బాండ్లు రిటైర్మెంట్కు మంచి పోర్ట్‌ఫోలియో అని చెప్పవచ్చు. రాబడులు: సగటున 7-7.5% రేంజ్లో ఉంటాయి. పన్ను ప్రయోజనాలు: మెచ్యూరిటీ వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఆర్జించే వడ్డీపై పన్ను రాయితీలు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులేమీ ఉండవు. ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను రాయితీలు లభించవు. మార్కెట్ ద్వారా ఈ బాండ్ల నుంచి వైదొలిగితే మాత్రం 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: బాండ్ల కాలపరిమితి 10/15/20 ఏళ్లుగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవాలంటే ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పన్ను రహిత బాండ్ల ద్వారా ఏటా వచ్చే వడ్డీని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు వస్తాయి. మైనస్ పాయింట్లు: ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రోజులే అందుబాటులో ఉంటాయి. ఏ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించడానికి కొంత హోమ్‌వర్క్ చేయాలి. వీటికి సావరిన్ గ్యారంటీ ఉండదు. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ బాండ్లు ట్రేడవుతాయి. కానీ లావాదేవీలు స్వల్పంగా ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పోస్టాఫీసుల్లో కానీ, ఎంపిక చేసిన బ్యాంకుల్లో కానీ రూ.100తో ఈ ఖాతాను తెరవవచ్చు. ఏడాదికి కనీ సంగా రూ.500, గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. తర్వాత ఐదేళ్ల కాలానికి పొడిగించుకునే వెసులుబాటు ఉంది. రాబడులు: ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 8.1 శాతంగా ఉంది. భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నాయి. పన్ను ప్రయోజనాలు: ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఏడవ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతిస్తారు. విత్‌డ్రాయల్ చేసుకుంటున్న ఏడాదికి ముందున్న బ్యాలెన్స్‌లో సగం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు ఓకే. మైనస్ పాయింట్లు: మూడునెలలకొకసారి వడ్డీరేట్లను మార్చడం, ఒడిదుడుకులకు గురయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలతో అనుసంధానించడం, అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగంలోని వ్యక్తుల కోసం భారత ప్రభుత్వం గత ఏడాది అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్లలోపు, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు అర్హులు. 60 ఏళ్లు వచ్చే వరకూ నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000/2,000/3,000/ 4,000/.5,000 వరకూ పెన్షన్ పొందవచ్చు. వ్యక్తి చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి ఈ పెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42 చొప్పున 42 సంవత్సరాలు చెల్లిస్తే నెలకు రూ.1,000, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన స్కీమ్ కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలతో ఈ స్కీమ్‌ను అనుసంధానిస్తారు. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తుంది. మార్కెట్ ఆధారిత స్కీమ్‌లు... నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) మార్కెట్ అనుసంధానిత రిటైర్మెంట్ స్కీమ్ ఇది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.1,000. ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎం తెంత ఇన్వెస్ట్ చేయాలో(అసెట్ అలొకేషన్) మనమే నిర్దేశించవచ్చు. ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతంగా నిర్దేశించారు. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాల వెల్లడి, రోజువారీ ఎన్ఏవీ ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు సంతృప్తికరంగా లేకపోతే, ఫండ్ మేనేజర్‌ను, లేదా అసెట్ అలొకేషన్‌ను మార్చుకోవచ్చు. రాబడులు: మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటివరకైతే వివిధ కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఎన్పీఎస్ ప్లాన్లు మంచి రాబడులనే ఇచ్చాయని చెప్పొచ్చు. పన్నులు: ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి రూ. 2లక్షల వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ రాబడులపై పన్ను పోటు ఉంటుందని గుర్తించాలి. ఫైనల్ మెచ్యురిటీలో 40 శాతం వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 40 శాతం సొమ్ములతో యాన్యుటీని (రిటైర్మెంట్ ప్లాన్స్‌ను) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెల వారీ ఆదాయంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం మీ ఆదాయానికి కలిపి పన్ను విధిస్తారు. మీరు కనుక అధిక పన్ను బ్రాకెట్లో ఉంటే మీకు పన్ను పోటు భారీగానే ఉంటుంది. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి పదేళ్లు పూర్తయితే 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. లేదంటే రిటైర్మెంట్ వయస్సు వరకూ మీ ఇన్వెస్ట్మెంట్స్ లాక్ అయి ఉంటాయి. ప్లస్ పాయింట్లు: వృత్తిగత ఫండ్ మేనేజర్లు దీనిని నిర్వహిస్తారు. వ్యయాలు తక్కువ. 0.25 శాతం లావాదేవీల, 0.01 శాతం ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇది 2-3 శాతం రేంజ్లో ఉంటుంది. రాబడులు, వ్యయాలు, పారదర్శకత విషయంలో ఇది మంచి స్కీమ్. మైనస్ పాయింట్లు: తుది నిధుల వినియోగానికి సంబంధించి నియమనిబంధనలు సంతృప్తికరంగా లేవు. మెచ్యూరిటీలో 60 శాతం వరకూ మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థల రిటైర్మెంట్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు రెండు రకాలుగా ఉంటున్నాయి. 1.సంప్రదాయ/గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్లు 2. యులిప్‌లు రెండు ప్లాన్‌ల్లో స్థిరమైన వార్షిక ప్రీమియమ్‌లు 5/10/15 ఏళ్ల టర్మ్ (లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ) చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటైరైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుంది. రాబడులు: సంప్రదాయిక పెన్షన్ ప్లాన్లలో గ్యారంటీడ్ ఆడిషన్స్ లభిస్తాయి. వ్యయాలు అధికంగా ఉండడం వల్ల రాబడులు సగటున 4-6% రేంజ్లో ఉంటాయి. యులిప్‌లు కూడా అంతంత మాత్రం రాబడులనే ఇస్తాయి. ప్రీమియమ్ అలొకేషన్, పాలసీ నిర్వహణ, ఫండ్ మేనేజ్మెంట్, యొర్టాలిటీ చార్జీలు తదితర ఖర్చులు అధికంగా ఉంటాయి. పన్నులు: ఈ ప్లాన్లకు చెల్లించిన ప్రీమియమ్లకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులుండవు. నెలా నెలా తీసుకునే యాన్యుటీపై మాత్రం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: సంప్రదాయ ప్లాన్‌ల్లో ముందస్తుగా ఎగ్జిట్ కావడం ఉండదు. సరెండర్ చేస్తే చార్జీలు అధికంగా ఉంటాయి. ఇక యులిప్‌ల విషయానికొస్తే, ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. చార్జీలు స్వల్పంగా ఉంటాయి. ప్లస్ పాయింట్లు: ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి. మైనస్ పాయింట్లు: ఈ ప్లాన్‌ల్లో పెద్దమొత్తంలో పోగుపడిన మీ నిధిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ మొత్తంలో మూడో వంతు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలు ఉంది. మిగిలిన దాంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 80 సీ ప్రయోజనాలకనుగుణంగా ఉండేలా పలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేక రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యుటిఐ రిటైర్మెంట్ బెనిఫిట్ యూనిట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ వంటి సీబీడీటీ -నోటిఫై చేసిన ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో గానీ, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. రాబడులు: ఈ ఫండ్స్ రాబడులు 10-15 శాతం రేంజ్లో ఉన్నాయి. పన్నులు: స్పెషల్ రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ ప్రకారం. తుది విత్డ్రాయల్స్పై పన్నులు సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌లాగానే ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. డెట్ ఫండ్స్ అయితే 20 శాతం దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: వీటికి లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే, 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైనప్పుడు ఏక మొత్తంలో సొమ్ములు తీసుకోవచ్చు. లేదా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: ఇతర మార్కెట్ అనుసంధానిత ప్లాన్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ప్లాన్లు ఆరోగ్యకరమైన రాబడులనిస్తాయి. లిక్విడీటీ మెరుగ్గా ఉంటుంది. పన్నులు కూడా తక్కువ. మీకు ఇష్టంవచ్చిన రీతిగా మీ సొమ్ములను వాడుకునే వీలుంటుంది. మైనస్ పాయింట్లు: ఎన్‌పీఎస్‌తో పోల్చితే వ్యయాలు, ఫీజులు అధికంగా 2.5-3% ఉండడం, కొత్త ప్లాన్ల గురించి అంచనాకు రావడానికి ట్రాక్ రికార్డ్ ఉండకపోవడం. ఈ విషయాలు గమనించండి ఆరోగ్యకరమైన రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయాలంటే. ♦ వీలైనంత చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం మదుపు చేయడం ప్రారంభించండి. ఇలా చేస్తే చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడులు పొందవచ్చు. ♦ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి. 60 ఏళ్లు వచ్చే వరకూ తప్పనిసరి అయితే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. ♦ ఒక వేళ మీరు ఉద్యోగస్తులైతే సింహభాగం ఈపీఎఫ్‌కు కేటాయించండి. మీ రిటైర్మెంట్ నిధుల్లో దాదాపు 70 శాతం దానికే కేటాయించండి. ♦ ఆ ఏడాది బడ్జెట్‌ను నిశితంగా పరిశీలించండి. పన్ను రహిత బాండ్ల గురించి ప్రకటనలు ఉన్నట్టైతే, పీపీఎఫ్‌కు తక్కువ మొత్తం కేటాయించండి. పన్ను రహిత బాండ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి. పన్ను రహిత బాండ్లు ఓపెన్ కాగానే వాటికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. ఒక వేళ పన్ను రహిత బాండ్ల ప్రస్తావన లేకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ♦ {దవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ♦ రాబడులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్నుల విషయమై అవగాహన పెంచుకోండి. ♦ ఈపీఎఫ్ అవకాశం మీకు లేకుంటే, పీపీఎఫ్, పన్ను రహిత బాండ్లలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ♦ మీ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు తీరు గమనించండి. కనీసం మూడు నెలలకొకసారైనా మదింపు చేయండి. -
రైతు గోస పట్టదా?
పంటలు నష్టపోయినా.. అందని బీమా సొమ్ము - ఏడాదిగా బీమా ప్రీమియం చెల్లించని సర్కారు - రూ.360 కోట్ల పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టిన బీమా కంపెనీ - కేంద్రం ఇచ్చిన కరువు నిధులనూ రైతులకు ఇవ్వని సర్కారు - ఊసు లేని రూ.720 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు - మూడో విడత రుణమాఫీలో మరో సగం పెండింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరడం లేదు. వరుస కరువులతో తల్లడిల్లుతున్న అన్నదాతలను ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత అగాధంలోకి నెట్టివేసింది. దెబ్బతిన్న పంటలకు బీమా కంపెనీలు ఇచ్చే నష్ట పరిహారం అందకుండా చేసింది. పంటల బీమా కోసం తన వంతుగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. దాదాపు 20 లక్షల మంది రైతులు నిరాశలో మునిగిపోయారు. గత ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పంటలకు బీమా చేసుకున్నారు. ఈ బీమా ప్రీమియంలో కొంత శాతాన్ని రైతులు చెల్లిస్తారు, మిగతా సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు వాటాగా నేరుగా జాతీయ వ్యవసాయ బీమా కంపెనీకి చెల్లిస్తాయి. రైతులు పంట రుణాలు తీసుకున్నప్పుడే తమ వంతు ప్రీమియం చెల్లించేశారు. కేంద్రం కూడా తన వంతు మేర ప్రీమియం సొమ్మును విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా జమ చేమాల్సిన రూ.30 కోట్లను బీమా కంపెనీకి చెల్లించలేదు. మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో పంటలు నష్టపోయి ఏడు జిల్లాల్లో రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా బీమా కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడు జిల్లాల పరిధిలోని రైతులకు రూ.360 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు అంగీకరించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తన వంతు ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా కంపెనీ కొత్త మెలికపెట్టింది. ప్రీమియం పూర్తిగా చెల్లించకుండానే పరిహారమెలా చెల్లిస్తామని కొర్రీ పెట్టింది. రూ.30 కోట్లు చెల్లించే వరకు పరిహారమివ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. మరోవైపు దాదాపు 20 లక్షల మంది రైతులు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సొమ్ము అందితే తమ కష్టాలు కొంతైనా గట్టెక్కుతాయని ఆశతో ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీకీ ఇదే గతి గత ఖరీఫ్‌లో 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికీ అక్కడి రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అందించలేదు. దీంతో ఖరీఫ్‌లో పెట్టుబడులకు కనీస సాయం అందుతుందని ఎదురుచూసిన రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇక కేంద్రం నాలుగు నెలల క్రితమే రాష్ట్రానికి కరువు సాయం కింద రూ.712 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు చెల్లించేందుకు రూ.1,018 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మిగతా మొత్తం సర్దుబాటు చేసే పరిస్థితి లేకపోవటంతో ఇన్పుట్ సబ్సిడీ ఊసెత్తకుండానే కాలం వెళ్లబుచ్చుతోంది. గత ఖరీఫ్‌లో కరువు దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 30.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 20.91 లక్షల మంది రైతులు నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపినా.. ఇప్పటికిప్పుడు రూ.712 కోట్లు విడుదల చేయడం సాధ్యం కాదంటూ ఆ ఫైలును ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. రుణమాఫీ నిధులకు కత్తెర ఇక రైతుల రుణ మాఫీ మూడో విడత కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.4,250 కోట్లు కేటాయించింది. ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా జూన్‌లో సగం, జూలైలో సగం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జూన్ ఒకటిన రూ.2,019.99 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చినా.. సరిగా నిధులు విడుదల చేయలేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులకు సంబంధించి ఈ విడత నిధులు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో కొర్రీలు పెడుతున్నాయి. -
వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..!
ఇండెమ్నిటీ పాలసీలతో ప్రొఫెషనల్స్‌కు భరోసా వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు సహా పలువురికి సేవలు.. బాధితులకు పరిహారం చెల్లించేది బీమా కంపెనీలే.. బాధ్యతారాహిత్యం, తప్పిదం ప్రధానాంశాలే.. కేసుల్లో ఖర్చుల నుంచి, పరిహారం దాకా బీమాదే.. ’’ఉన్నదంతా ఊడ్చేశాను. ఆఖరికి అప్పులు కూడా చేశాను. అయినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. మాకు న్యాయం కావాలి’’ - ఓ దంపతుల ఆవేదన... ‘‘ఈ లాయర్‌ను నమ్ముకుని భారీగా ఖర్చుచేశా. కానీ లాయర్ తప్పిదం కారణంగా కేసును వీగిపోయా. నాకు నష్టం జరిగింది’’ - కోర్టులో ఒక కక్షిదారు పిటిషన్ ‘‘ఆర్కిటెక్ట్ సరిగా డి జైన్ చెయ్యలేదు. డిజైన్ లోపం వల్లే నిర్మాణం దెబ్బతింది. నాకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. నాకు పరిహారం కావాలి’’ - కోర్టులో పిటిషన్ ద్వారా ఓ భారీ భవంతి యజమాని అభ్యర్థన... చూడటానికివన్నీ వేరువేరు సంఘటనలే. కాకపోతే మూడింట్లోనూ ఇమిడి ఉన్న ఒకే ఒక అంశమేంటంటే... ఈ సందర్భాలన్నిట్లో సేవలు పొందిన వారు నష్టపోయారు. మరి వారికి న్యాయం జరిగేదెలా? ఇదిగో... సరిగ్గా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం ద్వారా దీన్లోని వ్యాపారాన్ని అందిపుచ్చుకోవటానికి బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వృత్తి నిపుణుల తరఫున బాధితులకు పరిహారం అందించే పాలసీలను అందజేస్తున్నాయి. న్యాయవాదులు, వైద్యులు, ఆర్కిటెక్ట్‌ల వంటి వృత్తి నిపుణులు ఈ పాలసీలను తీసుకునే ధోరణి ఇపుడు పెరుగుతోంది. ఓ నిపుణుడి నిర్లక్ష్య ధోరణి కారణంగా సేవలు పొందిన వ్యక్తి నష్టపోతే ఇరువురినీ ఆదుకునేందుకు ఈ పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వీటినే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీలుగా పిలుస్తున్నారు. ప్రీమియం కాస్త ఎక్కువే... పాలసీ ప్రీమియం అనేది... తీసుకునే వారిని బట్టి ఉంటుంది. ఓ వైద్యుడు రూ.50 లక్షల పరిహారం కోసం పాలసీ తీసుకుంటే 1% అంటే రూ. 50 వేల ప్రీమియం చెల్లించుకోవాలి. వైద్యుల్లోనూ ఫీజీషియన్ కంటే సర్జన్‌కు ప్రీమియం అధికంగా ఉంటుంది. ఎందుకంటే శస్త్రచికిత్స విఫలమైన పక్షంలో రోగుల ప్రాణాలకు ముప్పుంటుంది. అదే రిస్క్ తక్కువగా ఉండే వర్గాలకు ఇన్సూరెన్స్ మొత్తంలో 0.30% ప్రీమియంనే బీమా కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఎవరికి ఈ పాలసీలు..? స్వతంత్రంగా సేవలందించే ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవచ్చు. అంటే లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రకటనల నిపుణులు, కంపెనీ సెక్రటరీలు, ప్రజా సంబంధాల నిపుణులు, మేనేజ్మెంట్ నిపుణులు, కళాత్మక వస్తువులకు విలువ కట్టేవారు, వేలందారులు, టూర్ ఆపరేటర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, బీమా బ్రోకింగ్ సేవలందించేవారితో పాటు విద్యా సంస్థలు, ఇంకా సలహా సేవలందించే ఇతర రంగాల నిపుణులు పాలసీలు తీసుకోవచ్చు. పాలసీ ఉందికదా అని నిర్లక్ష ్యం కూడదు! పాలసీ ఉంది కదా అని వృత్తి నిపుణులు బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా సేవలు అందిస్తే జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం నిరాకరించవచ్చు. పాలసీ నిబంధనల్లో ఇలాంటి ఎన్నో మినహాయింపులుంటాయి. అందుకే పాలసీ తీసుకునే ముందే పరిహారం విషయమై మినహాయింపుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంటే పాలసీ నియమ, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే మోసపూరిత, నేరపూరిత, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన ఘటనలకు కూడా పరిహారం రాదు. ఇలాంటివి మినహాయిస్తే బాధ్యతాయుతంగా అందించే సేవల్లో జరిగే నష్టాలకు నిపుణులు బాధితులుగా మారకుండా ఇండెమ్నిటీ పాలసీలు రక్షణనిస్తాయి. ఏ సందర్భంలో పరిహారం..? ఉదాహరణకు వైద్యుడి సేవా లోపం కారణంగా ఓ రోగి ప్రాణం కోల్పోయాడంటూ బాధితుని కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మరి వైద్యుడు కూడా జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని వాదించుకోవటానికి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలి కదా? తనకు ఛార్జీలు చెల్లించాలి కదా!! ఒకవేళ కేసులో ఓడిపోయి పరిహారం చెల్లించాల్సి వస్తే తానే చెల్లించాలి కదా!! ఇవన్నీ తప్పనిసరి. కాకపోతే ఇండెమ్నిటీ పాలసీ గనక తీసుకుని ఉంటే... ఈ భారమంతా బీమా కంపెనీ తలకెత్తుకుంటుంది. -
యూఐఐకి 5.. ఓరియంటల్‌కు 4 జిల్లాలు
గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా కంపెనీల ఖరారు సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఉద్యాన శాఖ తాజాగా బీమా కంపెనీలకు జిల్లాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్‌కి.. మెదక్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలను యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ లిమిటెడ్ (యూఐఐ)కి అప్పగించింది. నిర్దేశించిన జిల్లాల్లోని గ్రీన్హౌస్ రైతులకు ఆయా కంపెనీలు బీమా వసతి కల్పించాల్సి ఉంటుంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యాన శాఖ నుంచి 50 శాతం సబ్సిడీ విడుదలయ్యాక జిల్లా అధికారి ధ్రువీకరణ పత్రం ఆధారంగా సంబంధిత కంపెనీ బీమా పాలసీని రైతుకందజేస్తుంది. పంటలకు బీమా లేదు.. గ్రీన్‌హౌస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు.. అందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఎకరా గ్రీన్హౌస్ నిర్మాణానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో భారీగా సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం.. ఈదురు గాలులు, వరదల వల్ల సొమ్ము నష్టపోకుండా బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఓరియంటల్, యునెటైడ్ ఇండియా బీమా కంపెనీలకు రూ. 34 లక్షల బీమా ఏడాది పాటు అవకాశం కల్పించింది. గ్రీన్హౌస్ నిర్మాణం, పాలీషీట్లు, షేడ్నెట్లకు కవరేజీ ఉంటుందని, అందులో పండించే పంటలకు మాత్రం బీమా ఉండదని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. -
క్లెయిమ్ పరిష్కారం కష్టమేం కాదు!
♦ పాలసీ తీసుకున్నప్పుడే జాగ్రత్త అవసరం ♦ ఆరోగ్య వివరాలేవీ దాచిపెట్టకుంటే ఉత్తమం ♦ చిరునామా, నామినీలు మారితే వెంటనే సవరణ ♦ అన్నీ సరిగా ఉన్నా క్లెయిమ్ కాకుంటే ప్రత్యామ్నాయాలు ♦ అంబుడ్స్‌మన్ నుంచి ఐఆర్‌డీఏకు కూడా... అసలు బీమా పాలసీ తీసుకునేదే కుటుంబ రక్షణ కోసం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక... ఆపత్కాలంలో ఆదుకుంటుందనే బీమా పాలసీని తీసుకుంటాం. మరి అనుకోని సంఘటన జరిగాక... ఆ దురదృష్టకర పరిస్థితుల్లో పాలసీ అక్కరకు రాకపోతే..? ఇక్కడ క్లెయిమ్ పరిష్కారం విధాన ప్రక్రియ సులభంగా జరగడం ముఖ్యం. చాలా మంది ఇక్కడే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి బీమా క్లెయిములంటే.. చాలా కష్టంతో కూడుకున్నవని అనిపించే ఉదంతాలు మనకు తరచూ ఎదురవుతుంటాయి. గందరగోళాన్ని తొలగించి, క్లెయిమ్ ప్రక్రియపై అవగాహన కల్పించడానికే ఈ కథనం. క్లెయిమ్ ప్రక్రియ నిజంగానే సులభంగా జరగాలంటే పాలసీదారులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ⇔ ముందుగా తీసుకోదల్చుకున్న బీమా పథకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సందేహాలుంటే ఏజెంటును లేదా బీమా కంపెనీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సంతృప్తికరమైన సమాధానాలు పొందాకే సంతకం చేయాలి. ⇔ సంతకం చేసే ముందు దరఖాస్తు ఫారాన్ని కూడా చదవాలి. ఖాళీ ఫారంపై సంతకం చేయొద్దు. వివరాలన్నీ మీరే నింపడం మంచిది. ఒకవేళ ఎవరిదైనా సహాయం తీసుకుంటే అన్నీ సరిగ్గా నింపారో లేదో చూసుకోవాలి. ఇంగ్లిషులోని ఫారంను అర్థం చేసుకోవడం కష్టమైతే .. సన్నిహితులో, స్నేహితులో, బంధువులో నమ్మకస్తుల సహాయం తీసుకోవాలి. ⇔ మీ వయస్సు, చదువు, ఆదాయం, వృత్తి, అలవాట్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా బీమా పాలసీలుంటే ఆ వివరాలు... అన్నీ వాస్తవాలనే తెలపాలి. ⇔ సరైన బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరిస్తే, మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ మొత్తాలు నేరుగా ఖాతాలోకి డిపాజిట్ అవుతాయి. జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులను నామినీలుగా పెట్టొచ్చు. వారి పేరు, పుట్టిన తేదీ, బంధుత్వం, చిరునామా మొదలైన వివరాలు కచ్చితమైనవిగా ఉండాలి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువుంటే.. ఏ నిష్పత్తిలో వాటాలుండాలనేది కూడా పొందుపర్చాలి. బీమా పాలసీ వివరాలను.. నామినీలకు కూడా తెలియపర్చాలి. క్లెయిమ్ సులభ పరిష్కారంలో ఇది ఎంతో కీలకం. ⇔ ఇన్సూరెన్స్ కంపెనీ.. మీరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం కాపీ, పాలసీ ప్రయోజనాల పత్రాన్ని పంపాలి. బీమా పాలసీ చేతికొచ్చాక మరోసారి వివరాలన్నీ సరిచూసుకోవాలి. తప్పులేమైనా కనిపిస్తే వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. ⇔పాలసీని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, నామినీకి కూడా తెలియజేయాలి. పాలసీ పత్రాల్లో కంపెనీ కాంటాక్ట్ వివరాలుంటాయి. అవసరమైన సందర్భంలో బీమా సంస్థను వెంటనే ఎలా సంప్రదించాలో నామినీకి చెప్పాలి. అలాగే నామినీకి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు వంటి సరైన గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ⇔ చిరునామా లేదా నామినీల వివరాల్లో మార్పులేమైనా ఉంటే తక్షణం బీమా కంపెనీకి తెలియజేయాలి. ఈ విషయంలో ఆలస్యం సరికాదు. వివరాలు అన్నీ క్షుణ్ణంగా సంబంధిత అధికారికి అందజేయాలి. ⇔ క్లెయిమ్ సమయంలో దాఖలు చేయాల్సిన పత్రాల గురించి పాలసీ కాంట్రాక్టులోనే ఉంటుంది (ఉదా. డెత్ సర్టిఫికెట్, డాక్టర్ రిపోర్టు, నామినీ కేవైసీ పత్రాలు మొదలైనవి). వాటి గురించి తెలుసుకోవాలి. ⇔ క్లెయిమ్ చేయాల్సి వస్తే సాధ్యమైనంత త్వరగా ఘటన గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ అందించాలి. ⇔ క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టడం చాలా ముఖ్యం. లేకపోతే పాలసీ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలా బీమా పాలసీ విషయంలో జాగ్రత్తలన్నీ పాటిస్తే.. క్లెయిమ్ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తవుతుంది. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి... అన్నీ సరిగ్గా చేసినా క్లెయిమ్ పరిష్కారంలో సమస్యలెదురైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి చూద్దాం... పాలసీ క్లెయిమ్ వస్తే బీమా కంపెనీ 30 రోజుల్లోపు పరిష్కరించాలి. తిరస్కరిస్తే దానికి కారణాలు కూడా చెప్పాలి. కంపెనీ అలా చెయ్యకుంటే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు. రూ.20 లక్షల విలువ వరకు గల పాలసీ కేసులను అంబుడ్స్‌మన్ విచారించే అవకాశం ఉంది. ఒకవేళ క్లెయిమ్ కరెక్టేనని, బీమా కంపెనీ తప్పిదం వల్లే అది ఆలస్యమవుతోందని అంబుడ్స్‌మన్ భావిస్తే... పరిహారం విషయమై బీమా కంపెనీలకు ఆదేశాలివ్వటం కూడా జరుగుతుంది. ఐఆర్డీఏ సాయం కూడా... బీమా కంపెనీల సేవా లోపాలు, ఏజెంట్ల తీరుపై పాలసీదారులు బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ)కు ఫిర్యాదు చేయవచ్చు. కాల్ సెంటర్‌కు 155255కు ఫోన్ కాల్ ద్వారా లేదా ఐఆర్డీఏ తాలూకు ఐఆర్జీఏ పోర్టల్‌లో igms.irda.gov.in ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉంది. వినియోగదారుల ఫోరానికి... ఈ వేదికల్లో సమస్యకు పరిష్కారం లభించకపోతే పాలసీదారులు నేరుగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. అతి తక్కువ వ్యయంతో తక్కువ సమయంలోనే తగిన న్యాయ సహాయం పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. -
బీమా క్లెయిమ్ కష్టమేమీ కాదు!
ఇన్సూరెన్స్ సంస్థలు ఒక విషయంలో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. అది క్లయింట్స్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుచుకోవడం!!. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న సంస్థలకే మనుగడ ఉంటుంది. వృద్ధి బాటలో పయనిస్తాయి. ఇది బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ అంశంపై ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ చెల్లింపుల్లో ఏ బీమా కంపెనీ అయితే అధిక రేషియోను కలిగి ఉంటుందో... ఆ సంస్థ నుంచి బీమాను తీసుకోవడానికే కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతారనేది బహిరంగ రహస్యం. చాలా మందిలో బీమా క్లెయిమ్‌కు సంబంధించి కొన్ని అపోహలుంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలు క్లెయిమ్ చెల్లింపునకు ఇష్టపడవని, సరిగా చేయవని, చాలా కష్టమని, ఎక్కువ సమయం పడుతుందనే వ్యాఖ్యలను తరచూ వింటూనే ఉంటాం. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. క్లెయిమ్ చెల్లింపు అంశం.. ఇన్సూరెన్స్ కంపెనీపై కన్నా పాలసీదారుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ వద్దే సమస్య బీమా కంపెనీలకు, పాలసీదారులకు మధ్య సమస్యలు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలోనే తలెత్తుతాయి. పాలసీదారుడు బీమా పాలసీని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం.. పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయం వంటి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తప్పుగా అందించడం వంటి వాటివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లో సమస్య ఉత్పన్నమౌతుంది. ఉదాహరణకు ప్రమాదం జరిగి మరణం సంభవించినప్పుడు... పోస్ట్‌మార్టమ్ సహా పాలసీ నివేదికలను సదరు బీమా కంపెనీకి సమర్పించాలి. అదే అనారోగ్యం కారణంగా చనిపోతే.. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్ రికార్డులను, వివిధ టెస్టుల నివేదికలను కోరతాయి. అందుకే క్లెయిమ్ చేసే వ్యక్తి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే క్లెయిమ్ కోసం బీమా సంస్థలు ఏ ఏ లీగల్ డాక్యుమెంట్లను, పత్రాలను కోరతాయో వాటినే సమర్పించాలి. క్లెయిమ్‌కు సంబంధించిన సమస్త సమాచారం ఆయా బీమా సంస్థల వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కూడా అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. తగిన సమాచారం సమర్పించడం ద్వారా ఎటువంటి సమస్యలూ, ఆలస్యానికి తావు లేకుండా క్లెయిమ్ సెంటిల్మెంట్ను వేగవంతం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జరిగే లోటుపాట్లే ఇబ్బందులకు కొంత కారణం. సరైన పత్రాలతో నిర్ణీత సమయంలోనే సెటిల్మెంట్ బీమా సంస్థలకు అన్ని అవసరమైన పత్రాలను సమర్పిస్తే.. నిర్ణీత సమయంలోనే క్లెయిమ్ చెల్లింపు జరిగిపోతుంది. అదెలాగో చూద్దాం.. శర్మకు వయసు 32 ఏళ్లు. ఈయన భార్య ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె రెండేళ్ల కిందటే ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె అన్ని అవసరమైన పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించారు. అయినా కూడా ఆమె క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించింది. దీనికి కారణం ఏంటి? అంటే.. శర్మ తన భార్య గుండెకు సంబంధించిన ఆరోగ్య వివరాలను కంపెనీకి తెలియజేయలేదు. వైద్య పరీక్షల నివేదికల ప్రకారం ఆమె గుండె అనారోగ్యంతో మరణించింది. అందుకే పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయానికి సంబంధించి ఎలాంటి విషయాలను దాచకూడదు. అదే శర్మ అప్పుడు అన్ని వివరాలను కంపెనీకి తెలియజేసి ఉంటే ఇప్పుడు క్లెయిమ్ సులువుగా వచ్చేది. - సమీర్ బన్సాల్ డెరైక్టర్, బ్యాంక్ అస్యూరెన్స్ పీఎన్బీ మెట్‌లైఫ్ -
మంచి జీవిత బీమా పాలసీ ఎంపిక ఎలా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. మార్కెట్లో చాలా బీమా సంస్థలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. భిన్న వ్యక్తుల్ని ఆకర్షించడానికి అవి రకరకాల జీవిత బీమా పాలసీలను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో బాసటగా నిలుస్తుందనే పాలసీని తీసుకుంటారు. అందుకే బీమా పాలసీ ఎంపిక చాలా జాగ్రత్తగా జరగాలి. పాలసీ ఎంపికలో మొదట చేయాల్సింది కొన్ని ప్రధానమైన బీమా కంపెనీలను ఎంచుకోవడం. తర్వాత ఆ కంపెనీల ట్రాక్ రికార్డ్, దాని మేనేజ్మెంట్, మాతృ సంస్థ, ఫండ్ పనితీరు, సేవలకు సంబంధించి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ వంటి అంశాల్ని పరిశీలించాలి. ఏ బీమా కంపెనీ మంచి సేవలను అందిస్తుందో దాన్నే ఎంచుకోవాలి. అలాగే ఆ బీమా కంపెనీ మన అవసరాలకు అనువైన పాలసీని ఆఫర్ చేస్తోందా? లేదా? అనేది గుర్తించాలి. సరిపోయే పాలసీ ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవాలి. పాలసీ ఎంచుకున్నాక దానికి సంబంధించిన ప్రీమియం, ఇతరత్రా వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్ ద్వారా పాలసీ నియమ నిబంధనలను తెలుసుకోవచ్చు. అలాగే మనకు సం బంధించిన జీవన వ్యయాలు, రిస్క్ తదితర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అంశాల్లో మనం సంతృప్తి చెందాకే పాలసీ తీసుకోవాలి. పాలసీ తీసుకున్నాక బీమా కంపెనీతో ఎప్పుడూ అనుసంధానమై ఉండండి. -
ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్
నూతన కార్యాలయం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అన్ని బీమా కంపెనీల సేవలనూ... అన్ని రకాల బీమాలనూ ఒకేచోట అందిస్తూ రైతులు, ఉద్యోగులకు బీమాను మరింత చేరువ చేసిందంటూ ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్‌ను (ఈఐబీఎస్‌ఎల్) ప్రముఖ న్యాయవాది వి.సురేందర్‌రావు కొనియాడారు. సోమవారం బంజారాహిల్స్‌లోని లుంబినీ మాల్లో ఈఐబీఎస్‌ఎల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వినియోగదారులకు అవసరమైన బీమా కంపెనీలు, పాలసీల వివరాలను అందించడంతో పాటు కస్టమర్ల అవసరాలకు తగ్గ బీమా సేవలందించటం ఈఐబీఎస్‌ఎల్ ప్రత్యేకతన్నారు. ప్రమాద, జీవిత, సాధారణ, వాహన బీమాకు సంబంధించి కస్టమర్లకు క్లెయిములు అందేలానూ సంస్థ చూస్తుందని ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ వి.సుధాకర్ చెప్పారు.ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో 6 లక్షల మంది రైతులకు ఓరియంటల్, ఇతర సంస్థల ద్వారా బీమా సౌకర్యం కల్పించడంలో ఈఐబీఎస్‌ఎల్ కీలకంగా వ్యవహరించిందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జన్నత్ హుస్సేన్, బజాజ్ అలయంజ్ వైస్ ప్రెసిడెంట్ సీఆర్ మోహన్, ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ కో ఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ వెంకట్‌రెడ్డి, కన్సల్టెంట్ గజ్జల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవిత బీమా తీసుకుంటున్నారా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో జీవిత బీమా పాలసీ తీసుకోవడం సులభం. బీమా కంపెనీలు పలురకాల బీమా పాలసీలను అందిస్తున్నాయి. బీమా కంపెనీల వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా మన అవసరాలకు ఏ పాలసీ సరిపోతుందో మనమే ఒక అంచనాకు రావచ్చు. లేదా బీమా కంపెనీల ప్రతినిధులను కలిసి వారి ద్వారా బీమా పాలసీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత మనకు నచ్చిన పాలసీని తీసుకోవచ్చు. ఈ విధంగా బీమా పాలసీని తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం. * ముందుగా మీ ఆర్థిక అవసరాలను గుర్తించండి. మీరు మీ కుటుంబం కోసం డబ్బుల్ని పొదుపు చేస్తున్నారా? లేదా? అనేది తెలుసుకోవాలి. * మీ జీవిత కాలం ఆధారంగా మీ కుటుంబ సంరక్షణకు ఎంత మొత్తం అవసరమో ముందుగా ఒక అంచనాకు రండి. * మార్కెట్లో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్ ప్లాన్ (యులిప్స్), టర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్, సంప్రదాయ/ఎండోమెంట్ ప్లాన్ అనే మూడు రకాల ప్రాడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఏ ప్రాడక్ట్ మీకు సరిపోతుందో తెలుసుకోండి. * యూలిప్స్ అయితే రిస్క్ భరించాల్సి ఉంటుంది. అదే విధంగా అధిక రాబడి కూడా రావచ్చు. * టర్మ్ పాలసీలో అధిక రక్షణ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. * తక్కువ రిస్క్ భరించగలమనే వారికి ఎండోమెంట్ ప్లాన్ సరిపోతుంది. * ఫండ్ పనితీరు, ఫ్రీ-లుక్ గ్యారంటీ, సరెండర్ చార్జీల వంటి అంశాలను కూడా పరిగ ణనలోకి తీసుకోవాలి. * ఇన్సూరెన్స్ కంపెనీ చరిత్రతో సహా క్లెయిమ్ చెల్లింపు, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో దాని ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. -
కెనరా హెచ్ఎస్బీసీ నుంచి కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త పథకాలపై దృష్టిసారించింది. ఈ మధ్యనే చిన్న పిల్లల కోసం యులిప్ పథకం ప్రవేశపెట్టిన కంపెనీ త్వరలోనే మరో ఐదు పథకాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నాలుగు నెలల్లో రెండు టర్మ్ పథకాలతో పాటు ఒక పెన్షన్, యాన్యుటీ, ఎండోమెంట్ పథకాలను ప్రవేశపెట్టడానికి ఐఆర్డీఏకి దాఖలు చేయనున్నట్లు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ డెరైక్టర్ చిరాగ్ జైన్ మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
పేటిఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు
4 సంస్థలతో ఒప్పందం ముంబై: ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలసీదారులు ఆన్లైన్ ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యం కల్పించేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రూ.1,000 కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 15 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోగలమని వివరించింది. వినియోగదారులు సులభంగా చెల్లింపులు జరిపేలా సేవలందించడమే తమ లక్ష్యమని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి చెప్పారు. ఇక తమ 10 కోట్ల మంది నమోదిత యూజర్లు సులభంగా బీమా పాలసీల ప్రీమియమ్‌లు చెల్లించవచ్చని వివరించారు. అన్ని రకాల బిల్లు చెల్లింపులు, రీ చార్జ్‌లకు వన్ స్టాప్ షాప్‌గా పేటీఎంను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. హోటల్ అగ్రిగేషన్ సేవలను కూడా అందించడం ప్రారంభించిన ఈ సంస్థకు ఇటీవలనే ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్ లభించింది. -
ఫ్యూచర్ జెనరాలి.. ‘టోటల్ హెల్త్’ వైద్య బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ సాధారణ బీమా కంపెనీ... ఫ్యూచర్ జెనరాలి ‘టోటల్ హెల్త్’ పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వైటల్, సుప్రీం, ప్రీమియం పేర్లతో మూడు లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు వైద్య బీమాను ఈ సంస్థ అందిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్యూచర్ జెనరాలి సౌత్ జోన్ హెడ్ మాధవ ఎండ్లూర్ టోటల్ హెల్త్ పాలసీని మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఒక సంవత్సరం కాలపరిమితి నుంచి మూడేళ్ళ కాలపరిమితికి ఈ పాలసీని తీసుకోవచ్చని, అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి బీమా రక్షణ ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఒకసారి ‘టోటల్ హెల్త్’ పాలసీ తీసుకుంటే మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవిత కాలం రెన్యువల్ చేయించుకోవచ్చు. క్లెయిమ్‌లు లేకపోతే మరుసటి ఏడాది నో-క్లెయిమ్ బోనస్ కింద 50 శాతం బీమా రక్షణ మొత్తాన్ని ఇలా గరిష్టంగా 100 శాతం పెంచుతామన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ జెనరాలి ప్రీమియం ఆదాయంలో 14 శాతం వైద్య బీమా రంగం నుంచి వస్తోందని, వచ్చే మూడేళ్లలో దీన్ని 20 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతేడాది ఫ్యూచర్ జెనరాలి మొత్తం ప్రీమియం ఆదాయం రూ. 1,450 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ అయిదు రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉంది. -
ప్రీమియాన్ని బీమా సంస్థలకు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని పెద్ద మొత్తంలో తమ వద్దే దాచిపెట్టుకున్న బ్యాంకులు తక్షణమే ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆ సొమ్మును జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)కి చెల్లించాలి. కానీ కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రీమియం సొమ్మును బ్యాంకులు తమ వద్దే దాచుకుంటున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాల్లో ప్రతీ బ్యాంకు బ్రాంచీలో ఎంత ప్రీమియం సొమ్మును ఈ రకంగా దాచిపెట్టుకున్నారో వెంటనే తెలపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బ్యాంకుల ద్వారానే చెల్లించాలి... ఇప్పటివరకు పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించి బీమా సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇకనుంచి బ్యాంకు రుణాలు తీసుకోని రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియాన్ని వసూలు చేసి బీమా కంపెనీలకు చెల్లించాలని..ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త రుణాల ఆలస్యంపై అసంతృప్తి... ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును విడతల వారీగా ఇస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సారి పంట రుణాల లక్ష్యం రూ. 15 వేల కోట్లు పైగా ఉండగా... ఇప్పటివరకు 35 శాతానికి మించి రుణాలు ఇవ్వలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
ఫొటో తీస్తే... కోట్ వస్తుంది
ఐసీఐసీఐ యాప్‌లో వినూత్న సేవ ముంబై: వాహన బీమా తీసుకునేటపుడు ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ నింపటమంటే మామూలు మాటలు కాదు. వ్యక్తిగత వివరాలతో పాటు వాహనం తాలూకు వివరాలూ పూర్తిగా నింపాలి. ప్రత్యేకించి ఒక బీమా కంపెనీ నుంచి వేరొక దానికి మారాలనుకున్నపుడు... ఆ కంపెనీ ప్రీమియం ఎంతుందో తెలుసుకోవాలన్నా సరే... ఇవన్నీ నింపక తప్పదు. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో కూడా ఇవన్నీ ఉండాలా...? ఇదే ఆలోచన ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకి కూడా వచ్చింది. దీంతో పాలసీని స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీసి పంపిస్తే చాలు... కొత్త పాలసీ ప్రీమియం తాలూకు కోట్‌ను మన మొబైల్‌కే ఎస్ఎంఎస్ చేసే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ లాంబార్డ్ వాహన బీమా కావాలనుకున్నవారు ఐసీఐసీఐ మొబైల్ ఫోన్ యాప్‌లో ‘ఫొటో కోట్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయటం ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఫొటో కోట్తో పాటు ఐసీఐసీఐ మొబైల్ యాప్ ద్వారా ఆరోగ్య, వాహన, ట్రావెల్ బీమా పాలసీలను కొనుగోలు చేయటం, రెన్యువల్ చేసుకోవటం వంటివన్నీ చేయొచ్చు. దగ్గర్లోని నెట్వర్క్ ఆసుపత్రిని, ఓపీడీ కేంద్రాన్ని, పాథాలజీ లాబ్లను గుర్తించటమే కాక... వాహన బీమాకు సంబంధించి దగ్గర్లోని గ్యారేజీని కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లెయిమ్ స్థితిగతులను ట్రాక్ చేయొచ్చు కూడా. ఈ స్మార్ట్ యుగంలో కస్టమర్లకు అత్యుత్తమ సాంకేతిక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బీమాతో పేదల కుటుంబాలకు భరోసా
ఒంగోలు: ప్రధానమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రకాల పథకాలు పేదల కుటుంబాలకు అతిపెద్ద భరోసాగా నిలుస్తాయని బీమా సంస్థలే కాదు...బ్యాంకర్లూ చెబుతున్నారు. అయితే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు దృష్టి సారించడం లేదు. చాలామంది ఏదో ఒక స్కీమును వినియోగించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కనీసం రెండు బీమా పథకాలను ఉపయోగించుకున్నా ఆపద వేళల్లో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా పథకాలు అమలులోకి వస్తాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేదు. కేవలం ఫారం పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: ఇది పూర్తిగా ప్రమాద బీమా. ఈ బీమాలో సభ్యత్వం పొందాలంటే బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసంగా నెలకు రూపాయి చొప్పున ప్రతి ఏడాది ఏకమొత్తంగా రూ.12 చెల్లించాలి. ఈ మొత్తం కూడా జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. దీనికి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు అందరూ అర్హులే. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత పాలసీదారుడు మరణిస్తే అతను పేర్కొన్న నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. ఒక వేళ పాలసీదారుడు తీవ్రంగా గాయపడి ఎటువంటి పనిచేసుకోలేని నిస్సహాయ స్థితికి లోనైతే అతనికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రయోజనం ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన: ఇది పూర్తిగా జీవిత బీమా. మరణం ఏ రూపంలో సంభవించినా పాలసీదారుడు సూచించినా నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. దీనికి ఏడాదికి రూ.330లు ప్రీమియం చెల్లించాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. పాలసీ 5 వరుస సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనికి కూడా ప్రీమియం రూ.330లు ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండింటికీ ప్రీమియం చెల్లించిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు పరిహారం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన: ఇది కేవలం భవిష్యత్తులో పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన పథకం. పెన్షన్ కనీసంగా వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన తరువాతే అందుతుంది. పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతినెల రూ.42 చొప్పున చెల్లించాలి. రూ.2 వేలు పెన్షన్ పొందాలంటే రూ.84, రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ పొందాలంటే రూ.168, రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే రూ.210లు చొప్పున ప్రీమియం చెల్లించాలి. అయితే ప్రీమియం వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. అయితే వేరే పెన్షన్ సౌకర్యం పొందుతున్నవారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.1.70 లక్షలు చెల్లించడంతోపాటు పెన్షన్ కూడా ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. -
కాటన్ మరిచినందుకు 8 లక్షల ఫైన్
అహ్మదాబాద్ ఆపరేషన్ సమయంలో కడుపులో కత్తెర, కత్తులు, కాటన్, ఆ మధ్య మొబైల్ ఫోన్ మర్చిపోయి కుట్లు వేయడం.. ఆ తర్వాత లబోదిబోమంటూ బాధితులు మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగడం మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి కేసులో గుజరాత్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల కోర్టు తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ వందన, బీమా కంపెనీ పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా.. ఆపరేషన్ సమయంలో కడుపులో కాటన్ మర్చిపోయి కుట్లు వేసేసిన మహిళా డాక్టర్ (గైనకాలజిస్ట్) పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. బాధితురాలికి రూ. 8 లక్షల నష్ట పరిహారంతో పాటు, కోర్టు ఖర్చులకు గాను పదివేల రూపాయలు చెల్లించాల్సిందిగా డాక్టర్‌ను, బీమా కంపెనీని ఆదేశించింది. అహ్మదాబాద్‌కు చెందిన మితాబెన్ పాటిల్ తీవ్రమైన గైనిక్ సమస్యలతో బాధపడుతూ డాక్టర్ వందన అమిన్‌ను కలిశారు. చివరికి అక్టోబర్ 2002 లో ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించారు. దీంతో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశపడిన మితాబెన్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. అయితే ఆపరేషన్ సమయంలో పొట్టలో కాటన్ మర్చిపోయినట్టుగా పరీక్షల్లో తేలింది. చివరికి ఏడాది తర్వాత మరో ఆపరేషన్ చేసి ఆ కాటన్‌ను తొలగించారు. ఈ వ్యవహారంపై మితాబెన్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, శరీరంలోని కొన్ని అంతర్భాగాలు పాడయ్యాయని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు. 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో డాక్టర్ వందన స్థానికంగా నడుపుతున్న నర్సింగ్ హోమ్‌కు బీమా సౌకర్యం కల్పించిన కంపెనీ కూడా ఈ కేసులో ఇరుక్కుంది. వినియోగదారుల కోర్టు మితా బెన్‌కు రూ. 8 లక్షలు చెల్లించాలంటూ తీర్పుచెప్పింది. ఈ తీర్పుపై డాక్టర్ వందన, బీమా సంస్థ వినియోగదారుల వివాదాల రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కింది కోర్టు తీర్పును అభినందిస్తూ తీర్పును వెలువరించింది. ఆపరేషన్ సమయంలో అన్నీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత డాక్టర్‌కు లేదా అని ప్రశ్నించింది. ఇది డాక్టర్ నిర్లక్ష్యం కాకపోతే మరేమిటని మండిపడింది. ఆపరేషన్ సమయంలో రోగి కడుపులో ఏదైనా మర్చిపోతే అది...కచ్చితంగా డాక్టర్ అశ్రద్ధ కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. మొత్తం 12 ఏళ్లకు గాను 8 లక్షల రూపాయలకు తొమ్మిది శాతం వడ్డీని కలిపి చెల్లించాలని పేర్కొంది. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడమే కాకుండా.. బాధితురాలిని కోర్టు కీడ్చినందుకు మరో పదివేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. -
బజాజ్ అలయంజ్ జీఐ లాభం రూ.562 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ బజాజ్ అలయంజ్ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సర నికర లాభంలో 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఏడాది రూ. 962 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించినప్పటికీ రూ. 562 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. జమ్మూ కశ్మీర్ వరదలు, హుద్ హుద్ తుపాన్ వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మరీ ఈ లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ సీఈవో తపన్ సింఘల్ తెలిపారు. ఈ ఏడాది కాలంలో పరిశ్రమ 10 శాతం వృద్ధిని నమోదు చేస్తే బజాజ్ అలయంజ్ 16 శాతం వృద్ధితో రూ. 5,305 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
ఆదుకోని ‘ఆపద్బంధు’
అర్హులకు మొండి చెయ్యి మండలాల నుంచి అలస్యంగా రిపోర్టులు కాలపరిమితి ముగియడంతో అందని సహాయం నిధుల కోసం దరఖాస్తుదారుల నిరీక్షణ జిల్లాకు ఈ ఏడాది నిధులు వచ్చేనా..? ఖమ్మం జెడ్పీసెంటర్: నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించాల్సిన ఆపద్బందు పథకం అందకుండా పోతోంది. ప్రమాదవశాత్తు వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం బీమా కంపెనీ సహాయంతో ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలి. అయితే లేనిపోని నిబంధనల పేరుతో పలు దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు ఇన్సూరెన్స్ కంపెనీలు సవాలక్ష తిరకాసులు పెట్టడం, మండల కార్యాలయాల నుంచి అందాల్సిన నివేదికలు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఈ పథకం ప్రారంభం నుంచీ అనేక మంది అర్హులకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు కాళ్లరిగే లా తిరిగినా ఎలాంటి ఫలతం లేకుండా పోయింది. 2012-2013 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా 22 మంది అర్హులకు సహాయం అందాల్సి ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ లావాదేవీల్లో భాగంగా ఇప్పటి వరకు ఆ నిధులు అందలేదని సమాచారం. ఇటీవల కాలంలో ప్రభుత్వం బీమా కంపెనీతో సంబంధం లేకుండా జిల్లాకు 200 మంది లబ్ధిదారులకు కలెక్టర్ నేరుగా ఈ సహాయం అందించేలా వెసులుబాటు కల్పించింది. 2013 -14కు సంబంధించి ఇప్పటి వరకు 55 మందికిపైగా అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయినా ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కదలని ఫైళ్లు... పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో మరణించిన వ్యక్తులకు సంబంధించి ఎంక్వయిరీ రిపోర్టులు అందించడంలో మండలాధికారులు అలసత్వం వహించడంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. మండలాధికారులు విచారణ జరిపి ఆ నివేదికను రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపుతారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌కు పంపిస్తారు. మండలాలు, డివిజన్ కార్యాలయాల్లో నెలల తరబడి ఫైళ్లు కదలకపోవడంతో చివరికి అనర్హులుగా మిగలాల్సి వస్తోంది. పేదలకు రాజకీయ నాయకుల అండ లేకపోవడం, పలుకుబడి గల వారికే ఈ పథకం అందడం, కాసులు సమర్పించనిదే కార్యాలయాల్లో ఫైలు కదలకపోవడంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సామాన్య ప్రజలు మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పథకం ఉద్దేశం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం నియమ నిబంధనలతో అర్హులందరికీ అందకపోగా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజులతరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదలకు సంబంధించి 16 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిపై ఆధారపడే కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి. వీరు అర్హులు .. ప్రమాదవశాత్తు మరణించినా, వరదల్లో కొట్టుకుపోయినా, పిడుగుపాటుకు గురై మృతి చెందినా, చెట్టు, బిల్డింగ్ పైనుంచి పడి మృతిచెందినా, నక్సలైట్ల చేతిలో మరణించినా, అగ్నిప్రమాదంలో మృతి చెందినా, పాముకాటు, కరెంట్‌షాక్‌తో మృతి చెందినా వారి కుటుంబసభ్యులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలి. కావాల్సిన సర్టిఫికెట్లు... ఈ పథకం వర్తించాలంటే దరఖాస్తుతో పాటు తెల్లరేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. మొదట ఐదు రకాల సర్టిఫికెట్లను 4 సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు ఆపద్బంధు దరఖాస్తు పూర్తి చేసి తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుతుంది. ఈ ఏడాది నిధులు వచ్చేనా... ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ నుంచి ఏడాదిపాటు ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. కానీ ఈ ఏడాది అర్హులకు ప్రభుత్వం నేరుగా స హాయం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఏడాదికి జిల్లాలో 200 మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని, అందుకోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జిల్లాకు రూ.20 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవికూడా ఇప్పటి వరకు జిల్లాకు అందలేదు. ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారు. -
సులభంగా క్లెయిమ్
బీమా కంపెనీ పనితీరును గుర్తించడంలో క్లెయిమ్‌ల పరిష్కారం అనేది చాలా ప్రధానమైనది. అందుకే ఇప్పుడు బీమా కంపెనీలు త్వరితగతిన క్లెయిమ్ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి చికాకులు లేకుండా సులభంగా క్లెయిమ్ మొత్తం పొందొచ్చు. క్లెయిమ్ సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను తెలుసుకుందాం... కంపెనీకి తెలియ చేయడం క్లెయిమ్‌లో అత్యంత కీలకమైన, ముఖ్యమైన అంశం ఏమిటంటే..పాలసీదారుడి మరణానికి సంబంధించిన వార్త బీమా కంపెనీకి తెలియచేయడమే. అప్పటి నుంచే క్లెయిమ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సాధ్యమైనంత తొందరగా కంపెనీ కార్యాలయంలో కాని లేదా ఈ మెయిల్ ద్వారా కాని వివరాలను చెప్పొచ్చు. పాలసీదారుని పేరు, పాలసీ నంబర్, మరణం సంభవించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్ కోరుతున్నవారి వివరాలన్నీ తెలియచేయాలి. ఇవన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇవి అందితేనే క్లెయిమ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇవి జత చేయాలి.. ప్రాథమికంగా క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి తెలియచేసిన తర్వాత అధికారికంగా క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తును పూర్తి చేసి దానిని ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌తో బీమా కంపెనీకి అందచేయాలి. వీటితో పాటు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధుృవీకరణ పత్రంతో పాటు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తున్న నామినీ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. జత చేసే జిరాక్స్ కాపీలన్నీ కనీసం ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించాలి. సాధారణంగా బీమా కంపెనీకి ఈ వివరాలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌ను బట్టి అదనపు సమాచారాన్ని అడుగుతాయి. కాలపరిమితి ఉందా? క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు కాని ఆలస్యం కాకుండా ఉండాలంటే ఎంత తొందరగా క్లెయిమ్ చేసుకుంటే అంత తొందరగా పూర్తవుతుంది. కాని క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 30 రోజుల్లో క్లెయిమ్‌ను పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యం అయితే దానికి గల కారణాలను తెలియచేయాలని ఐఆర్డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఒక వేళ బీమా కంపెనీ సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ పరిష్కారం చేయడంలో ఆలస్యం చేస్తే ఐఆర్డీఏకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్)ను సంప్రదించవచ్చు. లేదా పాలసీదారుడు వినియోగదారుల ఫోరం, కోర్టు, అంబుడ్స్‌మన్‌లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. -
స్త్రీ కన్నీళ్లు వర్సెస్ ఇస్త్రీ పెట్టె!
ఉత్త(మ)పురుష ‘‘సరే నువ్వు కోరినట్టే గోల్డ్ చైన్ ఇప్పిస్తా గానీ ఇక ఆ నల్లా కట్టేయ్. ఎప్పుడూ రెడీగా ఉంటుంది నెత్తి మీద కుళాయి. ఈ కుళాయి ఉందని మీకు మహా బడాయి. అందుకే చిన్న మాట అన్నా సరే... ట్యాప్ విప్పేస్తుంటారు. టాప్ లేపేస్తుంటారు’’ కాస్త చీవాట్లు పెడుతున్న ధోరణిలో అన్నారాయన. ‘‘మీరు బంగారం ఇప్పించకపోయినా పర్లేదు. కానీ వెటకారంగా మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు నా కన్నీళ్ల కుళాయి మీ ఎగతాళికే’’ అన్నాను వెక్కుతూ. ఆత్మాభిమానం మగాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని నాకు మా ఆయన మాటల్లో చాలాసార్లు అర్థమైంది. మనం ఏదో గోముగా అడుగుతామా? వెంటనే వాళ్లు ఖండించేస్తారు. మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. అడిగింది ఇవ్వనందుకు మనం ఏడుస్తున్నామని వాళ్లనుకుంటారు. కానీ మన కన్నీళ్లు అది దక్కనందుకు కాదు. అనగానే మాట కాదన్నందుకు. కాదనేలా మాట పడినందుకు. ఈ విషయం ఈ మగాళ్లకు ఎందుకు అర్థం కాదు? అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆ మధ్య బంగారం తులం ముఫ్ఫై రెండు వేల నుంచి అకస్మాత్తుగా ఇరవై ఐదువేలకు పడిపోయింది. ఇదే టైమ్‌లో ఓ యాభై వేలు అప్పు చేసైనా రెండు తులాల గోల్డ్ చైన్ తీసుకుంటే దాదాపు పదిహేను వేలు ఆదా అవుతుంది. భవిష్యత్తులో రేటు పెరిగితే అప్పుడు బంగారం కొనలేకపోయామే అన్న బాధా తప్పుతుంది. ఇది నా ఆలోచన. ఇదే విషయం చెప్పీ చెప్పగానే ఆయన డెలివరీ చేసిన డైలాగ్లన్నమాట అవి! మాటకు మాట జవాబిచ్చాను కానీ నాకు తెలియకుండానే దొర్లిపోయాయి కన్నీళ్లు. ఇలా ఏడుపుకు దిగినప్పుడల్లా ఆయన అనే మాట ఒక్కటే. ‘‘దేన్నెనా మీ ఆడాళ్లు ఏడ్చి సాధించగలరోయ్’’ అని. మా ఏడుపు ఎవరినో సాధించి, ఏదో సాధించుకుందామని కాదనీ, ఆత్మాభిమాన సాధన కోసమేనని ఈ మగాళ్లకు ఎప్పుడర్థమవుతుందో ఏమో?! ఎక్కడ అప్పు చేశారో, ఎలా సంపాదించారోగానీ... ఓ రెండు తులాల చైన్ చేయించి తెచ్చి, ‘‘నువ్వు కోరినట్టే చైన్ తెచ్చా... నవ్వు లేదు! గోల్డు తెచ్చినా బోల్డు ఆనందమేమీ కనిపించడం లేదేమిటోయ్’’ అన్నారు. ‘‘చెప్పాగా మహానుభావా... నా కోరిక గొలుసుల కోసం కాదు. తళుకుల కోసం కాదు. అయినా... మీరు వేడి బండలా మండిపోతుంటారు. మా కన్నీళ్లు దానిపై పడితే సుయ్‌మంటూ ఆవిరే. మీరేదో కోపంతో కాలిపోతూ కూడా మాకు ఉపకారం చేస్తున్న ఇస్త్రీ పెట్టెలా పోజెడతారు. ముక్కు మీది నుంచి జారే చెమటైనా, కళ్ల నుంచి కారే కన్నీరైనా ఇస్త్రీ మీద పడ్డా సుయ్‌మంటూ ఇగిరిపోవాల్సిందే కదా. లోహపురుషుల దగ్గర ఇక నవ్వెక్కడా, ఆనందమెక్కడా’’ అంటూ దెప్పిపొడిచా. మొన్న ఒకరోజు ఆయనకు ఛాతీనొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆయనకు బాధతో చెమటలు పడితే, నాకు ఆందోళనతో చెమటలు పట్టాయి. ఆయన ఆయాసపడితే నేను ప్రయాసపడ్డా. అదేదో కార్పొరేట్ ఆసుపత్రి. ఇన్‌పేషెంట్‌గా చేర్చాలంటే ముందుగానే అడ్వాన్సుగా డబ్బు కట్టాలట. ఫస్టొచ్చాక కాసు కళ్లపడేది మళ్లీ ఫస్టుకే. నెల చివర్లో అంత డబ్బంటే ఎలా? అందుకే ఆపదలో ఆయన తెచ్చిన గోల్డు చైనే అక్కరకొచ్చింది. ‘‘నీ గోల్డు చైను ఇన్సూరెన్సు కంపెనీ బాగా పనికొచ్చిందోయ్’’ అంటూ ఓ కాంప్లిమెంటు పడేశారు మా సారూ, శ్రీవారూ. నిజం చెబుతున్నా... ఆయాసం వచ్చినప్పుడు లేదూ... ఆసుపత్రిలో చేర్చినప్పుడు లేదూ... డిశ్చార్జి అయి ఇంటికొచ్చాక నిశ్చింత ధ్వనిస్తూ అన్న ఆ మాటతో అప్పుడొచ్చాయి కన్నీళ్లు. -
బీమాలో నామినీ ఉండాల్సిందే...
జీవిత బీమా తీసుకునే వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ తదనంతరం బీమా ప్రయోజనం ఎవరికి అందాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. పాలసీదారుని మరణానంతరం ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే జీవిత బీమా ముఖ్యోద్దేశం. అందుకే, బీమా పత్రాలు నింపేటపుడు నామినీ వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. పాలసీలో నామినీలను పేర్కొనకపోతే బీమా మొత్తాన్ని పొందడానికి పాలసీదారుని కుటుంబ సభ్యులు ఎన్నో ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. కోర్టులు జారీచేసే వారసత్వ సర్టిఫికెట్ తీసుకురమ్మని బీమా కంపెనీలు కోరతాయి. ఈ సర్టిఫికెట్‌ను పొందడం అంత సులువు కాదు. అందుకే, బీమా ప్రపోజల్ ఫారంలోనే నామినీ(ల)ను స్పష్టంగా రాస్తే సరిపోతుంది. నామినీ అంటే... తన తదనంతం బీమా సొమ్ము ఎవరికి అందాలని పాలసీదారు ప్రతిపాదిస్తాడో ఆ వ్యక్తినే నామినీ అంటారు. నామినీ పూర్తి వివరాలను, పాలసీదారునితో ఆ వ్యక్తి బంధుత్వాన్ని ప్రపోజల్ ఫారంలో స్పష్టంగా పేర్కొనాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే... పాలసీదారునికి నామినీ చట్టపరంగా వారసుడు/ వారసురాలు అయి ఉండాలి. లేదంటే నామినేషన్ చెల్లదు. చట్టం ప్రకారం పాలసీదారుని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు నామినేషన్‌కు అర్హులు. ఒకవేళ నామినీ మైనర్ అయితే అతనికి/ ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు కస్టోడియన్‌ను నియమించాలి. గుర్తుంచుకోవాల్సినవి... * పాలసీ గురించి, నామినేషన్ గురించి నామినీకి, కుటుంబ సభ్యులకు తెలపాలి. తద్వారా, పాలసీదారు లేనపుడు వారు అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. * పాలసీ కాలపరిమితి ముగిసేలోపు నామినీ దురదృష్టవశాత్తూ మరణిస్తే బీమా కంపెనీని సంప్రదించి కొత్త నామినీని పేర్కొనాలి. * ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో నామినీలుంటే వ్యవహారం సహజంగానే సంక్లిష్టమవుతుంది. కొన్నిసార్లు న్యాయ వివాదాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా సొమ్మును ఒక నామినీకే ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తాయి. అందుకుగాను సదరు నామినీ మిగిలిన నామినీల నుంచి అంగీకారాన్ని పొందాల్సి ఉంటుంది. మిగిలిన నామినీలు అంగీకారం తెలిపే సమయంలో వివాదాలు ఏర్పడుతుంటాయి. -
ధీమా ఇవ్వని బీమా
సత్తుపల్లి : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోకుండా ఉండేందుకు బ్యాంకర్లు ‘ పంటల బీమా- రైతుకు ధీమా’ నినాదంతో కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కింద వసూలు చేశారు. అయితే పరిహారం ఇవ్వడం మాత్రం మరిచారు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో మూడు లక్షల ఎకరాలలో వరిసాగు చేశారు. ఇందులో సుమారు 30 వేల ఎకరాలలో బెరుకులు(తాలు) వచ్చి అన్నదాత కుదేలయ్యాడు. పంట నష్టం వాటిల్లిన ఆ పొలాలను అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు పరిశీలించారు. పంటల బీమా పథకం కింద రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీలు గుప్పించారు. నష్టపోయిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని, రైతుల పట్ల అధికారులు సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అయితే ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందక పోవటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను, తెగుళ్ల దెబ్బకు పంటలకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇచ్చే సమయంలో రూ.100కు రూ.2.50 పైసలు ఇన్సూరెన్స్ కింద బ్యాంకర్లు వసూలు చేశారు. వీటిని జాతీయ వ్యవసాయ పథకం కింద ఇన్సూరెన్స్‌కు పంపిస్తామని, పంటలు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ వర్తింస్తుందని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఎలాంటి పరిహారమూ చెల్లించకపోవడంతో దానికోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నష్ట పరిహారం అంచనాలిలా.. ప్రతి ఏడాది 500 ఎకరాల్లో ఎనిమిది చోట్ల రెవెన్యూ శాఖకు చెందిన సహాయ గణాంక అధికారి (ఎఎస్వో) పంటకోత ప్రయోగాలు చేపట్టి నమూనాలను సేకరిస్తారు. ఒక ఎకరంలో ఐదు సెంట్ల పంట కుప్పనూర్చి ఎంత దిగుబడి వచ్చిందో ఎకరంతో కలిపి లెక్కిస్తారు. 6 కేజీల పైనవస్తే పంట బాగా పండినట్లే.. లోపు వస్తే పంట దిగుబడి తగ్గినట్లుగా భావిస్తారు. ఆ నివేదికను చీఫ్ డ్రాయింగ్ అధికారి ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే.. అక్కడ నుంచి నేరుగా నష్టపరిహారం రైతుల ఖాతాలో చేరుతుంది. అయితే ఇన్సూరెన్స్ చెల్లించేటప్పడు రెండేళ్ల నుంచి పంటల పరిస్థితిని పరిశీలిస్తారు. వరికి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే మొక్కజొన్నకు మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలను చేపడతారు. మామిడి పంటలకూ అతీగతీ లేదు.. జిల్లాలో 48 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మూడేళ్ల నుంచి వరుసగా పంటలు దెబ్బతింటున్నా.. అధికారులు తమను పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద మామిడి చెట్టుకు రూ.46, చిన్న చెట్టుకు రూ.36 చొప్పున ఇన్సూరెన్స్ వసూలు చేశారని, ఎకరాకు 40 చెట్లకు రూ.1800 చెల్లించామని వారు చెపుతున్నారు. అయితే 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే నష్ట పరిహారం వస్తుందని, ఇది రిఫరల్ వెదర్ స్టేషన్లో నమోదు కావాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని అధికారులు అంటున్నారు. ఇలా అనేక నిబంధనలు విధించి ప్రభుత్వం, బ్యాంకు అధికారులు తమకు మొండిచేయి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
బీమా లబ్ధి మరింత వృద్ది ...
పాలసీదారుల ప్రయోజనాలు, హక్కులకు మరింత పెద్దపీట వేస్తూ జీవిత బీమా పాలసీల్లో కీలకమైన మార్పులు జరిగాయి. ఇందుకోసం బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) ఇప్పటి వరకు ఉన్న పాత పాలసీలను రద్దు చేయడమే కాకుండా కొత్త నిబంధనలతో కూడిన పథకాలను విక్రయించాల్సిందిగా బీమా కంపెనీలను ఆదేశించింది. ఈ మార్పులు ఇప్పటికే తీసుకున్న పాత పాలసీల ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతాయి. ఇక నుంచి కొత్తగా తీసుకునే పాలసీల్లో మాత్రం ఈ అదనపు ప్రయోజనాలుంటాయి. ఐఆర్డీఏ చేసిన ఈ మార్పులు పాలసీదారులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం... గత నాలుగేళ్లలో జీవిత బీమా రంగంలో సమూలమైన మార్పులు జరిగాయి. 2010లో యూనిట్ ఆధారిత బీమా పథకాల్లో చేసిన మార్పులు మంచి ఫలితాలను ఇవ్వడంతో వీటిని సంప్రదాయ బీమా పాలసీలకు కూడా వర్తింపచేశారు. బీమా పథకాల్లో పూర్తి పారదర్శకతను తీసుకు రావడమే కాకుండా పాలసీదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ మార్పులను చేశారు. ఇప్పుడు ప్రతీ బీమా కంపెనీ కొత్త నిబంధనలతో కూడిన పాలసీలనే విక్రయించాల్సి ఉంటుంది. జీవిత బీమా పథకాల్లో ఐఆర్డీఏ చేసిన కొన్ని కీలక మార్పులు వాటి ప్రయోజనాలు చూద్దాం... అధిక బీమా రక్షణ.. తక్కువ ప్రీమియం చెల్లింపుతో ఎక్కువ బీమా రక్షణ కల్పించే విధంగా కొత్త నిబంధనలను సూచించారు. ఇక నుంచి అన్ని జీవిత బీమా పాలసీలు చెల్లించే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు తక్కువ కాకుండా బీమా రక్షణ కల్పించాలి. ఈ నిబంధన 45 ఏళ్ల లోపు పాలసీలు తీసుకున్న అందరికీ వర్తిస్తుంది. ఉదాహరణకు 45 ఏళ్లలోపు వ్యక్తి ఏటా ప్రీమియం కింద రూ.50,000 చెల్లిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ బీమా కంపెనీ కనీసం రూ. 5 లక్షల బీమా రక్షణను కల్పించాల్సి ఉంటుంది. గతంలో ఇటువంటి నిబంధన ఏమీ లేకపోవడంతో కొన్ని పథకాలతో అతి తక్కువ బీమా రక్షణ లభించేది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో తక్కువ ప్రీమియం చెల్లింపు ద్వారా బీమా ముఖ్య ఉద్దేశమైన అధిక బీమా రక్షణ లభిస్తోంది. అధిక సరెండర్ వేల్యూ.. కొత్త నిబంధనల్లో పాలసీదారునికి మరింత లబ్ధి చేకూర్చే వాటిల్లో సరెండర్ వేల్యూని పెంచడం ఒకటి. బీమా అనేది పాలసీదారుడు, బీమా కంపెనీ మధ్య జరిగే దీర్ఘకాలిక ఒప్పందం. కొన్ని సందర్భాల్లో పాలసీదారులు పాలసీ కాలపరిమితి తీరకుండానే మధ్యలో వైదొలగాల్సి వస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో పాత నిబంధనల ప్రకారం చెల్లించిన ప్రీమియం కంటే చాలా తక్కువ మొత్తం చేతికి వచ్చేది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏటా లక్ష రూపాయలు చొప్పున 14 ఏళ్లు ప్రీమియం చెల్లించాడనుకుందాం. ఇప్పుడతను 15వ ఏట మరో లక్ష చెల్లించాల్సి ఉంది. కాని అతనికి నగదు అత్యవసరం అవడంతో పాలసీ ఇక కొనసాగించలేని పరిస్థితి ఏర్పడి పాలసీని రద్దు (సరెండర్) చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కనుక అతను పాలసీని సరెండర్ చేస్తే చెల్లించిన రూ.14 లక్షల్లో 90 శాతం అంటే రూ.12.6 లక్షలు తప్పకుండా వస్తాయి. అదే పాత నిబంధనల ప్రకారం రూ. 3.9 లక్షలు మించి వచ్చే పరిస్థితి లేదు. అలాగే తక్కువ ప్రీమియంలు చెల్లించి వైదొలిగే వారికి కూడా సరెండర్ విలువ పెరిగింది. పాలసీ తీసుకున్న నాలుగేళ్లలోపు వైదొలిగితే చెల్లించిన ప్రీమియంలో 30 శాతం, అదే నాలుగు నుంచి ఏడేళ్ల లోపు అయితే 50 శాతం సరెండర్ వేల్యూ లభిస్తుంది. కాలపరిమితిని బట్టి కమీషన్ ఏజెంట్ల కమీషన్‌ను పాలసీ కాలపరిమితితో ముడిపెట్టడం కీలక మార్పుల్లో మరో ముఖ్యమైన అంశం. ఏజెంట్లు సాధ్యమైనంత వరకు దీర్ఘకాలిక పాలసీలనే విక్రయించడానికి ప్రోత్సహించే విధంగా ఐఆర్డీఏ ఈ నిబంధనను తీసుకుంది. దీని ప్రకారం తక్కువ కాలపరిమితి గల పథకాలకు కమీషన్లను తగ్గించి, దీర్ఘకాలిక పథకాల్లో పెంచింది. దీని వల్ల ఏజెంట్లు కమీషన్ల కోసం తక్కువ కాలపరిమితి గల పాలసీలను విక్రయించడం, ఆ తర్వాత వాటిని సరెండర్ చేయడం తగ్గుతుంది. అంతే కాకుండా ఏజెంట్లు కమీషన్ల కోసం కాకుండా పాలసీదారుల అవసరాలకు తగిన పథకాలను విక్రయించే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం దేశీయ జీవిత బీమా పరిశ్రమ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఐఆర్డీఏ కొత్త నిబంధనలు పాలసీదారులకు అధిక ప్రయోజనాన్ని చేకూరుస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక పథకాలను విక్రయించే విధంగా చేస్తుందనడంలో సందేహంలేదు. మొత్తానికి ఈ మార్పులు జీవిత బీమా రంగ వృద్ధికి దోహదం చేసేవేనని చెప్పొచ్చు. -
నేడో.. రేపో
సాక్షి ప్రతినిధి, కడప: అన్నదాతల ఆశలు నెరవేరనున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంటల బీమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. జిల్లాలోని 39వేల మంది రైతన్నలకు రూ.52 కోట్లు రేపోమాపో అందనుంది. వ్యవసాయ జూదంలో అలసిపోయిన రైతన్నలకు ఆలస్యంగానైనా పంటల బీమా బ్యాంకు ఖాతాలలో జమ కానుంది. జిల్లాలో 2011-12 సంవత్సరానికి సంబంధించి 76,050 హెక్టార్లలో శనగ పంటను సాగుచేసిన 38,200 మంది రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అలాగే 915 హెక్టార్లలో ఉల్లి సాగుచేసిన 855 మంది రైతులు కూడా ప్రీమియం చెల్లించారు. కరవు పరిస్థితుల కారణంగా అన్నదాతలకు పంటలు చేతికి అందకుండా పోయాయి. పంటల బీమా అయినా ఆదుకుంటుందని ఆశించారు. వివిధ కారణాల వల్ల పంటల బీమా రైతులకు అందకుండా పోయింది. చివరకు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఐదుగురి ప్రతినిధుల సంతకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. సీఎండీ సంతకం కూడా గురువారానికి పూర్తవుతుందని ఎల్ఐసీ జనరల్ మేనేజర్ నాగార్జున ‘సాక్షి ప్రతినిధి’కి ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 92 కోట్ల బీమా అందాల్సి ఉండగా వైఎస్సార్ జిల్లా రైతాంగానికే రూ.52 కోట్లు అందనుందని ఆయన తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతాంగానికి పంటల బీమా విడుదల ఊరటనిచ్చే అంశమని ఆయన తెలిపారు. వైఎస్ అవినాష్ కృషి ప్రశంసనీయం పంటల బీమా విడుదల కావడంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని రైతులు పేర్కొంటున్నారు. బీమా విషయమై జనరల్ మేనేజర్ నాగార్జునతో ఫోన్లో మాట్లాడటంతో పాటు పలుమార్లు స్వయంగా చర్చించారు. విషయాన్ని కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పంటల బీమా ఫైల్‌కు కదలిక వచ్చిందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కాగా శుక్రవారం సీఎండీ సంతకం చేయనున్న నేపథ్యంలో రైతుల పక్షాన అవినాష్‌రెడ్డి చేసిన పోరాటానికి ఫలితం దక్కనుంది. -
బీమా పేరిట టోకరా..
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రముఖ బీమా కంపెనీ పేరుతో ఓ బోగస్ సంస్థ కార్యాలయం తెరిచింది. జనాన్ని నమ్మించి డబ్బులు వసూలు చేసింది. బాండ్లు ఇవ్వమంటే నీళ్లు నములుతుండడంతో పాలసీదారులు నిలదీశారు. దీంతో బోగస్ సంస్థ గుట్టురట్టు అయింది. రెక్కల కష్టం దోచుకుపోయారని బాధితులు లబోదిబోమంటున్నారు. తాండూరు పట్టణ డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ఓ భవనంలో ఓ ప్రముఖ కార్పొరెట్ కంపెనీ పేరుతో ఈ ఏడాది మార్చి నెలలో కార్యాలయం తెరిచారు. కంపెనీ ప్రధాన బ్రాంచ్‌లు కాకినాడ, సామర్లకోటలో ఉన్నట్లు జనాన్ని నమ్మబలికారు. కార్యాలయంలో సుమారు 10 మంది వరకు పని చేస్తున్నారు. పథకం ప్రకారం ముందుగా తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మధ్య తరగతి, ఆపై స్థాయి వారికి ఫోన్లు చేశారు. 1000 మంది లక్కీ డ్రాలో మీ ఫోన్ నంబర్ ఎంపికైందని, మా కంపెనీ యాజమాన్యం మీకు ఉచితంగా రూ.లక్ష విలువ గల బీమా బాండ్‌ను ఇస్తుందని నమ్మబలుకుతారు. కార్యాలయానికి సతీసమేతంగా వచ్చి బాండ్ తీసుకువెళ్లాలని వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన జనానికి ఓ గంటపాటు బీమా పాలసీల గురించి వివరించి వారు ఏదో ఓ పాలసీలో చేరేలా చేస్తున్నారు. పాలసీని బట్టి ఒక్కొక్కరి దగ్గర రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నట్లు ఓ రశీదు కూడా ఇచ్చి వారం రోజుల తర్వాత వచ్చి రూ.లక్ష ఉచిత పాలసీ బాండ్‌తో పాటు, డబ్బులు చెల్లించిన బీమా పాలసీ బాండ్‌ను తీసుకెళ్లాలని చెప్పసాగారు. ఇలా పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 15 లక్షలు వసూలు చేశారు. పాలసీదారులకు బాండ్లు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో పలువురు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పటణంలోని దోబీ గల్లీకి చెందిన ఇడ్లీ బండి నడుపుకొనే శ్రీనివాస్ తన పేరుమీద, భార్య పేరు మీద రెండు పాలసీలు చేసి రూ.70 వేలు చెల్లించాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా బాండ్లు ఇవ్వకపోవడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కార్యాలయం మీద దాడిచేసి కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. పలు ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ చెప్పారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ బోగస్ కంపెనీ మూలాలను వెతికి పట్టుకుని త్వరలోనే సంబంధీకులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా బాధితులు లబోదిబోమంటున్నారు. పాలసీదారులకు న్యాయం చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.