బీమా లబ్ధి మరింత వృద్ది ...
పాలసీదారుల ప్రయోజనాలు, హక్కులకు మరింత పెద్దపీట వేస్తూ జీవిత బీమా పాలసీల్లో కీలకమైన మార్పులు జరిగాయి. ఇందుకోసం బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) ఇప్పటి వరకు ఉన్న పాత పాలసీలను రద్దు చేయడమే కాకుండా కొత్త నిబంధనలతో కూడిన పథకాలను విక్రయించాల్సిందిగా బీమా కంపెనీలను ఆదేశించింది. ఈ మార్పులు ఇప్పటికే తీసుకున్న పాత పాలసీల ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతాయి. ఇక నుంచి కొత్తగా తీసుకునే పాలసీల్లో మాత్రం ఈ అదనపు ప్రయోజనాలుంటాయి. ఐఆర్‌డీఏ చేసిన ఈ మార్పులు పాలసీదారులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
గత నాలుగేళ్లలో జీవిత బీమా రంగంలో సమూలమైన మార్పులు జరిగాయి. 2010లో యూనిట్ ఆధారిత బీమా పథకాల్లో చేసిన మార్పులు మంచి ఫలితాలను ఇవ్వడంతో వీటిని సంప్రదాయ బీమా పాలసీలకు కూడా వర్తింపచేశారు. బీమా పథకాల్లో పూర్తి పారదర్శకతను తీసుకు రావడమే కాకుండా పాలసీదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ మార్పులను చేశారు. ఇప్పుడు ప్రతీ బీమా కంపెనీ కొత్త నిబంధనలతో కూడిన పాలసీలనే విక్రయించాల్సి ఉంటుంది. జీవిత బీమా పథకాల్లో ఐఆర్‌డీఏ చేసిన కొన్ని కీలక మార్పులు వాటి ప్రయోజనాలు చూద్దాం...
అధిక బీమా రక్షణ..
తక్కువ ప్రీమియం చెల్లింపుతో ఎక్కువ బీమా రక్షణ కల్పించే విధంగా కొత్త నిబంధనలను సూచించారు. ఇక నుంచి అన్ని జీవిత బీమా పాలసీలు చెల్లించే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు తక్కువ కాకుండా బీమా రక్షణ కల్పించాలి. ఈ నిబంధన 45 ఏళ్ల లోపు పాలసీలు తీసుకున్న అందరికీ వర్తిస్తుంది. ఉదాహరణకు 45 ఏళ్లలోపు వ్యక్తి ఏటా ప్రీమియం కింద రూ.50,000 చెల్లిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ బీమా కంపెనీ కనీసం రూ. 5 లక్షల బీమా రక్షణను కల్పించాల్సి ఉంటుంది. గతంలో ఇటువంటి నిబంధన ఏమీ లేకపోవడంతో కొన్ని పథకాలతో అతి తక్కువ బీమా రక్షణ లభించేది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో తక్కువ ప్రీమియం చెల్లింపు ద్వారా బీమా ముఖ్య ఉద్దేశమైన అధిక బీమా రక్షణ లభిస్తోంది.
అధిక సరెండర్ వేల్యూ..
కొత్త నిబంధనల్లో పాలసీదారునికి మరింత లబ్ధి చేకూర్చే వాటిల్లో సరెండర్ వేల్యూని పెంచడం ఒకటి. బీమా అనేది పాలసీదారుడు, బీమా కంపెనీ మధ్య జరిగే దీర్ఘకాలిక ఒప్పందం. కొన్ని సందర్భాల్లో పాలసీదారులు పాలసీ కాలపరిమితి తీరకుండానే మధ్యలో వైదొలగాల్సి వస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో పాత నిబంధనల ప్రకారం చెల్లించిన ప్రీమియం కంటే చాలా తక్కువ మొత్తం చేతికి వచ్చేది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏటా లక్ష రూపాయలు చొప్పున 14 ఏళ్లు ప్రీమియం చెల్లించాడనుకుందాం. ఇప్పుడతను 15వ ఏట మరో లక్ష చెల్లించాల్సి ఉంది.
కాని అతనికి నగదు అత్యవసరం అవడంతో పాలసీ ఇక కొనసాగించలేని పరిస్థితి ఏర్పడి పాలసీని రద్దు (సరెండర్) చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కనుక అతను పాలసీని సరెండర్ చేస్తే చెల్లించిన రూ.14 లక్షల్లో 90 శాతం అంటే రూ.12.6 లక్షలు తప్పకుండా వస్తాయి. అదే పాత నిబంధనల ప్రకారం రూ. 3.9 లక్షలు మించి వచ్చే పరిస్థితి లేదు. అలాగే తక్కువ ప్రీమియంలు చెల్లించి వైదొలిగే వారికి కూడా సరెండర్ విలువ పెరిగింది. పాలసీ తీసుకున్న నాలుగేళ్లలోపు వైదొలిగితే చెల్లించిన ప్రీమియంలో 30 శాతం, అదే నాలుగు నుంచి ఏడేళ్ల లోపు అయితే 50 శాతం సరెండర్ వేల్యూ లభిస్తుంది.
కాలపరిమితిని బట్టి కమీషన్
ఏజెంట్ల కమీషన్‌ను పాలసీ కాలపరిమితితో ముడిపెట్టడం కీలక మార్పుల్లో మరో ముఖ్యమైన అంశం. ఏజెంట్లు సాధ్యమైనంత వరకు దీర్ఘకాలిక పాలసీలనే విక్రయించడానికి ప్రోత్సహించే విధంగా ఐఆర్‌డీఏ ఈ నిబంధనను తీసుకుంది. దీని ప్రకారం తక్కువ కాలపరిమితి గల పథకాలకు కమీషన్లను తగ్గించి, దీర్ఘకాలిక పథకాల్లో పెంచింది. దీని వల్ల ఏజెంట్లు కమీషన్ల కోసం తక్కువ కాలపరిమితి గల పాలసీలను విక్రయించడం, ఆ తర్వాత వాటిని సరెండర్ చేయడం తగ్గుతుంది. అంతే కాకుండా ఏజెంట్లు కమీషన్ల కోసం కాకుండా పాలసీదారుల అవసరాలకు తగిన పథకాలను విక్రయించే అవకాశం పెరుగుతుంది.
ప్రస్తుతం దేశీయ జీవిత బీమా పరిశ్రమ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఐఆర్‌డీఏ కొత్త నిబంధనలు పాలసీదారులకు అధిక ప్రయోజనాన్ని చేకూరుస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక పథకాలను విక్రయించే విధంగా చేస్తుందనడంలో సందేహంలేదు. మొత్తానికి ఈ మార్పులు జీవిత బీమా రంగ వృద్ధికి దోహదం చేసేవేనని చెప్పొచ్చు.