life insurance policy
-
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని ఎత్తివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రద్దు డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నిరసన చేపట్టారు. ‘పన్ను ఉగ్రవాదం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాందీతో పాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం ఎంపీలు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీ ప్రజలపై పెనుభారమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు.జీఎస్టీతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. ఇండియా కూటమి ఎంపీల నిరసనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనలు, నినాదాలు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ప్రవేశ ద్వారం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడతామని సభ్యులంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8,263 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. -
చుక్కలు చూపిస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు.. పాలసీదారులను పట్టించుకోవడం లేదా
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలపై ప్రీమియం పెరగడం వినియోగదారులకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు హన్సా రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ప్రీమియం అందుబాటు ధరలో ఉండడం కీలకమని పాలసీదారులు భావిస్తున్నారు. జీవిత బీమా పాలసీల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనపరమైన పక్షపాతం, ఆర్థిక అవరోధాలు, ప్రీమియం ధరల అందుబాటు, కొనుగోలుపై దాని ప్రభావం తదితర అంశాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా 3,300 జీవిత బీమా పాలసీదారులు ఇందులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పాలసీదారులుగా వారి అభిప్రాయాలను సర్వేలో ప్రశ్నల రూపంలో తెలుసుకున్నారు. బీమా కంపెనీని సంప్రదించినప్పుడు స్పందన సరిగ్గా లేకపోవడం వాటిని వీడడానికి ప్రధాన కారణమని 22 శాతం మంది పాలసీదారులు చెపన్పారు. తాము పాలసీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాంక్ ఆర్ఎం లేదా ఏజెంట్ తమను కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కలవాలని ప్రతీ 10 మందిలో 8 మంది పాలసీదారులు కోరుకుంటున్నారు. డిజిటల్ వేదికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లను సందర్శించం చేస్తున్నారు. బ్రాండ్‌కు ఉన్న పేరు, డిజిటల్ సేవలు, కస్టమర్ సేవలు కూడా ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేసే వారు పరిగణనలోకి తీసుకునే కీలక అంశాలని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. -
IRDAI: జీవితబీమా పాలసీల ఆవిష్కరణలకూ స్వేచ్ఛ
న్యూఢిల్లీ: తన నుంచి ముందస్తు అనుమతి లేకుండా అన్ని రకాల హెల్త్, సాధారణ బీమా పాలసీల ఆవిష్కరణకు ఇటీవలే అనుమతించిన బీమా రంగ అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ.. తాజాగా జీవిత బీమా పాలసీల విషయంలోనూ ఇదే స్వేచ్ఛ కల్పించింది. జీవిత బీమా సంస్థలు తన నుంచి ముందు అనుమతి తీసుకోకుండా ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరల్లో వాటికి వెసులుబాటు లభించనుంది. కొత్త ప్లాన్లను ముందుగా విడుదల చేసి, ఆ తర్వాత వాటి అనుమతికి బీమా సంస్థలు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఒక ఉత్పత్తిని వేగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టొచ్చు. అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. ముందు అనుమతి తీసుకోవడానికి.. ఉత్పత్తి ఆవిష్కరించిన తర్వాత అనుమతి పొందడానికి మధ్య వ్యత్యాసం ఉంది. ముందస్తు అనుమతి పొందేట్టు అయితే ఎన్నో పరిమితులు, నిబంధనల పరిధిలో ఉత్పత్తుల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ, అనుమతి తీసుకోకుండా జారీ చేసే ఉత్పత్తుల రూలకల్పన విషయంలో కంపెనీలు స్వేచ్ఛగా వ్యవహరించగలవు. ఇప్పటి వరకు అన్ని రకాల జీవిత బీమా పాలసీలు, రైడర్లకు ముందస్తు అనుమతి అమల్లో ఉండడం గమనార్హం. భారత్‌ను మరింత బీమా రక్షణ కలిగిన దేశంగా మార్చేందుకు సంస్కరణలకు సుముఖంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. ‘‘మారుతున్న మార్కెట్ ధోరణులకు తగ్గట్టు బీమా పరిశ్రమ వేగంగా స్పందించేందుకు.. ఉత్పత్తుల డిజైన్, ధరలు, వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా.. జీవిత బీమా ఉత్పత్తులకు సైతం ‘యూజ్ అండ్ ఫైల్ ప్రక్రియ’ను విస్తరించాలని నిర్ణయించాం’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనివల్ల బీమా సంస్థలు మార్కెట్ అవసరాలకు వీలుగా వేగంగా ఉత్పత్తులను విడుదల చేయగలవని పేర్కొంది. సానుకూలం ఐఆర్డీఏ తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు సానుకూలమని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో ఆశిష్ కే శ్రీవాస్తవ తెలిపారు. మరింత ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని, ప్రజలు తమ భవిష్యత్తుకు సంబంధించి ప్లాన్ల ఎంపికలకు ఆప్షన్లను విస్తృతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా సానుకూల నిర్ణయమని, ఉత్పత్తులకు అనుమతుల ప్రక్రియల సులభంగా మారినట్టు ఇన్సూరెన్స్బ్రోకర్ ‘సెక్యూర్ నౌ’ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. -
ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం
జీవిత బీమా కంపెనీల (లైఫ్ ఇన్సూరెన్స్)కు డిసెంబర్ నెలలో నూతన పాలసీల రూపంలో రూ.24,466 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చింది. 2020 డిసెంబర్లో ఆదాయం రూ.24,383 కోట్లతో పోలిస్తే పెద్దగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. జీవిత బీమా దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ పనితీరు నిరాశపరిచింది. ఈ సంస్థకు కొత్త పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్) రూపంలో ఆదాయం డిసెంబర్ నెలలో 20 శాతం క్షీణించి రూ.11,434 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎల్ఐసీకి కొత్త పాలసీ రూపంలో రూ.14,345 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ప్రైవేటు సంస్థల మెరుగైన పనితీరు మిగిలిన 23 ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం ఉమ్మడిగా 30 శాతం పెరిగింది. రూ.13,032 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఇది రూ.10,037 కోట్లుగానే ఉంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ న్యూ బిజినెస్ ఆదాయం 55 శాతం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. ఎస్బీఐ లైఫ్ ఆదాయం సైతం 27 శాతం వృద్ధితో రూ.2,943 కోట్లుగా నమోదైంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 70 శాతం పెరిగి రూ.1,164 కోట్లకు చేరుకుంది. మ్యాక్స్‌లైఫ్ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,013 కోట్లుగా ఉంటే, టాటా ఏఐఏ లైఫ్ ఆదాయం 50 శాతం పెరిగి రూ.660 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఆదాయం 6 శాతం పెరిగి రూ.544 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం 6 శాతం క్షీణించి రూ.1,380 కోట్లకు పరిమితమైంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఆదాయం స్వల్పంగా తగ్గగా.. ఏగాన్ లైఫ్ న్యూ బిజినెస్ ప్రీమియం 36 శాతం పడిపోయి రూ1.29 కోట్లుగా ఉంది. తొమ్మిది నెలల్లో మిశ్రమ ధోరణి 2021–22లో మొదటి తొమ్మిది నెలల్లో అన్ని జీవిత బీమా సంస్థల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 7 శాతం పెరిగి రూ.2,05,231 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ఎల్ఐసీ ఆదాయం 3 శాతం తగ్గి రూ.1,26,015 కోట్లుగా ఉంటే.. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.79,217 కోట్లుగా నమోదైంది. చదవండి: ఇన్సురెన్స్ కంపెనీకి వార్నింగ్.. రూ.79 లక్షలు చెల్లించాలంటూ ఆదేశం -
పాలసీ దారులకు షాక్?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను పెంచాలనుకుంటున్నట్టు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు. నూతన పాలసీకి అనుమతి కోసం త్వరలోనే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ముందు దరఖాస్తు చేసుకోనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు, బీమాపై బీమాను ఆఫర్ చేసే సంస్థలు (రీఇన్సూరెన్స్) తీవ్రంగా ప్రభావితమైనట్టు చెప్పారు. తమ ఉత్పత్తుల ప్రీమియం ధరలు, అండర్‌రైటింగ్ (చెల్లింపుల బాధ్యతను స్వీకరించడం) నిబంధనలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టు వివరించారు. గడిచిన కొన్ని నెలలుగా భారీ ఎత్తున క్లెయిమ్‌లు రావడంతో ఇప్పటికే చాలా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియంను పెంచినట్టు చెప్పారు. ‘‘చివరిగా మేము గతేడాది ఏప్రిల్‌లో ప్రీమియం పెంచాము. పరిస్థితులను మదింపు వేసిన అనంతరం నూతన ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసుకుంటాము’’ అని చెప్పారు. ధరల పెంపు కాకుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించేలా తమ ఉత్పత్తి ఉంటుందన్నారు. 2021–22 మొదటి ఆరు నెలల్లో 62,828 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1,230 కోట్లను ఈ సంస్థ చెల్లించడం గమనార్హం. చదవండి: మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు -
మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు
ముంబై: చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే 105 శాతం వెనక్కి చెల్లించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త టర్మ్ ప్లాన్ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ను ప్రవేశపెట్టింది. పాలసీదారు జీవిత దశల ఆధారంగా బీమా కవరేజీ సర్దుబాటు అయ్యే (లైఫ్‌స్టేజ్ కవర్) ఆప్షన్ ఉండడం ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత. ఇది కాకుండా కవరేజీ స్థిరంగా ఉండే ‘లెవల్ కవరేజీ’ ఆప్షన్ కూడా ఉంది. పాలసీదారులు తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. 64 క్రిటికల్ ఇల్నెస్లకు (తీవ్ర అనారోగ్య సమస్యలు) సైతం ఈ ప్లాన్‌లో కవరేజీ తీసుకోవచ్చు. లైఫ్‌స్టేజ్ ఆప్షన్లో బీమా కవరేజీ ఆరంభంలో క్రమంగా పెరుగుతూ వెళుతుంది. పాలసీ చివర్లో (పెద్ద వయసులో) క్రమంగా కవరేజీ తగ్గుతూ వస్తుంది. పాలసీ అమల్లో ఉన్నప్పుడు మరణిస్తే పరిహారం, గడువు పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాకానీ ప్రయోజనం కోరుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులను (క్రిటికల్ ఇల్‌నెస్‌లు) దృష్టిలో పెట్టుకుని ప్లాన్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. -
జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి!
ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో జీవిత బీమా పాలసీలను పోల్చి చూసుకుని, తీసుకోవడం సులభతరంగానే ఉంటున్నప్పటికీ.. పాలసీని ఎంపిక చేసుకునే ముందు పరిశీలించాల్సిన నాలుగు ముఖ్యాంశాలు ఉంటాయి. అవేంటంటే: ఆర్థిక లక్ష్యాలను మదింపు చేసుకోవడం: ప్రతీ ఒక్కరి జీవితాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. బీమా పాలసీ అనేది మీరు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, అలాగే మీపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు తోడ్పడే విధంగా ఉండాలి. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రుణాలు, వైద్య చికిత్సల ఖర్చులు, లేదా రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి పలు రకాల అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజీ ఉండాలని భావించేవారికి టర్మ్ ప్లాన్ ఉత్తమమైనది. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు కావాలంటే యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) లేదా రిటైర్మెంట్ ప్లాన్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. సొంతంగా అధ్యయనం చేయండి: మార్కెట్లో ప్రస్తుతం అనేకానేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు ముందు తగు స్థాయిలో అధ్యయనం చేయండి. పాలసీ రకం, అది అందించే ప్రయోజనాలను పరిశీలించండి. ఉదాహరణకు కొన్ని ప్లాన్లు రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడగలవు. అలాగే చిల్డ్రన్ ఇన్సూరెన్స్ పాలసీలు మీ పిల్లల భవిష్యత్తుకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండగలవు. ఇక ఎండోమెంట్ పాలసీ అనేది ఇటు జీవిత బీమా అటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఏకమొత్తంగా రాబడులు అందించగలదు. కవరేజీ ఎంచుకోవడం: సరైన ప్లాన్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో .. తగినంత కవరేజీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. సమ్ అష్యూర్డ్ అనేది హ్యూమన్ లైఫ్ వేల్యూ (హెచ్ఎల్వీ) లేదా ఆర్థికంగా పాలసీదారు విలువ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, చేయాల్సిన చెల్లింపులు, వివిధ దశల్లో ఆర్థిక లక్ష్యాలు మొదలైన అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కవరేజీ ఎంత తీసుకోవాలన్నదానిపై ఇథమిత్థంగా ఫార్ములా అంటూ ఏమీ లేకపోయినప్పటికీ.. వార్షిక వేతనానికి కనీసం 15 రెట్లు అయినా ఉండాలన్నది బండగుర్తుగా పాటిస్తుంటారు. పాలసీని ల్యాప్స్ కానివ్వకండి: టర్మ్ పూర్తయ్యే వరకూ వార్షిక ప్రీమియంలను చెల్లించడం ఆపకుండా జాగ్రత్తపడండి. బీమా ప్రయోజనాల రూపంలో మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ చిన్న అంశాలు దృష్టిలో ఉంచుకుంటే చాలు.. బీమా పాలసీ ప్రక్రియ అంతా సజావుగా ఉండగలదు. మీకు, మీ మీద ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించగలదు. - సంజయ్ తివారీ, డైరెక్టర్ (స్ట్రాటజీ) ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
ఇన్సూరెన్స్ కింద కోట్ల రూపాయలు ఆర్జించవచ్చనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. ఇది జరగడానికి కొంతకాలం ముందు సదరు వ్యక్తి ఒకటి, రెండు కాదు సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్నాడు. ఐతే ఏళ్లు గడుస్తున్నా బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ఈ పనికి పూనుకున్నాడు సదరు వ్యక్తి. డబ్బుకోసం కాళ్లను నరుక్కున్న ఈ వ్యక్తిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం హంగేరీకి చెందిన సెందర్ అనే వ్యక్తి ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో 54 ఏళ్ల సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్ ఇచ్చాయి. నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది. పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..
బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. నిందితుడు వేసిన ప్లాన్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తక్కువ కాదు! ఏం చేశాడంటే.. ప్రభాకర్ భీమాజీ వాఘ్చౌరే (54) గత 20 యేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చి, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రజుర్ అనే గ్రామంలో ఉంటున్నాడు. ఐతే ఏమైందో ఏమో.. హఠాత్తుగా 3 నెల్లతర్వాత ఏప్రిల్ 22న రజుర్ పోలీస్ స్టేషన్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్చౌరే అనే వ్యక్తి మరణించినట్లు నివేదిక వచ్చింది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో పోలీసులు సదరు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టగా.. ప్రవీణ్, హర్షద్ లహంజె అనే ఇద్దరు వ్యక్తులు మృతుడు వాఘ్‌చౌరేగా గుర్తించారు. వారిలో ప్రవీణ్ అనే వ్యక్తి మృతుడికి మేనల్లుడినని చెప్పుకొన్నాడు. మృతుడు పాముకాటుతో మరణించినట్లు ప్రాథమిక మెడికల్ రిపోర్టులు వెల్లడించాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడికి అప్పగించారు కూడా. దీంతో కథముగిసిపోయిందిలే అని అనుకున్నారు. కానీ.. వాఘ్చౌరే జీవిత బీమా క్లెయిమ్‌పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు అతని మరణ వివరాలను కోరుతూ అహ్మద్‌నగర్ అధికారులను సంప్రదించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. బీమా సంస్థ అధికారులు తొలుత మృతుడిగా చెప్పబడుతున్న వాఘ్చౌరే ఇంటి పక్కవారిని అడిగితే.. పాముకాటు సంఘటన ఏదీ ఇక్కడ చోటుచేసుకోలేదని, ఐతే అంబులెన్స్ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు తెలిపారు. తర్వాత వాఘ్చౌరే మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను బతికిఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్‌చౌరేను, అతనికి సహకరించిన 4 అనుచరులను నిర్భందంలోకి తీసుకున్నాట్టు అహ్మద్‌నగర్ ఎస్పీ మనోజ్ పటేల్ మీడియాకు తెలిపారు. ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్‌నాథ్ యశ్వంత్ ఆనప్ (50)గా గుర్తించారు. ఏప్రిల్ 22న ఆనప్‌ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని వాఘ్చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్‌ను పిలిపించినట్లు తెలిసింది. అసలు బీమా కంపెనీకి వాఘ్‌చౌరేపై అనుమానం ఎందుకొచ్చిందంటే.. గతంలో అతని భార్య బతికి ఉండగానే 2017లో సదరు బీమా కంపెనీ నుంచి బీమా క్లెయిమ్ చేయడంతో, మోసపోయిన బీమా సంస్థ అతని మృతి గురించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ దర్యాప్తే అతని బండారాన్ని వీధి కీడ్చింది. ఏదిఏమైనా ఒక నిండు ప్రాణం అతని స్వార్థానికి బలైపోయింది. చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
మీకు ఎంత జీవిత బీమా అవసరం..! ఇలా తెలుసుకోండి...
కోవిడ్-19 మహమ్మారి రాకతో చాలా మంది జీవితాలు చిద్రమైపోయాయి. కరోనా చూపిన ప్రభావం చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాల్లో బీమా పాలసీలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్గింది. కాగా కరోనా రాకతో ఇప్పుడు చాలా మంది పాలసీలను తీసుకోవడానికి సన్నద్దమవుతున్నారు. ఏలాంటి పాలసీలను తీసుకోవాలనే సందిగ్ధంలో నెలకొని ఉన్నారా..! అయితే ఇది మీకోసమే. ఎజెంట్లు చెప్పే మాయమాటలకు నమ్మకుండా మీ సొంతంగా ఏ పాలసీ మీకు సరిపోతుందో తెలుసుకోండి. బీమా తీసుకోవడంతో అనుకొని దురదృష్టకర సంఘటనల నుంచి మనల్ని మనం కాస్త కాపాడుకున్నా వాళ్లం అవుతాం. మీ జీవిత బీమాను తెలసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవిత బీమా ముందుగా మీకు వచ్చే వార్షిక ఆదాయంపై ఆధాపడి ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రస్తుత వయసు, పదవీ విరమణ పొందే వయసుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే అంతా మంచింది. మీకు ఎంత బీమా అవసరం.. అనే అంచనాలను ఇలా వేయండి. మీరు తీసుకునే వ్యక్తిగత జీతం నుంచి మీ వ్యక్తిగత ఖర్చులను తగ్గించడం ద్వారా మీ కుటుంబ నెలవారీ గృహ ఆదాయానికి మీరు ఎంతవరకు సహకరిస్తారో లెక్కించండి. మీ కుటుంబానికి మీరు రిటైర్మెంట్ అయ్యే లోపు ఎంతమేరకు ఆదాయాన్ని సంపాదిస్తారో లెక్కించండి. రిటైర్మెంట్లోపు వచ్చే ఇంక్రిమెంట్లతో సహా మొత్తాన్ని లెక్కించండి. మీరు ఆశించే మొత్తం ఆదాయం ప్రస్తుత విలువను కనుగొనండి. అంతేకాకుండా మారుతున్న కాలానికి తగ్గట్లుగా పాలసీలను ఎంపిక చేసుకోవడం మంచింది. జీవిత బీమాలు, ఆరోగ్య బీమాలు వేరవేరుగా ఉంటాయి. ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు వయసు ను పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత చిన్న వయసు లో పాలసీ తీసుకుంటే అంత మంచిది. ఆరోగ్య బీమాలను ప్రతి సంవత్సరం 10 నుంచి 15 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఫామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా మొత్తం కుటుంబాన్ని ఆరోగ్య బీమా పరిధి లోకి తీసుకురావచ్చు. కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం కన్నా..ఒకే పాలసీ తో అందరికి బీమా రక్షణ కల్పించడం ఉత్తమమైన మార్గం. -
దారుణం: బీమా చేయించారు.. 8 మందిని చంపేశారు
సాక్షి, నల్లగొండ క్రైం: అదో కరడుగట్టిన ముఠా. సులువుగా డబ్బు సంపాదించేందుకు పెద్ద పన్నాగమే వేసింది. అమాయకుల పేరిట జీవిత బీమా పాలసీలు కట్టి, తర్వాత వారిని చంపేసి.. బీమా డబ్బు కాజేస్తోంది. ఒక్కరిద్దరు కాదు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని ఇలా చంపి, రూ.కోటిన్నర మేర క్లెయిమ్ చేసుకుంది. ఈ దుర్మార్గంలో ఆ అమాయకుల కుటుంబ సభ్యులతోపాటు బీమా కంపెనీల ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. బీమా సొమ్ము పంపకాల్లో తలెత్తిన వివాదం చివరికి ఈ ముఠా గుట్టును రట్టు చేసింది. పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం తన కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బు వస్తుందని.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ధీరావత్ రాజునాయక్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ట్రస్టు ఫైనాన్స్ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేస్తుండేవాడు. 2013లో అతడి సమీప బంధువు శూన్యపహాడ్‌కు చెందిన సబావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. అతని భార్య పేరిట రూ.1.40 లక్షల బీమా పాలసీ పొందడంలో రాజునాయక్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో బీమా సొమ్మును కాజేసేందుకు ఓ పథకాన్ని రచించాడు. తన స్నేహితులైన కంచి శివ, మందారి సాయిసంపత్, వేముల కొండల్‌ను సభ్యులుగా ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, వివాహేతర సంబంధాల గొడవలతో సతమతమవుతున్న వారిని టార్గెట్ చేసుకుని కార్యకలాపాలను ప్రారంభించాడు. ఒప్పందం చేసుకుని.. బీమా చేయించి.. ఈ ముఠా మిర్యాలగూడ, దామరచర్ల మండలాల పరిధిలో అనారోగ్య సమస్యలున్న వారిని, వివాహేతర సంబంధాలను అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో ఉన్న వారిని సంప్రదిస్తుంది. హత్య చేయాల్సిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఒప్పందం చేసుకుంటుంది. సదరు వ్యక్తి పేరిట ముఠా సభ్యులే వివిధ కంపెనీల బీమా పాలసీలు కడతారు. కొద్దినెలల తర్వాతో, ఏడాది తర్వాతనో ఆ వ్యక్తిని చంపేస్తారు. వచ్చిన బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు. ముఠా దారుణాల్లో కొన్ని.. ►అనారోగ్యంతో బాధపడుతున్న మిర్యాలగూడ మండలం జటావత్ తండాకు చెందిన రూపావత్ దేవాను ఈ ముఠానే మట్టుబెట్టింది. ఈ దారుణంలో దేవా భార్య ధనమ్మ కూడా పాత్రధారే. దేవా పేరిట రూ.12లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నారు. ►దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా.. అతడి పేరిట బీమా పాలసీ చేయించి, చంపేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన దైద హుస్సేన్‌ను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. రూ.53 లక్షలు క్లెయిమ్ చేసి, పంచుకున్నారు. ►దామరచర్ల మండలం కల్లెపల్లికి చెందిన ధీరావత్ లాల్సింగ్ను కూడా అతడి భార్య సహకారంతో హత్య చేశారు. రూ.23 లక్షల ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకున్నారు. ►రాళ్లవాగు తండాకు చెందిన సబావత్ తుల్య అనారోగ్యంతో ఉండడంతో.. అతడి భార్య ఇద్దరు పిల్లలను ఒప్పించి చంపేశారు. రూ.60 లక్షలు ఇన్సూరెన్స్ పొందారు. ►గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన బూక్యా నాగులునాయక్ ను కూడా ఇదే తరహాలో హత్య చేసి బీమా సొమ్ము కాజేశారు. బయటపడిందిలా.. దామరచర్ల మండలానికి చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి, హారిక దంపతులు. హారిక అదే గ్రామానికి చెందిన మరొకరితో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు ఆమెను సంప్రదించి.. కోటిరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించారు. బీమా పాలసీలు కట్టారు. ఫిబ్రవరి 24న ముఠా సభ్యులే అతడిని హత్య చేశారు. తర్వాత బొత్తలపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారు. అతడి పేరిట రూ.12 లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ చేశారు. అయితే ఈ డబ్బు పంపకాల్లో తలెత్తిన వివాదం పోలీసుల వరకు చేరింది. అనుమానంతో హారికను అదుపులోకి తీసుకుని విచారించగా బీమా మాఫియా గుట్టు బయటపడింది. విషయం తెలిసిన ముఠా సభ్యులు రాజునాయక్, కంచి శివ, మందారి సాయిసంపత్, వేముల కొండల్ పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బీమా మాఫియా వ్యవహారంపై ఏఎస్పీ నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపిస్తామని ఎస్పీ ప్రకటించారు. -
పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్
పోస్టాఫీసులో మీరు జీవిత పాలసీలు తీసుకున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్‌లో బోనస్ కింద వేయి రూపాయలకు రూ.76, పిల్లల పాలసీలతో సహా ఎండోమెంట్ అస్యూరెన్స్ కోసం అయితే వేయికి రూ.52 బోనస్ అందుకుంటారు. పోస్టాఫీసులో ప్రస్తుతం ఆరు జీవిత భీమా పాలసీలు ఉన్నాయి. అవి హోల్ లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్ (సంతోష్), కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ (సువిధా), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ (యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా) లాంటి భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ (2011) ప్రకారం.. 2020 మార్చి 31 నాటికి పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆస్తులు అప్పుల వ్యాల్యూయేషన్ ఆధారంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై సాధారణ రివర్షనరీ బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్ ఆకస్మిక మరణం తర్వాత లేదా పాలసీ కాలపరిమితి గడిచిన తర్వాత చెల్లిస్తారు. ఈ జీవిత భీమా పాలసీలపై బోనస్ హోల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ(డబ్ల్యూఎల్ఏ)పై వెయ్యికి రూ.76లు అదనంగా లభిస్తుంది. ఎండోమెంట్ అస్యూరెన్స్(జాయింట్ లైఫ్ & చిల్డ్రన్ పాలసీలతో సహా) పాలసీపై వెయ్యికి రూ.52లు అదనంగా లభిస్తుంది. యాంటిస్పేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్(సుమంగల్) పాలసీపై వెయ్యికి రూ.48లు అదనంగా లభిస్తుంది. కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ రేటు లభిస్తుంది. పది వేల మొత్తంపై రూ.20లు టెర్మినల్ బోనస్ తో పాటు గరిష్ఠంగా రూ.1000 వస్తుంది. ఇది 20 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. -
లైఫ్ ఈజీ చేసుకుందాం ఇలా...
కొత్తగా ఏదో ఒకటి చేయాలి.. ఏటా నూతన సంవత్సరంలోకి ప్రవేశించే సమయంలో చాలా మంది అనుకునే సంకల్పమే ఇది. కానీ, కొద్ది మందే అనుకున్నవి ఆచరణలో పెడుతుంటారు. 2020 ఎన్నో పాఠాలు చెప్పి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావన్న హెచ్చరికలు కూడా ఇచ్చి వెళ్లింది. అందుకే 2021లో అయినా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రణాళికలపై దృష్టి పెట్టి.. అమల్లో పెట్టడం ద్వారా ఎంతో స్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందే అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకు ఏం చేయవచ్చంటే..? ఆపద్బాంధవ.. బీమా ఆరోగ్య బీమా, జీవిత బీమా తమకు అంతగా అవసరం లేదనుకునే వారు ఎందరో ఉన్నారు. వీటి ప్రాధాన్యం ఎంతన్నది కరోనా వైరస్ చాలా మందికి తెలిసేలా చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వారు రూ.లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. బీమా పాలసీ లేని వారు తమ కష్టార్జితాన్ని వైద్య చికిత్సల కోసం ధారపోయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి జీవిత బీమా పాలసీ లేకుండా కరోనాతో మరణించినట్టయితే.. పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించాలి. ఒకవేళ జీవిత బీమా పాలసీ ఉన్నా తగినంత కవరేజీ లేని కుటుంబాలకు వాస్తవంలో రక్షణ లేనట్టుగానే భావించాలి. కట్టిన ప్రీమియం రాదన్న ప్రతికూల ధోరణితో టర్మ్ ప్లాన్లకు బదులు.. మరణించినా లేదా మెచ్యూరిటీ తీరినా రాబడులతో వెనక్కిచ్చే ఎండోమెంట్ ప్లాన్లు తీసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ, రూ.1–5 లక్షల ఎండోమెంట్ ప్లాన్ ఓ కుటుంబ అవసరాలను ఏ మాత్రం తీర్చగలదో ఆలోచించండి. అందుకే హెల్త్, లైఫ్ ప్లాన్లు లేని వారు వెంటనే వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న వారు.. వీలు చేసుకుని టర్మ్ ప్లాన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. తమ వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా కవరేజీకి కలిపి అధిక మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తాము లేని లోటును తీర్చే రక్షణ ఏర్పాటు చేసిన వారు అవుతారు. అనారోగ్యం, ప్రమాదాలు చెప్పి రావు. వయసులో ఉన్న వారికి కూడా ఇటువంటివి ఎదురుకావచ్చు. ఒకవేళ హెల్త్ పాలసీ ఉన్నా కేవలం రూ.2–3లక్షల కవరేజీయే ఉంటే.. దానికి టాపప్ తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాలి. టాపప్‌కు ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల హెల్త్ కవరేజీ అయినా ఉండాలి. దీనికి అదనంగా టాపప్ కూడా జోడించుకోవాలన్నది నిపుణుల సూచన. సాయం కోసం ఎదురుచూడొద్దు అనుకోని అవసరం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక సాయం కోసం బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఆశ్రయించడం కంటే.. ఒక ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మనశ్శాంతిని, ధైర్యాన్నిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ప్రమాదానికి గురి కావడం ఇటువంటివన్నీ అత్యవసర పరిస్థితులే. అందుకే కనీసం 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులో రుణాలకు చేసే చెల్లింపులు కూడా భాగంగా ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు ఎఫ్డీలు లేదా లిక్విడ్ ఫండ్స్ రూపంలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అవసరం ఏర్పడినప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే కాదు.. అత్యవసరాలు ఎదురైతే తప్పించి చిన్న అవసరాలకు కదపకూడదు. భిన్న సాధనాలకు కేటాయింపులు పెట్టుబడులన్నింటినీ ఒకటే సాధనంలో కాకుండా భిన్న సాధనాలకు కేటాయించుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక భాగమే. ఉదాహరణకు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడుల పరంగా మీ నిర్ణయాల్లో తప్పిదం చోటు చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఈక్విటీలు, డెట్, బంగారం ఇలా వీలైనన్ని సాధనాల మధ్య పెట్టుబడులను వేరు చేసుకోవాలి. దీనివల్ల రిస్క్‌ను మించి రాబడులు వస్తాయి. మీ రిస్క్ సామర్థ్యం, ఆశిస్తున్న రాబడులు, పెట్టుబడులకు ఉన్న వ్యవధి వీటి ఆధారంగా ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది ఆర్థిక సలహాదారుల సాయంతో నిర్ణయిం చుకోవాలి. ఒక్కో విభాగం అద్భుత పనితీరుతో అందులోని పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగిపోతే.. అందుకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్విటీలకు 50% కేటాయించాలన్నది మీ ప్రణాళిక అయితే.. మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 60 శాతానికి చేరితే.. అప్పుడు 10% మేర ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఆగొద్దు పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోవాలి. మధ్యలో వచ్చే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల ప్రణాళికలు ఆగిపోకూడదు. గతేడాది మార్చి చివరికి మార్కెట్లు కనిష్టాలకు పడిపోయినప్పుడు కంగారుపడిపోయి స్టాక్స్‌ను అమ్ముకున్న వారు.. డిసెంబర్ వచ్చే సరికి ఎంతో విచారించి ఉంటారు. ఎందుకంటే తొమ్మిది నెలల్లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళ్లిపోయాయి. మార్కెట్లు ఎప్పుడూ పడి లేచే కెరటాలు. అలాగే, స్టాక్స్ విక్రయించకుండా.. అదనంగా ఇన్వెస్ట్ చేసిన వారు భారీ లాభాలను కళ్లచూసి ఉంటారు. అందుకే ఈక్విటీ పెట్టుబడులు కనీసం ఐదేళ్లకు మించిన కాలానికే సముచితం. అందులోనూ నేరుగా స్టాక్స్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో, అందులోనూ ప్రతీ నెలా ఇంతచొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం.. సగటున అధిక రాబడులను సమకూర్చుకునేందుకు, రిస్క్‌ను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఇరువైపులా ప్రయోజనాలను తెచ్చిపెట్టే సాధనమే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను అలాగే ఉంచేయవద్దు. సేవింగ్స్ వడ్డీ రేటు 4–5 శాతం అన్నది ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. కనుక అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్లుగా మార్చే ఆటోస్వీప్ సదుపాయాన్ని ఎంచుకోవాలి. నామినీని, విల్లును మర్చిపోవద్దు ఒక వ్యక్తి మరణానంతరం అతని పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు కుటుంబ సభ్యులకు సులభంగా అందేలా చేసేదే విల్లు. ఎవరికి ఏవి, ఏ మేరకు చెందాలన్నదీ విల్లులో నిర్దేశించుకోవచ్చు. తమ పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, బీమా పాలసీల వివరాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి. బీమా ప్లాన్లు, పెట్టుబడుల్లో నామినీని చేర్చాలి. ఖర్చు/పొదుపు కరోనా, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా గతంతో పోలిస్తే కొన్ని అనవసర వ్యయాలు తగ్గాయి. వీకెండ్లో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో తినడం, సినిమాలు, పర్యటనలు వంటివి చాలా వరకు తగ్గాయి. వేతనాల్లో కోతలు పడిన వారికి ఈ విధంగా తగ్గిన వ్యయాలు కాస్త ఊరటనిచ్చాయి. అదే సమయంలో వేతన కోతల్లేని వారికి మిగిలిన మేర అదనంగా ఇన్వెస్ట్ చేసుకునే మంచి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా.. ఎంత పొదుపు చేశారన్నదే మీ ఆర్థిక పరిస్థితులను మార్చే సూత్రం అవుతుంది. కనుక పరిమితుల్లోపే ఖర్చు చేసుకోవాలి. అందుకే నెలవారీ బడ్జెట్ రూపొందించుకుని దాని ప్రకారం ఖర్చు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యయాలపై మీకు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతగా అవసరం లేని వాటి కోసం రుణాలపై కొనుగోళ్లకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ తరహా అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. కొత్త ఏడాది ప్లానింగ్ ► జనవరి: బీమా కవరేజీ మీకు సరిపడా ఉన్నదీ, లేనిదీ ఒక్కసారి సరిచూసుకోవాలి. అలాగే, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపుల తేదీల కోసం రిమైండర్ పెట్టుకోవాలి. ► ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్లో కొత్త నిబంధనల వల్ల మీ ఆదాయం, పన్నులు, పెట్టుబడుల ప్రణాళికలను మార్చుకోవాలేమో సరిచూసుకోవాలి. ► మార్చి: 2020–21 సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత చెల్లింపుల గడువు మార్చి 15తో ముగుస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఈలోపు ఆ పనిచేసేయాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులకు మార్చితో గడువు ముగిసిపోతుంది. ఫాస్టాగ్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ► ఏప్రిల్: 2021–22 నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కనుక.. ఆర్థిక నిపుణుల సాయంతో పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సొంతంగా ఆ పరిజ్ఞానం ఉంటే తామే ఆ పనిచేసుకోవచ్చు. ► మే: ఈ నెలలో 14న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే అందుకు కావాల్సిన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ► జూన్: 2021–22 మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ గడువు జూన్ 15. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు వేసేందుకు గాను పనిచేస్తున్న సంస్థ వద్ద ఫామ్ 16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► జూలై: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకు గడువు. ఆ లోపు రిటర్నులు ఫైల్ చేయాలి. ► ఆగస్టు: పెట్టుబడులపై మధ్యంతర సమీక్ష మంచిది. ► సెప్టెంబర్: 2021–22 రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను 15వ తేదీలోపు చెల్లించాలి. ► అక్టోబర్: దసరా పండుగ భారీ ఆఫర్ల సమయంలో కొనుగోళ్లకు ముందుగానే సన్నద్ధం అయితే మంచిది. ► నవంబర్: ఈ నెలలో దీపావళి పండుగ 4న వస్తోంది. ఆ సందర్భంలో కొనుగోళ్లకు సన్నద్ధులు కావాలి. ► డిసెంబర్: మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ (2021–22)కు 15 వరకు గడువు ఉంది. 25న క్రిస్మస్ పండుగ వేడుకలకు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. -
ప్రియమైన వారికి అమూల్య బహుమతి
ముఖ్యమైన పండుగలు, పుట్టిన రోజు.. ఈ తరహా ప్రత్యేక సందర్భాల్లో కొందరు అపురూప కానుకల ద్వారా తమకు అత్యంత సన్నిహితులను సంతోషానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంటారు. ఇందుకోసం ఖరీదైన కార్లు, బంగారం, వజ్రాభరణాలు, ఫ్లాట్ లేదా విల్లా ఈ తరహా కానుకలను ఇచ్చే వారు ఉన్నారు. కానీ, ఈ తరహా భౌతిక కానుకలు కాకుండా, మీరు నిజంగా అభిమానించే వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు వినూత్నంగా బీమా పాలసీని బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు..? ఆలోచించండి. ఒక వ్యక్తి అకాల మరణంతో సంబంధిత కుటుంబం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమయంలో బీమా పాలసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. కనుక జీవిత బీమా పాలసీని ఇవ్వడం నిజంగా అపురూపమైన కానుకే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే మరణానికి పరిహారం ఇచ్చే ఉద్దేశ్యంతో కూడినది. పాలసీ కాల వ్యవధి ముగిసిపోయే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ, పాలసీ కాల వ్యవధి సమయంలో అకాల మరణానికి గురైతే నామినీకి సమ్ అష్యూరెన్స్‌ను పరిహారం కింద చెల్లించడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్‌లో రూ.కోటి సమ్ అష్యూరెన్స్ (బీమా రక్షణ మొత్తం)కు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని గమనించాలి.. బీమా పాలసీని కానుకగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇతర ఉత్పత్తుల వైపు ఆలోచన వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే, బండిల్డ్ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించాలి. బీమా రక్షణకు, పెట్టుబడి ఇతర ఆప్షన్లను జోడించి ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాలను కంపెనీలు చేస్తుంటాయి. కానీ, వీటిల్లో ఉండే అనేక రకాల చార్జీలతో బీమా కంపెనీలకే ప్రయోజనం ఎక్కువ. ఈ చార్జీల కారణంగా పాలసీదారులకు చివర్లో దక్కేది తక్కువే. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు గట్టిగా 4–5 శాతం మించి రాబడులను ఇవ్వలేవు. ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ లింక్డ్ బీమా పథకాల్లో (యులిప్) రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులకు హామీ ఉండదు. అధిక రిస్క్ తీసుకునే వారికి యులిప్ పాలసీలు పెట్టుబడి ఆప్షన్ అవుతాయి. కానీ, టర్మ్ పాలసీలతో పోలిస్తే అసలైన బీమా ప్రయోజనం వీటిల్లో తక్కువే. ఇక పాలసీ ఎంపిక విషయంలో బీమా కంపెనీ, బీమా మొత్తం, బీమా కాల వ్యవధి, ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి వీటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి. బీమా ఎంత? ఎంత మొత్తం బీమా తీసుకోవాలనే విషయంలో ఓ సాధారణ సూత్రం ఉంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకుంటే, పది రెట్ల మేర రూ.60 లక్షలకు బీమా కవరేజీని తీసుకోవడం అవసరం. అయితే, సంబంధిత వ్యక్తి పేరిట ఉన్న అప్పులు, కుటుంబ జీవన శైలి ఆధారంగా ఈ మొత్తం మారిపోతుంది. ఏమైనా రుణ భారం ఉంటే ఆ మేరకు అదనంగా బీమా కవరేజీ అవసరం. ఇక పాలసీ కాల వ్యవధిని నిర్ణయించే ముందు ఎంత కాలం పాటు ఇంకా ఆ వ్యక్తి పనిచేయగలరన్నది కీలకం అవుతుంది. ఎందుకంటే కుటుంబానికి సంబంధిత వ్యక్తి ఆర్జన అవసరమైనంత కాలం మేర బీమా రక్షణ ఉంటే సరిపోతుంది. ప్రీమియంలపై ప్రత్యేక దృష్టి... బీమా కంపెనీలు 80 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణను ఆఫర్ చేస్తున్నాయి. ఆలస్యంగా వివాహం అవడం, ఆలస్యంగా సంతానం కలిగిన వారికి రిటైరైన తర్వాత కూడా కొంత కాలం వరకు బీమా రక్షణ అవసరంపడొచ్చు. బీమా ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి కూడా కీలకమైనదే. బీమా కంపెనీలు పరిమిత కాలం పాటు చెల్లింపు, పూర్తి కాలం పాటు చెల్లింపు ఆప్షన్లు ఇస్తుంటాయి. పరిమిత కాలం ఆప్షన్లో 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 5/10/15 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం ఇవ్వొచ్చు. ఇటువంటి సందర్భాల్లో చెల్లించే ప్రీమియం మొత్తం అధికంగా ఉంటుంది. కొనుగోలు ఏ రూపంలో..? ఆన్లైన్లో అయితే బీమా పాలసీని తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. దీనితో ఏజెంట్ల కమీషన్ భారం ఉండదు. అన్ని బీమా కంపెనీలు తమ అధికారిక వెబ్ పోర్టళ్ల ద్వారా ఆన్లైన్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకటికి మించిన బీమా కంపెనీల మధ్య ప్రీమియం పరంగా అంతరం, ప్రయోజనాల వైరుధ్యం తెలుసుకుని మంచి పాలసీని ఎంచుకునేందుకు పాలసీబజార్ డాట్ కామ్ పోర్టళ్లు అనుకూలంగా ఉంటాయి. పేరు, వయసు, ఎంత కాలానికి బీమా కవరేజీ కావాలి, ఎంత మొత్తం అనే వివరాలను పోర్టళ్లలో ఇవ్వడం ద్వారా ప్రీమియం ఎంతన్న కొటేషన్ చూసుకోవచ్చు. నచ్చితే అక్కడి నుంచే తదుపరి, పాన్, ఇతర ఆరోగ్య వివరాలు, చిరునామా, కాంటాక్ట్ సమాచారం ఇవ్వడం ద్వారా అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనికి 10–15 నిమిషాలకు మించి పట్టదు. చివర్లో ప్రీమియం చెల్లించినట్టయితే, కంపెనీ సిబ్బంది మీకు కాల్ చేసి తదుపరి వివరాలు కోరతారు. కొన్ని కంపెనీలు ఆరోగ్య పరీక్షల అనంతరం బీమా పాలసీని జారీ చేస్తాయి. కొనుగోలుకు ముందు ముఖ్యంగా బీమా కంపెనీని ఎంచుకునే ముందు, క్లెయిమ్స్ హిస్టరీని పరిశీలించాలి. అంటే ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బీమా పరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఎన్నింటికి కంపెనీ పరిహారం చెల్లించింది, ఎన్నిటిని తిరస్కరించింది, అలాగే ఎన్ని అపరిష్కృతంగా ఉన్నాయనే వివరాలను ఐఆర్డీఏఐ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. చెల్లింపుల హిస్టరీ మెరుగ్గా ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చిన క్లెయిమ్స్ పట్ల బీమా కంపెనీ ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలుస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త... ఒకరి పేరిట బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడమే కాదు... సంబంధిత వ్యక్తి మరణిస్తే పరిహారం దక్కే విషయంలో తగిన రక్షణ కల్పించడం కూడా అవసరం. బీమా పాలసీ కలిగిన వారు మరణించిన సందర్భాల్లో, వారి పేరిట రుణాలు ఉంటే, ఆ పరిహారం తాము స్వాధీనం చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోర్టులను ఆశ్రయించొచ్చు. అదే జరిగితే వాటికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇవ్వొచ్చు. ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు, జీవిత బీమా పాలసీని వివాహిత మహిళా ఆస్తి చట్టం (ఎండబ్ల్యూపీ) కింద రిజిస్టర్ చేయాలి. ఇలా చేసిన పాలసీ విషయంలో క్లెయిమ్ హక్కును సంబంధిత వ్యక్తి జీవిత భాగస్వామి లేదా పిల్లలు మాత్రమే కలిగి ఉంటారు. కనుక బీమా పాలసీ కొనుగోలు సమయంలోనే దానిని ఎండబ్ల్యూపీ చట్టం కింద తీసుకోవాలి. ఒక్కసారి పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి వీలు పడదు. -
ఖతార్‌లో ప్రవాసులకు బీమా సౌకర్యం
గల్ఫ్ డెస్క్: ఖతార్ దేశంలో ఉంటున్న ప్రవాస భారతీయులకు నూతన సంవత్సర కానుకగా బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు ఈ నెల 24న ఖతార్‌లోని భారత రాయబారి పి.కుమరన్ బీమా పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఐసీబీఎఫ్, దమాన్ ఇస్లామిక్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య ఎంఓయూపై ఐసీబీఎఫ్ ప్రసిడెంట్ పీఎన్ బాబురాజన్, దమాన్ సీవోవో హరికృష్ణన్ సంతకాలు చేశారు. ఖతార్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన వారికి బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక్కసారి 125 ఖతార్ రియాల్స్ చెల్లిస్తే రెండేళ్ల పాటు లక్ష రియాల్స్ బీమా పొందవచ్చు. సహజ మరణాలకు కూడా బీమా వర్తిస్తుంది. గాయాలపాలైనా, జీవితకాలం కోలుకోలేకపోయే విధంగా క్షతగాత్రులైన వారికి కూడా ఇన్సూరెన్సు ద్వారా పరిహారం అందుతుంది. వివరాలకు తెలంగాణ గల్ఫ్ సమితిని సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. -
ఇ‘స్మార్ట్’ పాలసీ..!
జీవిత బీమా... ఇప్పటికీ చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదన్న ఆకాంక్ష ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ... ఆచరణకు వచ్చే సరికి సరైన కవరేజీ తీసుకుంటున్న వారు అతి స్వల్పం. పాలసీ కడితే నాకేంటి...? అన్న ప్రశ్న వారిది. కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ కల్పించే పాలసీని తక్కువ ప్రీమియానికే టర్మ్ ప్లాన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.... తాను జీవించి ఉంటే చివరకు నాకు వచ్చేది ఏదీ లేదన్న భావన ఎక్కువ మందిని టర్మ్‌ప్లాన్ వైపు అడుగులు వేయనీయడం లేదు. తాజాగా నిర్వహించిన సర్వేల్లోనూ సగటు వ్యక్తి ఇదే ఆలోచిస్తున్నట్టు వెల్లడైంది. మన చుట్టూ ఉన్న వారిలో ఎంత మందికి జీవితబీమా రక్షణ ఉందో చెప్పగలరా..? ఆర్థిక రక్షణ కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చౌకగా లభిస్తున్నప్పటికీ ఎక్కువ మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదన్న నిజం తెలుసా..? మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇటీవల సొంతంగా సర్వే నిర్వహించాయి. దేశంలో వ్యక్తుల ఆర్ధిక సన్నద్ధత ఎలా ఉంది? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఈ రెండు సంస్థల సర్వేల్లోనూ తెలిసిన విషయాలు ఇవే. మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 33.3 శాతం మందికి బీమా రక్షణ ఉండగా, అందులోనూ కేవలం 20 శాతం మందికే టర్మ్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వేలో 83 శాతం మంది తమ కుటుంబ రక్షణ కోసం అవసరమైన మొత్తం పట్ల అవగాహనతో ఉన్నప్పటికీ, వారు తీసుకున్న బీమా రక్షణ అతి స్వల్పంగానే ఉండడం నివ్వెరపరిచే విషయం. కేవలం తమ వార్షిక ఆదాయానికి 1.67 రెట్ల మేరే బీమా కవరేజీతో ఎక్కువ మంది ఉన్నారు. వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు అయినా బీమా కవరేజీ ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. అంటే కావాల్సినంత బీమా కవరేజీ తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలు తీసుకుని ఉంటే వారికి తగినంత రక్షణ లభించి ఉండేది. కానీ నేటికీ చాలా మంది టర్మ్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియం వెనక్కి రాదన్న ఉద్దేశ్యంతో సంప్రదాయ పాలసీలను తీసుకుంటూ తమ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ విషయంలో రాజీ పడుతున్నట్టు సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇప్పటికైనా కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి టర్మ్ ప్లాన్ దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన. ప్రీమియం చాలా తక్కువ గడిచిన పదేళ్ల కాలంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియం చాలా తక్కువ స్థాయిలకు దిగొచ్చినప్పటికీ... చాలా మంది వ్యక్తులు వీటికి దూరంగా ఉన్నారు. ‘‘గత 18 ఏళ్లలో జీవిత బీమా సంస్థలు ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాయి. దాంతో అవి తమ అండర్‌రైటింగ్ ప్రక్రియలను మెరుగుపరిచాయి. బిగ్ డేటా, డేటా అనలటిక్స్ ద్వారా కస్టమర్లను సూక్ష్మంగా పరిశీలించే అవకాశం వాటికి లభించింది. దాంతో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తగిన నమూనాలు, ధరలతో కూడిన ఉత్పత్తులను రూపొందించాయి’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ నందా తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తికి రూ.కోటి రూపాయల బీమా రక్షణకు పదేళ్ల క్రితం అయితే రూ.20,000–30,000 ప్రీమియం ఉండేదని, అదిప్పుడు రూ.8,000–10,000కు తగ్గిపోయినట్టు నందా చెప్పారు. అయితే, డిస్ట్రిబ్యూటర్లు టర్మ్ ప్లాన్ల విక్రయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు టర్మ్ ప్లాన్లను విక్రయించేందుకు సుముఖంగా లేరు. టర్మ్ ప్లాన్లపై వారికి ముట్టే కమీషన్ తక్కువగా ఉంటుంది’’ అని పాలసీబజార్ డాట్‌కామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ సంతోష్ అగర్వాల్ తెలిపారు. చాలా మంది తమ పెట్టుబడి అవసరాలు, పన్ను ఆదా కోసం బీమా పాలసీలు తీసుకుంటున్నారని, టర్మ్ ప్లాన్ల అమ్మకాలు తక్కువగా ఉండడానికి ఇది మరో కారణమని బజాజ్ అలియాంజ్ లైఫ్ చీఫ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్ ఆఫీసర్ ధీరజ్ సెహ్గల్ పేర్కొన్నారు. సంప్రదాయంగా మన దేశంలో పెట్టుబడి ఆధారిత బీమా పాలసీల కొనుగోలు ఎక్కువ. గడువు తీరిన తర్వాత నిర్ణీత మొత్తం తిరిగి వస్తుందన్న ఆకర్షణ వాటిల్లో వారికి కనిపిస్తోంది. అదే టర్మ్ ప్లాన్ల గడువు తీరిన తర్వాత రూపాయి కూడా తిరిగి రాదు. దీంతో వీటిని ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఏమీ తిరిగి రాదు కనుకనే వీటిల్లో ప్రీమియం తక్కువగా ఉంటుందన్న సూక్ష్మాన్ని గ్రహించే వారు తక్కువగా ఉంటున్నారు. చిన్న వయసులో టర్మ్‌పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియానికే మంచి కవరేజీ పొందొచ్చు. ఇలాంటి కొన్ని వ్యూహాల ద్వారా ప్రీమియాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశాలు, అదే సమయంలో మంచి కవరేజీ పొందే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వయసు ఆధారంగా కవరేజీ సాధారణంగా వివాహం కాని వారికి భవిష్యత్తులో బాధ్యతలు పెరుగుతాయి కనుక వారు నిర్ణీత కాలానికి బీమా మొత్తం పెరిగే పాలసీలను తీసుకోవచ్చు. అదే వివాహమై 30 ఏళ్లు దాటిన వారికి, వయసు పెరుగుతున్న కొద్దీ కవరేజీ అవసరం తగ్గుతూ వెళుతుంది. ఎందుకంటే కొంత కాలానికి పొదుపు, పెట్టుబడులతోపాటు, ఆస్తులు కొంత మేర సమకూర్చుకుని ఉంటారు. ఉదాహరణకు 35 ఏళ్లున్న చరణ్ 60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే, 25 ఏళ్ల పాటు పనిచేయగలుగుతారు. ఈ కాలంలోనే అన్ని రకాల లక్ష్యాలకు పొదుపు, మదుపులు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహాలు సహా తన అన్ని అవసరాలకు రూ.2 కోట్లు అవసరం అనుకుంటే... ఒకవేళ ప్రాణ ప్రమాదం ఎదురైతే చరణ్‌పై ఆధారపడిన కుటుంబానికి ఎంత కష్టం ఎదురవుతుందో ఆలోచించండి. అందుకే రూ.2 కోట్ల కవరేజీకి ఈ వ్యక్తి టర్మ్ ప్లాన్ రూపంలో వార్షికంగా రూ.17,396 చెల్లించడం ద్వారా పూర్తి రక్షణ పొందే అవకాశం సొంతం చేసుకున్నట్టు అవుతాడు. అయితే, 60 ఏళ్ల వరకూ రూ.2 కోట్ల కవరేజీ అవసరమా..? అంటే లేదనే సమాధానం వస్తుంది. రూ.2 కోట్లతో ఒకే పాలసీ తీసుకోకుండా, నాలుగు భాగాలు చేసి రూ.50 లక్షల చొప్పున భిన్న కాలాలకు తీసుకోవడం చక్కగా ఉంటుంది. 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల కాలానికి ఒక్కోటీ రూ.50 లక్షలకు తీసుకోవాలి. తద్వారా తన బీమా రక్షణ అవసరాల్లో రాజీ పడకుండా ప్రీమియం రూపంలో ఆదా చేసుకోవచ్చు. 25 ఏళ్ల టర్మ్‌లో రూ.2 కోట్ల కవరేజీకి రూ.4.48 లక్షలు ప్రీమియం రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రూ.50 లక్షల చొప్పున భిన్న కాలానికి ఒక్కోటీ తీసుకోవడం వల్ల చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం రూ.2.7 లక్షలకు తగ్గిపోతుంది. దీనివల్ల రూ.1.7 లక్షలు ఆదా చేసుకోవచ్చని నిపుణుల విశ్లేషణ. ఈ విధానంలో బీమా పాలసీలు నాలుగు తీసుకోవడం వల్ల... పదేళ్ల తర్వాత నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒక పాలసీ చొప్పున మెచ్యూరిటీ అవుతుంది. తీసుకున్న తర్వాత మొదటి పదేళ్లు రూ.2కోట్ల బీమా కవరేజీ లభిస్తుంది. చరణ్‌కు 45 ఏళ్లు వచ్చిన తర్వాత (అంటే పదేళ్ల తర్వాత) బీమా కవరేజీ రూ.1.5 కోట్లకు తగ్గుతుంది. అలాగే 50 ఏళ్లు రాగానే రూ.కోటి కవరేజీ, 55 ఏళ్లకు వచ్చిన తర్వాత రూ.50 లక్షలకు కవరేజీ పరిమితం అవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రీమియం 25–30 శాతం ఆదా అవుతుందని ఏగా¯Œ లైఫ్ ఇన్సూరె¯Œ ్స ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ హరీష్ కురూది తెలిపారు. బాధ్యతలకు విడిగా కవరేజీ... జీవిత బీమా అన్ని ఆర్థిక అవసరాలకూ రక్షణ కల్పించేది అయి ఉండాలి. లేదంటే ఒక్కో అవసరానికి ఉద్దేశించిన పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు గృహ రుణం తీసుకునేట్టు అయితే, రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ప్లాన్ విడిగా తీసుకోవాలి. ఈ పాలసీ టర్మ్ కూడా రుణ కాల అవధికి సరిపడా ఉండాలి. ఒకవేళ ఈ టర్మ్ ప్లాన్ కవరేజీ లేనట్టయితే... రుణం తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో వారసులు ఇంటి రుణం తీర్చలేకపోతే, ఆ ఇంటిని బ్యాంకు వేలం వేసి రుణ బకాయిలు రాబట్టుకునే చర్యలు చేపడుతుంది. ఒకవేళ రుణానికి టర్మ్ కవరేజీ ఉన్న సందర్భంలో రుణ గ్రహీత మరణించినట్టయితే, చెల్లింపుల బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. దీనివల్ల కుటుంబానికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో నిర్ణీత కాలం వరకు ఒకటే కవరేజీ కాకుండా, ఏటా తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ తగ్గే పాలసీని తీసుకోవడం సముచితం అవుతుంది. ఈ పాలసీల్లో సమ్ అష్యూర్డ్ ఏటా నిర్ణీత శాతం తగ్గుతూ వెళుతుంది. రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే ఇలా సమ్ అష్యూర్డ్ తగ్గుతూ వెళ్లే వాటిల్లో ప్రీమియం తక్కువగా ఉండడం అనుకూలం. ఉదాహరణకు ప్రభుత్వరంగ బీమా సంస్థ ఒకటి 35 ఏళ్ల వ్యక్తి, 30 సంవత్సరాల టర్మ్‌కు రూ.24 లక్షల కవరేజీకి రూ.67,449 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని రుణం తీసుకున్న ఏడాదే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తికి ఏటా కవరేజీ మారకుండా రుణ కాల వ్యవధి వరకు ఒకే విధంగా ఉండే పాలసీలో బీమా సంస్థ రూ.1.01 లక్షలను ప్రీమియం కింద వసూలు చేస్తోంది. అయితే, కేవలం కొన్ని బీమా సంస్థలే వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువ శాతం గ్రూప్ ప్లాన్‌ను బ్యాంకులు అంటగడుతున్నాయి. ఒకవేళ మీకు గృహ రుణం ఇచ్చే సంస్థ సమ్ అష్యూర్డ్ ఏటా తగ్గుతూ వెళ్లే టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తే... అటువంటి సందర్భాల్లో ఇతర క్రెడిట్ లింక్డ్ ప్లాన్లు, లెవల్ టర్మ్ ప్లాన్లతో పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. సింగిల్ ప్రీమియం ప్లాన్లపై తగ్గింపు ప్రతీ నెలా, లేదా మూడు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించడానికి బదులు... ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధపడితే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీ తీసుకోదలిస్తే... చౌకగా లభించే పాలసీలోనూ వార్షిక ప్రీమియం రూ.4,012 అవుతుంది. అంటే 20 ఏళ్లలో మొత్తం రూ.80,240 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో రూ.59,531 కట్టేస్తే సరిపోతుంది. కానీ, ఈ విధానంలో నిజానికి చెల్లించిన మొత్తం ఆర్థిక గణాంకాల ప్రకారం ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ముందుగానే పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాం కనుక. దీనికి బదులు ఒకేసారి ప్రీమియం చెల్లించడానికి బదులు, ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. నిర్ణీత కాలంలో సంపద వృద్ధి జరుగుతుంది కనుకనే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్ చేస్తుంటాయి. 5–10 ఏళ్లు వంటి తక్కువ టర్మ్ కోసం సింగిల్ ప్రీమియంను ఎంచుకోవడం మంచిదే అవుతుంది. స్థిరమైన ఆదాయం లేని వారికీ సింగిల్ ప్రీమియం పాలసీలు అనుకూలంగా ఉంటాయి. -
హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్ ప్లాన్, మార్కెట్ ఆధారిత ప్లాన్ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. -
ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!
కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే, సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలు కూడా. సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి ఆర్థిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో వారి పెట్టుబడులపై కంపెనీలకు రాబడులు వస్తాయి. ఇటు వ్యక్తిగతంగా లాభాలను చేకూర్చుతూనే మరోవైపు ఆర్థికవ్యవస్థకూ ప్రయోజనం చేసే పథకాల గురించిన చర్చే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది తమ పెరుగుతున్న ఆదాయానికి తగినట్టు పెట్టుబడులను పెంచుకోరు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) స్టెప్ అప్ లేదా టాపప్ సిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ప్రతి నెలా చేస్తున్న సిప్ మొత్తం, నిర్ణీత కాలానికి ఓ సారి (వార్షికంగా లేదా మీరు నిర్ణయించిన దాని ప్రకారం) నిర్ణీత శాతం పెరుగుతూ ఉంటుంది. దీంతో, ఇన్వెస్టర్లు స్వయంగా సిప్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క టాపప్ సిప్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థే ఆ పని చేసేస్తుంది. ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రాబడులు తక్కువేనన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాలో మిగులు నిధులను, లిక్విడ్ ఫండ్స్‌లోకి సులభంగా బదలాయించుకోవడం ద్వారా అధిక రాబడులు పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. ఫలితంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి నిధుల రాక పెరిగింది. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సంస్థ ‘యాక్టివ్ అకౌంట్ యాప్’ను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, తమ వివరాలను ఇవ్వడం ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క సింగిల్ క్లిక్‌తోనే ఈ యాప్ సాయంతో బ్యాంకు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌ను లిక్విడ్ ఫండ్‌లోకి పంపుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, పెట్టుబడుల కేటాయింపు విషయంలో వారికి సమస్య ఎదురవుతుంది. ఈక్విటీల్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, డెట్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది వారి సందేహం. ఇన్వెస్టర్ల తరఫున ఈ బాధ్యతను తీసుకుని ఇన్వెస్ట్ చేసేవే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ‘‘ఈక్విటీల విలువ (వ్యాల్యూషన్స్) పెరిగింద నుకోండి, ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించి, డెట్ విభాగంలో పెట్టుబడులు పెంచడం ఈ పథకాల్లో జరుగుతుంది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు బాగా దిద్దుబాటుకు గురై, స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయనుకోండి, అప్పుడు డెట్ విభాగంలో పెట్టుబడులు తగ్గించి, ఈక్విటీల్లో పెంచడం జరుగుతుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు అస్థిరతంగా మారినా, డెట్ విభాగంలోని పెట్టుబడుల వల్ల ఆ ప్రభావం తగ్గించడం జరుగుతుంది’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఐవో, ఈడీ ఎస్.నరేష్ తెలిపారు. స్వీప్ అకౌంట్లు ఇప్పుడు చాలా బ్యాంకులు స్వీప్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10,000–25,000 మధ్య ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉండొ చ్చు. నిర్ణీత బ్యాలెన్స్‌కు మించి అదనంగా ఉన్న బ్యాలెన్స్‌ను ఫిక్స్డ్ డిపాజిట్‌గా బ్యాంకు మారుస్తుంది. ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై వార్షికంగా 3.5 శాతం వడ్డీనే గిడుతుందని తెలిసిందే. అదే ఫిక్స్డ్ డిపాజిట్‌గా మార్చడం వల్ల అధిక వడ్డీ రేటు పొందే అవకాశం లభిస్తుంది. కస్టమర్ బ్యాంకుకు వెళ్లి తన సేవింగ్స్ బ్యాంకు ఖాతాను స్వీప్ అకౌంట్‌గా మార్చుకుంటే సరిపోతుంది. బీమా డిజైనర్ పాలసీలు వ్యక్తి వయసును బట్టి వివిధ దశల్లో బీమా కవరేజీ అవసరాలు మారిపోతుంటాయి. యువతీ, యువకులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు అధికమవుతాయి. అలాగే, వారికి పిల్లలు జన్మించిన తర్వాత బాధ్యతలు ఇంకాస్త పెరుగుతాయి. అందుకనే బీమా సంస్థలు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. టర్మ్ ప్లాన్ లలో సమ్ అష్యూరెన్స్ నిర్ణీత కాలానికి (ఐదేళ్లు) ఒకసారి ఆటోమేటిగ్గా పెరిగిపోతుంది. సాధారణ టర్మ్ ప్లాన్ తీసుకుని, తమ అవసరాలకు అనుగుణంగా మళ్లీ అదనపు టర్మ్ ప్లాన్ తీసుకోవడం, అందుకోసం వైద్య పరీక్షలు తరహా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయడం కంటే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు ఈ తరహా పాలసీలు అనుకూలంగా ఉంటాయి. విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడంతో పోలిస్తే, ఇలా ఉన్న ప్లాన్స్లోనే ఆటోమేటిగ్గా కవరేజీ పెరగడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉండడం మరో సానుకూలత. పన్ను రాయితీలు.. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదాయపన్ను రాయితీలు కూడా... వ్యక్తులు తమ ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరిచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలుగానే చూడాల్సి ఉంటుంది. రాయితీల కోసమైనా వ్యక్తులు జీవిత బీమా, రిటైర్మెంట్ ప్లాన్లు, ఇతర పెట్టుబడి సాధనాల వంటి వాటిపైపు దృష్టి సారిస్తారని అంచనా. ఆర్థిక సంవత్సరం చివర్లో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేతన జీవులు పరుగులు పెట్టడం ఇదే తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఈటీఎఫ్ (సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో పెట్టుబడులకూ ఇకపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం మరొకటి. ఇక విశ్రాంత జీవన అవసరాలను ముందుగానే గుర్తించి, రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయించేందుకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయ రాయితీకి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50వేల పెట్టుబడికి సెక్షన్ 80సీసీడీ 1బీ కింద పూర్తి పన్ను ప్రోత్సాహకాలు ఉన్నాయి. తాజా బడ్జెట్లోనూ ఎన్పీఎస్ పథకానికి సంబంధించి రాయితీలను కల్పించారు. లైఫ్‌సైకిల్ ఫండ్ ఇక ఎన్పీఎస్ పథకంలోని లైఫ్‌సైకిల్ ఫండ్ కూడా ప్రోత్సాహకమే. ఎన్‌పీఎస్‌లో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీలు, కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని క్లిష్టంగా చూస్తున్నారు. అదే లైఫ్ సైకిల్ ఫండ్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ వయసు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయింపులు జరుగుతుంటాయి. వయసు పెరుగుతూ, రిటైర్మెంట్ సమీపిస్తుంటే, ఈక్విటీలకు వాటా తగ్గుతూ డెట్ విభాగాలకు పెరగడం ఇందులో చూడొచ్చు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అందుబాటు ధరల గృహాలకు (రూ.45 లక్షల వరకు) మరో ప్రోత్సాహకంగా, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రాయితీని మరో రూ.1.5 లక్షలు పెంచారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ పొందొచ్చు. ఇది మొదటిసారి ఇంటి కొనుగోలుదారులకు ప్రోత్సాహకంగానే పనిచేస్తుందన్నారు దీపేష్ రాఘవ్. ప్రోత్సాహకాలతో జాగ్రత్త ► ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ ఆన్లైన్ లోనే, కొన్ని క్లిక్‌లతోనే పొందొచ్చనే ఆఫర్లను ప్రోత్సాహకాలుగా చూడొద్దు. ఇవి అధిక రుణ భారం పెంచే ప్రమాదం ఉంది. ► ప్రతీ నెలా మీ చేతికి అందే వేతనంలో ఇంటి రుణ ఈఎంఐ 50 శాతం మించకుండా చూసుకోవాలి. ► వినియోగ వస్తువులకు రుణాలను తీసుకోరాదన్న సూత్రానికి కట్టుబడి ఉండాలి. కేవలం ఇల్లు వంటి విలువైన ఆస్తి సమకూర్చుకునేందుకు రుణం తీసుకోవడం సమంజసం అవుతుంది. ► ఆకట్టుకునే బెనిఫిట్స్‌ను చూపించి సంప్రదాయ ఎండోమెంట్ బీమా పాలసీలను అంటగట్టే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. వీటిల్లో రాబడుల తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రత్యేకించి ఆయా సందర్భాల్లో రాబడులపై దృష్టి పెట్టాలి. ► మాల్స్‌కు వెళ్లినప్పుడు వారి మాయల్లో పడి ఏవి పడితే అవి కొనుగోలు చేయకుండా ఉండేందుకు గాను క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ మనీని తీసుకెళ్లొద్దు. కావల్సినంత నగదునే వెంట తీసుకెళ్లడం మంచిది. -
జీవిత బీమా తప్పనిసరి!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా కలిగి ఉండటమనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ అధ్యయనంలో తేలిందని బజాజ్ అలియాంజ్ లైఫ్ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా లైఫ్ గోల్స్ పేరుతో పలు నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 1,681 మంది సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో 60 శాతం మంది జీవిత బీమాను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ తరుణ్ చుగ్ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘‘సర్వే ప్రకారం.. పిల్లల విద్య, ప్రశాంత జీవనం, సొంత ఇల్లు కీలకంగా ఉన్నాయి. 10 శాతం మంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. పది మందిలో ఒకరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంతోపాటు అదనపు సంపాదన కోసం చూస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి అయిదుగురిలో ఇద్దరు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు’’ అని తరుణ్ చుగ్ వివరించారు. సోషల్ మీడియా ప్రభావం.. పలు విదేశీ పర్యాటక కేంద్రాలను చుట్టి రావాలని 28 శాతం మంది లక్ష్యంగా చేసుకున్నట్లు చుగ్ చెప్పారు. ‘‘దక్షిణాది వారిలో ఇది 35 శాతంగా ఉంది. ముగ్గురు మహిళల్లో ఒకరికి ట్రావెల్ గోల్స్ ఉన్నాయి. 40 శాతం మంది హెల్త్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సగం మంది బ్యాలెన్స్ లైఫ్ ఉండాలని కోరుకున్నారు. సామాజికంగా తాము ప్రభావం చూపాలని 10 శాతం మంది ఉత్సాహం కనబరుస్తున్నారు. జీవిత లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో సోషల్ మీడియా ప్రభావం ఉందని అయిదుగురిలో ఒకరు తెలిపారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిపడ చేయలేకపోయామని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 62 శాతం మంది తమ లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు’’ అని వివరించారు. -
ఐదుగురిలో ఒక్కరికే టర్మ్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలకు సంబంధించి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అత్యంత చౌకైనవే అయినప్పటికీ పాలసీదారుల్లో వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. జీవిత బీమా పాలసీలు తీసుకున్న ప్రతి అయిదుగురిలో ఒక్కరు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీదారులు కావటం గమనార్హం. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 మెట్రోపాలిటన్, ప్రథమ శ్రేణి నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4,566 మంది పాల్గొన్నారు. సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది (సుమారు 65%) జీవిత బీమా పాలసీలు తీసుకున్నప్పటికీ.. వారిలో 21% మంది మాత్ర మే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇక 53% మందికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాల గురించే తెలియదు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారిలో కూడా 57% మందికి సమ్ అష్యూర్డ్ గురించి అవగాహన లేదు. జీవిత బీమా పాలసీదారుల సంఖ్య, అవగాహన స్థాయి, రిస్కులను ఎదుర్కొనేందుకు మానసిక సంసిద్ధత అంశాల ఆధా రంగా ఇండియా ప్రొటెక్షన్ కోషంట్(ఐపీక్యూ) పేరిట ఈ సర్వే నిర్వహించారు. -
ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు
శివరామ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వరకు చెల్లిస్తున్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారింది. శ్రీరామమూర్తి ఏడాది క్రితం ఎన్‌పీఎస్‌లో చేరాడు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనంలో భాగంగా ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీనికి అదనంగా ఇన్వెస్ట్ చేయాలని ఉంది. కానీ, పన్ను మినహాయింపు ఉంటుందా? అన్నది సందేహం. పన్ను ఆదా సాధనాల విషయంలో వేతన జీవులకు పక్కా ప్రణాళిక ఉండాలి. శివరామ్ పన్ను ఆదా కోసం ఎండోమెంట్ పాలసీ తీసుకుని పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కవరేజీ తక్కువ, రాబడులు కూడా స్వల్పమే. పైగా ప్రీమియం ఎక్కువ. దీనివల్ల ఇతర పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతింటుంది. ఏటా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పన్ను పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది చివరి మూడు నెలల్లోనే పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటారు. ఆ తరహా వారికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా సాధనాలు, వాటి∙ప్రయోజనాలు వివరించేదే ఈ కథనం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పన్ను ఆదా విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయ పన్ను ఆదా కోసం దీన్ని మెరుగైన సాధనంగానే చూడొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను రూ.లక్ష మించినప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018లో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండగా... ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసే వారు వీటి గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అయితే, మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే అంతా ఒకేసారి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా జనవరి నుంచి మార్చి వరకు మూడు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్ట్రోగ్రఫీ సీఈవో శ్వేతా జైన్ సూచించారు. ఫండ్స్ పేరు 3 ఏళ్ల రాబడులు మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ 19.06 ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్ 12.67 ఆదిత్య బిర్లా ట్యాక్స్ రిలీఫ్96 12.48 ప్రిన్సిపల్ ట్యాక్స్ సేవింగ్ 12.59 యాక్సిల్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 12.38 డీఎస్పీ ట్యాక్స్‌సేవర్ 12.13 ఎన్పీఎస్ జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో గత ఐదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 10.84 శాతంగా ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ పీఎఫ్ఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో ఎన్పీఎస్ ఆకర్షణీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్ల సమయంలో ఉపసంహరించుకునే 60 శాతంలో 20 శాతం పైన పన్ను చెల్లించాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించడం పెద్ద ముందడుగుగా క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్గుప్తా పేర్కొన్నారు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా పీఎఫ్ఆర్డీఏ కల్పించింది. వీటిల్లో ఫండ్స్ పనితీరును గమనిస్తే... ఈక్విటీలో 50 శాతం ఇన్వెస్ట్ చేసే విభాగం ఫండ్ మేనేజర్ ఏడాది రాబడి మూడేళ్లు రాబడి ఐదేళ్లు రాబడి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ 3.37 9.56 11.31 ఎస్బీఐ పెన్షన్ ఫండ్ 4.12 9.98 11.45 యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ 3.19 9.85 11.41 కోటక్ పెన్షన్ ఫండ్ 1.37 9.58 11.22 హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఫండ్ 3.71 10.22 – పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లు కూడా సెక్షన్ 80సీ కింద పెట్టుబడి ప్రయోజనం అందించేవే. అయితే, ఎన్పీఎస్, యులిప్‌లతో పోలిస్తే ఇవి అంత ఆకర్షణీయం కావు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా రూ.50,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంది. పని చేస్తున్న కంపెనీ ఉద్యోగి పెన్షన్ కోటా కింద జమ చేస్తే అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. కానీ బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లకు ఈ ప్రయోజనాలు లేవు. కొత్త యులిప్ పాలసీల్లో చార్జీలు చాలా వరకు దిగొచ్చాయి. బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో మాత్రం చార్జీలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. యులిప్‌ల మాదిరే బీమా పెన్షన్ ప్లాన్లలోనూ చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ జాతీయ పొదుపు పత్రా ల్లో పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ఉంది. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8%. ఈక్విటీల గురించి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేని వారు, పెట్టుబడి పెట్టి నిశ్చితంగా ఉండాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైనది. దీనిలో వచ్చే వడ్డీ ఆదాయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు వీలుంటుంది. ఉదాహరణకు 2019 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశారనుకుంటే, 2020 జనవరి నాటికి రూ.4,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో దీనిపై మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికీ ఇది అనువైనదే. బ్యాంకుల్లో వీటిని పొందొచ్చు. బ్యాంకు ఎఫ్డీలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ 7.5–8.25% మధ్య ఉంది. సెక్షన్ 80 సీ పన్ను ఆదా కోసమయితే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు తిరిగి ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకోవడానికి ఉండదు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వారు ఆన్లైన్లోనే కొన్ని క్లిక్‌లతో ఈ డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ వడ్డీ రేటు ఐడీఎఫ్సీ బ్యాంకు 8.25 ఏయూస్మాల్ ఫైనాన్స్ 8.00 లక్ష్మీ విలాస్ బ్యాంకు 7.75 డీసీబీ బ్యాంకు 7.75 ఆర్బీఎల్ బ్యాంకు 7.60 బీమా పాలసీలు ఆర్జించే వ్యక్తికి మరణ ప్రమాదం ఎదురైతే, అతడు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే తమపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి. కానీ, అది టర్మ్ ప్లాన్ రూపంలో ఉంటే మంచిది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు ఓ వ్యక్తి కుటుంబానికి సరిపడా బీమా రక్షణ అందించలేవు. ఎందుకంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 30 ఏళ్ల వ్యక్తికి వార్షికంగా కనీసం రూ.40–50 లక్షల కవరేజీ అవసరం. ఎండోమెంట్ పాలసీ అయితే ఇంత కవరేజీ కోసం రూ.ఏడాదికి రూ.4–5 లక్షల ప్రీమియం చెల్లించాలి. కానీ రూ.5,000లోపు ప్రీమియంతోనే 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.50 లక్షల టర్మ్ పాలసీని పొందొచ్చు. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియానికి కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...(పీపీఎఫ్) 2019 జనవరి–మార్చి నెలకు వడ్డీ 8 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ... పీపీఎఫ్ సాధనం ఇప్పటికీ మంచి సాధనంగా ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. రాబడి పూర్తిగా పన్ను రహితం. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనం అవుతుంది. ఎందుకంటే ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిసిందే. అయితే, ఇప్పటికే ప్రావిడెండ్ ఫండ్‌కు కొంత కేటాయించే వారు పన్ను ఆదా కోసం మరింతగా అదే బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వివేకం అనిపించుకోదు. దీనికి బదులు ఇక్కడి ప్రత్యామ్నాయ సాధనాల్లో మీకు అనువైనది ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడులు, రాబడులకు హామీదారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఏ పోస్టాఫీసు శాఖ లేదా బ్యాంకు శాఖలో అయినా పీపీఎఫ్ ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్ సదుపాయం కలిగిన బ్యాంకులో ఎంచుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.7 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం మరింత ఆకర్షణీయత సంతరించుకుంది. దీంతో 60 ఏళ్లు దాటిన వారికి వార్షికంగా రూ.3.5 లక్షలకు పన్ను లేనట్టు అవుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5.5 లక్షలకు పన్ను ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోకీ అధిక వడ్డీ రేటు ఉన్నది ఈ పథకంలోనే. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరని వారు 58 ఏళ్లకే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన కుమార్తెల పేరిట పొదుపు చేసుకుని పన్ను ఆదా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం. వడ్డీ రేటును ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌తో ముడిపెట్టినందున ప్రతీ క్వార్టర్‌కు మారుతుంటుంది. పీపీఎఫ్ పథకంలో కంటే అధిక వడ్డీ రేటు ఇందులో లభిస్తోంది. పీపీఎఫ్‌లో మాదిరే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.250 పెట్టుబడితో పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకుల్లో దీన్ని ఆరంభించొచ్చు. తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెల పేరిటే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కుమార్తెల పేరిట రెండు ఖాతాలు ప్రారంభించిన వారు రెండింటిలోనూ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడే పథకం. యులిప్‌లు యూనిట్ లింక్డ్ బీమా పథకాలను ‘యులిప్’లుగా పిలుస్తారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో లాభాలు గడించే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యులిప్‌లు బీమాతో కూడిన పెట్టుబడి పథకాలు కావడంతో వీటికి మినహాయింపు ఉంది. యులిప్‌ల్లో కేవలం ఈక్విటీలే కాకుండా డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. యులిప్ పాలసీల్లో ఈక్విటీ నుంచి డెట్ ఫండ్స్‌కు మారినా పన్ను వర్తించదు. ఫండ్స్‌లో మాదిరిగా కాకుండా, యులిప్ పాలసీల్లో డెట్ అయినా ఈక్విటీ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆర్జించే మొత్తంపైనా పన్ను ఉండదు. కాగా ఐదేళ్ల పాటు లాకిన్. గడువు లోపు ముందుగానే తప్పుకుంటే సరెండ్ చార్జీల వంటివి ఉంటాయి. యులిప్ల్లోనే చైల్డ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లల పేరిట తీసుకుంటే, పాలసీ గడువు లోపు సంరక్షణ చూసే తల్లి లేదా తండ్రి అకాల మరణం చెందితే, పిల్లల పేరిట పెట్టుబడి ఆగకుండా కొనసాగుతుంది. -
1,44,000 : జిల్లా రైతు బీమా సభ్యుల సంఖ్య..!
సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్ : సాగును ప్రోత్సహించడం.. రైతులకు వెన్నుదన్నుగా నిలవడం.. పంట పెట్టుబడితో ఆదుకోవడమే కా కుండా రైతులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా, అకాల మరణం సంభవించినా, ఆత్మహత్య చేసుకున్నావారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబంధు సామూహిక బీమా పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందనుండగా.. ఒక్కో రైతుకు రూ. 2,271 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. రైతుబంధు సామూహిక జీవిత బీమా చేయించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తున్నారు. గత నెల 23వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, నామినీ పత్రాల సేకరణను ఈనెల 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇంకా మూడు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. అటు ఖరీఫ్.. ఇటు సమన్వయ లోపం... రైతుబంధు సామూహిక బీమా పథకంపై వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిçస్తున్నా.. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసిన కొత్త పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడం, చాలామందికి పాసు పుస్తకాలు అందకపోవడం తదితర సమస్యల వల్ల రైతు బీమా పథకానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయశాఖ ఏఈఓలే ఇంటింటికీ తిరగడం వల్ల పనిభారంతో రైతు బీమా పథకం జిల్లాలో అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం.. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లే సరికే రైతులు పొలం పనులకు వెళ్లిపోతున్నారు. ఇక బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాలు సేకరించేందుకు ప్రభుత్వం విధించిన గడువు 10వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే, జిల్లాలోని మొత్తం 3,35,852 మంది రైతుల్లో 2,22,510 మందిని పథకానికి అర్హులని గుర్తించారు. ఇక ఇందులో ఇప్పటివరకు 1.44 లక్షల మంది నుంచే నామినీ పత్రాలు సేకరించగలిగారు. అంటే మిగిలిన మూడు రోజుల్లో ఇంకా 78,510 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. ఏదైనా ఒక్కచోటే... 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారికి బీమా సౌకర్యం కల్పించే విషయంపై సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా బీమాపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. అంతేకాక ఒకే రైతుకు రెండు, మూడు చోట్ల భూములు ఉండటం వల్ల రికార్డుల్లో విస్తీర్ణం ఎక్కువగా కనిపించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూములు ఒకచోట.. నివాసం మరోచోట ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే రైతు ఏదైనా ఒకచోట బీమా చేయించుకోవచ్చని.. అన్ని చోట్లా అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు బీమా పథకంపై నిరాసక్తత కనబరుస్తున్నారు. నామినీ పత్రాల సేకరణ వేగవంతం జిల్లాలో రైతుల వద్ద నుంచి రైతు బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఏఈఓలు పత్రాలు స్వీకరిస్తున్నారు. బీమా పత్రాల ఆన్లైన్ ప్రక్రియ సైతం చురుగ్గా సాగుతోంది. గడువు లోగా మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తక్కువ ప్రీమియం... అధిక కవరేజీ
ఆర్థిక సాధనాలు అనగానే ఫిక్సిడ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ స్కీములు, ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలతో కూడిన జీవిత బీమా పాలసీలు, బంగారం.. ప్రాపర్టీలే టక్కున గుర్తొస్తాయి. అయితే, పూర్తిగా జీవిత బీమా కోసమే ఉద్దేశించిన టర్మ్ ప్లాన్ల గురించి అంతగా ఆలోచన రాదు. నిజం చెప్పాలంటే బీమా పాలసీల్లో అత్యంత సింపుల్ పాలసీ ఇదే. ప్రతి వేతనజీవి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమిది. ఇంటిల్లిపాదీ ఆధారపడే కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే వారికి ఆర్థికంగా భరోసానిచ్చేదే టర్మ్ పాలసీ. టర్మ్ పాలసీలు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చేవే అయినా.. వీటిపై పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఉదాహరణకు.. సిగరెట్ అలవాటు లేని 35 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్లకు అత్యధికంగా రూ.1 కోటి రూపాయల కవరేజీ తీసుకున్న పక్షంలో కట్టాల్సిన ప్రీమియం రూ. 8,300 మాత్రమే. టర్మ్ ప్లాన్ పూర్తయ్యేంత వరకూ ఇంతే ప్రీమియం ఉంటుంది. ఇది చాలు.. టర్మ్ ప్లాన్ ఎంత చౌకైనదో తెలియడానికి. ఇక, సిగరెట్ అలవాటు లేని 45 ఏళ్ల వ్యక్తి గానీ అదే రూ.1 కోటి కవరేజీ కోసం 30 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే రూ.14,600 కట్టాలి. అంటే పదేళ్ల పాటు వాయిదా వేయడం వల్ల మొత్తం మీద రూ.1.38 లక్షలు అధికంగా కట్టాలి. కాబట్టి.. వీలైనంత వరకూ యుక్త వయస్సులోనే పాలసీ తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. కుటుంబానికి ఆర్థిక భరోసా.. పాలసీదారుకు అనుకోనిదేమైనా జరిగితే తనపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా అవస్థలు పడకుండా ఆదుకుంటుంది టర్మ్ ప్లాన్. అవసరాలకు అనుగుణమైన ఆప్షన్స్‌తో కూడా టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. సమ్ అష్యూర్డ్‌ను ఒకేసారి అందుకునే ఆప్షన్ లేదా కొంతభాగాన్ని ఒకేసారి, మరికొంత భాగాన్ని నెలవారీ ఆదాయంగాను పొందే ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి. ఒకవేళ మెచ్యూరిటీ గడువు తీరేదాకా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను తిరిగి చెల్లించే పాలసీలూ ఉన్నాయి. ఇక, నెలవారీగానూ లేదా వార్షికంగాను అందుకునే మొత్తం నిర్దిష్ట శాతం మేర పెరుగుతూ ఉండే ఆప్షన్ కూడా ఇస్తున్నాయి బీమా కంపెనీలు. ఎంత కవరేజీ.. సాధారణంగా ప్యూర్ టర్మ్ పాలసీని ఎంచుకునేటప్పుడు ఎంత కవరేజీ తీసుకోవాలన్న దానికి సంబంధించి కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఆదాయం, కుటుంబం జీవన విధానం, ఆస్తులు, అప్పులు మొదలైనవాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. బండగుర్తుగా చెప్పాలంటే.. స్థూల వార్షికాదాయానికి కనీసం పది రెట్లయినా కవరేజీ ఉండాలి. ఒకవేళ భారీ రుణాలున్నాయంటే.. ఇది మరింత ఎక్కువగా ఉండాలి. ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించి సెక్షన్ 80సీ పరంగా చూసినా.. భారీ రాబడులిచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చూసినా టర్మ్ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. కానీ, పాలసీదారుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడిపోకుండా ఆదుకునే ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. - రిషి శ్రీవాస్తవ ,టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ -
మీ బీమాకు నామినీ ఉన్నారా?
జీవిత బీమా పాలసీ ఎందుకు? అనుకోనిదేమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికే కదా!! మరి పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆ పరిహారం ఎవరికి అందించాలన్న వివరాలను పేర్కొనకపోతే లాభమేంటి? కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కదా!! అందుకే జీవిత బీమా పాలసీకి నామినీ చాలా అవసరం. దీని ప్రాధాన్యాన్ని తెలియజేసే కథనమే ఇది. నామినీ ఎందుకు? నామినేషన్ ప్రాధాన్యం తెలుసుకునే ముందు నామినీ గురించి తెలుసుకోవాలి. పాలసీదారు మరణిస్తే జీవిత బీమా పరిహారం అందుకునేందుకు అర్హులైన వారే నామినీ. నిజానికి టర్మ్ పాలసీల్లో ఇది తప్పనిసరి కనక అంతా నామినీ పేరు పేర్కొంటారు. కానీ కొన్ని రకాల మెచ్యూరిటీ తీరాక నగదు అందే పాలసీలకు కొందరు నామినీ వివరాలివ్వరు. తామే తీసుకుంటాం కదా అనే భరోసాయే దీనిక్కారణం. నిజానికి వాటికీ కొంత కవరేజీ ఉంటుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో ఆ కవరేజీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. అయితే పాలసీలో ఎవరినీ నామినీగా పేర్కొనకపోతే అలాంటి సందర్భంలో పరిహారం చట్టబద్ధమైన వారసులకే చెందుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు చట్టబద్ధమైన వారసులు. కాకపోతే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ‘‘బీమాసంస్థ వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అడుగుతుంది. అది చట్టబద్ధమైన వారసులను సూచించేలా ఉండాలి. ఇందుకు సమయం పడుతుంది. వారి కుటుంబ సభ్యులకు వ్యయాలు కూడా అవుతాయి. ఇది సరైనది కాదు. ఎందుకంటే బీమా పాలసీ తీసుకోవడం అన్నది తమపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత చేకూర్చేందుకే’’ అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసుఫ్ పచ్‌మరివాలా వివరించారు. ఒకరికి మించి వారసులుంటే... నామినీగా ఎవరినీ పేర్కొనని సందర్భాల్లో ఒకరికి మించి వారసులు ఉంటే క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ మరింత జటిలం అవుతుంది. బీమా సంస్థలు పలు రకాల పత్రాలు, ఇండెమ్నిటీ బాండ్ అడగొచ్చు. ఇందుకు సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇరు పార్టీల మధ్య వివాదానికి దారితీయవచ్చు. ఒకవేళ పాలసీదారుడు నామినీగా ఎవరినీ పేర్కొనకపోయినా, విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తికి బీమా సంస్థ నిబంధనల మేరకు అన్ని ప్రయోజనాలను చెల్లిస్తుంది. ఒకవేళ బీమా పాలసీలో నామినీగా ఒకరిని నమోదు చేయించి, విల్లులో మరొకరిని చట్టబద్ధమైన వారసుడిగా పేర్కొంటే, అప్పుడు బీమా సంస్థ విల్లులో ఉన్న వారికే ప్రయోజనాలను బదలాయిస్తుంది. అందుకే పాలసీలో నామినీగా ప్రతిపాదించిన వారినే విల్లులోనూ పేర్కొనడం మర్చిపోవద్దు. నమోదు ప్రక్రియ ఇలా... జీవిత బీమా పాలసీ తీసుకునే సమయంలోనే నామినీ వివరాలిస్తే మంచిది. దీని వల్ల భవిష్యత్తులో వారి కుటుంబానికి సమస్యలు రాకుండా ఉంటాయి. ‘‘నామినీ నమోదు ప్రక్రియ చాలా సులభం. నామినీగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పూర్తి పేరు (అధికారిక ధ్రువీకరణ పత్రాల్లో ఉన్నట్టుగా), వయసు, పాలసీదారునితో ఉన్న అనుబంధం వివరాలు ఇస్తే చాలు’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ పునీత్ నందా తెలిపారు. నామినీ అంటే ఒక్కరనే పరిమితి లేదు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే ఆప్షన్ పాలసీదారునికి ఉంటుంది. ఇలా పేర్కొంటే ఒక్కో నామినీకి ఎంత మేర పరిహారం చెల్లించాలన్న వివరాలూ ఇవ్వాలి. ఒకవేళ నామినీ మైనర్ అయితే ఆ మైనర్‌కు సంబంధించి అపాయింటీ లేదా ట్రస్టీని పేర్కొనాల్సి ఉంటుంది. ‘‘చట్ట ప్రకారం మైనర్లు ఓ కాంట్రాక్టు పరిధిలో చేరేందుకు అర్హులు కారు. దాంతో బీమా పరిహారం నేరుగా పొందేందుకు అవకాశం లేదు. ఇటువంటి సందర్భం ఎదురైతే అపాయింటీకి పరిహారం చెల్లిస్తారు’’ అని పునీత్ వివరించారు. ఒకసారి నామినీగా ఎవరి పేరును అయినా నమోదు చేసిన తర్వాత పాలసీ కాల వ్యవధిలోపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరిగి మార్చుకోవచ్చు. చివరిగా పేర్కొన్న నామినీయే చట్టప్రకారం అర్హులుగా ఉంటారు. ఒకవేళ నామినీలో మార్పులు చేయదలిస్తే సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి బీమా సంస్థకు అందజేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నామినేషన్ వివరాలను సమీక్షించుకుంటూ, జీవితంలో వివాహం, నామినీగా ప్రతిపాదించిన వారు మరణించడం వంటి సందర్భాల్లో కొత్తగా మరొకరిని నామినీగా చేర్చుకోవడం పాలసీదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రస్తుతం బీమా సంస్థలు ఆన్లైన్లోనే నామినీ వివరాలు మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. చెల్లుబాటు జీవిత బీమా పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో కాదు. ఉదాహరణకు పాలసీదారుడు ఏదైనా రుణం తీసుకుని హామీగా బీమా పాలసీని తనఖాగా ఉంచితే, అప్పుడు ఆ పాలసీని అసైన్ చేయాల్సి ఉంటుందని యూసుఫ్ పేర్కొన్నారు. ‘‘పాలసీని తనఖాగా ఉంచి ఇతరులకు అప్పగించితే అప్పుడు పాలసీదారుడు ఆ విషయాన్ని కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. దాంతో బీమా సంస్థ అసైన్మెంట్ను రిజిస్టర్ చేస్తుంది. అప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను అసైనీ (ఎవరికి అయితే తనఖా పెట్టారో)కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ పాలసీదారుడు మరణిస్తే పరిహారం అసైనీకే చెల్లించడం జరుగుతుంది’’ అని యూసుఫ్ వివరించారు. తనఖా పెట్టి ఆ తర్వాత విడిపించుకుంటే తిరిగి పాలసీదారుడు తన పాలసీకి నామినేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నామినీ ఎవరు? నామినీ అంటే పాలసీదారుడి కుటుంబమే. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు. అయితే, పాలసీదారుడు ఇంకెవరినైనా కూడా నామినీగా ప్రతిపాదించొచ్చు. ‘‘చట్టబద్ధమైన వారసులు కాకుండా, రక్త సంబధీకులు కాకుండా మరెవరినో నామినేట్ చేస్తే, క్లెయిమ్ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఏర్పడవచ్చు. రక్త సంబంధం లేదా పాలసీదారుని కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి ప్రశ్నలు లేకుండా క్లెయిమ్ దరఖాస్తును ఆమోదించడం జరుగుతుంది. ఇతరులైతే బీమా కంపెనీల్లో అండర్ రైటింగ్ సమయంలో ప్రశ్నలు తలెత్తవచ్చు’’ అని పచ్‌మరివాలా పేర్కొన్నారు.