జీవిత బీమా కంపెనీల (లైఫ్ ఇన్సూరెన్స్)కు డిసెంబర్ నెలలో నూతన పాలసీల రూపంలో రూ.24,466 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చింది. 2020 డిసెంబర్‌లో ఆదాయం రూ.24,383 కోట్లతో పోలిస్తే పెద్దగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను ఐఆర్‌డీఏఐ విడుదల చేసింది. జీవిత బీమా దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ పనితీరు నిరాశపరిచింది. ఈ సంస్థకు కొత్త పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్) రూపంలో ఆదాయం డిసెంబర్ నెలలో 20 శాతం క్షీణించి రూ.11,434 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎల్‌ఐసీకి కొత్త పాలసీ రూపంలో రూ.14,345 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.
ప్రైవేటు సంస్థల మెరుగైన పనితీరు
మిగిలిన 23 ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం ఉమ్మడిగా 30 శాతం పెరిగింది. రూ.13,032 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఇది రూ.10,037 కోట్లుగానే ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ న్యూ బిజినెస్ ఆదాయం 55 శాతం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ లైఫ్ ఆదాయం సైతం 27 శాతం వృద్ధితో రూ.2,943 కోట్లుగా నమోదైంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 70 శాతం పెరిగి రూ.1,164 కోట్లకు చేరుకుంది.
మ్యాక్స్‌లైఫ్ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,013 కోట్లుగా ఉంటే, టాటా ఏఐఏ లైఫ్ ఆదాయం 50 శాతం పెరిగి రూ.660 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఆదాయం 6 శాతం పెరిగి రూ.544 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం 6 శాతం క్షీణించి రూ.1,380 కోట్లకు పరిమితమైంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఆదాయం స్వల్పంగా తగ్గగా.. ఏగాన్ లైఫ్ న్యూ బిజినెస్ ప్రీమియం 36 శాతం పడిపోయి రూ1.29 కోట్లుగా ఉంది.
తొమ్మిది నెలల్లో మిశ్రమ ధోరణి
2021–22లో మొదటి తొమ్మిది నెలల్లో అన్ని జీవిత బీమా సంస్థల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 7 శాతం పెరిగి రూ.2,05,231 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ఎల్‌ఐసీ ఆదాయం 3 శాతం తగ్గి రూ.1,26,015 కోట్లుగా ఉంటే.. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.79,217 కోట్లుగా నమోదైంది.
చదవండి: ఇన్సురెన్స్ కంపెనీకి వార్నింగ్.. రూ.79 లక్షలు చెల్లించాలంటూ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment