ముంబై: చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే 105 శాతం వెనక్కి చెల్లించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త టర్మ్ ప్లాన్ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ను ప్రవేశపెట్టింది. పాలసీదారు జీవిత దశల ఆధారంగా బీమా కవరేజీ సర్దుబాటు అయ్యే (లైఫ్‌స్టేజ్ కవర్) ఆప్షన్ ఉండడం ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత. ఇది కాకుండా కవరేజీ స్థిరంగా ఉండే ‘లెవల్ కవరేజీ’ ఆప్షన్ కూడా ఉంది. పాలసీదారులు తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. 64 క్రిటికల్ ఇల్‌నెస్‌లకు (తీవ్ర అనారోగ్య సమస్యలు) సైతం ఈ ప్లాన్‌లో కవరేజీ తీసుకోవచ్చు.
లైఫ్‌స్టేజ్ ఆప్షన్‌లో బీమా కవరేజీ ఆరంభంలో క్రమంగా పెరుగుతూ వెళుతుంది. పాలసీ చివర్లో (పెద్ద వయసులో) క్రమంగా కవరేజీ తగ్గుతూ వస్తుంది. పాలసీ అమల్లో ఉన్నప్పుడు మరణిస్తే పరిహారం, గడువు పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాకానీ ప్రయోజనం కోరుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులను (క్రిటికల్ ఇల్‌నెస్‌లు) దృష్టిలో పెట్టుకుని ప్లాన్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment