ICICI Prudential
-
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త పాలసీ
పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
అరుదైన పెట్టుబడుల అవకాశాలు..!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్ కూడా ఒకటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కంపెనీల ధరలు ఆకర్షణీయమైన స్థాయిలకు, చౌక విలువకు దిగి వస్తాయి. అలాంటప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడమే స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌లో కనిపిస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ కూడా ఇదే మాదిరి పనిచేస్తుంటుంది. ఈ పథకానికి మెరుగైన రాబడుల చరిత్ర ఉంది. రాబడులు ఈ పథకంలో ఐదేళ్ల క్రితం ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు అది రూ.2.8 లక్షలుగా మారి ఉండేది. ఈ పథకానికి ఐదేళ్ల చరిత్ర ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో శంకరన్ నరేన్తోపాటు, రోషన్ చట్కే దీని నిర్వహణ వ్యవహరాలు చూస్తున్నారు. ఈ పథకం 2019 జనవరి 15న మొదలైంది. ఆరంభం నుంచి చూస్తే ఈ పథకం ఏటా 22.9 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక రాబడులు (సీఏజీఆర్) అందించింది. ఈ పథకం పనితీరుకు బెంచ్‌మార్క్‌గా పరిగణించే నిఫ్టీ 500 టీఆర్ఐ ఇదే కాలంలో ఇచ్చిన రాబడి 19 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఏటా 37.7 శాతం చొప్పున రాబడి అందించగా, నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 19.8 శాతంగానే ఉంది. సూచీ కంటే 17.9 శాతం అధిక రాబడిని అందించినట్టు తెలుస్తోంది. ఏడాది కాల రాబడి చూసినా 38 శాతంగా ఉంది. ఇదే కాలంలో సూచీ రాబడి 30 శాతమే కావడం గమనించాలి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఈ పథకంలో సిప్ చేస్తూ వచ్చి ఉంటే, రూ.12.58 లక్షలు సమకూరి ఉండేది. పెట్టుబడుల విధానం ముందు చెప్పినట్టుగానే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ అన్నది స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌తో నడిచే పథకం. ఏదైనా ఒక కంపెనీ లేదా రంగంలో కొన్ని సమస్యల వల్ల షేరు ధర గణనీయంగా దిద్దుబాటుకు గురైనప్పుడు, ఆ కంపెనీ/రంగం దీర్ఘకాల వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయన్నది ఈ పథకం అంచనా వేస్తుంది. దీర్ఘకాలంలో బలమైన, మెరుగైన పనితీరుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫండ్ మేనేజర్ భావిస్తే వెంటనే దిద్దుబాటుకు గురైన కంపెనీల్లో, రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. సకాలంలో లాభాలు స్వీకరించడం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంపెనీలపై దృష్టి సారించడం వంటివి మంచి పనితీరుకు దోహదం చేస్తున్న అంశాలు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,205 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 92.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.53 శాతం డెట్ సాధనాలకు కేటాయించగా, మిగిలినది నగదు రూపంలో ఉంది. ఈక్విటీల్లో 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 20 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కేటాయింపులు 1.78 శాతంగా ఉన్నా యి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఫార్మాస్యూటికల్స్, టెలికం సర్వీసెస్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం భారతీ ఎయిర్టెల్ 6.74 ఐసీఐసీఐ బ్యాంక్ 6.40 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.64 సన్‌ఫార్మా 4.43 ఇన్ఫోసిస్ 3.96 కోటక్ బ్యాంక్ 3.92 ఓఎన్జీసీ 3.81 ఎన్టీపీసీ 3.75 టాటా స్టీల్ 2.93 హీరో మోటో 2.82 -
ఈ ఫండ్‌తో నమ్మకమైన రాబడులు!
ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్‌ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. రాబడులు ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్ మార్క్ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్‌లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్ విభాగంలో ఎస్వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 7.43 ఐసీఐసీఐ బ్యాంక్ 7.01 భారతీ ఎయిర్టెల్ 6 ఓఎన్జీసీ 4.18 మారుతి సుజుకీ 3.92 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.39 సన్‌ఫార్మా 3.07 ఇన్ఫోసిస్ 3.02 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.95 టాటామోటార్స్ డీవీఆర్ 2.63 -
ఈ మ్యానిఫ్యాక్చరింగ్ ఫండ్‌తో లాభాలే లాభాలు
ప్రపంచ సేవల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశ ఎగుమతుల ఆదాయంలో సేవల రంగం వాటాయే ఎక్కువ. ప్రపంచ తయారీ రంగంలో మన వాటా నామమాత్రం. అందుకే కేంద్ర సర్కారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆత్మనిర్భర భారత్, భారత్‌లో తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 14 రంగాల్లో ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు తయారీ కోసం చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు, సరఫరా వ్యవస్థలో భాగంగా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల వైపు చూస్తున్నాయి. దీంతో భారత్ ముందు తయారీ పరంగా అపార అవకాశాలున్నాయి. దీంతో వచ్చే దశాబ్ద కాలంలో భారత్ అంతర్జాతీయ తయారీ రంగంలో తన వాటాను గణనీయంగా పెంచుకోనుందని అంచనా. ఆటోమొబైల్, రక్షణ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, రైల్వేస్, టెక్స్టైల్స్, కెమికల్స్, పెట్రోలియం అండ్ గ్యాస్ రంగ కంపెనీలు మంచి వృద్ధి అవకాశాలు చూడనున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, పెరుగుతున్న ఆదాయం హౌసింగ్, ఇన్ఫ్రా రంగాలకు కలసి రానుంది. కనుక తయారీ రంగంలో రానున్న అద్భుతమైన అవకాశాల నుంచి లబ్ధి పొందాలనుకునే ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. రాబడులు ఘనం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆరంభం నుంచి అద్భుత పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 అక్టోబర్‌లో మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతానికి పైనే రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ట్రెయిలింగ్ విధానంలో (ఏడాది, రెండు, మూడేళ్ల చొప్పున) ఏడాదిలో 35.3 శాతం, మూడేళ్లలో ఏటా 35.3 శాతం చొప్పు న రాబడిని అందించింది. ఇక ఐదేళ్లలో చూస్తూ రాబడి ఏటా 19.7 శాతంగా ఉంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో చేసిన పెట్టుబడులపై రాబడి ఐదేళ్లలో ఏటా 25.3 శాతం చొప్పున ఉంది. ముఖ్యంగా రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. రోలింగ్ రాబ డులు (ఒక కాలం నుంచి మరో కాలం వరకు నిర్ధేశిత కాలంలో పనితీరు) చూస్తే 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య ఏటా 24.6 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 116గా ఉంది. అంటే మార్కెట్ ర్యాలీల్లో ఈ పథకం ఎన్ఏవీ వృద్ధి మెరుగ్గా ఉండడానికి ఇది నిదర్శనం. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 59.3గా ఉంది. అంటే బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువ నష్టపోతుందని అర్థం. పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం తయారీలో సైక్లికల్, డిఫెన్సివ్ (రక్షణాత్మకమైనవి) రంగాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. వ్యాల్యూ, గ్రోత్ ఈ రెండు రకాల పెట్టుబడి విధానాలను అనుసరిస్తుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఇలా అన్ని రకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మల్టీక్యాప్ తరహా విధానాన్ని అనుసరిస్తోంది. మెరుగైన ఫలితాలకు, రంగాల వారీ, కంపెనీల వారీ ఎంపిక విధానాన్ని కూడా పాటిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఆటో యాన్సిలరీ, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 15 శాతం ఇన్వెస్ట్ చేయగా, ఇంధన రంగ కంపెనీలకు 7 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 7%, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.81%, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.47 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలపై తక్కువ వెయిటేజీ అనుసరిస్తోంది. తన నిర్వహణ ఆస్తుల్లో 90 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.43 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 8.86% మేర నగదు నిల్వలు ఉన్నాయి. -
ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలు: అదేంటో తెలుసా?
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ‘ఐషీల్డ్’ పేరిట కొత్త బీమా పాలసీని ప్రవేశపెట్టాయి. ఇటు ఆరోగ్య బీమా, అటు జీవిత బీమా ప్రయోజనాలు ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దాయి. వైద్య చికిత్సల వ్యయాలకు కవరేజీ ఇస్తూనే పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో కుటుంబానికి పెద్ద మొత్తంలో సమ్ అష్యూర్డ్‌ను అందించేలా ఈ పాలసీ ఉంటుందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) చికిత్స వ్యయాల భారం పడినా, ఇంటిపెద్దకు ఏదైనా జరిగినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ సమగ్రమైన బీమా పథకం తోడ్పడగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా వివరించారు. హాస్పిటలైజేషన్, డే–కేర్ ట్రీట్మెంట్ మొదలైన వాటికి ఆరోగ్య బీమా భాగం ఉపయోగపడనుండగా, జీవిత బీమా భాగంతో.. 85 ఏళ్ల వయస్సు వరకూ లైఫ్ కవరేజీ ఉంటుంది. (792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ ) -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గోల్డ్ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) ఐసీఐసీఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్, అలాగే డిఫర్డ్ ఇన్కమ్ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు. మూడోదైన డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్ వాలెట్లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్సెట్ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) -
అధిక కవరేజీ వైపు మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లలో అధిక కవరేజీ ఉండే ప్లాన్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరిగిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ తెలిపారు. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ప్రీమియం వెయివర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉండే టర్మ్ ప్లాన్లకు, జీవితంలోని వివిధ దశల్లో అవసరాలకు అనుగుణమైన కవరేజీనిచ్చే వినూత్న ప్లాన్లకు ఆదరణ పెరుగుతోందని వివరించారు. పొదుపునకు సంబంధించి కచ్చితమైన రాబడినిచ్చే సాధనాలపై ఆసక్తి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పిస్తూ జీవితకాలం ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ రిటర్వ్ ఆఫ్ ప్రీమియం వంటి వినూత్న పథకాలను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు కచ్చితమైన రాబడులిచ్చే పథకాలను కస్టమర్లు ఇష్టపడుతుండటంతో సుఖ్ సమృద్ధిలాంటి పథకాలు ఉన్నాయన్నారు. ఇవి కచ్చితమైన రాబడులతో పాటు బోనస్‌ల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయని శ్రీనివాస్ చెప్పారు. రిటైర్మెంట్ ప్లానింగ్ ముఖ్యం.. జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవిత కాలం పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ కోసం తగిన ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోందని శ్రీనివాస్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుందని, ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్నదొక్కటే ఆదాయ మార్గంగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఆర్థికంగా ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితం గడపాలంటే సరైన ప్రణాళిక వేసుకుని, తగిన సాధనాల్లో సాధ్యమైనంత ముందు నుంచీ ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వివరించారు. రిటైర్మెంట్ ప్రణాళికను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చని ఆయన చెప్పారు. మొదటి దశలో నిధిని ఏర్పాటు చేసుకోవడం, రెండో దశలో దాన్ని వినియోగించుకోవడం ఉంటుందన్నారు. జీవిత బీమా కంపెనీలు అందించే యులిప్స్, సాంప్రదాయ సేవింగ్స్ సాధనాల్లాంటివి దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకునేందుకు ఉపయోగపడగలవని శ్రీనివాస్ వివరించారు. అధిక రిస్కును భరించగలిగే వారు యులిప్‌లను ఎంచుకోవచ్చని, రిస్కులను ఎక్కువగా ఇష్టపడని వారు సాంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకోవచ్చన్నారు. యాన్యుటీలకు సంబంధించి జాయింట్ లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం స్థిరమైన ఆదాయం లభించగలదని ఆయన చెప్పారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. ఈ సంస్థ 2000 డిసెంబర్లో మొదలైంది. 2020–21 నాటికి ఏయూఎం రూ.100 కోట్లుగా ఉంటే, ఇన్నేళ్ల కాలంలో రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. మొదటి రూ.50,000 కోట్ల మైలురాయిని చేరుకునేందుకు తొమ్మిదేళ్లు పట్టగా, రూ.లక్ష కోట్ల ఏయూఎం మార్క్‌ను 14 ఏళ్లలో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే ఏయూఎంను రెట్టింపు చేసుకుంది. రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరిన తర్వాత వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తెలిపింది. కంపెనీ పట్ల కస్టమర్ల విశ్వాసానికి తమ నిర్వహణలోని ఆస్తులే ప్రామాణికమని, ఎందుకంటే జీవిత బీమా దీర్ఘకాల ఉత్పత్తి అని సంస్థ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ జీవిత బీమా మార్కెట్లో 15.7 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 2022 సెప్టెంబర్ నాటికి నూతన పాలసీల సమ్ అష్యూరెన్స్ పరంగా ఈ స్థానం దక్కించుకుంది. -
మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్‌లో ఇది ఒకటి!
ఆర్బీఐ రెపో రేట్ల పెంపుతో కొంత కాలంగా డెట్ మార్కెట్లు అస్థిరతలను చూస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ వరుసగా రేట్లను పెంచుతూనే వస్తోంది. ఇప్పటికే 2.25 శాతం వడ్డీ రేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున, రానున్న కాలానికి అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు అనువైనవి డైనమిక్ బాండ్ ఫండ్స్. పరిస్థితులకు తగినట్టు ఇవి స్వల్ప కాలం నుంచి దీర్ఘకాల సాధనాల మధ్య పెట్టుబడులను మార్చే సౌలభ్యంతో పనిచేస్తాయి. ఈ విభాగంలో ఎన్నో పథకాలు అంబాటులో ఉన్నాయి. మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ ఒకటి. రాబడులు.. గడిచిన ఆరు నెలల్లో పెట్టుబడి 5 శాతం మేర వృద్ధి చెందగా, ఏడాది కాలంలో 4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో ఏటా 7.30 శాతం, ఐదేళ్లలో 7.26 శాతం, ఏడేళ్లలో 8.28 శాతం, పదేళ్లలో 9.28 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. స్వల్పకాలంతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడి స్థిరంగా, మెరుగ్గా కనిపిస్తోంది. డైనమిక్ బాండ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్‌సీజన్స్ బాండ్ ఫండ్‌లోనే అధిక రాబడులు ఉన్నాయి. మూడేళ్లలో 1.5 శాతం, ఐదేళ్లలో 1.30 శాతం, ఏడేళ్లలో 1.5 శాతం, పదేళ్లలో 1.60 శాతం అధిక రాబడులు ఈ పథకం ఇవ్వడాన్ని గమనించాలి. ఈ పథకం ఆరంభమైన 2009 నుంచి చూస్తే వార్షిక రాబడి సుమారు 9 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో.. ఈ విభాగంలో నిర్వహణ ఆస్తుల పరంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ అతిపెద్దది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.6,074 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసినప్పుడు ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోలోని సాధనాల డ్యురేషన్‌ను ( కాలవ్యవధి) పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని భావించినప్పుడు, ఆ ప్రయోజనాలను ఒడిసి పట్టేందుకు, మార్కెట్ టు మార్కెట్ నష్టాలను తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలోని డెట్ సాధనాల డ్యురేషన్‌ను తగ్గిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ పోర్ట్‌ఫోలియో డ్యురేషన్ మార్పులపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఈ పథకానికి ఎంతో అనుభవం ఉంది. ఈ పథకం కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ (జీసెక్) ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో డ్యురేషన్ పథకంగా, వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో అక్రూయల్ పథకంగా పనిచేస్తుంది. ఈ పథకం ఆరంభం నుంచి ఎన్నో పర్యాయాలు వడ్డీ రేట్ల సైకిల్ (పెరగడం, తరగడం)ను చూసింది. కనుక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా, మెరుగైన నిర్ణయాలు తీసుకోడంలో కాస్త అనుభవం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియో సగటు డ్యురేషన్ 1.91 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెరుగుదల సైకిల్లో ఉన్నాం. కనుక డ్యురేషన్ తక్కువగా ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 38.2 శాతం ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో కలిగి ఉంది. అంటే వడ్డీ రేట్లు పెరిగినా, తరిగినా రిస్క్ ఉండదు. 29 శాతం పెట్టుబడులను ఏఏ మైనస్ అంతకంటే మెరుగైన రేటింగ్ సాధనాల్లో కలిగి ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 92.91 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయగా, 7.09 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్‌కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్‌ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్‌లేకుండా!
గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు.. రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. డెట్ ఫండ్స్‌లో మదుపు ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్ ఫండ్స్, అలాగే డైనమిక్ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్-రేట్ బాండ్లు (ఎఫ్ఆర్బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. లక్ష్యాల ఆధారిత ఫండ్స్ .. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా మల్టీ–అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్ సిప్, బూస్టర్ ఎస్టీపీ లేదా ఫ్రీడమ్ ఎస్‌డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు .. వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్‌ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా లేని వారికి గోల్డ్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండగలవు. -ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఎండీ, నిమేష్ షా -
రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం భారత్‌లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్‌లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ రివ్యూ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్బీఐ, ఫెడ్ సహా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. రాబడులు వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్‌లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. పోర్ట్‌ఫోలియో.. పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్‌కేర్ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్ స్టాక్స్‌కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి పెన్షన్ ప్లాన్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరిట యాన్యుటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసి, దీర్ఘకాలంలో నిధిని సమకూర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని సంస్థ తెలిపింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా యాక్సిలరేటెడ్ హెల్త్ బూస్టర్స్, బూస్టర్ పేఅవుట్స్ వంటి ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బూస్టర్ పేఅవుట్ ఆప్షన్లో యాన్యుటీకి అదనంగా అయిదు సార్లు పెద్ద మొత్తంలో చెల్లింపులు పొందవచ్చు. -
ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు. అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్‌కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్‌గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్‌లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు. మెరుగ్గా లార్జ్ క్యాప్స్ .. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్‌పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్‌పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు. -
ఎఫ్‌వోఎఫ్ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!
ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ప్యాసివ్ మల్టీ-అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్‌వోఎఫ్) ఆవిష్కరించింది. ఈ ఫండ్ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈటీఎఫ్ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్ విధానంలో వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ) చింతన్ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్, పౌస్‌ల ఈటీఎఫ్‌లలో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌కి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఫండ్ దేశంలోనే మొదటే సిల్వర్ ఈటీఎఫ్‌ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్, సిల్వర్ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ రుణ పత్రాల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సిల్వర్. ఈటీఎఫ్‌ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్‌లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఎన్‌ఫ్‌వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది. -
మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు
ముంబై: చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే 105 శాతం వెనక్కి చెల్లించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త టర్మ్ ప్లాన్ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ను ప్రవేశపెట్టింది. పాలసీదారు జీవిత దశల ఆధారంగా బీమా కవరేజీ సర్దుబాటు అయ్యే (లైఫ్‌స్టేజ్ కవర్) ఆప్షన్ ఉండడం ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత. ఇది కాకుండా కవరేజీ స్థిరంగా ఉండే ‘లెవల్ కవరేజీ’ ఆప్షన్ కూడా ఉంది. పాలసీదారులు తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. 64 క్రిటికల్ ఇల్నెస్లకు (తీవ్ర అనారోగ్య సమస్యలు) సైతం ఈ ప్లాన్‌లో కవరేజీ తీసుకోవచ్చు. లైఫ్‌స్టేజ్ ఆప్షన్లో బీమా కవరేజీ ఆరంభంలో క్రమంగా పెరుగుతూ వెళుతుంది. పాలసీ చివర్లో (పెద్ద వయసులో) క్రమంగా కవరేజీ తగ్గుతూ వస్తుంది. పాలసీ అమల్లో ఉన్నప్పుడు మరణిస్తే పరిహారం, గడువు పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాకానీ ప్రయోజనం కోరుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులను (క్రిటికల్ ఇల్‌నెస్‌లు) దృష్టిలో పెట్టుకుని ప్లాన్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. -
గొప్ప రాబడుల చరిత్ర
ICICI Prudential Equity And Debt Fund: రాబడులు కావాలి. పెట్టుబడులు పూర్తిగా ప్రమాదంలో పడకూడదు. అంటే రిస్క్ కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కిందకు వస్తుంది. అంటే తన నిర్వహణలోని మొత్తం ఆస్తుల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ సాధనాల్లో 20 శాతం నుంచి 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. రాబడులు ఈ పథకం 1999 నవంబర్ 3న మొదలు కాగా, ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి అది రూ.21.76 లక్షలు సమకూరి ఉండేది. అంటే కాంపౌండెడ్‌గా ఏటా 15.03 శాతం రాబడిని ఇచ్చింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాంపౌండెడ్‌గా వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం (సీఏజీఆర్) 14.04 శాతంగానే ఉంది. అంటే నిఫ్టీలో రూ.లక్ష పెట్టుబడి రూ.18.01 లక్షలు అయి ఉండేది. నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్ని డెట్‌లో పెడుతూ ఈక్విటీ సూచీ కంటే అధిక రాబడిని ఇవ్వడం అన్నది కచ్చితంగా మెరుగైన పనితీరుగానే చూడాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ పథకంలో ప్రతీ పెలా రూ.10,000 చొప్పున ఆరంభం నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి ఇన్నేళ్లలో రూ.26.4 లక్షలు కాగా, సమకూరిన మొత్తం రూ.2.11 కోట్లుగా ఉండేది. సిప్ మార్గంలో సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 53 శాతం ప్రతిఫలం లభించింది. మూడేళ్లలో వార్షికంగా 19 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 15.58 శాతం, ఏడేళ్లలో 13.49 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఒక హైబ్రిడ్ ఫండ్ ఇంత నిలకడైన పనితీరు చూపించడం అరుదైనది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను ఎస్.నరేన్ చూస్తున్నారు. గడిచిన 18 నెలల్లో వ్యాల్యూ స్టాక్స్‌కు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల స్టాక్స్ పాల్గొనడంతో వ్యాల్యూ స్టాక్స్ మంచి రాబడులను ఇచ్చాయి. పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.18,740 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ పథకానికి ఉంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం నిర్వహణ ఆస్తుల్లో ఈక్విటీ విభాగంలో 74.4 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్ సాధనాల్లో 17.1 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 90 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు చెరో 5 శాతం కేటాయింపులు చేసింది. ప్రైస్ టు బుక్ విధానంలో స్టాక్స్ ఎంపిక ఉంటుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను అనుసరిస్తుంటుంది. విద్యుత్, టెలికం, ఆయిల్, నాన్ ఫెర్రస్ మెటల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకులు, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ కంపెనీల పట్ల తక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈక్విటీలకు సంబంధించి విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ ఆప్షన్ కూడా ఈ పథకంలో భాగంగా ఉంది. మార్కెట్ల దిద్దుబాట్లలో పెట్టుబడుల విలువకు రక్షణ కోసం గాను డెరివేటివ్స్‌లో హెడ్జింగ్ కూడా చేస్తుంది. డెట్ విభాగంలో దీర్ఘకాల ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను, ఏఏ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటుంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.46 ఎన్టీపీసీ 7.69 భారతీ ఎయిర్టెల్ 7.32 ఓఎన్జీసీ 5.17 హిందాల్కో ఇండస్ట్రీస్ 4.35 సన్‌ఫార్మా 3.97 టాటా మోటార్స్ డీవీఆర్ 3.93 హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.19 ఇన్ఫోసిస్ 2.67 ఐటీసీ 2.36 చదవండి: హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ రివ్యూ -
పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకునే మార్గం
ఈక్విటీ మార్కెట్ ఇటీవలి కాలంలో చక్కని ర్యాలీతో గరిష్ట విలువలకు చేరింది. కనుక అస్సెట్ అలోకేషన్ విధానాన్ని (ఒక్క విభాగంలోనే కాకుండా భిన్న సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం) అనుసరించాలంటూ ఆర్థిక సలహాదారులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకుని, రిస్క్ తగ్గించుకోవాలని భావించే వారికి అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. వివిధ సాధనాల మధ్య వ్యూహాత్మక స్థాయిలో కేటాయింపులు అనేవి అన్ని వేళలా ఇన్వెస్టర్లకు రిస్క్ నుంచి రక్షణ కల్పిస్తాయని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మల్టీ అస్సెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎంతో పేరున్న ఎస్.నరేన్ ఈ ఫండ్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తుండడం సానుకూలాంశం. ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీలకు.. పరిస్థితులకు అనుగుణంగా 10 శాతం నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్‌లకు 0–10 శాతం వరకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్ ఫండ్స్ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. రాబడులు మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన, స్థిరమైన పనితీరు చూపిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలించొచ్చు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడులు 32 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసినా కానీ, వార్షిక రాబడులు 18 శాతంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఏ కాలంలో చూసినా కానీ, మల్టీ అస్సెట్ విభాగం సగటుతో పోల్చి చూస్తే ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) 39 రెట్లు వృద్ధి చెందింది. అంటే ఆరంభంలో చేసిన రూ.10 పెట్టుబడి రూ.390గా వృద్ధి చెందింది. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినా కానీ, నేటికి రూ.5.36 లక్షలుగా వృద్ధి చెందేది. ఈ పథకం ప్రారంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,405 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడులు 66 శాతంగా ఉన్నాయి. డెట్‌లో 10.9 శాతం మేర పెట్టుబడులు పెట్టి ఉంటే, 23 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. అంటే మూడు విభాగాల్లోనే ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 9.41 భారతీ ఎయిర్టెల్ 7.90 ఐసీఐసీఐ బ్యాంకు 7.73 ఓఎన్జీసీ 5.59 సన్‌ఫార్మా 3.75 హిందాల్కో 3.31 ఇన్ఫోసిస్ 2.56 ఎస్బీఐ 2.26 ఐటీసీ 2.15 మారుతి సుజుకీ 2.01 -
వ్యాల్యూ డిస్కవరీ ఫండ్... పెట్టుబడులకు విలువ తెచ్చిపెట్టేది..!
మోస్తరు రాబడులు చాలు.. రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లకు వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ విభాగం చక్కగా నప్పుతుంది. కంపెనీ వ్యాపారం, ఆర్థిక బలాల ఆధారంగా వాస్తవ విలువ షేరులో ప్రతిఫలించని సందర్భాలు కొన్ని వస్తుంటాయి. అటువంటి సందర్భాలను వ్యాల్యూ డిస్కవరీ పథకాలు అనుకూలంగా మలుచుకుని, మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఈ పథకాన్ని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం నిర్వహణలో ఈ ఏడాది జూలై నాటికి రూ.21,195 కోట్ల ఆస్తులున్నాయి. వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో అతిపెద్ద పథకం ఇది. మొత్తం వ్యాల్యూ ఫండ్స్ పరిధిలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 30 శాతం ఒక్క ఈ పథకంలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 48 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 13.49 శాతం, ఐదేళ్లలో 12.66 శాతం, ఏడేళ్లలో 12.69 శాతం, పదేళ్లలో 18.16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో నిఫ్టీ50టీఆర్ఐ కాంపౌండెడ్ వార్షిక రాబడి రేటు 15.91 శాతంగానే ఉంది. ఈ ప్రకారం సూచీల కంటే మెరుగైన పనితీరును చూపించిందని అర్థమవుతోంది. ఈక్విటీ విభాగంలో వీటిని మెరుగైన రాబడులుగా చూడొచ్చు. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.1.46 లక్షలు అయి ఉండేది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.100 చొప్పున కూడా పెట్టుబడులకు ఈ పథకం అనుమతిస్తోంది. పెట్టుబడులు పెట్టిన ఏడాదిలోపు వైదొలిగితే 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్షను ఇన్వెస్ట్ చేసి (17 ఏళ్ల క్రితం) అలాగే కొనసాగించి ఉంటే నేటికి .22.13లక్షలు అయి ఉండేది. పెట్టుబడుల విధానం కంపెనీ వాస్తవ విలువతో పోలిస్తే తక్కువలో లభిస్తున్న కంపెనీలను, వివిధ రంగాల వారీగా ఎంపిక చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే స్వల్ప మార్పులను కూడా తీసుకుంటుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత సమయం ఉన్న వారికి వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. డెట్‌లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 69 స్టాక్స్ ఉన్నాయి. 82 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 13 శాతం, మిగిలిన మొత్తాన్ని స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇంధనం, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కమ్యూనికేషన్ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేయడాన్ని గమినించొచ్చు. ధర్మేష్ కక్కాడ్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం సన్‌ఫార్మా 10.05 భారతీ ఎయిర్టెల్ 6.96 ఎన్టీపీసీ 6.90 ఎంఅండ్ఎం 6.72 ఐటీసీ 5.33 యాక్సిస్బ్యాంకు 5.02 ఓఎన్జీసీ 4.32 హిందాల్కో 4.24 ఇన్ఫోసిస్ 4.08 బీపీసీఎల్ 3.61 చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
మ్యూచువల్ ఫండ్లకు అపార అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మ్యుచువల్ ఫండ్లు ఇంకా సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరలేదని, ఈ నేపథ్యంలో ఫండ్స్ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా తెలిపారు. పెట్టుబడి సాధనంగా ఫండ్స్‌పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా 2018–19 జూన్‌లో రూ. 7,554 కోట్ల పెట్టుబడులు రాగా, 2020–21 జూన్‌లో రూ. 9,156 కోట్లు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి బుల్ మార్కెట్ తరహాలోనే ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ధోరణులు కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యురోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో తెలిపారు. అయితే, మార్కెట్లు బులిష్‌గా ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండని ఇన్వెస్టర్లు ఆ తర్వాత రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చరిత్ర చెబుతోందన్నారు. సరైన పెట్టుబడి సాధనాలకు తగు పాళ్ళలో నిధులను కేటాయించడం ముఖ్యమని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయాన్ని తీసుకోవాలని షా సూచించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత మార్కెట్లు.. అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు విడుదల చేసిన నిధుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగాను, దేశీయంగాను స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలకు పరుగులు తీస్తున్నాయి. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్నాయి. నిధుల లభ్యతతో పాటు దాదాపు సున్నా స్థాయి వడ్డీపై రుణాలు మొదలైన అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. వ్యాపార పరిస్థితుల వలయాన్ని బట్టి చూస్తే భారత బిజినెస్ సైకిల్ ఆకర్షణీయంగానే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వృద్ధి రికవరీ కాస్త మందగించినట్లుగా ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు, ప్రభుత్వ విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఉదారవాద చర్యలు తదితర అంశాలు వల్ల సరైన దిశలోనే సాగుతోందని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహం.. అంతర్జాతీయంగా ఈక్విటీలు, కమోడిటీలు సహా రిస్కులతో కూడుకున్న అన్ని పెట్టుబడి సాధనాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వ్యాపారాలు కోలుకునే క్రమంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల బిజినెస్ సైకిల్ ఆధారిత ఫండ్‌ను ప్రవేశపెట్టాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈక్విటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మహమ్మారి పరిణామాలు, అంతర్జాతీయంగా వృద్ధి రికవరీ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా డైనమిక్ అసెట్ అలోకేషన్ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇలాంటి ఫండ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్విటీల్లో పెట్టుబడుల వ్యూహాలను సరిచేసుకుంటూ ఉంటాయి. అటు మార్కెట్ క్యాప్లపరంగా వివిధ కేటగిరీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. వేల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా సైతం మంచి రాబడులను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పలు రంగాల్లో సంస్థలు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో లభిస్తున్నాయి. వీటిలో చాలా మటుకు విభాగాలు 2008 తర్వాత పెద్దగా రాణించలేకపోయాయి. ఈక్విటీలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు .. వేల్యూ ఇన్వెస్టింగ్ విధానం పాటించవచ్చు. అయితే, రికార్డు స్థాయిలో నిధులు వస్తుండటంతో ప్రస్తుతం ధరలు.. వాస్తవిక స్థాయిలో లేవు. సెంట్రల్ బ్యాంకుల చర్యల ప్రభావాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి ప్రతీ పెట్టుబడి సాధనానికి ఎంతో కొంత రిస్కు ఉంటుందన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం.. డెట్ సంక్షోభం.. గతేడాది తొలినాళ్లలో డెట్ మార్కెట్లో సంక్షోభమనేది ఒక కంపెనీకి మాత్రమే పరిమితమైన సంఘటన తప్ప వ్యవస్థాగతంగా ఎలాంటి రిస్కులూ తలెత్తలేదు. మా విషయానికొస్తే గత 23 ఏళ్లలో ఎన్నడూ ఏ స్కీములోనూ డిఫాల్ట్ గానీ చెల్లింపుల్లో జాప్యం గానీ జరగలేదు. -
రిస్క్ తక్కువ,.. రాబడి ఎక్కువ...
మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే (థీమ్యాటిక్) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్ఎసీ ఫండ్ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎంఎన్సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు, భారత్‌లో లిస్ట్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్‌గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఎంఎన్సీ కంపెనీలకు చోటిస్తుంటారు. ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్ పథకాలతో పోలిస్తే ఎంఎన్సీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్సీ పథకాల్లోనూ సైక్లికల్ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, సాఫ్ట్వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందినవి ఉన్నాయి. రాబడులు పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్‌లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్‌మార్క్‌తో పోల్చి చూసినా లేక ఎంఎన్సీ థీమ్యాటిక్ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి.