సెబీ చెంతకు 85 కొత్త ఫండ్ స్కీములు
మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చెంతకు ఈ ఏడాది ఇప్పటివరకూ 85 కొత్త స్కీములు పరిశీలనకు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు... ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ల జారీకి ఈ స్కీము ప్రతిపాదనల్ని సెబీకి సమర్పించాయి. న్యూ ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌ఓలు)కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంస్థల్లో మహింద్రా, యాక్సిస్, రిలయన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బిర్లా సన్‌లైఫ్ హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, ఎడెల్‌వీజ్, ఎస్‌బీఐలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎన్‌ఎఫ్‌ఓలు ఇప్పటికే జారీకాగా, మరికొన్ని అనుమతులు రాగానే ప్రారంభంకానున్నాయి.
హిందీ పేర్లతో...: ఆసక్తికరమైన అంశమేమిటంటే..కొన్ని మ్యూచువల్ ఫండ్స్ జారీచేసే స్కీములకు హిందీ భాషలో పేర్లు పెట్టాయి. ఫండ్ స్కీములకు ఇప్పటివరకూ ఇంగ్లీషులోనే పేర్లు ఉంటుండగా, గ్రామీణ ప్రాంతాల ఇన్వెస్టర్లకు స్కీముల లక్ష్యాలు సులభంగా అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో హిందీ పేర్లతో స్కీముల్ని జారీచేసేందుకు ఫండ్ హౌస్‌లు శ్రీకారం చుట్టాయి. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ సెబీకి సమర్పించిన స్కీములకు.. డైనమిక్ బాండ్ బచత్ యోజన, ప్రగతి బ్లూచిప్ యోజన, ఉన్నతి మిడ్ స్మాల్‌క్యాప్ యోజన వంటి పేర్లు ఉన్నాయి.
4.8 కోట్లకు ఫండ్ ఇన్వెస్టర్లు....
మ్యూచువల్ ఫండ్ స్కీముల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కనపరుస్తున్న అమితాసక్తి కారణంగా కొత్త స్కీముల జారీని ఫండ్ హవుస్‌లు వేగవంతం చేశాయని, ఇటీవల ప్రారంభమైన స్కీములకు మంచి స్పందన లభించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జూలై చివరినాటికి మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య 4.8 కోట్లకు చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.