ఇటీవలి మార్కెట్ల అస్థిరత సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందిన విషయం నిజమే. కానీ, దీర్ఘకాలంలో పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా సంపద సృష్టికి ఈక్విటీలకు దూరంగా ఉండడం కూడా సరికాదు. కనుక నాణ్యమైన ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవడం అర్థవంతమైనదే. ఆ విధంగా చూసినప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ కూడా పరిశీలించదగ్గదే.
ఎందుకంటే మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయంలో స్టాక్స్‌ను కొంత మేర విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవడం, అదే సమయంలో డెట్ విభాగంలోనూ కొంత మేర పెట్టుబడుల ద్వారా నష్టాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం ఈ పథకం పనితీరులో భాగం. హైబ్రిడ్ పథకంగా ఇది 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. కనీసం 65 శాతం ఈక్విటీలోనూ, 20–35 శాతం వరకు డెట్ విభాగంలోనూ పెట్టుబడులు పెట్టే ఈ పథకాన్ని అటు రాబడుల పరంగా, ఇటు మార్కెట్ల ఆటుపోట్ల సమయంలోనూ కాస్తంత రక్షణగా భావించొచ్చు.
పనితీరు
గతంలో ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్‌డ్ ఫండ్‌గా ఉండేది. సెబీ మార్పుల తర్వాత పేరు మారింది. దీర్ఘకాలంలో చూసినప్పుడు ఈ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు కాస్త అధికంగానే ఉంది. స్వల్ప కాలం అంటే ఏడాది కాలంలో మాత్రం కాస్త ప్రతికూలంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 4.9 శాతం రాబడులు ఇస్తే, ఈ విభాగం సగటు రాబడులు 6.2 శాతంగా ఉన్నాయి.
ఇక మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు సగటున 10.4 శాతంగా ఉంటే, ఇదే విభాగం సగటు రాబడులు 8.6 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 17.4 శాతం కాగా, ఈ విభాగం రాబడులు 15.3 శాతం. గత మూడేళ్లుగా ఈ పథకం ఈక్విటీల్లో 65–74 శాతం మేర పెట్టుబడులు కొనసాగిస్తోంది. 2017లో వడ్డీ రేట్లు పెరిగిన సమయంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్‌పోజర్‌ను 11–14 శాతం వరకు తగ్గించుకుంది. 2017లో ఈ పథకం రాబడులు తక్కువగా ఉండడానికి కారణం ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్ తగ్గించుకుని, అధిక భాగం లార్జ్‌క్యాప్‌నకు పరిమితం కావడమే.
పోర్ట్‌ఫోలియో
ఈక్విటీల్లో ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అవసరమైన సమయాల్లో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబడులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులు మార్చడం ద్వారా రాబడులు మెరుగ్గా ఉండేలా చూస్తుంది.
2014 ర్యాలీ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 68–70 శాతం స్థాయిలో కొనసాగిస్తే, 2013లో ఇది 65–67 శాతంగా ఉండడం గమనార్హం. 2016లో బ్యాంకింగ్, పవర్, ఆయిల్, గ్యాస్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment