ICICI Prudential Balanced Advantage Fund Review: Low Risk With Better Returns - Sakshi
Sakshi News home page

ఫండ్‌ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్‌ తక్కువ.. మెరుగైన రాబడులు

Published Mon, Jun 26 2023 8:29 AM | Last Updated on Mon, Jun 26 2023 10:29 AM

Fund Review Low risk better returns ICICI Prudential Balanced Advantage Fund - Sakshi

ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌. మార్కెట్‌ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్‌ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ టాప్‌ పనితీరు చూపిస్తోంది.

రాబడులు 
ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్‌ (హెడ్జింగ్‌) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది.

2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50ప్లస్‌50 మోడరేట్‌ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్‌ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఎక్స్‌ఐఆర్‌ఆర్‌ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది.

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్‌ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్‌ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్‌ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది.

స్టాక్స్‌ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్‌ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్‌ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్‌ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్‌ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్‌ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్‌ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. 

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 

కంపెనీ    పెట్టుబడుల శాతం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 5.94
ఐసీఐసీఐ బ్యాంక్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.85
ఇన్ఫోసిస్‌ 3.66 
టీవీఎస్‌ మోటార్‌ 2.81 
మారుతి సుజుకీ 2.57 
హెచ్‌డీఎఫ్‌సీ 2.44  
భారతీ ఎయిర్‌టెల్‌  2.44 
ఎస్‌బీఐ  2.31 
యాక్సిస్‌ బ్యాంక్‌ 1.88

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement