పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందరూ కోరుకుంటారు. కానీ, అస్థిరతల రిస్క్‌ను ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండాలి, అదే సమయంలో అచ్చమైన డెట్‌తో పోల్చితే కాస్త మెరుగైన రాబడి కోరుకునే వారికి
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న కొన్ని పథకాల్లో పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. బాండ్ల పట్ల బుల్లిష్ ధోరణితో ఉన్న వారికి కూడా ఈ విభాగం అనుకూలం.
రాబడులు
ఈ పథకం ఏడాది కాలంలో 16.6 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఏటా11.49 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. 2021 మే నెలలో ఇది ప్రారంభమైంది. అంటే ఈ పథకానికి మూడేళ్ల చరిత్రే ఉంది. అయినప్పటికీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు పనితీరు కంటే ఈ పథకమే మెరుగ్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంలో వార్షిక రాబడి 13.91 శాతంగా ఉంటే, మూడేళ్లలో వార్షిక రాబడి 8.59 శాతంగానే ఉండడం గమనించొచ్చు.
పెట్టుబడుల విధానం
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా ఈక్విటీలకు 25–30 శాతం వరకు (పరిస్థితులు, అవకాశాలు) పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. డెట్‌లో 70 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌మాత్రం నేరుగా ఈక్విటీల్లో 15 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 10–15 శాతం వరకు ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.
పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపదు. ఈ పథకమనే కాకుండా ఈ సంస్థకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఇదే విధానం అంతర్లీనంగా కొనసాగుతుంటుంది. అందులో ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కనుక రిస్క్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ కేటాయింపులను గమనించినట్టయితే ఎక్కువ పెట్టుబడులు డివిడెండ్ దండిగా పంపిణీ చేసే బ్లూచిప్ కంపెనీల్లోనే ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్‌లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో రూ.2,197 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 14.28 శాతం మేర ఈక్విట్లీలో ఇన్వెస్ట్ చేసింది. 75.71 శాతం డెట్ సాధనాలకు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సాధానాల్లో 6.88 శాతం పెట్టుబడులు పెట్టింది. 3.13 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే ఈ నగదును ఉపయోగించి మెరుగైన అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 62 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. 32 శాతం మేర మిడ్‌క్యాప్‌లో, 6.18 శాతం మేర స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 14 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడులు గమనిస్తే 56 శాతం ఎస్‌వోవీ (సావరీన్ డెట్) రేటెడ్ పత్రాలు, 18.59 శాతం ఏఏఏ రేటెడ్ ఫండ్స్‌లోనే ఉండడం గమనించొచ్చు. అంటే డెట్‌లోనూ 74 శాతం పెట్టుబడులను రిస్క్ చాలా తక్కువ ఉన్న వాటినే ఎంపిక చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment