ఏదైనా ఒక విభాగంలో పెట్టుబడిని లక్ష్యం, కాల వ్యవధి, రంగం పనితీరు ఇలా ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుకూలమైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో పరిమిత రిస్క్‌తో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి. కనుక చక్కని ఏకైక పెట్టుబడి పరిష్కారంగా ఇవి పనిచేస్తాయి. తమ పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసే సాధనాలను ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవడం ద్వారానే గరిష్ట ప్రయోజనాన్ని సొంతం చేసుకోగలరు.
విదేశీ పెట్టుబడులకు చోటు
నూతన, వినూత్నమైన పెట్టుబడుల అవకాశాలు మన మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపైనా ఇన్వెస్టర్లు ఒకసారి దృష్టి సారించాలి. ముఖ్యంగా అధిక రిస్క్ తీసుకునే వారు విదేశీ పెట్టుబడులకు చోటివ్వాలి. వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో దీర్ధకాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ తదితర సాధనాల ద్వారా ఇన్వెస్టర్లు ఆయా అవకాశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది.
అత్యవసరాల కోసం పెట్టుబడి
జీవితంలో దేన్నీ ఊహించలేమని కరోనా మహమ్మారి అతిపెద్ద పాఠం నేర్పించింది. ఈ తరహా పరిస్థితులను మనం ‘సన్నద్ధత’ ద్వారానే అధిగమించగలం. అందుకని అత్యవసర నిధిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ నిధిని వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓవర్‌నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, లేదా ఫ్లోటర్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.
నాణ్యతకు ప్రాధాన్యం
పెట్టుబడుల సాధనాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. మంచి వ్యాల్యూషన్లు, దీర్ఘకాలంలో రాబడులను ఇచ్చే విధంగా పెట్టుబడులు ఉండాలి. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నట్టు అన్ని కంపెనీలు లేదా అన్ని రంగాల్లో ఎప్పుడూ అదే మాదిరి ప్రదర్శన, రాబడులను ఉండవని తెలుసుకోవాలి. ప్రీమియం వ్యాల్యూషన్లతో ఎక్కువ కాలంపాటు కొనసాగలేవు. కనుక దీర్ఘకాల పెట్టుబడుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పి తమ పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఏర్పడకపోవచ్చు. కాకపోతే పునఃసమీక్ష అన్నది మంచి విధానం. భవిష్యత్తులో రాబడులను ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో ఉందా, లేదా అన్నది సరిచూసుకోవడం ఇక్కడ కీలకమని గుర్తించాలి.
రిస్క్ కొద్దీ రాబడులు
అనుభవం ఉన్న పెట్టుబడిదారులు రిస్క్‌ను, రాబడులను అర్థం చేసుకోగలరు. కానీ, అవగాహన లేని ఇన్వెస్టర్లు ‘రిస్క్’ అంటే ఏంటో నష్టాల రూపంలో చూడాల్సి వస్తుంది. కనుక ఇన్వెస్టర్లు రిస్క్‌ను అర్థం చేసుకునేందుకు వారి పోర్ట్‌ఫోలియోను సూక్ష్మంగా విడదీసి చూడాలి. తమ అవసరాలకు అనుగుణంగా రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు)చేసుకోవాలి. రిస్క్‌కు అనుగుణంగా రాబడులను సర్దుబాటు చేసుకోవాలి.
ప్యాసివ్ పెట్టుబడి అవకాశాలు
ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పట్ల భారతీయ ఇన్వెస్టర్లలోనూ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ఇవి వీలు కల్పించడమే కాకుండా.. ఇండెక్స్‌కు అనుగుణంగా వెయిటేజీ, రాబడులకు చోటిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ వైపు నుంచి పక్షపాత ఆధారిత లోపాలను అధిగమించే ఉత్పత్తులు ఇవి. ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ప్యాసివ్ పెట్టుబడులు చేసుకోవచ్చు. ఇండెక్స్‌కే పరిమితం అయ్యే ఉత్పత్తులు ఇవి ఎంతమాత్రం కాబోవు. థీమ్యాటిక్, రంగాల వారీ ఫండ్స్‌లోనూ ఇవి అంకురిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులపై భరోసా ఉంటుంది.
లక్ష్యాల సమీక్ష
గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. కనుక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల లక్ష్యాలను కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సమీక్షించుకోవాలి. వివాహం తర్వాత బాధ్యత పెరిగి రీబ్యాలన్స్ అవసరం ఏర్పడవచ్చు. లేదంటే ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాధాన్యతలు మారిపోయి ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడుల లక్ష్యాల్లోనూ మార్పులు చేసుకోవాలి. మార్కెట్లో నూతన అవకాశాల కోసం చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై తప్పకుండా దృష్టి సారించాలి.
గడిచిన రెండేళ్లలో.. ముఖ్యంగా కరోనా ప్రవేశం తర్వాత ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపార విధానాలు, నమూనాలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని అక్కున చేర్చుకోవాల్సి వచ్చింది. నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2022 అయినా స్థిరత్వాన్ని, సానుకూల పరిస్థితులను తీసుకురావాలని ఆశిద్దాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకోవాలన్నది వైద్యుల సూచన.
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్ణీత కాలానికోసారి సమీక్షించుకోవాలన్నది (వెల్త్ చెక్) ఆర్థిక సలహాదారులు ఇచ్చే సలహా. నూతన సంవత్సరం ఆరంభం ఇందుకు అనుకూల సందర్భంగా చూడాలి. గత సంవత్సరంలో రాబడులు ఏ మేరకు సమకూరాయి, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల తీరు వీటన్నింటినీ పరిశీలించుకుని అస్సెట్ అలోకేషన్‌ను అమల్లో పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకునే విధంగా విధానాన్ని రూపొందించుకుని అమల్లో పెట్టాలి.
– రాఘవ్ అయ్యంగార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యాక్సిస్ ఏఎంసీ
Comments
Please login to add a commentAdd a comment