ప్రపంచ సేవల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశ ఎగుమతుల ఆదాయంలో సేవల రంగం వాటాయే ఎక్కువ. ప్రపంచ తయారీ రంగంలో మన వాటా నామమాత్రం. అందుకే కేంద్ర సర్కారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆత్మనిర్భర భారత్, భారత్‌లో తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 14 రంగాల్లో ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) కింద భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది.
మరోవైపు తయారీ కోసం చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు, సరఫరా వ్యవస్థలో భాగంగా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల వైపు చూస్తున్నాయి. దీంతో భారత్ ముందు తయారీ పరంగా అపార అవకాశాలున్నాయి. దీంతో వచ్చే దశాబ్ద కాలంలో భారత్ అంతర్జాతీయ తయారీ రంగంలో తన వాటాను గణనీయంగా పెంచుకోనుందని అంచనా. ఆటోమొబైల్, రక్షణ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, రైల్వేస్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, పెట్రోలియం అండ్ గ్యాస్ రంగ కంపెనీలు మంచి వృద్ధి అవకాశాలు చూడనున్నాయి.
పట్టణీకరణ, అధిక జనాభా, పెరుగుతున్న ఆదాయం హౌసింగ్, ఇన్‌ఫ్రా రంగాలకు కలసి రానుంది. కనుక తయారీ రంగంలో రానున్న అద్భుతమైన అవకాశాల నుంచి లబ్ధి పొందాలనుకునే ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
రాబడులు ఘనం
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆరంభం నుంచి అద్భుత పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 అక్టోబర్‌లో మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతానికి పైనే రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ట్రెయిలింగ్ విధానంలో (ఏడాది, రెండు, మూడేళ్ల చొప్పున) ఏడాదిలో 35.3 శాతం, మూడేళ్లలో ఏటా 35.3 శాతం చొప్పు న రాబడిని అందించింది. ఇక ఐదేళ్లలో చూస్తూ రాబడి ఏటా 19.7 శాతంగా ఉంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో చేసిన పెట్టుబడులపై రాబడి ఐదేళ్లలో ఏటా 25.3 శాతం చొప్పున ఉంది. ముఖ్యంగా రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. రోలింగ్ రాబ డులు (ఒక కాలం నుంచి మరో కాలం వరకు నిర్ధేశిత కాలంలో పనితీరు) చూస్తే 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య ఏటా 24.6 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 116గా ఉంది. అంటే మార్కెట్ ర్యాలీల్లో ఈ పథకం ఎన్‌ఏవీ వృద్ధి మెరుగ్గా ఉండడానికి ఇది నిదర్శనం. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 59.3గా ఉంది. అంటే బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువ నష్టపోతుందని అర్థం.
పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం
తయారీలో సైక్లికల్, డిఫెన్సివ్ (రక్షణాత్మకమైనవి) రంగాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. వ్యాల్యూ, గ్రోత్ ఈ రెండు రకాల పెట్టుబడి విధానాలను అనుసరిస్తుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఇలా అన్ని రకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మల్టీక్యాప్ తరహా విధానాన్ని అనుసరిస్తోంది. మెరుగైన ఫలితాలకు, రంగాల వారీ, కంపెనీల వారీ ఎంపిక విధానాన్ని కూడా పాటిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఆటో యాన్సిలరీ, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 15 శాతం ఇన్వెస్ట్ చేయగా, ఇంధన రంగ కంపెనీలకు 7 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 7%, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.81%, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.47 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలపై తక్కువ వెయిటేజీ అనుసరిస్తోంది. తన నిర్వహణ ఆస్తుల్లో 90 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.43 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 8.86% మేర నగదు నిల్వలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment