గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బాస్కెట్‌లో పెట్టేయరాదన్నది పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి పూర్తిగా డెట్ సాధనాల్లోనో లేక ఈక్విటీల్లోనో లేక బంగారంలోనో లేక రియల్ ఎస్టేట్‌పైనో ఇన్వెస్ట్ చేయరాదన్నది ఇందులోని సూత్రం. ఇలా ఒకే విభాగంలో మొత్తం పెట్టుబడులను పెట్టేయడం వల్ల రిస్క్ పాళ్లు చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా విభాగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో నిధుల అవసరం ఏర్పడిందనుకోండి.. పెట్టుబడులపై రాబడులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వైవిధ్యం అన్నది పెట్టుబడులకు ప్రాణం వంటిది. మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా వైవిధ్యాన్ని కల్పిస్తాయి. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్.నరేన్ ఈ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
పెట్టుబడుల విధానం..
మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి నిబంధనల ప్రకారం ఈక్విటీలకు 10 శాతం నుంచి 80 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను బట్టి ఈ కేటాయింపులను ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటే గరిష్టంగా 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయింపులు చేయవచ్చు. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరాయని భావించిన సందర్భంలో ఈక్విటీలకు కేటాయింపులను కనిష్టంగా 10 శాతానికి వరకూ తగ్గించుకునే వెసులుబాటు ఈ పథకాల్లో ఉంటుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 నుంచి 35 శాతం మధ్య, బంగారం ఈటీఎఫ్‌లకు 10 శాతం నుంచి 35 శాతం మధ్య కేటాయింపులు చేయడం పెట్టుబడుల విధానంలో భాగంగా ఉంటుంది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్)లలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలోనూ గరిష్టంగా 10 శాతం వరకు కేటాయింపులు చేస్తుంటాయి. ముఖ్యంగా ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఈ పథకాల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీల్లో 87 శాతం, డెట్ సాధనాల్లో 9 శాతం, బంగారంలో 3.9 శాతం చొప్పున పెట్టుబడులను కలిగి ఉంది.
రాబడులు
మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 44 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు కూడా ఉన్నాయి కనుక ఏడాది రాబడులను అంత ముఖ్యంగా పరిగణించరాదు. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలంలో పనితీరును పరిశీలించాలి. మూడేళ్లలో ఈ పథకం వార్షికంగా 10 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలోనూ 14 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను ఇస్తున్నట్టయితే మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) 34 రెట్లు వృద్ధి చెందింది. ఆరంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. గడిచి ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేయడం తెలిసిందే. ఈ విధంగా చూస్తే నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలతో పోలిస్తే ఈ పథకం మెరుగైన ఎంపికే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment