దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్‌ఎఫ్‌వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది.
వృద్ధి అవకాశాలు
ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్‌సైకిల్‌లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల హవా
పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి.
లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం
భారత్‌లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్‌లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం.
పెట్టుబడుల అవకాశాలు
ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి.
రిస్క్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment