భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్‌ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు.
సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం
సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్‌పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
మొబైల్ ఫోన్ల హబ్‌గా..
2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్‌లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్‌లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్‌ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్‌సంగ్ ఫోన్‌లను ఎగుమతి చేసింది.
మారిన పరిస్థితులు
భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది.
నైపుణ్యాలు కీలకం
యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్‌ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment