సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పీఎస్‌పీ)ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఎగువ సీలేరు పార్వతీనగర్ వద్ద 1,350 మెగావాట్ల సామర్థ్యం గల భూగర్భ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఏపీ జెన్‌కో వెల్లడించింది.
ఇందులో భాగంగా పర్యావరణ అనుమతులకు అవసరమైన నివేదికను సిద్ధం చేసింది. అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది నివాసానికి అవసరమైన నివాసాలు, కార్యాలయాలు, షెడ్లను సిద్ధం చేస్తోంది. ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజ ర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
అలాగే డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంపు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతల్లో ఒకటి. ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి.. సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందు కు ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ఇందుకు గ్రిడ్‌లో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగిస్తారు.
29 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం..
రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీలను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. మొత్తంగా 43,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమికి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు పెట్టేవారికి, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్లకు సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి భూమిని సమకూరుస్తోంది.
తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస, విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పీఎస్‌పీల వల్ల రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జీల కింద రూ.8,058 కోట్లు అందుతాయి. పన్ను రాబడి కింద రూ.1,956 కోట్ల మొత్తం సమకూరుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 58,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
త్వరలోనే టెండర్లు..
సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. టోపోగ్రాఫికల్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు ఇప్పటికే పూర్తయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధంగా ఉంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు రాగానే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపిస్తాం. అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకుని టెండర్లు పిలిచి.. త్వరలోనే పనులు మొదలుపెడతాం.
–బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment