పోలవరం పవర్ హౌస్ (ఫైల్)
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2025 జూన్‌కి పూర్తవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అదే సమయానికి పోలవరం జల విద్యుత్ కేంద్రం (పవర్ హౌస్) పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. 12 యూనిట్లతో 960 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే ఈ విద్యుత్ కేంద్రం ప్రగతిపై ఆయన సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు చౌకగా విద్యుత్ అందించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
► పోలవరం పవర్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) నూతన కాంట్రాక్టు ప్రకారం మొదటి మూడు యూనిట్లను 2024 జూలై నాటికి పూర్తి చేయనుంది. తర్వాత రెండు నెలలకు ఒకటి చొప్పున మిగిలిన 9 యూనిట్లను పూర్తి చేస్తుంది. తొలిదశ కింద 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఏడు యూనిట్లను ప్రారంభించి 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుడుతుంది.
ఆ తర్వాత మిగిలిన 5 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. నీటి నిల్వ స్థాయి తేలే వరకు ప్రాజెక్టు భవితవ్యాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని, 2026 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 12 యూనిట్లు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి.
► పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకే నీరు నిల్వ చేస్తే జల విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదనే అపోహలున్నాయి. వాస్తవానికి ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల పూర్ధిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లు, రిజర్వాయరు వద్ద 41.15 మీటర్లు, టెయిల్ వద్ద 13.64 మీటర్ల నీరు నిల్వ ఉంటే సరిపోతుంది. దీన్నిబట్టి రిజర్వాయరు నీటి మట్టం 41.15 మీటర్లు ఉంటే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని స్పష్టమవుతోంది.
► ఒకవేళ స్పిల్‌వే ద్వారా వదిలే నీటి వల్ల టెయిల్ వాటర్ లెవల్ పెరిగి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లకంటే తక్కువ నిల్వ ఉంటే ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి నిల్వ 41.15 మీటర్లకు పరిమితం చేసినా జల విద్యుత్ కేంద్రం నిర్వహణకు నష్టం లేదు. వరదల సీజన్‌లో ముందే విద్యుదుత్పత్తి ప్రారంభించొచ్చు.
► ముందు నిర్ణయించిన కాంట్రాక్టు సంస్థను తప్పించి వేరే సంస్థకు నిర్మాణం అప్పగించడంవల్ల సంప్రదింపులు (ఆర్బిట్రేషన్) కింద ఏపీ జెన్‌కో రూ.600 కోట్ల వరకు చెల్లించాలని, అది జెన్‌కోపై అదనపు భారమనే ప్రచారం జరుగుతోంది. కానీ గత కాంట్రాక్టు సంస్థతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆర్బిట్రేషన్ వల్ల ఏపీజెన్‌కోపై ఏమాత్రం భారం పడదని, తీర్పు అనుకూలంగా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం.
Comments
Please login to add a commentAdd a comment