![Representatives of Adani Group in a meeting with CM Revanth Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/ADANI-2.jpg.webp?itok=xREnT5kp)
సీఎంకు పుష్పగుచ్ఛం ఇస్తున్న కరణ్ అదానీ. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి తగిన సహకారం కావాలని అదానీ గ్రూపు రాష్ట్ర సర్కారును కోరింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో అదానీ గ్రూపు పోర్ట్‌లు, సెజ్‌ల సీఈవో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ ఈసీవో అశీష్ రాజ్‌వన్షి తదితరులు సమావేశమయ్యారు. ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్‌తో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై చర్చించారు.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం పట్టుబడులు పెడతామని అదానీ గ్రూపు ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నా మన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కొత్త పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలు కల్పిస్తామని చెప్పారు.
అమరరాజా గిగా ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష
అమరరాజా ఎనర్జీ, మొబిలిటీ సంస్థ సీఎండీ గల్లా జయదేవ్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో సీఎంను కలిసింది. రాష్ట్రంలోని దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. అమరరాజా ప్రాజెక్టు వేగంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని, ప్రభుత్వ సహకారంతో తమ ప్రాజెక్టును మరింత విస్తరిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
న్యూఎనర్జీ, లిథియం అయాన్ బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. అమరరాజా సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment