
ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఈయన.. కోవిడ్ అనంతర కాలంలో భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక సంబంధాల పరస్పర చర్య భారతదేశం స్థితిని బలపరిచిందని పేర్కొన్నారు.
భారతదేశం వృద్ధి మరింత వేగవంతం కావాలంటే పరిశ్రమలు కూడా వృద్ధి చెందాలి. ఈ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికీ మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమ చేయాల్సిన ముఖ్యమైన పని ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం అని ఆనంద్ మహీంద్రా అన్నారు.
1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేట్ పెట్టుబడులు జీడీపీలో 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. అయితే 2011-12 నుంచి జీడీపీ శాతంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆందోళనకరమైన స్థాయికి పడిపోతున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దాలని, సమస్య వనరులకు సంబంధించినది కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినదని మహీంద్రా వెల్లడించారు.