సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి ప్రసాదించిన సిరిసంపదలు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు.. అబ్బురపరిచే పర్యాటక సోయగాలు.. దట్టమైన అడవులు.. కొండ కోనలు.. మన్యాలు.. సుందరమైన నదీతీరాలు.. అత్యంత సువిశాల సాగరతీరం.. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవం! సహజ సిద్ధమైన అందాలతో స్వర్గధామంగా భాసిల్లుతున్న రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు సిద్ధమయ్యాయి.
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023లో పర్యాటక రంగంలో రూ.21,050 కోట్ల పెట్టుబడులతో ఏకంగా 122 ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చాయి. సీఎం వైఎస్ జగన్‌సమక్షంలో ఒప్పందాలు చేసుకుని ఏకంగా 39 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.
♦ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మారుతోంది. ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్టు వచ్చేలా ఎంవోయూలు సిద్ధమయ్యాయి.
♦ పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ అందిపుచ్చుకొని అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రోడ్‌షోలో మంచి స్పందన లభించింది. ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉండటంతో పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
రూ.కోటి నుంచి రూ.1,350 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ప్రాజెక్టులతో ముందుకొచ్చాయి. తాజ్‌గ్రూప్, ఒబెరాయ్, గ్యారీసన్ గ్రూప్స్, తులి హోటల్స్, మంజీరా గ్రూప్, డీఎక్స్‌ఎన్, టర్బో ఏవియేషన్, ఇండియన్ ఏసియన్, రివర్‌బే, పోలో టవర్స్, లాలూజీ అండ్ సన్స్, డ్రీమ్‌వ్యాలీ, సన్ గ్రూప్, విండ్ హెవెన్, ఆదిత్యా గేట్‌వే, సన్‌రే లాంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
♦ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, సీ ప్లేన్ సర్విసులు, వెల్‌నెస్ సెంటర్లు, మెగావీల్, అడ్వెంచర్, బీచ్ ఫ్రంట్ రిసార్టులు, వాటర్ థీమ్ పార్కులు, డిన్నర్ క్రూయిజ్, స్విమ్మింగ్ పూల్స్, కల్చరల్ విలేజ్‌లు, యాటింగ్, రెస్టోబార్, స్కైలాంజ్, రేసింగ్ ట్రాక్‌లు, కేబుల్‌కార్, గోల్ఫ్‌కోర్స్, సఫారీ టూరిజం.. ఇలా రూ.21050.86 కోట్లతో 39,022 మందికి ఉపాధి కల్పించేలా 122 ప్రాజెక్టులకు ఎంవోయూలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 4వతేదీన భాగస్వామ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టేలా పర్యాటక శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నా టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ అమలు చేయలేదు. సమీక్షలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మినహా కార్యాచరణ శూన్యం.
Comments
Please login to add a commentAdd a comment