AP CM YS Jagan Concluding Speech Highlights At Vizag Global Investors Summit - Sakshi
Sakshi News home page

CM YS Jagan: కీలక సమయంలో విశాఖ జీఐఎస్‌ సదస్సు నిర్వహించాం.. అందరికీ కృతజ్ఞతలు

Published Sat, Mar 4 2023 12:32 PM | Last Updated on Sat, Mar 4 2023 4:47 PM

AP CM YS Jagan Concluding speech AT vizag global investors summit - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధి చెందేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023’ రెండో రోజు సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని, మీతో మా బంధం చాలా అమూల్యమైనది’’ అని సీఎం అన్నారు. 

సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
గౌరవనీయులైన కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార ప్రముఖులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులందరికీ నమస్సులు. 

జీఐఎస్‌ విజయవంతం చేసిన  అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసింది. 

రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృత నిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుంది. మీతో మా బంధం చాలా అమూల్యమైనది. 

రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుంది. కోవిడ్‌ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చింది. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచింది.

అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసింది. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్‌ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా,  ఇంటర్నెట్, బ్రాడ్‌ బాండ్‌లను  అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశాం. 

అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించాం. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నాను.

15 సెషన్లు- 100 మంది వక్తలు..
ఈ సదస్సులో భాగంగా వివిధ రంగాలపై 15 సెషన్లు నిర్వహించాం.100 మందికిపైగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను కున్న బలాలేంటో చెప్పారు. ఆటోమైబైల్‌– ఈవీ సెక్టార్, హెల్తకేర్‌– మెడికల్‌ ఎక్విప్‌మెంట్,  రెన్యువబుల్‌ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా, అగ్రి ప్రాససింగ్‌ మరియూ టూరిజం తదితర రంగాలు.. ఇందులో ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌తో సహకారంకోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్‌ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. 

సదస్సులో భాగంగా మేం పెట్టిన ఎగ్జిబిషన్‌ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుంది. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి ( ఒన్‌ డిస్ట్రిక్ట్‌ – ఒన్‌ ప్రొడక్ట్‌) థీమ్‌ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశాం.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా ఈరెండు రోజులపాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉంది.

ఈ సమావేశాలన్నీ అత్యంత ఫలప్రదంగా సాగాయి. పెట్టబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను  నిలిపేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది. 

352 ఎంఓయూలు– రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

ఎనర్జీ రంగంలోనే రూ.8.84 లక్షల పెట్టుబడులు...
ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. 

ఐటీ రంగంలో...
ఐటీ మరియు ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం రంగంలో 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి. 

రెన్యువబుల్‌ ఎనర్జీ– గణనీయంగా పెట్టుబడులు..
గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్‌ఎనర్జీని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్టో్టరేజీ మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌ మరియు గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్‌ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్‌కు  తన లక్ష్యసాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయి. 

మీ నమ్మకానికి ధన్యవాదాలు...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రభుత్వంమీద మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఎంఓయూలు కుదుర్చుకున్న వారంతా వీలైనంత త్వరగా తమ పెట్టబడులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నాను. దీనికోసం అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు పెట్టేందుకు వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సదుపాయాలను కల్పిస్తుంది.

వీటిని సాకారం చేసేందుకు ఒక మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాల అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు దిశగా కృషి చేస్తుంది. మీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తూ.. ఈ పెట్టుబడులు ఫలప్రదమయ్యేలా ఆటంకాలు లేకుండా చూస్తుంది.

సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 యూనిట్లు ప్రారంభం... 
ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్‌ ల్యాబ్, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్‌ మరియు  అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణం.

పరస్పర ప్రయోజనాల దిశగా....
రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది.

వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సును అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement