(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి పథకంతో మౌలిక సదుపాయల కల్పన వేగవంతం కావడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాలూ తగ్గుతున్నాయని చెప్పారు. వివిధ రవాణా మార్గాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంటుందని అన్నారు. సాగర్‌మాలా కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.1 లక్షల కోట్ల విలువ చేసే 110 ప్రాజెక్టులను గుర్తించినట్లు సోనోవాల్ చెప్పారు.
ఇప్పటికే రూ. 32,000 కోట్ల విలువ చేసే 32 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజాగ్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉందని తెలిపారు. వైజాగ్ పోర్టు కార్గో విభాగం ఆరోగ్యకరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంద అన్నారు. దాదాపు రూ. 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ పనులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అందుబాటులోకి రావొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment