Sonowal
-
ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి పథకంతో మౌలిక సదుపాయల కల్పన వేగవంతం కావడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాలూ తగ్గుతున్నాయని చెప్పారు. వివిధ రవాణా మార్గాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంటుందని అన్నారు. సాగర్మాలా కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.1 లక్షల కోట్ల విలువ చేసే 110 ప్రాజెక్టులను గుర్తించినట్లు సోనోవాల్ చెప్పారు. ఇప్పటికే రూ. 32,000 కోట్ల విలువ చేసే 32 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజాగ్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉందని తెలిపారు. వైజాగ్ పోర్టు కార్గో విభాగం ఆరోగ్యకరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంద అన్నారు. దాదాపు రూ. 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ పనులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. -
అస్సాం సీఎంగా సోనోవాల్ ప్రమాణం
మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం - ఏజీపీ, బీపీఎఫ్ నుంచి చెరో ఇద్దరికి అవకాశం - ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరు - ప్రమాణస్వీకారానికి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గువాహటి: అస్సాం 14 వ ముఖ్యమంత్రిగా సర్బానంద సోనోవాల్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరే ంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ఖానాపార వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య సోనోవాల్‌తో పాటు మరో 10 మంది మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి ఆరుగురు, అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ నుంచి చెరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి హిమంత బిస్వా శర్మ, చంద్రమోహన్ పటోవరి, రంజిత్ దత్తా, పరిమళ్ సుక్లా బైద్య, పల్లబ్ లోచన్ దాస్, నబ కుమార్ డోలే, ఏజీపీ నుంచి అతుల్ బోరా, కేసబ్ మహంత, బీపీఎఫ్ నుంచి పరిమళ రాణి బ్రహ్మ, రిహన్ డైమరిలు మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. బీపీఎఫ్‌కు చెందిన మంత్రులిద్దరూ బోడోలో, బీజేపీకి చెందిన సుక్లా బైద్య బెంగాలీలో ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, సురేష్ ప్రభు, రాం విలాస్ పాశ్వాన్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, జితేంద్ర సింగ్, జయంత్ సిన్హా, కిరెన్ రిజుజు, వీకే సింగ్‌లు హాజరయ్యారు. బీజేపీ ముఖ్యమంత్రులైన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, ఆనంది బెన్ పటేల్, దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్, రఘువర్ దాస్, లక్ష్మీకాంత్ పర్సేకర్లతో పాటు మిత్రపక్షాల సీఎంలు ప్రకాశ్ సింగ్ బాదల్(పంజాబ్), చంద్రబాబు నాయుడు (ఏపీ), కలికో పుల్(అరుణాచల్), పీకే చామ్లింగ్(సిక్కిం)లు కూడా పాల్గొన్నారు. అస్సాంకు మరింత సహకారం: మోదీ సోనోవాల్ ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం నుంచి మరింత సహకారం అందిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా తీర్చిదిద్దుతామని, ఈశాన్య భారతంలో రాష్ట్రం ప్రధాన ఆకర్షణగా మారుతుందని, దేశం మొత్తంమ్మీద అభివృద్ధి చెందిన ప్రాంతంగా అవతరిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్ని ‘సెవెన్ సిస్టర్స్’గా పిలిచేవారని మనకు మాత్రం అష్టలక్ష్మి (సిక్కింతో కలిపి) అని, అన్ని రంగాల్లో ఆ రాష్ట్రాల పూర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. -
బంగ్లా బోర్డర్ ను మూసేస్తాం!
గువాహటి: ఎన్నికల్లో తామిచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్న సరిహద్దుని మూసివేస్తామని, ప్రజల గుర్తింపు కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ను పూర్తి చేస్తామని అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సర్బానంద సోనోవాల్ తెలిపారు. మొత్తం 263 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్లో ఇప్పటికే 224 కిలోమీటర్ల పాటు ఫెన్సింగ్ ఉండగా.. 40 కిలో మీటర్ల విస్తీర్ణం నదీ తీరప్రాంతం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నదీతీర ప్రాంతాల్లో సైతం చొరబాటుకు అడ్డుకట్టవేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభమయిన ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది జనవరి ఒకటిలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది. ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తయితే 1971 తర్వాత అసోంలోకి ప్రవేశించిన వలస ప్రాంతాలకు చెందిన వారు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీ విజయంపై మాట్లాడిన సోనోవాల్ 15 ఏళ్ల కాంగ్రెస్ అవినీతి పాలన వల్లే తాము విజయం సాధించినట్లు వివరించారు. స్థానిక పార్టీలైన అసోం గణ పరిషత్(ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)లతో జోడీ కట్టడం తమకు కలిసొచ్చిందని సోనోవాల్ తెలిపారు. బీజేపీకి పోలైన ఓట్లలో 20 శాతం మైనారిటీలు, స్థానిక అస్సామిలవి ఉన్నట్లు చెప్పారు. మే 24న సర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరించనున్నారు. -
సోనోవాల్ ప్రమాణానికి మోదీ
24న సీఎంగా సోనోవాల్ ప్రమాణం గువాహటి: అస్సాంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్న బీజేపీ.. ఇదే ఉత్సాహంతో మే 22న (ఆదివారం) శాసనసభా పక్ష భేటీ నిర్వహించనుంది. భేటీలో సీఎం అభ్యర్థి సర్బానంద సోనోవాల్(53)ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా గువాహటిలోని పార్టీకార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆదివారం నాటి శాసనసభాపక్ష సమావేశంపై నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు (సోమవారం) బీజేపీ మిత్రపక్షాలైన అస్సాం గణపరిషత్, బోడోలాండ్ ఫ్రంట్లతో సమావేశమై.. కూటమి నేతగా సోనోవాల్‌ను ఎన్నుకోనున్నారు. కాగా, మంగళవారం (మే 24న) ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని ఖానపర మైదానంలో జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు హాజరుకానున్నారు. రికార్డులు.. అస్సాంలో బీజేపీ విజయంలో కొన్ని రికార్డులు కూడా నమోదు చేసింది. దిస్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత అతుల్ బోరా 1,30,167 మెజారిటీతో గెలవగా.. బరాక్ లోయనుంచి పోటీ చేసిన కిశోర్ నాథ్(బీజేపీ) 42 ఓట్లతో గెలుపొందారు.