సోనోవాల్ ప్రమాణానికి మోదీ
24న సీఎంగా సోనోవాల్ ప్రమాణం
గువాహటి: అస్సాంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్న బీజేపీ.. ఇదే ఉత్సాహంతో మే 22న (ఆదివారం) శాసనసభా పక్ష భేటీ నిర్వహించనుంది. భేటీలో సీఎం అభ్యర్థి సర్బానంద సోనోవాల్(53)ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా గువాహటిలోని పార్టీకార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆదివారం నాటి శాసనసభాపక్ష సమావేశంపై నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు (సోమవారం) బీజేపీ మిత్రపక్షాలైన అస్సాం గణపరిషత్, బోడోలాండ్ ఫ్రంట్‌లతో సమావేశమై.. కూటమి నేతగా సోనోవాల్‌ను ఎన్నుకోనున్నారు. కాగా, మంగళవారం (మే 24న) ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని ఖానపర మైదానంలో జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు హాజరుకానున్నారు.
రికార్డులు.. అస్సాంలో బీజేపీ విజయంలో కొన్ని రికార్డులు కూడా నమోదు చేసింది. దిస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత అతుల్ బోరా 1,30,167 మెజారిటీతో గెలవగా.. బరాక్ లోయనుంచి పోటీ చేసిన కిశోర్ నాథ్(బీజేపీ) 42 ఓట్లతో గెలుపొందారు.