గువాహటి: ఎన్నికల్లో తామిచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్న సరిహద్దుని మూసివేస్తామని, ప్రజల గుర్తింపు కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ను పూర్తి చేస్తామని అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సర్బానంద సోనోవాల్ తెలిపారు.
మొత్తం 263 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్లో ఇప్పటికే 224 కిలోమీటర్ల పాటు ఫెన్సింగ్ ఉండగా.. 40 కిలో మీటర్ల విస్తీర్ణం నదీ తీరప్రాంతం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నదీతీర ప్రాంతాల్లో సైతం చొరబాటుకు అడ్డుకట్టవేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభమయిన ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది జనవరి ఒకటిలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది.
ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తయితే 1971 తర్వాత అసోంలోకి ప్రవేశించిన వలస ప్రాంతాలకు చెందిన వారు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీ విజయంపై మాట్లాడిన సోనోవాల్ 15 ఏళ్ల కాంగ్రెస్ అవినీతి పాలన వల్లే తాము విజయం సాధించినట్లు వివరించారు. స్థానిక పార్టీలైన అసోం గణ పరిషత్(ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)లతో జోడీ కట్టడం తమకు కలిసొచ్చిందని సోనోవాల్ తెలిపారు. బీజేపీకి పోలైన ఓట్లలో 20 శాతం మైనారిటీలు, స్థానిక అస్సామిలవి ఉన్నట్లు చెప్పారు. మే 24న సర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరించనున్నారు.
బంగ్లా బోర్డర్ ను మూసేస్తాం!
Published Sun, May 22 2016 10:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement