fencing border
-
శ్వేతసౌధంలో చిరు చొరబాటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్న వేళ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆనాటి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ ఏజెంట్లకు బుధవారం ఒక చిన్నారి కాస్తంత పనిచెప్పాడు. తల్లిదండ్రులతో కలిసి వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుని అధికార నివాసం వైట్‌హౌస్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. రోడ్డుకు, శ్వేతసౌధానికి మధ్య గోడ కాకుండా కేవలం నిలువెత్తు ఇనుప చువ్వల ఫెన్సింగ్ మాత్రమే ఉంటుంది. హఠాత్తుగా రోడ్డు మీద నుంచి ఆ ఫెన్సింగ్ చువ్వల సందుల్లోంచి సులభంగా దూరిపోయి వైట్‌హౌస్ గార్డెన్‌లోకి వచ్చి అంతా కలియ తిరగడం మొదలెట్టాడు. ఇది చూసి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చకచకా వచ్చేసి చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. బయటివైపు పిల్లాడి కోసం చూస్తున్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్తరం వైపు పచ్చికబయళ్ల వద్ద బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగిందని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ గుగెల్మీ చెప్పారు. నీలం రంగు హూడీ చొక్కా వేసుకున్న చిన్నారిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎత్తుకునిరావడం, పిల్లాడు అతని గడ్డంతో ఆడుకుంటున్న దృశ్యాలున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ ఎంతోమంది నిరసనకారులు ఆ ఫెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఈ పిల్లాడు రెప్పపాటులో ఫెన్సింగ్ దాటేశాడు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ వైట్‌హౌస్‌లో ఈజీగా వెళ్లిపోయానని భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఆ పిల్లాడికి ఇది ఒక చిరస్మరణీయ ఘటనగా నిలిచిపోతుంది’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ అతను ఒకవేళ ఎలాన్ మస్క్ డజను మంది సంతానంలో ఒకరై ఉంటారు. తండ్రి ఆఫీస్ ఇదేననుకుని వచ్చాడేమో’’ అని మరొకరు ట్వీట్‌చేశారు. -
బంగ్లా బోర్డర్ ను మూసేస్తాం!
గువాహటి: ఎన్నికల్లో తామిచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్న సరిహద్దుని మూసివేస్తామని, ప్రజల గుర్తింపు కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ను పూర్తి చేస్తామని అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సర్బానంద సోనోవాల్ తెలిపారు. మొత్తం 263 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్లో ఇప్పటికే 224 కిలోమీటర్ల పాటు ఫెన్సింగ్ ఉండగా.. 40 కిలో మీటర్ల విస్తీర్ణం నదీ తీరప్రాంతం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నదీతీర ప్రాంతాల్లో సైతం చొరబాటుకు అడ్డుకట్టవేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభమయిన ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది జనవరి ఒకటిలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది. ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తయితే 1971 తర్వాత అసోంలోకి ప్రవేశించిన వలస ప్రాంతాలకు చెందిన వారు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీ విజయంపై మాట్లాడిన సోనోవాల్ 15 ఏళ్ల కాంగ్రెస్ అవినీతి పాలన వల్లే తాము విజయం సాధించినట్లు వివరించారు. స్థానిక పార్టీలైన అసోం గణ పరిషత్(ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)లతో జోడీ కట్టడం తమకు కలిసొచ్చిందని సోనోవాల్ తెలిపారు. బీజేపీకి పోలైన ఓట్లలో 20 శాతం మైనారిటీలు, స్థానిక అస్సామిలవి ఉన్నట్లు చెప్పారు. మే 24న సర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరించనున్నారు.