balanced fund
-
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
బ్యాలన్స్డ్ ఫండ్ ప్రయోజనాలేమిటి?
ఏ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో అయినా కనీసం ఒక బ్యాలన్స్డ్ ఫండ్ ఉంటే మంచిదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అసలు బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ? బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరా ? –శ్రీహరి, విశాఖపట్టణం సాధారణంగా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మొదటిది.. పోర్ట్‌ఫోలియోను ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్ చేయడం. మీరు కొన్ని ఆర్థిక లక్ష్యాల కోసం కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిల్లో కొన్ని పనితీరు అధ్వానంగా ఉండవచ్చు. కొన్ని ఫండ్స్ పనితీరు మెరుగ్గా ఉండవచ్చు. పనితీరు బాగాలేని ఫండ్స్ నుంచి వేరే ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి. దీనినే పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్గా పరిగణిస్తారు. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలను కూడా పరిశీలిస్తూ ఉండాలి. కనీసం ఏడాదికొకసారైనా, పోర్ట్‌ఫోలియో మదింపు తప్పనిసరి. అలా కాకుండా మీ పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాలన్స్డ్ ఫండ్ ఉందనుకోండి. మీ పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీ బ్యాలన్స్ అవుతుంది. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్డ్ ఫండ్ ఉన్నా సరే కనీసం ఏడాదికి ఒకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను మదింపు చేయడం మాత్రం మరచిపోవద్దు. ఇక రెండో విషయం.. పన్ను ప్రయోజనాలు... బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పన్ను అంశాల పరంగా బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు. బ్యాలన్స్డ్ ఫండ్ తన మొత్తం నిధుల్లో 35 శాతం వరకూ స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఈ 35 శాతం ఆదాయంపై ఎలాంటి పన్ను భారం పడదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు తేడా ఏమిటి ? –పల్లవి, హైదరాబాద్ జ: ఈ రెండు ఫండ్స్‌కు చాలా తేడా ఉంది. ఆర్బిట్రేజ్ ఫండ్స్.. లిక్విడ్ ఫండ్స్ లానే రాబడులనిస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే వీటి రాబడులు తక్కువ స్థాయిల్లోనే ఉంటాయి. ఇక పన్ను అంశాల పరంగా చూస్తే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఇక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్ తన మొత్తం నిధుల్లో మూడో వంతు ఈక్విటీలోనూ, మరో మూడు వంతు లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే సాధనాల్లో, మరో మూడో వంతు స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని దీర్ఘకాలం రాబడుల పరంగా చూస్తే, బ్యాలన్స్డ్ ఫండ్స్ కంటే తక్కువ రాబడులే వస్తాయి. అయితే ఈ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు స్థిరత్వం ఎక్కువ. ఇక పన్ను అంశాల పరంగా చూసినా కూడా, ఈ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, రాబడులు తక్కువగా ఉన్నా, స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో కాకుండా ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమని చాలా మంది ఎనలిస్ట్‌లు సలహా ఇస్తుంటారు కదా ! ఎన్ఎఫ్ఓల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? –కిరణ్, విజయవాడ తెలియని దారిలో వెళ్లడం కన్నా తెలిసిన దారిలో వెళ్లడమే సులువు. అందుకని న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ప్రస్తుతమున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ప్రస్తుతమున్న ఫండ్స్ పోర్ట్‌ఫోలియో గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈ ఫండ్ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుందో మీకు తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఈ ఫండ్ పనితీరు ఎలా ఉంది...మార్కెట్ పెరిగినప్పుడు ఎలా ఉంది. మార్కెట్ పతన సమయాల్లో రాబడులు ఎంత ఇచ్చింది తదితర విషయాల గురించి మీరు ఒక అవగాహన ఉంటుంది. కానీ కొత్త ఫండ్ గురించి ఈ విషయాలేవీ మీకు తెలియవు. కొత్త ఫండ్ ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడుతుంది. సాధారణంగా ఒక ఫండ్ భవిష్యత్తు పనితీరును ఆ ఫండ్ గత ట్రాక్ రికార్డ్ ఆధారంగా అంచనా వేస్తారు. కొత్త ఫండ్ భవిష్యత్తు పనితీరు అంచనాలకు అలాంటి ట్రాక్ రికార్డ్ ఉండదు. మరోవైపు ఫండ్ మొదలైనప్పుడే కొనుగోలు చేస్తే, చౌకగా కొనుగోలు చేసినట్లవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అసలు విషయమే కాదు. ఒక కంపెనీ ఐపీఓ(పబ్లిక్ ఆఫర్)కు వచ్చినప్పుడు ఉండే ధర, ఎన్ఎఫ్ఓ ఆరంభమైనప్పుడు ఫండ్ ధర ఒకలాంటివేనని చాలా మంది అపోహ పడుతుంటారు. కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు ఆ కంపెనీ పరిమిత సంఖ్యలోనే షేర్లను ఆఫర్ చేస్తుంది. దీంతో లిస్టింగ్ గెయిన్స్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎన్‌ఎఫ్‌ఓకు ఉండదు. ఈ ఫండ్ ఎన్‌ఏవీపై ఈ ఫండ్‌కు ఉండే డిమాండ్ ఏమీ ప్రభావం చూపించదు. కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు గతంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒకే విధంగా(పోర్ట్‌ఫోలియో పరంగా) ఉండే ఎన్ఎఫ్ఓలను ఎక్కువగా ఆఫర్ చేసేవి. ఈ విషయంలో సెబి కఠినమైన నిబంధనలు రూపొందించడంతో ఎన్ఎఫ్ఓల జోరు తగ్గింది. ఏ రకంగా చూసినా, ఎన్ఎఫ్ఓల కంటే ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్
ఇది బ్యాలెన్స్డ్ ఫండ్. ఈక్విటీలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడితే మార్కెట్లు కరెక్షన్కు లోనైనప్పుడు తమ పెట్టుబడుల విలువ కుంగిపోతుందన్న ఆందోళన ఉంటే దీన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఇది ఈక్విటీ, డెట్ల కలబోత. ముఖ్యంగా మార్కెట్లు అధిక స్థాయికి చేరిన తరుణంలో పూర్తి ఈక్విటీ పథకాలతో రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. మరోవైపు గత ఏడాది ఆగస్ట్‌లో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్ల పరంగా కఠిన, తటస్థ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి రిస్క్‌కు సిద్ధపడేవారు రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ తరహా బ్యాలెన్స్డ్ ఫండ్లను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడులను కొంత మేర బ్యాలెన్స్డ్ ఫండ్లలోకి మళ్లించడం కూడా వివేకమే. రిస్క్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అక్రూయెల్ స్ట్రాటజీ (క్రెడిట్ రేటింగ్ మెరుగుపడే అవకాశం ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడం) పాటిస్తుంటాయి. రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ – బ్యాలెన్స్డ్ కూడా ఇదే తరహా పథకమే. హైబ్రిడ్ ఈక్విటీ తరహా కేటగిరీలోకి వస్తుంది. పథకం కింద సమీకరించే నిధుల్లో 65 శాతం మేర ఈక్విటీలకు కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే పథకం కావడంతో మార్కెట్లలో అనూహ్య ఆటు పోట్లు ఎదురైనా తట్టుకునే విధంగా మెరుగైన స్థానంలో ఉంది. ఈ కేటగిరీలోనే మంచి పనితీరు చూపిస్తున్న ఇతర పథకాలు... హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ ఫండ్, ప్రిన్సిపల్ బ్యాలెన్స్డ్ ఫండ్, యూటీఐ బ్యాలెన్స్డ్ ఫండ్లు మాత్రం స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయి. పోర్ట్‌ఫోలియో, పనితీరు ఈ పథకం పనితీరు 2013–16 మధ్య కాలంలో ఆశించిన మేర లేదు. ఎందుకంటే ఆ సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడంతో రాబడుల విషయంలో మిగిలిన పథకాలతో పోలిస్తే వెనుకబడింది. కారణం ఎక్కువ పెట్టుబడుల్ని లార్జ్‌క్యాప్‌కు కేటాయించడమే. కానీ, 2017లో తిరిగి రాబడుల పరంగా మంచి స్థానానికి చేరుకుంది. టాప్–3 పథకాల్లో ఒకటిగా నిలిచింది. బ్యాంకు స్టాక్స్‌కు అధిక కేటాయింపులతో గత 10 సంవత్సరాల కాలంలో ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడులను అందించింది. పెట్టుబడులను రక్షించుకోవడంతోపాటు రిస్క్‌ను పరిమితం చేసే విధంగా ఈ పథకం విధానం ఉంటుంది. గత ఐదేళ్లలో పరిశీలిస్తే ఈక్విటీలకు కేటాయింపులను 72 శాతం స్థాయిలో కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 70 శాతం ఈక్విటీలకు కేటాయించగా, అందులో 83 శాతం లార్జ్‌క్యాప్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన 17 శాతం నిధుల్ని మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులుగా పెట్టింది. ఇన్విట్‌లకు 2 శాతం కేటాయించడం గమనార్హం. బ్యాంకులు, ఫైనాన్స్, ఆటో, సిమెంట్ రంగాల స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. రాబడుల విషయానికొస్తే ఏడాది కాలంలో 29 శాతం, మూడేళ్లలో 13.2 శాతం, ఐదేళ్లలో 16.4 శాతం, పదేళ్లలో 12 శాతం చొప్పున వార్షికంగా ప్రతిఫలం ఇచ్చింది. ఈక్విటీలో టాప్ పెట్టుబడులు కంపెనీ కేటాయింపులు (%) హెచ్డీఎఫ్సీ బ్యాంకు 8.55 గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5.56 ఇన్ఫోసిస్ 4.37 ఐసీఐసీఐ బ్యాంకు 4.09 భారత్ ఫైనాన్షియల్ 3.27 లార్సన్ అండ్ టుబ్రో 3.20 హెచ్డీఎఫ్సీ 2.61 ఆర్ఐఎల్ 2.38 కోటక్ మహీంద్రాబ్యాంకు 2.26 ఇండియన్ ఆయిల్ 2.18 -
ఇది కూడా ‘జీతం’ లాంటిదే!!
• ఎస్‌డబ్ల్యూపీతో నెలనెలా విత్‌డ్రా చేసుకునే అవకాశం • ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఆ తరవాత నిరంతరం రాబడి • రిటైరీలకు అనువుగా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్లు • బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కు కూడా తక్కువే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్... అంటే ఎస్డ బ్ల్యూపీ గురించి తెలుసా? ఇదేంటి... మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్‌డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్‌కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల నిర్వహణ ప్రయోజనాలు, క్రమానుగత పెట్టుబడితో దీర్ఘకాలంలో గణనీయమైన మొత్తాన్ని పోగు చేసుకోగలిగే వెసులుబాటు ఇవన్నీ ఉండటంతో చాలామంది ఇన్వెస్టర్లు సిప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సిప్‌కు పూర్తి రివర్స్ విధానమైన ఎస్‌డబ్ల్యూపీలో... ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్‌డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి. ఎవరి కోసమిది? చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి... నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్‌డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన సత్యనారాయణ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్‌డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం... ఎస్‌డబ్ల్యూపీ తీరుతెన్నులు ఇవీ.. సత్యనారాయణ మూర్తి తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్‌డ్రా చేసుకునేలా ఆయన ఎస్‌డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తారీఖు సదరు ఫండ్ ఎన్ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్‌డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్‌డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్‌డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్‌డబ్ల్యూపీ కొనసాగవచ్చు. ఈక్విటీ.. డెట్.. లిక్విడ్.. ఏ ఫండ్‌లో పెట్టాలి? మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువ. డెట్, లిక్విడ్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ. కాకపోతే రాబడి కూడా రిస్క్‌ను బట్టే ఉంటుంది. అందుకే ఏదో ఒకదానికే పరిమితం కాకుండా ఈక్విటీ, డెట్, లిక్విడ్ ఫండ్స్ మేళవింపులో ఇన్వెస్ట్ చేస్తే ఎస్‌డబ్ల్యూపీ ద్వారా గరిష్ట రాబడులు పొందడానికి వీలవుతుంది. దీర్ఘకాలంలో మరింత నిధి పోగవడానికి ఈక్విటీ ఫండ్స్ తోడ్పడతాయి. ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తాన్ని భద్రంగా కాపాడుకుంటూనే సగటు మించి రాబడులు అందుకోవడానికి డెట్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మరీ స్వల్పకాలిక కోణంలో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ధర పరంగాను, లిక్విడిటీపరంగానూ వీటిలో రిస్కు తక్కువ. అయితే, ఎస్‌డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అన్నది ఆసక్తికరం. సత్యనారాయణ మూర్తి ఉదాహరణే తీసుకుంటే.. ఆయన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా... ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్‌డ్రా చేసుకుంటూ పోయిన పక్షంలో, ఎస్‌డబ్ల్యూపీ జీవితాంతం... ఆ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ప్రత్యేకత కూడా ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్‌డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది. పన్ను ప్రయోజనాలు కూడా... ఎస్‌డబ్ల్యూపీకి సంబంధించి ఇదో కీలకమైన ప్రయోజనం. డివిడెండ్ ప్లాన్‌తో పోల్చినప్పుడు ఎస్‌డబ్ల్యూపీతో పన్ను ప్రయోజనాలు ఇలా ఉంటాయి. సాధారణంగా డెట్ స్కీముల విషయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థ డివిడెండు డిక్లేర్ చేసినప్పుడు.. ఇన్వెస్టరు సదరు మొత్తాన్ని అందుకున్నాక పన్ను పోటు ఉండదు. ఎందుకంటే దాన్ని చెల్లించడానికి ముందే ఫండ్ సంస్థ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) మినహాయించుకుని చెల్లిస్తుంది. ఆ రకంగా చూస్తే ఇది ఇన్వెస్టరుకు భారమే. అదే ఎస్‌డబ్ల్యూపీ సంగతి తీసుకుంటే.. ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన తొలి నాళ్లలో మీకు వచ్చే రాబడులు తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఫలితంగా అసలు మొత్తం నుంచే మీరు ఎక్కువగా విత్‌డ్రా చేసుకున్నట్లవుతుంది. దీనిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలాగూ ఉండదు. ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్లలో చేసే పెట్టుబడులపై ఏడాది తర్వాత రాబడులు రావడం మొదలుపెట్టాక అవెలాగైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందికి వస్తాయి కనుక అప్పుడూ పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ భద్రత, ఈక్విటీ ఫండ్ అధిక రాబడుల మేలు కలయికతో రూపొందినవి బ్యాలెన్స్డ్ ఫండ్స్. పెపైచ్చు ఈక్విటీ ఫండ్ అందించే పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఇవి అందించగలవు. ఆ రకంగా చూస్తే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవడం అర్థవంతమైన నిర్ణయం అవుతుంది. గుర్తుంచుకోదగినవి.. సీనియర్ సిటిజన్లు, రిటైరైన వారు తమ దగ్గరున్న ఏకమొత్తం నిధిని క్రమానుగత ఆదాయంగా మార్చుకునే వెసులుబాటు కల్పించేవి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ). వీటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు నాలుగున్నాయి. అవేంటంటే.. ⇔ ఎస్డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ⇔ ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు. దీర్ఘకాలికంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ⇔ తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్‌డ్రాయల్ జరుగుతుంది కనుక .. దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు కనుక.. ఆ విధంగా ఇవి పన్ను పరమైన ప్రయోజనం అందించగలవు. ⇔ ఏకమొత్తం నిధిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి క్రమానుగత ఆదాయాన్ని పొందగోరే మూర్తి లాంటి రిటైరీలు, సీనియర్ సిటిజన్స్‌కి ఇలాంటి ఎస్‌డబ్ల్యూపీలు అనువైనవి. -
తొలి పెట్టుబడికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ బెస్ట్
నేను నెలకు రూ.2,000 చొప్పున ఏదో ఒక ఫండ్‌లో 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశమున్న ఏదైనా ఒక స్కీమ్‌ను సూచించండి? - అవినాశ్, అనంతపురం మీరు ఓపెన్‌ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ డబ్బులను తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏడాది లోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, మీరు ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ ఈక్విటీ ఫండ్స్ నుంచి ఏమైనా లాభాలు పొందితే, షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, బ్యాలెన్స్డ్ ఫండ్‌తో మొదలు పెట్టండి. 2-3 ఏళ్లలో మీకు ఈక్విటీ మార్కెట్ల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌కు మారవచ్చు. సిప్ విధానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో నా పెట్టుబడులను కొనసాగించమంటారా? - నందిత, నందిగామ ఈ ఫండ్ ప్రారంభమై, ఐదేళ్లయింది. అయినా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఐదేళ్ల ఫండ్ రాబడులను చూస్తే 23 శాతం రాబడులనిచ్చింది. తన ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో దాదాపు 83 శాతానికి పైగా ఈ ఫండ్ లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. పరిమితమైన స్టాక్స్‌పైనే దృష్టి సారిస్తున్న ఫోకస్డ్ ఫండ్ ఇది. మరో వైపు వివిధీకరణకు కూడా ప్రాధాన్యతనిస్తోంది. మొత్తం మీద ఈ ఫండ్ పనితీరు బావుందని చెప్పొచ్చు. ఒక్క 2011లోనే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. మీరు ఈ ఫండ్‌లో కొనసాగవచ్చు. ప్రస్తుతం పన్ను ఆదా చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఏదీ మార్కెట్లో లేదు. పన్ను ఆదా చేసే మార్గాలను సూచించండి. -క్రిష్టోఫర్, హైదరాబాద్ మౌలిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పన్ను ఆదా చేసే ఇన్ఫ్రా బాండ్లను పరిమిత కాలానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ బాండ్లలో పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీఎఫ్ కింద రూ.20 వేల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది నుంచి ఈ సౌకర్యానికి కోత పడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పన్ను-ఆదా బాండ్లు ఉన్నాయి. ఈ బాండ్ల మీద వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను ఆదా లభిస్తుంది. అయితే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం పన్నుకు అర్హమయ్యే ఆదాయానికి కలుస్తుంది. సెక్షన్ 80 సీ కింద కాకుండా ఇతర సెక్షన్ల కింద లభించే పన్ను తగ్గింపుల వివరాలు.... సెక్షన్ 80డి: సొంతానికి, భాగస్వామికి, పిల్లలకు, తల్లిదండ్రులకు తీసుకున్న వైద్య బీమాకు చెల్లించే ప్రీమియం. సెక్షన్ 24: గృహరుణంపై చెల్లించే వడ్డీ. రుణం తీసుకున్న గృహంలోనే ఉంటున్నట్లయితే ఈ రుణంపై చెల్లించిన వడ్డీ గరిష్ట మొత్తం రూ.1.5 లక్షల వరకు, అద్దెకిచ్చిన గృహం..సంబంధిత గృహ రుణంపై వడ్డీకి గరిష్ట మొత్తానికి ఇంత అని పరిమితి లేదు. సెక్షన్ 80ఈ: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ఫుల్టైమ్ కోర్సుల కోసం తీసుకున్న విద్యా రుణంపై వడ్డీకి పన్ను తగ్గింపులు లభిస్తాయి. అయితే అసలు చెల్లింపులపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. సెక్షన్ 80జి: ధార్మిక సంస్థలు, ఇతరత్రా ఫండ్స్‌కు ఇచ్చిన డొనేషన్లపై 50 నుంచి 100 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ విరాళాలకు సంబంధించిన మొత్తం మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించి ఉండకూడదు. సెక్షన్ 80డిడి: మీపై ఆధారపడిన వికలాంగులకు అయిన మెడికల్ ట్రీట్మెంట్పై రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకూ తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80డిడిబి: కిడ్నీ వైఫల్యం, పార్కిన్సన్ వ్యాధి కొన్ని ఎంపిక చేసిన వ్యాధుల ట్రీట్మెంట్కు అయ్యే వ్యయంపై 65 ఏళ్లలోపు వారికి రూ.40,000 వరకూ తగ్గింపులు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకైతే ఈ మొత్తం రూ.60,000 ఉంటుంది. సెక్షన్ 80 సిసిజి: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడులు. ధీరేంద్ర కుమర్ ,సీఈవో,వాల్యూ రీసెర్చ్ -
యూలిప్స్ మెరవాలంటే..
ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలానికి ఈక్విటీలే అధిక రాబడినిస్తాయన్నది పదేపదే రుజువవుతున్న వాస్తవం. కానీ స్టాక్ మార్కెట్లలో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకుల దృష్ట్యా వీటిలో పెట్టుబడిపై రిస్క్ ఉంటుంది. ఎవరెంత రిస్క్‌ను భరించగలరో అంతమేరకు వారు పెట్టుబడి పెడుతుంటారు. కానీ ఇలాంటి ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో కూడా ఇటు బీమా రక్షణతో పాటు పెట్టుబడిపై అధిక లాభాలను పొందడానికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యూలిప్స్) అవకాశమిస్తున్నాయి. యూలి ప్స్‌లో వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలామంది తమకు అనువయ్యేవి ఎంపిక చేసుకోవటం లేదని తెలుస్తోంది. అసలు ఎలాంటి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి? ఎవరికి ఏవి అనువుగా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం... గ్రోత్/అగ్రసివ్ ఫండ్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. అంటే మిగిలిన ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ కాస్త ఎక్కువ. అలాగే రాబడీ ఎక్కువే. దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్: పేరుకు తగ్గట్టే ఈ ఫండ్ చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తుంది. సగం మొత్తాన్ని ఈక్విటీలకు మిగిలిన మొత్తాన్ని డెట్ పథకాలకు కేటాయించడం జరుగుతుంది. ఇవి స్థిరాదాయాన్నిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి, గ్రోత్ ఫండ్స్‌తో పోలిస్తే రాబడి కాస్త తక్కువగానే ఉంటుంది. మధ్యస్థాయి రిస్క్ తీసుకునే వారికి వీటిని సూచించొచ్చు. కన్జర్వేటివ్ ఫండ్స్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని రిస్క్ తక్కువగా ఉండే డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పై రెండు పథకాలతో పోలిస్తే దీంట్లో నష్ట భయం మరింత తక్కువ. అస్సలు నష్ట భయానికి సిద్ధపడని వారికి ఇది బాగుంటుంది. ఫండ్ ఎంపికలో చూడాల్సినవి ఫండ్ ఎంపికలో ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి అనేది చాలా ముఖ్యం. మీ ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి ఐదు నుంచి 10 ఏళ్లు అయితే రిస్క్ చాలా తక్కువగా ఉండే కన్జర్వేటివ్ ఫండ్స్‌ని, అదే 10 నుంచి 15 ఏళ్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇంతకంటే దీర్ఘకాలం అయితే అగ్రసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితే కాకుండా, మీ రిస్క్ సామర్థ్యం, వయస్సు తదితర అంశాలు కూడా ఫండ్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. 30-50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 60-70% గ్రోత్ ఫండ్స్‌కు, ఆపైన వయస్సు ఉన్న వారు 50-60% కన్జర్వేటివ్ ఫండ్స్‌కు కేటాయించండి. అలాగే యూలిప్స్‌లో ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసే విధంగా ఎంచుకోవడం మంచింది. డైనమిక్ ఫండ్ ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత కూడా ఏ ఫండ్ ఎంపిక చేసుకోవాలో అర్థం కాని వారి కోసం బీమా కంపెనీలు డైనమిక్ ఫండ్ పేరుతో ఇంకో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీన్ని ఎంపిక చేసుకుంటే మీ ఆదాయం, పాలసీ కాలపరిమితి వంటి అంశాల అధారంగా మీ పోర్ట్‌ఫోలియోలో ఫండ్ కేటాయింపులను కంపెనీయే చేస్తుంది. - వి.విశ్వనాధ్, డెరైక్టర్, మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్