తొలి పెట్టుబడికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ బెస్ట్ | Balanced funds are the best investment | Sakshi
Sakshi News home page

తొలి పెట్టుబడికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ బెస్ట్

Published Mon, Jan 13 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

Balanced funds are the best investment

 నేను నెలకు రూ.2,000 చొప్పున ఏదో ఒక ఫండ్‌లో 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బులు వెనక్కి తీసుకునే  అవకాశమున్న ఏదైనా ఒక స్కీమ్‌ను సూచించండి?  
 - అవినాశ్, అనంతపురం
 
 మీరు ఓపెన్‌ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ డబ్బులను తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏడాది లోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, మీరు ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ ఈక్విటీ ఫండ్స్ నుంచి ఏమైనా లాభాలు పొందితే, షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, బ్యాలెన్స్‌డ్ ఫండ్‌తో మొదలు పెట్టండి. 2-3 ఏళ్లలో మీకు ఈక్విటీ మార్కెట్ల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌కు మారవచ్చు.
 
 సిప్ విధానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూ చిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో నా పెట్టుబడులను కొనసాగించమంటారా?
 - నందిత, నందిగామ
 ఈ ఫండ్ ప్రారంభమై, ఐదేళ్లయింది. అయినా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఐదేళ్ల ఫండ్ రాబడులను చూస్తే 23 శాతం రాబడులనిచ్చింది. తన ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో దాదాపు 83 శాతానికి పైగా ఈ ఫండ్ లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. పరిమితమైన స్టాక్స్‌పైనే దృష్టి సారిస్తున్న ఫోకస్డ్ ఫండ్ ఇది. మరో వైపు వివిధీకరణకు కూడా ప్రాధాన్యతనిస్తోంది. మొత్తం మీద ఈ ఫండ్ పనితీరు బావుందని చెప్పొచ్చు. ఒక్క 2011లోనే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. మీరు ఈ ఫండ్‌లో కొనసాగవచ్చు.
 
 ప్రస్తుతం పన్ను ఆదా చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఏదీ మార్కెట్లో లేదు. పన్ను ఆదా చేసే మార్గాలను సూచించండి.
 -క్రిష్టోఫర్, హైదరాబాద్
 మౌలిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పన్ను ఆదా చేసే ఇన్‌ఫ్రా బాండ్లను పరిమిత కాలానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ బాండ్లలో పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీఎఫ్ కింద రూ.20 వేల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది నుంచి ఈ సౌకర్యానికి కోత పడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పన్ను-ఆదా బాండ్లు ఉన్నాయి. ఈ బాండ్ల మీద వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను ఆదా లభిస్తుంది. అయితే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం పన్నుకు అర్హమయ్యే ఆదాయానికి కలుస్తుంది. సెక్షన్ 80 సీ కింద కాకుండా ఇతర సెక్షన్ల కింద లభించే పన్ను తగ్గింపుల వివరాలు....
 సెక్షన్ 80డి: సొంతానికి, భాగస్వామికి, పిల్లలకు, తల్లిదండ్రులకు తీసుకున్న వైద్య బీమాకు చెల్లించే ప్రీమియం.
 
 సెక్షన్ 24: గృహరుణంపై చెల్లించే వడ్డీ. రుణం తీసుకున్న గృహంలోనే ఉంటున్నట్లయితే ఈ రుణంపై చెల్లించిన వడ్డీ గరిష్ట మొత్తం రూ.1.5 లక్షల వరకు, అద్దెకిచ్చిన గృహం..సంబంధిత గృహ రుణంపై వడ్డీకి గరిష్ట మొత్తానికి ఇంత అని పరిమితి లేదు.
 సెక్షన్ 80ఈ: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ఫుల్‌టైమ్ కోర్సుల కోసం తీసుకున్న విద్యా రుణంపై వడ్డీకి పన్ను తగ్గింపులు లభిస్తాయి.  అయితే అసలు చెల్లింపులపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు.
 
 సెక్షన్ 80జి: ధార్మిక సంస్థలు, ఇతరత్రా ఫండ్స్‌కు ఇచ్చిన డొనేషన్లపై 50 నుంచి 100 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ విరాళాలకు సంబంధించిన మొత్తం మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించి ఉండకూడదు.
 
 సెక్షన్ 80డిడి: మీపై ఆధారపడిన వికలాంగులకు అయిన మెడికల్ ట్రీట్‌మెంట్‌పై రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకూ తగ్గింపు పొందవచ్చు.
 సెక్షన్ 80డిడిబి: కిడ్నీ వైఫల్యం, పార్కిన్సన్ వ్యాధి కొన్ని ఎంపిక చేసిన వ్యాధుల ట్రీట్‌మెంట్‌కు అయ్యే వ్యయంపై 65 ఏళ్లలోపు వారికి రూ.40,000 వరకూ తగ్గింపులు పొందవచ్చు. సీనియర్ సిటిజన్‌లకైతే ఈ మొత్తం రూ.60,000 ఉంటుంది.
 సెక్షన్ 80 సిసిజి: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడులు.

ధీరేంద్ర కుమర్ ,సీఈవో,వాల్యూ రీసెర్చ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement