ఇది కూడా ‘జీతం’ లాంటిదే!!
• ఎస్‌డబ్ల్యూపీతో నెలనెలా విత్‌డ్రా చేసుకునే అవకాశం
• ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఆ తరవాత నిరంతరం రాబడి
• రిటైరీలకు అనువుగా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్లు
• బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కు కూడా తక్కువే
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్... అంటే ఎస్‌డ బ్ల్యూపీ గురించి తెలుసా? ఇదేంటి... మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్‌డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్‌కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.
ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల నిర్వహణ ప్రయోజనాలు, క్రమానుగత పెట్టుబడితో దీర్ఘకాలంలో గణనీయమైన మొత్తాన్ని పోగు చేసుకోగలిగే వెసులుబాటు ఇవన్నీ ఉండటంతో చాలామంది ఇన్వెస్టర్లు సిప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సిప్‌కు పూర్తి రివర్స్ విధానమైన ఎస్‌డబ్ల్యూపీలో... ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్‌డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి.
ఎవరి కోసమిది?
చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి... నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్‌డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన సత్యనారాయణ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్‌డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం...
ఎస్‌డబ్ల్యూపీ తీరుతెన్నులు ఇవీ..
సత్యనారాయణ మూర్తి తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్‌ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్‌డ్రా చేసుకునేలా ఆయన ఎస్‌డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తారీఖు సదరు ఫండ్ ఎన్‌ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్‌డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్‌డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్‌ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్‌డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్‌డబ్ల్యూపీ కొనసాగవచ్చు.
ఈక్విటీ.. డెట్.. లిక్విడ్.. ఏ ఫండ్‌లో పెట్టాలి?
మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువ. డెట్, లిక్విడ్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ. కాకపోతే రాబడి కూడా రిస్క్‌ను బట్టే ఉంటుంది. అందుకే ఏదో ఒకదానికే పరిమితం కాకుండా ఈక్విటీ, డెట్, లిక్విడ్ ఫండ్స్ మేళవింపులో ఇన్వెస్ట్ చేస్తే ఎస్‌డబ్ల్యూపీ ద్వారా గరిష్ట రాబడులు పొందడానికి వీలవుతుంది. దీర్ఘకాలంలో మరింత నిధి పోగవడానికి ఈక్విటీ ఫండ్స్ తోడ్పడతాయి. ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తాన్ని భద్రంగా కాపాడుకుంటూనే సగటు మించి రాబడులు అందుకోవడానికి డెట్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మరీ స్వల్పకాలిక కోణంలో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
ధర పరంగాను, లిక్విడిటీపరంగానూ వీటిలో రిస్కు తక్కువ. అయితే, ఎస్‌డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అన్నది ఆసక్తికరం. సత్యనారాయణ మూర్తి ఉదాహరణే తీసుకుంటే.. ఆయన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా... ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్‌డ్రా చేసుకుంటూ పోయిన పక్షంలో, ఎస్‌డబ్ల్యూపీ జీవితాంతం... ఆ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ప్రత్యేకత కూడా ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్‌డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది.
పన్ను ప్రయోజనాలు కూడా...
ఎస్‌డబ్ల్యూపీకి సంబంధించి ఇదో కీలకమైన ప్రయోజనం. డివిడెండ్ ప్లాన్‌తో పోల్చినప్పుడు ఎస్‌డబ్ల్యూపీతో పన్ను ప్రయోజనాలు ఇలా ఉంటాయి. సాధారణంగా డెట్ స్కీముల విషయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థ డివిడెండు డిక్లేర్ చేసినప్పుడు.. ఇన్వెస్టరు సదరు మొత్తాన్ని అందుకున్నాక పన్ను పోటు ఉండదు. ఎందుకంటే దాన్ని చెల్లించడానికి ముందే ఫండ్ సంస్థ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) మినహాయించుకుని చెల్లిస్తుంది. ఆ రకంగా చూస్తే ఇది ఇన్వెస్టరుకు భారమే.
అదే ఎస్‌డబ్ల్యూపీ సంగతి తీసుకుంటే.. ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన తొలి నాళ్లలో మీకు వచ్చే రాబడులు తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఫలితంగా అసలు మొత్తం నుంచే మీరు ఎక్కువగా విత్‌డ్రా చేసుకున్నట్లవుతుంది. దీనిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలాగూ ఉండదు. ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లలో చేసే పెట్టుబడులపై ఏడాది తర్వాత రాబడులు రావడం మొదలుపెట్టాక అవెలాగైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందికి వస్తాయి కనుక అప్పుడూ పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ భద్రత, ఈక్విటీ ఫండ్ అధిక రాబడుల మేలు కలయికతో రూపొందినవి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్. పెపైచ్చు ఈక్విటీ ఫండ్ అందించే పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఇవి అందించగలవు. ఆ రకంగా చూస్తే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవడం అర్థవంతమైన నిర్ణయం అవుతుంది.
గుర్తుంచుకోదగినవి..
సీనియర్ సిటిజన్‌లు, రిటైరైన వారు తమ దగ్గరున్న ఏకమొత్తం నిధిని క్రమానుగత ఆదాయంగా మార్చుకునే వెసులుబాటు కల్పించేవి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ). వీటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు నాలుగున్నాయి. అవేంటంటే..
⇔ ఎస్‌డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
⇔ ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు. దీర్ఘకాలికంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
⇔ తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్‌డ్రాయల్ జరుగుతుంది కనుక .. దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు కనుక.. ఆ విధంగా ఇవి పన్ను పరమైన ప్రయోజనం అందించగలవు.
⇔ ఏకమొత్తం నిధిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి క్రమానుగత ఆదాయాన్ని పొందగోరే మూర్తి లాంటి రిటైరీలు, సీనియర్ సిటిజన్స్‌కి ఇలాంటి ఎస్‌డబ్ల్యూపీలు అనువైనవి.