SWP
-
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
క్రమం తప్పకుండా ఆదాయం
వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ. ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్‌డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్‌లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్‌పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే.. కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్ రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది. అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ఐడీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు. ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపిక ఎలా? ఎంపిక చేసుకున్న ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్‌కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్లైన్ నుంచే ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్‌డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్సీ, ఎల్ అండ్‌టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్‌డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్‌డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది. పన్నుల విషయానికి వస్తే... మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది. ఇక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. -
ఇది కూడా ‘జీతం’ లాంటిదే!!
• ఎస్‌డబ్ల్యూపీతో నెలనెలా విత్‌డ్రా చేసుకునే అవకాశం • ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఆ తరవాత నిరంతరం రాబడి • రిటైరీలకు అనువుగా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్లు • బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కు కూడా తక్కువే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్... అంటే ఎస్డ బ్ల్యూపీ గురించి తెలుసా? ఇదేంటి... మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్‌డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్‌కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల నిర్వహణ ప్రయోజనాలు, క్రమానుగత పెట్టుబడితో దీర్ఘకాలంలో గణనీయమైన మొత్తాన్ని పోగు చేసుకోగలిగే వెసులుబాటు ఇవన్నీ ఉండటంతో చాలామంది ఇన్వెస్టర్లు సిప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సిప్‌కు పూర్తి రివర్స్ విధానమైన ఎస్‌డబ్ల్యూపీలో... ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్‌డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి. ఎవరి కోసమిది? చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి... నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్‌డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన సత్యనారాయణ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్‌డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం... ఎస్‌డబ్ల్యూపీ తీరుతెన్నులు ఇవీ.. సత్యనారాయణ మూర్తి తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్‌డ్రా చేసుకునేలా ఆయన ఎస్‌డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తారీఖు సదరు ఫండ్ ఎన్ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్‌డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్‌డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్‌డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్‌డబ్ల్యూపీ కొనసాగవచ్చు. ఈక్విటీ.. డెట్.. లిక్విడ్.. ఏ ఫండ్‌లో పెట్టాలి? మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువ. డెట్, లిక్విడ్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ. కాకపోతే రాబడి కూడా రిస్క్‌ను బట్టే ఉంటుంది. అందుకే ఏదో ఒకదానికే పరిమితం కాకుండా ఈక్విటీ, డెట్, లిక్విడ్ ఫండ్స్ మేళవింపులో ఇన్వెస్ట్ చేస్తే ఎస్‌డబ్ల్యూపీ ద్వారా గరిష్ట రాబడులు పొందడానికి వీలవుతుంది. దీర్ఘకాలంలో మరింత నిధి పోగవడానికి ఈక్విటీ ఫండ్స్ తోడ్పడతాయి. ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తాన్ని భద్రంగా కాపాడుకుంటూనే సగటు మించి రాబడులు అందుకోవడానికి డెట్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మరీ స్వల్పకాలిక కోణంలో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ధర పరంగాను, లిక్విడిటీపరంగానూ వీటిలో రిస్కు తక్కువ. అయితే, ఎస్‌డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అన్నది ఆసక్తికరం. సత్యనారాయణ మూర్తి ఉదాహరణే తీసుకుంటే.. ఆయన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా... ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్‌డ్రా చేసుకుంటూ పోయిన పక్షంలో, ఎస్‌డబ్ల్యూపీ జీవితాంతం... ఆ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ప్రత్యేకత కూడా ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్‌డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది. పన్ను ప్రయోజనాలు కూడా... ఎస్‌డబ్ల్యూపీకి సంబంధించి ఇదో కీలకమైన ప్రయోజనం. డివిడెండ్ ప్లాన్‌తో పోల్చినప్పుడు ఎస్‌డబ్ల్యూపీతో పన్ను ప్రయోజనాలు ఇలా ఉంటాయి. సాధారణంగా డెట్ స్కీముల విషయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థ డివిడెండు డిక్లేర్ చేసినప్పుడు.. ఇన్వెస్టరు సదరు మొత్తాన్ని అందుకున్నాక పన్ను పోటు ఉండదు. ఎందుకంటే దాన్ని చెల్లించడానికి ముందే ఫండ్ సంస్థ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) మినహాయించుకుని చెల్లిస్తుంది. ఆ రకంగా చూస్తే ఇది ఇన్వెస్టరుకు భారమే. అదే ఎస్‌డబ్ల్యూపీ సంగతి తీసుకుంటే.. ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన తొలి నాళ్లలో మీకు వచ్చే రాబడులు తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఫలితంగా అసలు మొత్తం నుంచే మీరు ఎక్కువగా విత్‌డ్రా చేసుకున్నట్లవుతుంది. దీనిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలాగూ ఉండదు. ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్లలో చేసే పెట్టుబడులపై ఏడాది తర్వాత రాబడులు రావడం మొదలుపెట్టాక అవెలాగైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందికి వస్తాయి కనుక అప్పుడూ పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ భద్రత, ఈక్విటీ ఫండ్ అధిక రాబడుల మేలు కలయికతో రూపొందినవి బ్యాలెన్స్డ్ ఫండ్స్. పెపైచ్చు ఈక్విటీ ఫండ్ అందించే పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఇవి అందించగలవు. ఆ రకంగా చూస్తే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ తీసుకోవడం అర్థవంతమైన నిర్ణయం అవుతుంది. గుర్తుంచుకోదగినవి.. సీనియర్ సిటిజన్లు, రిటైరైన వారు తమ దగ్గరున్న ఏకమొత్తం నిధిని క్రమానుగత ఆదాయంగా మార్చుకునే వెసులుబాటు కల్పించేవి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ). వీటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు నాలుగున్నాయి. అవేంటంటే.. ⇔ ఎస్డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ⇔ ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు. దీర్ఘకాలికంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ⇔ తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్‌డ్రాయల్ జరుగుతుంది కనుక .. దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు కనుక.. ఆ విధంగా ఇవి పన్ను పరమైన ప్రయోజనం అందించగలవు. ⇔ ఏకమొత్తం నిధిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి క్రమానుగత ఆదాయాన్ని పొందగోరే మూర్తి లాంటి రిటైరీలు, సీనియర్ సిటిజన్స్‌కి ఇలాంటి ఎస్‌డబ్ల్యూపీలు అనువైనవి.