వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ.
ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్‌డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్‌లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్‌పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే..
కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్
రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది.
అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్‌లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది.
ఐడీఎఫ్‌సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్
బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు.
ఎల్‌అండ్‌టీ షార్ట్ టర్మ్ బాండ్
షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్‌అండ్‌టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది.
ఎంపిక ఎలా?
ఎంపిక చేసుకున్న ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్‌లైన్ నుంచే ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్‌డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్‌సీ, ఎల్ అండ్‌టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్‌డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్‌డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది.
పన్నుల విషయానికి వస్తే...
మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది.
ఇక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment