What Is The Difference Between An NFO (New Fund Offer) And Mutual Fund, Details Inside - Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్‌, న్యూ ఫండ్‌ ఆఫర్‌కు మధ్య తేడా ఏంటి?

Published Mon, Feb 20 2023 6:55 AM | Last Updated on Mon, Feb 20 2023 8:58 AM

What Is The Difference Between An Nfo And A Mutual Fund - Sakshi

మ్యూచువల్‌ ఫండ్‌ పథకానికి, న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)కు మధ్య తేడా ఏంటి? – డి.తరుణ్‌

ప్రతీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడుల నమూనాలతో నూతన పథకాలను (ఎన్‌ఎఫ్‌వో) తీసుకొస్తుంటాయి. ఇలా వచ్చిన పథకం కొంత కాలానికి పాతది అయిపోతుంది. ఆయా పథకం పెట్టుబడుల తీరు, మార్కెట్‌ కరెక్షన్లలో, మార్కెట్‌ ర్యాలీల్లో పథకాల పనితీరు ఎలా ఉందో పరిశీలించొచ్చు.

ఎన్‌ఎఫ్‌వో అన్నది కొత్తగా మొదలయ్యే పథకం. ఇన్వెస్టర్లు అప్పగించిన పెట్టుబడులను ఆ ఫండ్‌ మేనేజర్‌ అప్పటి నుంచి ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెడతారు. కొత్త పథకం పెట్టుబడి లక్ష్యాలు, ఫండ్‌ మేనేజర్‌ గతంలో నిర్వహించిన పథకాల ట్రాక్‌ రికార్డు గురించి తెలుసుకోవచ్చు. అలాగే, ఎన్‌ఎఫ్‌వో ఆరంభమైన సమయంపై పనితీరు ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయాల్లో పథకాన్ని ప్రారంభించి, అనంతరం మార్కెట్లు పెరిగిపోతే సహజంగానే పథకంలో రాబడులు ఎక్కువగా కనిపిస్తాయి.

అందుకే కొత్త పథకం మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడా లేక కనిష్టాల్లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుందా అన్నది ఇన్వెస్టర్‌ తప్పకుండా పరిశీలించాలి. ఎన్‌ఎఫ్‌వో రూపంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంటాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి. చాలా మంది ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా ఎన్‌ఎఫ్‌వోల్లో అంత భారీ మొత్తంలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేస్తున్నారనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చాల్సి వస్తుంది? – పవన్‌ కుమార్‌ 

మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది.

ఉదాహరణకు మీరు దీర్ఘకాలం కోసం అంటే రిటైర్మెంట్‌ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుంటే.. కావాల్సిన మొత్తం సమకూరితే పెట్టుబడిని మొత్తం తీసేసుకోవచ్చు. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక మీరు ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఆ తర్వాత ముందు చూసిన అంశాలు మారిపోయినట్టయితే మీ పెట్టుబడులను విక్రయించుకోవచ్చు. ఫండ్‌ మేనేజర్‌ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. కాకపోతే మీరు అప్రమత్తం అయ్యేందుకు ఒక కారణంగా చూడొచ్చు.

గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్‌ మేనేజర్‌ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement