
ఎకానమీ, పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి నిశితంగా పరిశీలించే అంశాల్లో రుతుపవనాలు, ‘‘సాధారణ’’ వర్షపాతం గణాంకాలు కూడా ఉంటాయి. నైరుతి రుతుపవనాలతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇటు ఖరీఫ్, అటు రబీ రెండు పంటలకు అవసరమయ్యే మొత్తం నీటి వనరుల్లో దాదాపు 75 శాతం భాగాన్ని ఇవి అందిస్తాయి. ఖరీఫ్ పంటల సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు, రబీ పంటల సీజన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటలపై నేరుగా ప్రభావం చూపడమే కాకుండా.. తదుపరి రబీ పంటల కోసం వినియోగించే నీరుని రిజర్వాయర్లు, చెరువులు మొదలైన వాటిల్లో నిల్వ చేసుకునేంతగా వర్షాలనిస్తాయి. ఇలాంటి వర్షాలు అటు పంటలపైనే కాదు మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోనూ ప్రభావితం చేస్తాయి.
ఎలాగంటే...
ద్రవ్యోల్బణం: వ్యవసాయోత్పత్తిపై వర్షాల ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. బియ్యం, సోయాబీన్, చెరకు, నూనెగింజలు మొదలైన వాటి దిగుబడిని వర్షం ప్రభావితం చేస్తుంది. వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండక.. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
ముడి వస్తువుల ధరలు : తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతరత్రా పంటలతో వివిధ పరిశ్రమలకు అవసరమైన ముడి వస్తువులు సమకూరుతాయి. వ్యవసాయోత్పత్తి ప్రభావం అటు ముడి వస్తువుల రేట్లపైనా పడుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటు: రుతుపవనాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయి. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై ఆధారపడే కంపెనీల ధరలు, రంగాలపైనా మీద ప్రభావం పడుతుంది. ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ (ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు), ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి రంగాలు వీటిలో
ఉంటాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు..
అగ్రి–ఎకానమీకి, మార్కెట్ సెంటిమెంటుకి రుతుపవనాలు ముఖ్యమే అయినప్పటికీ.. గత కొన్నేళ్లుగా మొత్తం మీద ఎకానమీపై వాటి ప్రభావం గణనీయంగా తగ్గింది. స్టాక్ మార్కెట్ కదలికలను ఏ ఒక్క అంశమో ప్రభావితం చేయలేవు. ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, వడ్డీ రేట్లు, కార్పొరేట్ ఫలితాలు, భౌగోళికరాజకీయాంశాలు, రుతుపవనాలు మొదలైనవన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి వర్షపాతం గురించి అంచనాలు వేసుకోవడం, వాటిని బట్టి స్పందించడం కాకుండా.. ఇన్వెస్టర్లు సరైన ఆర్థిక ప్రణాళికలను వేసుకుని దానికి కట్టుబడి ఉండటం ముఖ్యం. ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవడంలో సహాయం అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజరును సంప్రదించడం శ్రేయస్కరం.
Comments
Please login to add a commentAdd a comment