న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)లో పెట్టుబడులు గత నెల నీరసించాయి. అంతక్రితం నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 30 శాతం తక్కువగా రూ. 14,091 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో బలహీన సెంటిమెంటు కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ పెట్టుబడుల నుంచి దృష్టి మరల్చడం ప్రభావం చూపింది. దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫి) గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2023) ఆగస్ట్‌లో ఈక్విటీ ఎంఎఫ్‌లకు రూ. 20,245 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. గత నెలలో క్రమానుగత పెట్టుబడి పథకాల(సిప్)కు మాత్రం రూ. 16,042 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఇవి ఈక్విటీ ఫండ్స్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) సిప్ ద్వారా రూ. 90,304 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
కొత్త రికార్డ్స్‌తో..
గత నెలలో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతో రిస్క్ అసెట్స్ నుంచి ఇన్వెస్టర్ల దృష్టి మరలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయినప్పటికీ ఈక్విటీ ఎంఎఫ్‌లకు రూ. 14,091 కోట్ల పెట్టుబడులు లభించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది వివరించారు. వెరసి వరుసగా 31వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో ఆరు కొత్త ఫండ్స్ ప్రారంభంకాగా.. రూ. 2,503 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. అంతర్గతంగా సానుకూల సెంటిమెంటు నెలకొనడంతో సిప్ పెట్టుబడులు కొనసాగుతున్నట్లు యూనియన్ ఏఎంసీ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు నికరంగా అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు. థీమాటిక్(సెక్టోరల్) ఫండ్స్ సెప్టెంబర్‌లో రూ. 3,147 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోగా.. 4 కొత్త ఫండ్స్ విడుదలయ్యాయి. ఆగస్ట్‌లోనూ 5 కొత్త ఫండ్స్ ప్రవేశించగా.. రూ. 4,805 కోట్ల పెట్టుబడులు లభించాయి.
లార్జ్ క్యాప్స్ డీలా
సెప్టెంబర్‌లో లార్జ్ క్యాప్ ఫండ్స్ వరుసగా ఐదో నెలలోనూ డీలా పడ్డాయి. నికరంగా రూ. 110 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే మిడ్ క్యాప్ విభాగంలో పెట్టుబడులు తగ్గినప్పటికీ రూ. 2,000 కోట్లకు చేరాయి. ఆగస్ట్‌లో ఇవి రూ. 2,512 కోట్లుగా నమోదయ్యాయి. మే నుంచి ఆగస్ట్ మధ్యలో సగటున రూ. 4,298 కోట్ల పెట్టుబడులు లభించిన స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ గత నెలలో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 2,678 కోట్లకు పరిమితమైనట్లు ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలియజేశారు. స్మాల్ క్యాప్ విభాగంలో విలువలు భారీగా పెరగడంతో కొంతవరకూ లాభాల స్వీకరణ నెలకొనడం ప్రభావం చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారిటా వివరించారు.
రుణ పథకాల నేలచూపు
రుణ సెక్యూరిటీ ఆధారిత పథకాలు వరుసగా రెండో నెలలోనూ నేలచూపులకే పరిమితమయ్యాయి. ఆగస్ట్‌లో నికరంగా రూ. 25,873 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. సెప్టెంబర్‌లో మరింత అధికంగా రూ. 1.01 లక్షల కోట్లు వెనక్కి మళ్లాయి. అంచనాలకు అనుగుణంగా లిక్విడ్ ఫండ్స్‌లో భారీగా రూ. 74,000 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అవసరాలు ఇందుకు కారణమైనట్లు శాంటారియా అభిప్రాయపడ్డారు. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) సెప్టెంబర్ చివరికల్లా 46.58 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment