Systematic withdrawal plan
-
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిలిచిపోతున్న ‘సిప్’ ఖాతాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (సిప్)లు కొన్ని నిలిచిపోతున్నాయి. మార్కెట్లు స్థిరంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ మే నెలలో సిప్ ద్వారా పెట్టుబడులను నిలిపివేసిన ఖాతాల సంఖ్య 14.19 లక్షలకు చేరింది. ఏప్రిల్ చివరికి ఉన్న 13.21 లక్షల ఖాతాలతో పోలిస్తే 7.4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మే నెలలో రికార్డు స్థాయిలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ సాధనాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మే నెలలో నూతన సిప్ ఖాతాల నమోదు 24.7 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది 19.56 లక్షలుగా ఉండడం గమనార్హం. నిలిచిపోయిన సిప్ ఖాతాలతో పోలిస్తే కొత్తగా నమోదైన సిప్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఈ మార్గం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తిని తెలియజేస్తోందని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ డీపీ సింగ్ పేర్కొన్నారు. సిప్‌లను సులభంగా ఆన్లైన్లో రద్దు చేసుకునే సదుపాయం ఉండడం కూడా ఒక కారణమన్నారు. సిప్ ఆస్తులు రూ.7.53 లక్షల కోట్లు మరోవైపు మే నెలలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడుల పెట్టడంతో మొత్తం సిప్ ఆస్తుల విలువ ఏప్రిల్ చివరికి ఉన్న రూ.7.17 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.7.53 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 1.43 కోట్ల సిప్ ఖాతాలు నిలిచిపోవడం లేదా గడువు తీరిపోవడం జరిగింది. 2021–22లో ఇలాంటి ఖాతాలు 1.11 కోట్లుగా ఉన్నాయి. ఇక మే చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ 4.5 శాతం వృద్ధితో రూ.16.56 లక్షల కోట్లకు చేరింది. -
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ అంటే ఏంటి?
నా సోదరుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పు డు మా వదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? – వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినికి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – కృతిక పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమై ప్రణాళిక కలిగి ఉండడం కూడా ముఖ్యమే. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అన్నది పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. ఇది రిటైర్మెంట్ తీసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి కోరుకున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి జమ అవుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. కానీ, ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం వార్షికంగా పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి సాయపడుతుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు పెట్టుబడి నిలిచి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా తీసుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే మూడేళ్లకు మించిన లాభంపై 20 శాతం చెల్లించాలి. మూడేళ్లలోపు లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. ధీరేంద్ర కుమార్,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
క్రమం తప్పకుండా ఆదాయం
వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ. ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్‌డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్‌లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్‌పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే.. కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్ రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది. అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ఐడీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు. ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపిక ఎలా? ఎంపిక చేసుకున్న ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్‌కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్లైన్ నుంచే ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్‌డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్సీ, ఎల్ అండ్‌టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్‌డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్‌డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది. పన్నుల విషయానికి వస్తే... మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది. ఇక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. -
పన్ను లేకుండా ఫండ్ మార్పు ఎలా..
నేను సిప్ విధానంలో ఒక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. అందుకే వేరే ఈక్విటీ ఫండ్‌లోకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నుంచి పెట్టుబడులను ఒకేసారి ఉపసంహరించుకొని ఆ మొత్తాన్ని వేరే ఫండ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఇలాచేస్తే ఏడాదిలోపు నేను సిప్ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తాలపై షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రస్తుత ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటే బావుంటుంది? - అరవిందరావు, హైదరాబాద్ ఈక్విటీ ఫండ్స్ పనితీరు స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకొని మదింపు చేయకూడదు. ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరిపోదని మేం భావిస్తున్నాం. మీరు వేరే ఈక్విటీ ఫండ్‌లోకి మారేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మీరు మారేటప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని... ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్‌కు స్టాప్ రిక్వెస్ట్‌ను సమర్పించాలి. ఒకేసారి మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని ఉపసంహరించుకుంటే మీరు చెప్పినట్లుగానే మీరు షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఏడాది దాటిన వాటిని ఒకేసారి ఉపసంహరించుకోవాలి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే మంచిది. తాతల నాటి స్థిరాస్థిని విక్రయించగా నా భాగానికి కోటి రూపాయలు వచ్చాయి. దీనిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. దీనిపై వచ్చే వడ్డీని ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఉపయోగించుకోవాలనేది నా ఆలోచన. ఫిక్స్డ్ డిపాజిట్‌గా కాకుండా, ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? నా సొమ్ము భద్రంగా ఉండేలా మరో మార్గమేదైనా ఉందా? సరైన సలహా ఇవ్వండి. - జాన్, ఈ మెయిల్ ద్వారా డెట్ ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మీరు భద్రత కోరుకుంటున్నారు. అదే సమయంలో స్థిరమైన రాబడులు (ఇంటి అద్దె, ఇతర ఖర్చులు) కోరుకుంటున్నారు. ఈ దృష్ట్యా చూస్తే డెట్ఫండ్లో ఇన్వెస్ట చేయడం సరైనపనే కాదు. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ఫండ్స్ ఒకింత అధిక రాబడినే అందిస్తాయని చెప్పవచ్చు. అయితే ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. నెలవారీ రాబడుల నిమిత్తం ఈ ఫండ్లపై ఆధారపడడం సరైన విధానం కాదు. రూ. కోటి అనేది అతి పెద్ద మొత్తం. దీనిని ఒకేచోట ఒకేసారి ఒకే మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏడాది పాటు ఇంటి అద్దె, ఇతర ఖర్చులన్నింటిని లెక్కవేసి ఆ మొత్తాన్ని మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి. ఇదే మొత్తానికి మూడు రెట్ల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. గరిష్టంగా రాబడులను పొందాలంటే స్వీప్-ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌం ట్ను తెరవండి. ఈ తరహా ఖాతాల్లో నిర్దేశిత పరిమితికి మించి సొమ్ములు పెరిగినట్లయితే, బ్యాంక్ ఆ పెరిగిన మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారుస్తుంది. దీంతో మామూలుగా కన్నా అధికంగా మీకు రాబడులు లభిస్తాయి. మరోవైపు పరిమితి కంటే తక్కువగా మీ ఖాతాలో సొమ్ములున్నప్పుడు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రద్దై, ఆ సొమ్ములు సేవింగ్స్ ఖాతాలోకి వస్తాయి. ఇక మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న ఇన్కమ్, షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. .. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ప్లాన్, యూటీఐ షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, బిర్లా సన్‌లైఫ్ మీడియమ్ టెర్మ్ ప్లాన్, యూటీఐ డైనమిక్ బాండ్ తదితర ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.